మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ‘భోజ్‌శాల’ సంచలన తీర్పు.. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా రగులుతున్న పలు చారిత్రక వివాదాలకు మళ్లీ ప్రాణం పోసింది. ధార్‌లోని భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని కోర్టు తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు అందరి దృష్టి 1991 ప్రార్థనా స్థలాల చట్టంపై పడింది. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులనే కొనసాగించాలనే ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటి చారిత్రాత్మక అయోధ్య తీర్పు తర్వాత, ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రముఖ మందిరం-మసీదు న్యాయ పోరాటాలివే..
శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు (మధుర, ఉత్తరప్రదేశ్)
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీకృష్ణుడి జన్మస్థలమైన 13.37 ఎకరాల మధుర ఆలయ సముదాయం, దానిని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ పక్షాల ప్రధాన వాదన. అయితే ఈ కట్టడం 1991 ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ పరిధిలోకి వస్తుందని ముస్లిం ప్రతినిధులు వాదిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకుని, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భక్తులు దాఖలు చేసిన 18 వేర్వేరు వ్యాజ్యాలు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 2024 ఆగస్టు ఒకటిన, మసీదు కమిటీ అభ్యంతరాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.
కాశీ విశ్వనాథ్ ఆలయం - జ్ఞానవాపి మసీదు (వారణాసి, ఉత్తరప్రదేశ్)
అయోధ్య, మధుర తరహాలోనే దేశంలో అత్యంత సంచలనం రేపుతున్న మతపరమైన ఆస్తుల కేసు ఇది. ఔరంగజేబు హయాంలో అసలైన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసి, జ్ఞానవాపి మసీదును నిర్మించారని హిందువుల వాదన కాగా, శతాబ్దాలుగా ఇక్కడ నమాజులు జరుగుతున్నాయని ముస్లింలు 1991 చట్టాన్ని ఉదహరిస్తున్నారు. 2021లో ఐదుగురు మహిళలు ప్రార్థనల హక్కుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయపోరాటం వేగవంతమైంది. కోర్టు ఆదేశాలతో జరిగిన సర్వేలో మసీదు ‘వజూఖానా’లో శివలింగాన్ని పోలిన నిర్మాణం బయటపడటంతో సుప్రీంకోర్టు ఆ ప్రాంతానికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించింది. అనంతరం 2024లో మసీదులోని ‘వ్యాస్ జీ కా తహ్ఖానా’ బేస్‌మెంట్‌లో హిందూ పూజారి రోజూ ప్రార్థనలు చేయడానికి కోర్టు అనుమతించింది.
షాహీ జామా మసీదు (సంభాల్, ఉత్తరప్రదేశ్)
విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి భగవానుడి ప్రాచీన ‘హరిహర’ ఆలయం ఉన్న స్థలంలో ఈ మసీదును నిర్మించారన్న ఆరోపణలతో 2024లో సంభాల్ జిల్లాలో తీవ్ర పౌర అశాంతి చెలరేగింది. 1526లో బాబర్ కాలంలో ఇది నిర్మితమైందని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు సర్వేకు ఆదేశించింది. రెండో విడత సర్వే సమయంలో భద్రతా బలగాలు, స్థానిక ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు (ఢిల్లీ)
ప్రముఖ కుతుబ్ మినార్ సముదాయంలో ఉన్న ఈ మసీదు నిర్మాణం కోసం.. మహ్మద్ ఘోరీ సైన్యాధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఏకంగా 27 హిందూ, జైన దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ దేవాలయాల శిథిలాలతోనే మసీదును కట్టారని, అక్కడ తమ దేవుళ్లను పునరుద్ధరించాలని 2021లో హిందూ, జైన భక్తులు సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే ఈ కట్టడాల ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు చట్టపరంగా అనుమతి లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కౌంటర్ దాఖలు చేసింది. చారిత్రక సంఘటనల ఆధారంగా శాంతికి విఘాతం కలిగించలేమంటూ సివిల్ కోర్టు దావాను కొట్టివేయగా, ప్రస్తుతం దీని అప్పీల్ పెండింగ్‌లో ఉంది.
ఈద్గా మైదాన్ (హుబ్బళ్లి, కర్ణాటక)
2022లో హుబ్బళ్లిలోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించుకునేందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై అంజుమన్-ఏ-ఇస్లాం సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు మున్సిపల్ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ భూమి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని, అంజుమన్-ఏ-ఇస్లాం కేవలం ఏడాదికి ఒక్క రూపాయి నామమాత్రపు రుసుముతో 999 సంవత్సరాల లీజును మాత్రమే కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇది సాధారణ ప్రార్థనా స్థలం కాదని, కేవలం బక్రీద్, రంజాన్ పండుగల సమయంలో మాత్రమే ఇస్లామిక్ ప్రార్థనలకు అనుమతించారని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: ‘నీట్’పై కేరళ సీఎం సంచలన ప్రకటన


