సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.
డీఎంకేలో భారీ మార్పులు
డీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.
ఓటమికి నేనే బాధ్యుడిని..
పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు.


