ప్రధాని మోదీ కీలక నిర్ణయం | PM orders cut convoy size Check Full Details Here | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ కీలక నిర్ణయం

May 13 2026 8:05 AM | Updated on May 13 2026 8:44 AM

PM orders cut convoy size Check Full Details Here

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే.. ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌(తెలంగాణ) వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని.. సొంత వాహనాలకు బదులు కార్‌పూలింగ్‌, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రొత్సహించాలని అన్నారు. 

అయితే దానిని ఆచరించడంలో భాగంగా.. ప్రధాని మోదీ ఇప్పుడు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనుకుంటున్నారు. ఇంధన పొదుపు, మితవ్యయ (austerity) చర్యలలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ మేరకు ఎస్పీజీ (Special Protection Group)కి కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని.. భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు సమాచారం అందుతోంది. 

ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌శర్మ తన కాన్వాయ్‌లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement