న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో ఊహించని సంఘటనలను ముందే పసిగట్టిన బల్గేరియా అంధురాలు, ‘నొస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరుగాంచిన బాబా వంగ పేరు ఇప్పుడు వార్తల్లో మరోమారు మార్మోగుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె వెల్లడించిన కొన్ని భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు తెరతీస్తున్నాయి.
అంతుచిక్కని రోగాల ముప్పు
ప్రిన్సెస్ డయానా మరణం నుండి కోవిడ్-19 మహమ్మారి వరకు అనేక ప్రధాన ప్రపంచ పరిణామాలను కచ్చితంగా అంచనా వేసిన ఘనత బాబా వంగకు దక్కుతుంది. కొందరు నెటిజన్లు తాజాగా ఉదహరిస్తున్న వివరాల ప్రకారం.. 2025 మరియు 2027 మధ్యకాలంలో మానవాళి ‘ పూర్తిగా అంతుచిక్కని వైద్య పరిస్థితులను’ ఎదుర్కొంటుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ, ఎలాంటి మందులు లేదా చికిత్సకు లొంగకుండా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకరమైన వైరస్‌లు దాడి చేస్తాయని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు.
హంటా, నోరో వైరస్‌లతో లింక్?
బాబా వంగ హెచ్చరించిన ఈ ‘కల్లోల సమయం’ ఇప్పుడు నిజంగానే మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అకస్మాత్తుగా వెలుగుచూస్తున్న ‘హంటా వైరస్’ ‘నోరో వైరస్’ వ్యాప్తిని ప్రజలు ఆమె అంచనాలతో ముడిపెడుతున్నారు. అప్పట్లో ఆమె చెప్పిన చికిత్సకు లొంగని భయంకరమైన వైరస్‌లు ఇవేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
నిజానిజాలు ఏంటి?
అయితే నెట్టింట పెరుగుతున్న ఈ తీవ్ర ఆందోళనల మధ్య ఒక ముఖ్యమైన వాస్తవాన్ని అందరూ గమనించాలి. బాబా వంగ తన భవిష్యవాణిలో ఎక్కడా ‘హంటా వైరస్’ లేదా ‘నోరో వైరస్’ పేర్లను నిర్దిష్టంగా ప్రస్తావించినట్లు ఎలాంటి అధికారిక లేదా ప్రామాణిక రికార్డులు లేవు. ఆగస్టు 11, 1996న బల్గేరియాలో మరణించిన ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలకు, ప్రస్తుత వ్యాధుల వ్యాప్తికి ప్రజలే స్వయంగా పోలికలు తెస్తున్నారు తప్ప, ఇందులో కచ్చితమైన ఆధారాలు లేవని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: సిరియా టు గల్ఫ్.. ఇండియా మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్!


