బెంగాల్‌లో అర్ధరాత్రి భారీ విధ్వంసం | Asansol Violence Erupts After Loudspeaker Noise Dispute, Mob Attacks Police Outpost And Damages Vehicles | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో అర్ధరాత్రి భారీ విధ్వంసం

May 16 2026 8:20 AM | Updated on May 16 2026 10:25 AM

Mob Vandalizes Asansol Police Post Over Volume Curbs

అసన్‌సోల్: పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్ల వాతావరణం  ఏర్పడింది. లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమితులపై పోలీసులు ఇచ్చిన సూచనలు చివరకు అపార్థాలకు దారితీసి, తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. జహంగీరి మహల్లా పోలీస్ అవుట్‌పోస్టుపై మూకల దాడి, రాళ్ల రువ్వడం,  వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.

వదంతులు సృష్టించిన చిచ్చు
ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆదేశాల మేరకు, మతపరమైన ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని పోలీసులు అసన్‌సోల్‌లోని రైల్‌పార్ ప్రాంత ప్రజలకు సూచించారు. ఇదే విషయమై మసీదు కమిటీతో పోలీసులు మాట్లాడుతుండగా.. శుక్రవారం రాత్రి ప్రార్థనలను అడ్డుకుంటున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో ఒక వర్గానికి చెందిన అసాంఘిక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి, జహంగీరి మహల్లా (నయా మహల్లా) పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి దిగాయి.

వాహనాలు ధ్వంసం
వదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి, విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, పోలీసుల పైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో స్టేషన్ బయట, పరిసర వీధుల్లో పార్క్ చేసిన అనేక వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అసన్‌సోల్ నార్త్ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం కేవలం శబ్దాన్ని మసీదు ప్రాంగణానికే పరిమితం చేయాలని పోలీసులు కోరినందుకే ఈ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి.

రంగంలోకి కేంద్ర బలగాలు
పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అదనపు భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ విధ్వంసానికి కారణమైన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ‍ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement