సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్‌లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.
వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.
మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.


