మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది? | 72 Hour Fast Miracle Diet or Dangerous Trend | Sakshi
Sakshi News home page

మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది?

May 13 2026 8:00 AM | Updated on May 13 2026 8:00 AM

72 Hour Fast Miracle Diet or Dangerous Trend

సోషల్ మీడియాలో హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని ఫిట్నెస్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించే సెలబ్రిటీల వరకు.. ఇప్పుడు అందరి నోటా ‘72 గంటల ఉపవాసం’ గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెడుతూ.. క్రమశిక్షణతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు తాను అప్పుడప్పుడు మూడు రోజుల పాటు కఠిన ఉపవాసం చేస్తానని చెప్పడంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు 72 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఇది నిజంగానే సురక్షితమేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్నాయి.

72 గంటల ఫాస్టింగ్‌పై ఎందుకంత క్రేజ్‌
ఒకప్పుడు కేవలం వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలకే పరిమితమైన ఉపవాసం, ఇప్పుడు మోడ్రన్ వెల్నెస్ కల్చర్‌లో భాగమైపోయింది. చాలా మంది సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ నిపుణులు శరీరాన్ని ‘రీసెట్’ చేయడానికి, క్రమశిక్షణను మెరుగుపరచుకోవడానికి, బరువు తగ్గడానికి ఉపవాసాలు ఒక గొప్ప మార్గమని చెబుతున్నారు. మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక ఏకాగ్రత అలవడటంతో  పాటు శరీరం చాలా తేలికగా అనిపిస్తుందంటూ వారు చేస్తున్న పోస్టులు చూస్టుంటే.. ఇది కొత్త ఆరోగ్య రహస్యమా లేక మరొక  ట్రెండా అనే క్యూరియాసిటీ సామాన్యుల్లో సైతం కలుగుతోంది.

శరీరంలో జరిగే సైంటిఫిక్ మ్యాజిక్ ఇదే
72 గంటల ఉపవాసం అంటే.. మూడు రోజుల పాటు శరీరానికి ఎలాంటి క్యాలరీలు ఇవ్వకపోవడం. కేవలం నీరు, టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం మొదలైన ఒక రోజు తర్వాత, శరీరంలో నిల్వ ఉన్న చక్కెర స్థాయిలు పూర్తిగా తగ్గిపోయి, అప్పటి నుండి శక్తి కోసం కొవ్వును కరిగించడం మొదలవుతుంది. ఈ ప్రక్రియనే ‘కీటోసిస్’ అంటారు. మూడవ రోజుకు, శరీరం పూర్తిగా ఈ స్థితికి అలవాటు పడి, కార్బోహైడ్రేట్లకు బదులుగా కొవ్వు ద్వారా వచ్చే ఇంధనాన్ని వాడుకుంటుంది. దీనివల్ల కొందరిలో ఆకలి తగ్గి మానసిక స్పష్టత వస్తే, మరికొందరిలో శరీరం సర్దుబాటు చేసుకునే క్రమంలో విపరీతమైన అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇది నిజంగానే బాడీని ‘డీటాక్స్’ చేస్తుందా?
సాధారణ చర్చలలో ‘డీటాక్స్’ అనే పదం తరచుగా వినిపిస్తుంది. కానీ శాస్త్రీయంగా చూస్తే మన శరీరంలో సహజంగానే కాలేయం, మూత్రపిండాలు డీటాక్స్ వ్యవస్థలుగా పనిచేస్తాయి. నిజానికి ఉపవాసం ఎలా పనిచేస్తుందంటే.. శరీరం శక్తిని గ్రహించే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ సుదీర్ఘ ఉపవాస సమయంలో, ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి, కొవ్వు నిల్వలు చురుకుగా కరగడం మొదలవుతుంది. దీనికి తోడు పాడైన కణాలను శుభ్రపరిచే ‘ఆటోఫాగీ’ వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి. అందుకే చాలా మంది దీనిని ఒక ‘మెటబాలిక్ రీసెట్’గా భావిస్తారు. అయితే ఈ ప్రభావాలు అందరిలో ఒకేలా ఉండవు.

ఎవరెవరు ఈ సాహసానికి దూరంగా ఉండాలి?
నిజానికి ఈ 72 గంటల ఉపవాసం అనేది అందరూ క్యాజువల్‌గా చేసే ఒక లైఫ్‌స్టైల్ అలవాటు కాదు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు తప్పవు. బిజీ షెడ్యూల్, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేసేవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఉపవాసం చేస్తే తీవ్రమైన నీరసం, లో బ్లడ్ షుగర్ లేదా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు సైతం సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం అనేవి జరుగుతాయి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, శిక్షణలో ఉన్న అథ్లెట్లు దీనికి కచ్చితంగా దూరంగా ఉండాలి.

లాభాల కంటే ముప్పు ఎక్కువ
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 72 గంటల ఉపవాసం అనేది అద్భుతాలు చేసే మ్యాజిక్ ట్రిక్ కాదు. నిపుణుల పర్యవేక్షణలో, సరైన ప్రణాళికతో చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన అవగాహన లేకుండా ఎవరికి వారు సొంతంగా ప్రయోగాలు చేస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. దీని ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి, వైద్యుల సలహా లేకుండా.. ముఖ్యంగా గర్భిణిలు, మందులు వాడేవారు, 18 ఏళ్ల లోపు వారు ఈ ఉపవాసాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!

Advertisement
 
Advertisement
Advertisement