రెండు దేశాల ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాం: జైశంకర్‌ | Jaishankar on Palestine issue at BRICS meet | Sakshi
Sakshi News home page

రెండు దేశాల ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాం: జైశంకర్‌

May 14 2026 4:47 PM | Updated on May 14 2026 5:05 PM

Jaishankar on Palestine issue at BRICS meet

న్యూఢిల్లీ: పాలస్తీనా ఇష్యూలో విషయంలో​ ఇజ్రాయెల్ ఒక దేశంగా కొనసాగుతూ, పాలస్తీనీయులకు ప్రత్యేక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే ‘రెండు దేశాల’ పరిష్కారానికి భారత్ మద్దతిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. అలాగే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేతపై జై శంకర్‌ మాట్లాడుతూ.. “పశ్చిమాసియాలోని ఘర్షణ వల్ల కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర రవాణాపై ముప్పు, ఇంధన మౌలిక వసతుల్లో అంతరాయాలు పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో తెలియజేస్తున్నాయి” అని చెప్పారు.

లెబనాన్, సిరియా, సూడాన్, యెమెన్, లిబియా దేశాల పరిస్థితులపై కూడా జైశంకర్‌ మాట్లాడారు. “లెబనాన్, సిరియా ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సూడాన్ ఘర్షణ వల్ల భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. యెమెన్‌లో మానవతా ఆందోళనలు, సముద్ర భద్రతా ముప్పులు ఉన్నాయి. లిబియాలో స్థిరత్వం కూడా కీలకం” అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాల పరిష్కారానికి నిరంతర అంతర్జాతీయ సహకారం, దౌత్య చర్చలు అవసరమని జైశంకర్ తెలిపారు.

“ఇవి అన్నీ కలిపి ఒక స్పష్టమైన వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. స్థిరత్వం అనేది ఆప్షనల్‌గా ఉండకూడదు, శాంతి విడివిడిగా సాధ్యంకాదు. అంతర్జాతీయ చట్టాలను పాటించడం, పౌరులను రక్షించడం అత్యవసరం. ప్రజా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని  నివారించాలి. ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాల్లో భారత్ నిర్మాణాత్మకంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. స్థిరత్వం పునరుద్ధరణ లక్ష్యంగా సాగుతున్న చర్యలకు మద్దతిస్తుంది” అని విదేశాంగ మంత్రి తెలిపారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం మధ్య బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశం గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఘర్షణ రెండు నెలలకు పైగా కొనసాగుతుండటంతో ఇంధన ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరగడం మధ్య ఈ సమావేశం జరుగుతోంది.

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల దౌత్యవేత్తలతో పాటు కొత్త సభ్య దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా సమావేశానికి వచ్చారు.

బ్రిక్స్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీరును ఖండించాలని అరాఘ్చి కోరారు. యుద్ధోన్మాదాన్ని ఆపేందుకు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు బ్రిక్స్ దేశాలు, ఇతర దేశాలు ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement