వయనాడ్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో పదేళ్ల తర్వాత సాధించిన ఘన విజయం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే, కాంగ్రెస్ అధిష్టానంపై సొంత పార్టీ వర్గాలే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను టార్గెట్ చేస్తూ, సొంత ఇలాకా వయనాడ్‌లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి.
వయనాడ్ మరో అమేథీ కానుందా?
వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు కేరళ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కనుక కేరళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే.. ‘వయనాడ్ ఖచ్చితంగా తదుపరి అమేథీగా మారుతుంది’ అంటూ ఆ పోస్టర్లలో తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, కేరళ ప్రజలు అధిష్టానం తీసుకునే ఇలాంటి ‘మూర్ఖపు నిర్ణయాలను’ ఎన్నటికీ క్షమించరని, రాహుల్, ప్రియాంకలు ఇక వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలవడం మర్చిపోవాలని ఆ పోస్టర్లలో ఘాటుగా విమర్శించారు. అమేథీలో ఎలాగైతే కాంగ్రెస్ పట్టు కోల్పోయిందో, భవిష్యత్తులో వయనాడ్‌లో కూడా అలాగే జరుగుతుందని వారు అంటున్నారు.
Wayanad, Keralam: Posters targeting Congress MPs Rahul Gandhi and Priyanka Gandhi Vadra have appeared near the Wayanad District Congress Committee office amid ongoing suspense over Kerala's next Chief Minister following the UDF's election victory pic.twitter.com/z62QGaq9Rb
— IANS (@ians_india) May 13, 2026
భగ్గుమన్న అసమ్మతి.. సీఎం పీఠం కోసం పోరు
అధిష్టానం అండతో సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్‌ను రాహుల్ గాంధీకి కేవలం ‘బ్యాగ్ క్యారియర్’గా మాత్రమే పోస్టర్లలో అభివర్ణించడం గమనార్హం. ఆయనకు సీఎం పదవి ఇస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గానూ 102 స్థానాలు సాధించి, యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే ముఖ్యమంత్రి పీఠం కోసం సీనియర్ నేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.
ఢిల్లీలో ముమ్మర మంతనాలు.. నేడే క్లైమాక్స్
ఈ తీవ్ర ఉత్కంఠ నడుమ, ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం ఢిల్లీలో కేరళ మాజీ కేపీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ స్వయంగా వరుస సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికల్లా కేరళ తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: ప్రతీక్ యాదవ్: ‘సయోధ్య’ కుదిరిన వేళ.. సాగనంపిన కాలం!


