చైనా పర్యటనకు ట్రంప్‌.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు | Donald Trump China Tour for high-stakes talks on trade And Iran | Sakshi
Sakshi News home page

చైనా పర్యటనకు ట్రంప్‌.. ఇరాన్‌పై కొత్త వ్యాఖ్యలు

May 13 2026 7:46 AM | Updated on May 13 2026 12:30 PM

Donald Trump China Tour for high-stakes talks on trade And Iran

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్ ఆందోళనలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ గురించి చైనాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్‌ ఇంకా తమ కంట్రోల్‌నే ఉందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యంగా తైవాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బలహీనమైన వాణిజ్య సంబంధాల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపేందుకు ట్రంప్‌ మంగళవారం వైట్‌హౌస్ నుండి చైనా పర్యటనకు బయలుదేరారు. మూడు రోజుల పాటు ట్రంప్‌.. చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా తీవ్రమవుతున్న భౌగోళిక, రాజకీయ, వాణిజ్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ అంతటా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలలో ఒక కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది.

ఇక, ఈ పర్యటన సందర్భంగా ఇరాన్ వివాదం ప్రాముఖ్యతను తగ్గించి చూపడానికి అమెరికా అధికారులు ఇటీవలి రోజుల్లో ప్రయత్నిస్తుండగా, జిన్‌పింగ్‌తో తన చర్చలలో ఈ అంశం ఎంత ప్రముఖంగా ఉంటుందనే దానిపై ట్రంప్ మిశ్రమ సంకేతాలు ఇచ్చారు. బీజింగ్‌కు వెళ్లేందుకు మెరైన్ వన్ హెలికాప్టర్ ఎక్కే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ట్రంప్‌..‘మేము చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇరాన్ వాటిలో ఒకటి అని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ చాలా వరకు మా అదుపులోనే ఉంది. ఇరాన్ విషయంలో మాకు ఎలాంటి సహాయం అవసరమని నేను అనుకోవడం లేదు. శాంతియుతంగానైనా లేదా మరే విధంగానైనా, మేము దీనిని గెలుస్తాము. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం సహా మొత్తం యుద్ధ యంత్రాంగం పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు.. లేకపోతే మేం మిగతా పని పూర్తి చేస్తాం. దిగ్బంధనం 100 శాతం ప్రభావవంతంగా ఉంది. ఏదో ఒక విధంగా ఇది అమెరికాకు చాలా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా చమురు ఉత్పత్తి పెరుగుతుంది' అని ట్రంప్ తెలిపారు.

నాటోపై ట్రంప్ అసంతృప్తి
ఈ సందర్భంగా నాటోపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు. 'నాటో నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మాకు అవసరమైన సమయంలో నాటో మాతో లేదు. నిజానికి మాకు నాటో అవసరం లేదు. కానీ అవసరమైతే కూడా వాళ్లు ముందుకు రాలేదు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్​ రుట్టే మాత్రం కూటమి భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధానంగా సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

చైనా పర్యటనలో ట్రంప్‌తో మస్క్, టిమ్ కుక్.. 
బీజింగ్‌తో కొత్త వ్యాపార ఒప్పందాల కోసం తన ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ఈ పర్యటనకు ఎలాన్ మస్క్, టిమ్ కుక్‌తో సహా పలువురు అగ్రశ్రేణి అమెరికన్ వ్యాపార నాయకులను తీసుకువచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో బోయింగ్ విమానాలు, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన సరఫరాలకు సంబంధించిన కొనుగోళ్లను కూడా చైనా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 500 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌లు, డజన్ల కొద్దీ జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ విమానాల కోసం ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చిస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇది ఖరారైతే, 2017 తర్వాత చైనాకు ఇది మొదటి ప్రధాన బోయింగ్ ఆర్డర్ అవుతుంది. అలాగే విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విమాన ఒప్పందంగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాను అనుమతిస్తున్న వాణిజ్య సంధిని పొడిగించడంపై కూడా ఇరుపక్షాలు చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటనలో పొడిగింపునకు అంగీకారం కుదురుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.

తైవాన్, అమెరికా సంబంధాలపై.. 
ఇక, అంతకుముందు.. తైవాన్, ఇరాన్, రష్యా, వాణిజ్య సంబంధాలపై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ విషయంలో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. తైవాన్ అంశం ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గత కొన్ని సమావేశాల్లో కూడా చర్చకు వచ్చిన విషయమేనని తెలిపారు. అయినప్పటికీ అమెరికా పాలసీలో మార్పు చోటుచేసుకోలేదని, ఇకముందూ అలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయాల విషయంలో కూడా అమెరికా తన మద్దతును కొనసాగిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ తొలి ఏడాదిలోనే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో తైవాన్‌కు రక్షణ సామగ్రి విక్రయాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.

ఇటీవల తైవాన్ ప్రభుత్వం అమెరికా సైనిక పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దాదాపు 780 బిలియన్ తైవాన్ డాలర్ల వ్యయ పరిమితితో ఈ బిల్లును ఆమోదించినట్లు సమాచారం. అయితే ఇందులో కొన్ని కీలక రక్షణ అంశాలకు నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు. మొదట ప్రతిపాదించిన పూర్తి ప్యాకేజీకి నిధులు కేటాయించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement