అమెరికాలో భారతీయ షెఫ్‌కు అరుదైన గౌరవం | Vikas Khanna Makes History First Indian to Receive New York State Citation | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయ షెఫ్‌కు అరుదైన గౌరవం

May 13 2026 12:33 PM | Updated on May 13 2026 12:34 PM

Vikas Khanna Makes History First Indian to Receive New York State Citation

న్యూయార్క్‌: భారత్‌లోని అమృత్‌సర్ వీధుల నుంచి మొదలైన ఒక సాధారణ యువకుడి ప్రయాణం ఇప్పుడు అమెరికాలోని అత్యున్నత వేదికలపై సగర్వంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాల కమ్మదనాన్ని చాటిచెబుతున్న ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆహారం, కళలు, సంస్కృతికి ఆయన చేసిన విశేష కృషికి గాను న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరుదైన గౌరవంతో సత్కరించింది.

అరుదైన గౌరవం.. తొలి భారతీయుడిగా రికార్డు
ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏపీఐ)హెరిటేజ్ మంత్ సందర్భంగా న్యూయార్క్ రాజధాని అల్బానీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ కాథీ హోచుల్ ఈ ప్రతిష్టాత్మక ‘స్పెషల్ సైటేషన్’ను వికాస్ ఖన్నాకు అందజేశారు. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఒక భారతీయుడికి ఈ స్థాయి గుర్తింపు దక్కడం ఇదే తొలిసారి. ఈ పురస్కారం కేవలం తన వ్యక్తిగత విజయం కాదని, ఇది భారతీయ గుర్తింపు, ప్రాతినిధ్యం, భిన్నత్వానికి దక్కిన గౌరవంగా ఖన్నా అభివర్ణించారు.

అన్నం మాత్రమే కాదు.. ఆత్మగౌరవం కూడా
మే 9న జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో వికాస్ ఖన్నా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘ఒక భారతీయ షెఫ్‌ను ఈ వేదికపై నిలబెట్టడం నా ఒక్కడికే కాదు, మన సంస్కృతికి, మన కథలకు దక్కిన గౌరవం’ అని ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. ముఖ్యంగా వలసదారుల గురించి ప్రస్తావిస్తూ, కొత్త దేశంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని జీవితాన్ని నిర్మించుకుంటున్న వారికి న్యూయార్క్ నగరం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రశంసించారు. ఆయనను ‘గ్లోబల్ కలినరీ ఐకాన్’గా అభివర్ణించిన అక్కడి అధికారులు, పాకశాస్త్రంలో ఆయన అద్భుత నైపుణ్యాన్ని కొనియాడారు.

టైమ్ మ్యాగజైన్ గుర్తింపు తర్వాత మరో ఘనత
ఈ అరుదైన పురస్కారం వికాస్ ఖన్నా కీర్తికి మరో మణిమకుటంలా నిలిచింది. గత నెలలోనే, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ ప్రకటించిన ప్రపంచంలోని ‘100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement