మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు | Manipur Hostage Crisis Rescue Ops Escalate Amid Massive Highway Blockades | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు

May 18 2026 10:43 AM | Updated on May 18 2026 11:29 AM

Manipur Hostage Crisis Rescue Ops Escalate Amid Massive Highway Blockades

కాంగ్‌పోక్పి: మణిపూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయుధ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీలను ప్రాణాలతో రక్షించేందుకు భద్రతా దళాలు భారీ ‘ఆపరేషన్ రెస్క్యూ’ను ప్రారంభించగా, మరోవైపు తమ వారిని విడిపించాలంటూ గిరిజన సంఘాలు జాతీయ రహదారులను దిగ్బంధించడంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మే 13న జరిగిన దాడుల తర్వాత మొదలైన ఈ బందీల వ్యవహారం  పతాక స్థాయికి చేరుకుని, ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతోంది.

ఆపరేషన్ రెస్క్యూ షురూ
కాంగ్‌పోక్పి జిల్లాలో సాయుధ దళాల ఆధీనంలో ఉన్న వ్యక్తులను రక్షించేందుకు సోమవారం భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేపట్టాయి. అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తూ, బందీలను పట్టుకున్న వారి కోసం గాలిస్తున్నాయి. మే 14, 15 తేదీల్లో కుకీ, నాగా వర్గాలకు చెందిన దాదాపు 38 మందిలో 31 మంది బందీలను ఇప్పటికే భద్రతా దళాలు సురక్షితంగా విడిపించాయి.  మిగిలిన వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను మరింత తీవ్రతరం చేశాయి.

కలకలం రేపిన కిడ్నాప్‌లు 
ఈ కిడ్నాప్‌ల పర్వానికి మే 13న జరిగిన హింసాత్మక ఘటనలే ప్రధాన కారణం. కాంగ్‌పోక్పిలో ముగ్గురు చర్చి నాయకులను అనుమానిత మిలిటెంట్లు దారుణంగా కాల్చి చంపగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నోనీ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒక పౌరుడు మృతి చెందగా, అతని భార్య గాయపడింది. ఈ దాడుల అనంతరం మిలిటెంట్లు పలువురిని కిడ్నాప్ చేసి, ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు.

హైవేల దిగ్బంధం - గిరిజనుల ఆందోళన 
బందీలందరినీ తక్షణమే సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆదివారం రాత్రి నుండి 2, 37వ జాతీయ రహదారులను పూర్తిగా దిగ్బంధించింది. ఇంకా ఆరుగురు నాగా యువకులు మిలిటెంట్ల చెరలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, తమ వర్గానికి చెందిన 14 మంది సెనాపతి జిల్లాలో వివిధ సాయుధ వర్గాల చేతిలో ఇంకా బందీలుగానే ఉన్నారని కుకీ ఇన్పి మణిపూర్ ప్రకటించడంతో రాష్ట్రంలో పరిస్థితి మరింత అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement