రైల్లోనే డెలివరీ.. 'ఆపరేషన్ మాతృశక్తి' వీడియో వైరల్‌ | Baby Born On Moving Train As Railway Cops To Save Mother And Child | Sakshi
Sakshi News home page

రైల్లోనే డెలివరీ.. 'ఆపరేషన్ మాతృశక్తి' వీడియో వైరల్‌

May 12 2026 12:41 PM | Updated on May 12 2026 12:47 PM

Baby Born On  Moving Train As Railway Cops To Save Mother And Child

కదులుతున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు తోటి ప్రయాణికులు, రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సమయానికి స్పందించడం మాత్రమే కాదు, సమయస్ఫూర్తితో  వ్యవహరించి క్షేమంగా ప్రసవంజరిగేలా చూసిన ఘటన మానవీయ కోణాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన పుణే-సుపాల్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల రుఖ్సానా ఖాతూన్, ఆమె భర్త జమీల్ బేలవర్ కలిసి పుణే నుండి బీహార్ వెళ్లేందుకు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు అహల్యనగర్ స్టేషన్‌కు సమీపిస్తుండగా, రుఖ్సానాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి.  సమీపంలో లేని ఆసుపత్రి, కిక్కిరిసిన జనరల్ కోచ్, వేగంగా కదులుతున్న రైలు కావడంతో వైద్య సాయం అందడం కష్టంగా మారింది.

'ఆపరేషన్ మాతృశక్తి'
ఈ అత్యవసర పరిస్థితిపై సమాచారం అందుకున్న సెంట్రల్ రైల్వే వెంటనే 'ఆపరేషన్ మాతృశక్తి'ని యాక్టివేట్ చేసింది. ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ సోమనాథ్ పాఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ మహిళ ఉన్న కోచ్‌కి చేరుకున్నారు. ఆమె నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆ సమయంలో ఆసుపత్రికి తరలించడం అసాధ్యమని గుర్తించారు. అందుకే  రైలులోనే సురక్షిత ప్రసవం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆర్పీఎఫ్‌ సిబ్బంది, కోచ్‌లోని తోటి మహిళా ప్రయాణికులు కలిసి రుఖ్సానా చుట్టూ దుస్తులు, దుప్పట్లతో ఒక సురక్షితమైన తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేసిన ఈ పనితో రుఖ్సానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు వినగానే తోటి ప్రయాణికులు సంతోషంతో  ఊపిరి పీల్చుకున్నారు.

 అనంతరం రైలు అహల్యనగర్ స్టేషన్‌కు చేరుకోకముందే రైల్వే అధికారులు అక్కడ 108 అంబులెన్స్‌ను, డాక్టర్లను సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బందిని మరియు సహకరించిన ప్రయాణికులను అందరూ అభినందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement