సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త! | Nepali Gang Ties Up Hyderabad Couple, Loots Gold And Cash In Jawaharnagar, More Details Inside | Sakshi
Sakshi News home page

సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!

May 13 2026 8:19 AM | Updated on May 13 2026 10:58 AM

Nepali Gang Gold Robbery At Hyderabad Jawahar Nagar

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జవహర్‌నగర్‌లో నేపాలీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్‌.. ఓనర్‌ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.

వివరాల మేరకు.. జవహర్‌నగర్‌లోని కౌకుర్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. గల్ప్‌ ఎన్‌క్లేవ్‌లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్‌ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్‌ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్‌ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. 

ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్‌ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్‌ సతీమణి తనూజ రంజన్‌ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్‌ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్‌ స్కెచ్‌లో భాగంగానేహైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్‌ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ఉంటూనే భారత్‌లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement