చిత్తూరు గంగజాతరలో భాగంగా బుధవారం ‘ఓం శక్తి’ నినాదాల మధ్య భక్తులు చేపట్టిన వినూత్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసంతో వందలాది మంది భక్తులు నోటికి, వీపునకు శూలాలు గుచ్చుకుని దీక్షలు నిర్వర్తించారు.
చిత్తూరు నగరం గంగమ్మ జాతర సందడితో కళకళలాడింది. రెండు రోజులపాటు భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన జాతర బుధవారం అర్థరాత్రి నిమజ్జన మహోత్సవంతో ఘనంగా ముగిసింది.
రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం జనసంద్రంగా మారింది.
అమ్మవారి నిమజ్జనోత్సవానికి పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు చేపట్టారు. ముందస్తుగా ట్రాఫిక్ మళ్లించారు. మండపాలు, ఊరేగింపు మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిఘా పెట్టారు.


