breaking news
Visakhapatnam
-
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్‌లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్‌కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్‌ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్‌లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలకాలి
మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వలంటీర్ విభాగ సమావేశం జరిగింది. జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఉమ్మడి విశాఖకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. వలంటీర్ విభాగం జోనల్ ఇన్చార్జి సునీల్, రాష్ట్ర వలంటీర్ విభాగ ప్రధాన కార్యదర్శి పులగం శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శి పచరపల్లి రాము, వలంటీర్ విభాగ జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. వలంటీర్ల సమావేశంలో కేకే రాజు -
గిరిజన బిడ్డల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే...
కేజీహెచ్‌లో విద్యార్థినులను పరామర్శించిన షర్మిల మహారాణిపేట: కురుపాం గురుకుల విద్యార్థినుల మరణం పట్ల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం ఆమె పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గిరిజన బిడ్డల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ హాస్టల్లోనూ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని, వందల మంది విద్యార్థినులకు ఒకే బాత్రూం ఉండటం దారుణమని విమర్శించారు. తాను ‘గుడితో పాటు బడి ముఖ్యం’అని గతంలో చేసిన వ్యాఖ్యలకు మతం రంగు పులిమి తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే ఒక హైలెవల్ కమిటీ వేయాలని, రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను బాగుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
అదానీ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు
డాబాగార్డెన్స్: గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో అదానీ సంస్థ 40 లక్షల సామర్థ్యంతో తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మంగళవారం కోరారు. సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, వెంటనే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. ప్రతిపాదిత సిమెంట్ కంపెనీ వల్ల గాజువాక, పెదగంట్యాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు దుమ్ము, ధూళి, విష కణాలతో నిండిపోతాయని, తాగునీరు కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు శ్వాసకోశ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు కారణంగా గాజువాక పరిసర ప్రాంతాలు బొగ్గు, ధూళితో తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయని వివరించారు. సిమెంట్ కంపెనీ కోసం కేటాయించిన 20 ఎకరాల భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇచ్చారని, ఈ భూమిలో ఇతర కంపెనీ నిర్మాణం చట్ట విరుద్ధమని, భూ ఒప్పందం కూడా చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని.. నగర పౌరుల తరపున సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జీవీఎంసీ కమిషనర్‌కు అందజేసిన వినతిప్రతంలో విజ్ఞప్తి చేశారు. అలాగే జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ బి.గంగారావు, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్‌తో కలిసి ఆయన మేయర్ పీలా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వినతి -
చిట్టీల సొమ్ము రూ.కోటితో భార్యాభర్తలు పరార్
కొమ్మాది: చిట్టీల పేరుతో సుమారు కోటి రూపాయల సొమ్మును వసూలు చేసి భార్యాభర్తలు పరారైన సంఘటన ఎండాడలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో సందీపిని నగర్‌లోని స్వగృహ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వై.రమణమ్మ చిట్టీలు వేస్తోంది. ఈ క్రమంలో ఆమె గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసింది. చిట్టీల కాలపరిమితి దగ్గరపడుతుండటంతో.. బాధితులు నాలుగు నెలలుగా ఆమెను డబ్బు అడుగుతున్నారు. అయితే, ఆమె సమయం దాటవేస్తూ వస్తోంది. బాధితులందరూ మూకుమ్మడిగా వచ్చి తమ డబ్బులు అడగగా.. రమణమ్మ తన భర్త ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అని, తమను ఇబ్బంది పెడితే వివిధ కేసులు బనాయిస్తానని హెచ్చరించింది. దీంతో బాధితులు ఇటీవల పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ప్రస్తుతం రమణమ్మ, ఆమె భర్త పరారీలో ఉన్నారు. మంగళవారం రమణమ్మ ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేశారు. పరారీలో ఉన్న రమణమ్మను పట్టుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని పీఎంపాలెం పోలీసులను కోరారు. ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
దేశంలో రక్త అవసరాన్ని తీర్చడం అంత సులభం కాదు
మంత్రి సత్యకుమార్ కొమ్మాది: సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రక్త అవసరాలు తీర్చడం అంత సులభం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో హేతుబద్ధ వినియోగం జీవన విధానం మారాలని, తద్వారా రక్త సరఫరా కొరతను అధిగమించవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ఏటా అవసరమైన రక్తం సుమారు 1.5 కోట్ల యూనిట్లు అంచనా కాగా, 10–40 లక్షల యూనిట్ల కొరత ఉందని నివేదికలు చెబుతున్నాయన్నారు. రక్తం, దాని ఉత్పత్తులను హేతుబద్ధంగా వినియోగించడం అంటే సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన రక్తన్ని అందించడమేనన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా రక్త వినియోగంలో శాసీ్త్రయ, మానవతా దృక్పథం రెండింటినీ సమన్వయం చేయాలని కోరారు. -
స్నేహితుడిపై చాకుతో దాడి
పెదగంట్యాడ: స్నేహితుడిపై చాకుతో దాడి చేసి న యువకుడిని అరెస్ట్ చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన కుప్పిలి మణిదీప్, మిందికి చెందిన ఉంగరాల దినేష్ స్నేహితులు. వీరిద్దరూ తరచుగా కలిసి మద్యం సేవిస్తుంటారు. నెల రోజుల కిందట దినేష్ లంకెలపాలెంలోని ఓ ఫార్మా కంపెనీలో దినసరి కూలీగా మణిదీప్‌ను పనిలో చేర్చాడు. అయితే మణిదీప్ వారం రోజులకే పని మానేశాడు. ఆ వారం రోజుల వేతనాన్ని కాంట్రాక్టర్ దినేష్‌కు ఇచ్చాడు. ఈ డబ్బులు ఇవ్వాలని మణిదీప్ పదేపదే అడగడంతో, ఆగ్రహానికి గురైన దినేష్ అతడిని చంపుతానని బెదిరించాడు. ఈ నెల 2వ తేదీన.. మణిదీప్‌ను అక్కిరెడ్డిపాలెం చెరువు వద్దకు రమ్మని దినేష్ ఫోన్ చేసి పిలిచాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ చెరువు వద్ద కలుసుకున్నారు. ఆ తరువాత మణిదీప్ తన డబ్బులు ఇవ్వాలని అడగడంతో.. దినేష్ తనతో పాటు తెచ్చుకున్న చాకుతో మణిదీప్‌పై దాడి చేశాడు. మణిదీప్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మణిదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్ధసారధి కేసు నమోదు చేశారు. నిందితుడైన దినేష్‌ను మంగళవారం శ్రీనగర్ బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. ఎస్ఐ సూర్యకళ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల నిర్లక్ష్యమే బలిగొంది..
సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మహారాణిపేట/మర్రిపాలెం: జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ లైన్‌మన్ సత్తిబాబు (47) మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం విద్యుదాఘాతంతో సత్తిబాబు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. : సోమవారం సాయంత్రం మురళీనగర్ ప్రాంతంలో సత్తిబాబు తన హెల్పర్‌తో కలిసి వీధి దీపాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్తంభం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో ఆయన షాక్‌కు గురై కిందపడిపోయారు. సహచర ఉద్యోగులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి వీధి దీపాల మరమ్మతులు చేయాల్సిన రెగ్యులర్ సిబ్బంది రావడం లేదు. వారితో పనులు చేయించకుండా, మాతో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. సత్తిబాబు మరణానికి జీవీఎంసీ అధికారులదే పూర్తి బాధ్యత’అని వారు ఆరోపించారు. ఉద్యోగి చనిపోయి గంటలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి కనీసం పరామర్శించడానికి రాకపోవడంపై వారు మండిపడ్డారు. మృతుడు సత్తిబాబుకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షలకు మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్ష నుంచి అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులంతా కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు పదోన్నతలను, మరికొందరు పూర్తిగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ, పోలీస్, వైద్యలు తదితర వృత్తుల్లో ఉన్నవారికి, ఉన్నతాధికారులకు లేని ఇన్ సర్వీస్ అర్హత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపజేయడాన్ని తీవరంగా ఖండిస్తున్నాం. – ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ -
దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐసీసీ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ కీలక ఘట్టానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఐదు వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 9న జరిగే మొదటి మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మంగళవారం నగరానికి చేరుకుంది. విశాఖ వేదికగా తొలి మ్యాచ్ ఆడబోతున్న భారత్ మహిళల జట్టు ఇప్పటికే ఇక్కడికి చేరుకుని మంగళవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. కాగా.. టీమిండియా ఈ టోర్నమెంట్లో హాట్రిక్ విజయంపై కన్నేసింది. గత ప్రపంచ కప్‌లో ఐదో స్థానంతో సంతృప్తి పడిన భారత్.. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకను 59 పరుగుల తేడాతో, పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించి మంచి ఊపు మీదుంది. విశాఖ వేదికగా ఆ ఊపును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరినా (2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో) టైటిల్ సాధించలేకపోయిన భారత జట్టు.. ఈసారి కప్ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినా పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నాయి. విజయమే లక్ష్యంగా టీమిండియా ప్రాక్టీస్ -
టెట్ టెన్షన్
ఉపాధ్యాయులకుఆరిలోవ: దశాబ్దాలుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2010 సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2010 కంటే ముందు వివిధ డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది కూడా టెట్ రాయాల్సి రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ కోసం చదివి ఉద్యోగం సాధించిన మేము ఇప్పుడు మళ్లీ అర్హత పరీక్ష రాయడమేమిటి? అంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తీర్పు ప్రభావం విశాఖ ఉమ్మడి జిల్లాలో భారీగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యాలలో సుమారు 17,000 మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల్లో మరో 12,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కూడా ఈ తీర్పు ప్రకారం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇన్ సర్వీస్‌లో ఉన్నవారు టెట్‌లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 31, 2027 లోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతి కావాలనుకునేవారు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఈ కీలక సమయంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం టెట్ అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. మరోవైపు, టెట్ పరీక్షపై వారంలో నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాల సర్వీస్ ఉన్నవారికి పరీక్ష రాయడం, అర్హత సాధించడం తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత వ్యవహారంలో మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ పరీక్ష విధానం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాయాల్సిన టెట్ పరీక్ష వివరాలు: పేపర్లు: ఎస్జీటీలు పేపర్–1, స్కూల్ అసిస్టెంట్లు పేపర్–2 రాయాల్సి ఉంటుంది. మార్కులు: రెండున్నర గంటల (150 నిమిషాలు) సమయంలో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత మార్కులు: ఓసీ అభ్యర్థులు: 60 శాతం మార్కులు (90 మార్కులు). బీసీ అభ్యర్థులు: 50 శాతం మార్కులు (75 మార్కులు). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులు: 40 శాతం మార్కులు (60 మార్కులు). -
ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకేనా..?
రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగులకు లేని నిబంధనలు ఒక్క ఉపాధ్యాయులకే ఎందుకు పెడుతున్నారో అర్థంకావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు అవసరాలు పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా వదిలేశాయి. ఇలాంటి నిబంధనలు మాత్రం మాపై రుద్దడం మంచిదికాదు. మరో వారంలో టెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దవాబ్దాలుగా ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం ఇంతవరకు ప్రకటించకపోవడం బాధాకరం. – టి.ఆర్ అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
కేజీహెచ్ నుంచి గిరిజన విద్యార్థినుల డిశ్చార్జి
మహారాణిపేట: పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థినులను మంగళవారం పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విద్యార్థినులకు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో, వైద్యుల నివేదికల ప్రకారం తరలించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్(గ్యాస్ట్రో ఎంట్రాలజీ), డాక్టర్ శివ కల్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు)లతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 129 మంది విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. -
లోన్‌యాప్ బాధితులకు రికవరీ సొత్తు అందజేత
విశాఖ సిటీ: ఇన్స్టంట్ ఫ్రాడ్ లోన్ యాప్స్ ద్వారా మోసపోయిన బాధితులకు.. కోల్పోయిన మొత్తాన్ని అందించేందుకు రెండో దఫా రిఫండ్ మేళా నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ ఫ్రాడ్ లోన్ యాప్స్ ఉచ్చులో అనేక మంది అమాయకులు చిక్కుకుని రూ.లక్షలు నష్టపోతున్నారన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేసి ఇప్పటి వరకు రూ.60 లక్షల క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ మొత్తంలో రూ.48 లక్షలను రూ.100 మంది బాధితులకు తొలి దశలో అందజేసినట్లు వెల్లడించారు. రెండో దఫా రిఫండ్ మేళా ద్వారా 26 మంది బాధితులకు రూ.8 లక్షలు అందజేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ(క్రైమ్) లతామాధురి, ఏసీపీలు పాల్గొన్నారు. ‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి విశాఖ సిటీ : అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ సూచించారు. 2025 జూన్ 30 ముందు అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా చట్టబద్ధమైన భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చన్నారు. లేఅవుట్లలో మౌ లిక సదుపాయాలతో పాటు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా నిర్దేశిత డాక్యుమెంట్లతో స్వయంగా గానీ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఎంఆర్డీఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10న జాబ్‌మేళా కంచరపాలెం: వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న సుమారు 100 ఉద్యోగాల భర్తీకి స్థానిక నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్(ఎన్సీఎస్సీ)లో ఈ నెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సెంటర్ ఉప ప్రాంతీయ అధికారి నిట్టాల శ్యామ్‌సుందర్ తెలిపారు. రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్స్, ఆఫీసర్, బీపీవో, టెలీకాలర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత సాఽధించిన 18–30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. జాబ్ లోకేషన్ ఏపీలోని పలు జిల్లాల్లో ఉంటుందన్నారు. -
కురుపాం గురుకుల విద్యార్థినులకు పరామర్శ
మహారాణిపేట: అస్వస్థత, అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌లతో కలిసి మంత్రి మంగళవారం కేజీహెచ్‌కు వచ్చారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటివరకు 53 మంది చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు రాగా, మంగళవారం 13 మంది డిశ్చార్జి అయ్యారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మిగిలిన వారిని కూడా ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయిస్తాం’ అని చెప్పారు. కురుపాం ఘటన, అక్కడి పరిస్థితులపై అధికారుల బృందం విచారిస్తోందని, వారు ఇచ్చే నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యాదేవి, సీఎస్‌ఆర్‌ఎంవో యు.శ్రీహరి, ఇతర వైద్యాధికారులు మంత్రి వెంట ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -
త్వరితగతిన ఆధార్ సీడింగ్
విశాఖ సిటీ: విద్యుత్ సర్వీస్ నెంబర్లకు ఆధార్ సీడింగ్‌లో తప్పులను సరిదిద్దే ప్రక్రియను ఏపీఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. ఒక ఆధార్ నెంబర్‌కు పదుల సంఖ్యలో విద్యుత్ సర్వీస్ నెంబర్లను జత చేయడం, ఒకరి పేరుతో ఉన్న సర్వీస్ నెంబర్‌కు మరొకరి ఆధార్ అనుసంధానించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ‘కరెంటోళ్ల నిర్లక్ష్యం.. విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం’ శీర్షికను సాక్షి కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందిస్తూ.. అస్తవ్యస్తంగా ఉన్న ఆధార్ సీడింగ్ తప్పులు వేగవంతంగా సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. కరెంట్ సర్వీస్ నెంబర్‌కు జత చేసిన తప్పుడు ఆధార్ నెంబర్‌ను తొలగించేందుకు గతంలో వినియోగదారులు సచివాలయం, అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఏఈ కార్యాలయంలోనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.శ్యాంబాబు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్లో వచ్చే ఈ తరహా ఫిర్యాదులను సైతం ఇదే విధంగా పరిష్కరించి వినియోగదారులకు సమాచారం అందజేస్తున్నామన్నారు. తప్పులు సరిదిద్దుతున్నామన్న ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు -
జగన్‌కు భారీ స్వాగత సన్నాహాలు
అగనంపూడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలోని వైద్య కళాశాలను సందర్శించనుండడంతో.. లంకెలపాలెం కూడలి వద్ద భారీ ఎత్తున స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. లంకెలపాలెం కూడలి అనకాపల్లి జిల్లాకు ప్రవేశమార్గం అయినందున.. ఇక్కడ భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ పీఏసీ సభ్యుడు కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మంగళవారం లంకెలపాలెం కూడలిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ 79వ వార్డు అధ్యక్షుడు అప్పికొండ మహాలక్ష్మినాయుడు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, సుందరపు అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్‌రాజ్, రాష్ట్ర సోషల్ మీడియా అధికారిక ప్రతినిధి కర్రి నరసింగరావు, గంజి సురేష్, సునీల్, సిరపువరపు వాసు, ఉగ్గిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లంకెలపాలెం వద్ద నేతల ఏర్పాట్ల పరిశీలన -
మంచు కొండల్లో విడిది!
సాక్షి, విశాఖపట్నం: ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్లో బస చేయడం సాధారణం. ఎంత విలాసవంతమైన హోటల్ అయినా అది నాలుగు గోడల మధ్యే ఉంటుంది. కానీ.. ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు.. ప్రకృతి మన చుట్టూ ఆవరించినట్లు.. విశాలమైన మంచంపై పడుకుని కళ్లు తెరిస్తే.. ఆ ఊహాలోకం మన చెంతనే ఉన్నట్లు అనిపిస్తే.. ఆ అనుభూతే వేరు కదా! అలాంటి అద్భుత అనుభవాన్ని అందించేందుకు అందాల లంబసింగిలో సరికొత్త పర్యాటక రిసార్టులు రాబోతున్నాయి. వీటినే ‘జియోడెసిక్ డోమ్ రిసార్టులు’ అంటారు. వీటి నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) టెండర్లను ఆహ్వానించింది. లంబసింగిలో కొత్త ఆకర్షణ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో ఏపీటీడీసీకి ఇప్పటికే రిసార్టులు ఉన్నాయి. వాటి పక్కనే ఈ సరికొత్త జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలు, రెస్టారెంట్‌కు అదనంగా ఈ డోమ్ రిసార్టులను ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊటీని తలపించే శీతల వాతావరణం, చుట్టూ అల్లుకునే దట్టమైన పొగమంచుకు లంబసింగి ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారికి సరికొత్త వసతి అనుభవాన్ని అందించేందుకు ఏపీటీడీసీ శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డోమ్ రెస్టారెంట్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా.. ప్రస్తుత అధికారులు ఆ ప్రాజెక్టుకు మెరుగులు దిద్ది, పూర్తి స్థాయి డోమ్ రిసార్టులు తీసుకురావాలని నిర్ణయించారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి లంబసింగికి దేశ, విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు డోమ్ రిసార్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించాం. కాంట్రాక్టు ఖరారైన మూడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని నిబంధన విధించాం. భూమికి సంబంధించిన అనుమతుల నుంచి నిర్మాణం పూర్తి చేసి, వినియోగానికి సిద్ధంగా ఉన్న స్థితిలో అప్పగించే వరకు పూర్తి బాధ్యత ఎంపికై న కాంట్రాక్టర్‌దే. ఇవి అందుబాటులోకి వస్తే ఏజెన్సీలో మరింతగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ రూ. 5.33 కోట్లు.. 15 డోమ్ యూనిట్లు.. ప్రకృతిని వీక్షించడానికి, ఆస్వాదించడానికి వీలుగా.. పర్యాటకుల ఏకాంతానికి భంగం కలగకుండా కొండ ప్రాంతంలో ఈ జియోడెసిక్ డోమ్ రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. రూ.5.33 కోట్ల వ్యయంతో మొత్తం 15 డోమ్ రిసార్టులను నిర్మించనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ ఆర్ఎఫ్పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ఆహ్వానించింది. జియోడెసిక్, పుట్టగొడుగు ఆకారపు డోమ్లతో పాటు, అథారిటీ ఆమోదించిన మరికొన్ని విభిన్న నమూనాల్లో రిసార్టులను నిర్మిస్తారు. వీటికి రెయిలింగ్ సపోర్ట్‌తో కూడిన బేస్మెంట్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ (ఫీడ్) ఆధారంగా.. పర్యావరణానికి హాని కలగని రీతిలో.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుత కాటేజీలకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో, అలాగే రిసార్ట్ నిర్మాణాల పైన ఉన్న ఎత్తైన ప్రదేశంలో వీటిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో డోమ్ యూనిట్ 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడే 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల కోసం ఆటస్థలం కూడా నిర్మించనున్నారు. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్ల ఈవీ బగ్గీలు రెండు అందుబాటులో ఉంచుతారు. ప్రతి డోమ్‌లో 7/6 బెడ్, రాకింగ్ చైర్, 3/3 సైడ్ టేబుల్స్, వార్డ్రోబ్, లగేజ్ ర్యాక్, డ్రెస్సింగ్ టేబుల్, నాలుగు కుర్చీలతో కూడిన కాఫీ టేబుల్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. -
సవాల్ విసిరిన అమాత్యులకే చెమటలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్ కాలేజీలపై సవాల్ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఆంక్షలు విధించినా ఆగేది లేదు!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించడానికి ఈనెల 9వ తేదీన రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రచేస్తోందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ పర్యటన ఆగేది లేదని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించాలని మూడు రోజుల క్రితమే అనకాపల్లి ఎస్పీ, విశాఖ సీపీని కోరామని, ఇప్పటివరకూ కాలయాపన చేసిన వారు జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని చెబుతున్నారన్నారు. విశాఖ నుంచి మాకవరపాలేనికి జాతీయ రహదారి కాకుండా ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలని అడుగుతున్నామన్నారు. అయినా పర్యటనకు తాము అనుమతి కోరలేదని.. సెక్యూరిటీ మాత్రమే కల్పించాలని అడిగామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరికి కావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు రోడ్డు మార్గానే మాకవరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వం భద్రత కల్పించకపోతే వైఎస్సార్సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని అన్నారు. గతంలో వైఎస్ జగన్ పలు పర్యటనల్లో హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు హెలికాప్టర్ మీదే రావాలంటున్నారంటే.. తనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు, అభిమానులకు అనుమానం వస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సవ్యంగా లేని సమయంలో పదే పదే హెలిప్యాడ్ అనుమతి కోరండి అని చెబుతుంటే, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన సంఘటనను బూచిగా చూపించి అనుమతి ఇవ్వలేమనడం సరికాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు 65 వేల మంది జనాలు వస్తారని పోలీసులు చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. కళ్లు బైర్లు కమ్మి సవాల్ విసిరిన స్పీకర్ అయ్యన్న లాంటి వారి నోటికి తాళాలు వేసేందుకు, ఆయన అసత్య ప్రచారాలకు చెక్ పెట్టి.. మెడికల్ కాలేజీపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ జగన్ ఈనెల 9న మాకవరపాలెం వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్‌ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్‌ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రెండో యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్‌క్రాఫ్ట్ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ను విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నిర్మాణంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భారత నౌకాదళం నంబర్ వన్‌గా దూసుకుపోతోందని చెప్పారు.80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కోల్‌కతాలో ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారని తెలిపారు. వరుసగా భారత్‌లో తయారు చేసిన యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం సరికొత్త చరిత్రగా అభివరి్ణంచారు. ఆండ్రోత్ రాకతో సముద్ర రక్షణ మరింత బలోపేతమైందని తెలిపారు. లక్షదీవుల సమూహంలో ఉత్తరాన ఉన్న ప్రముఖ ద్వీపం ‘ఆండ్రోత్’ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టినట్టు వివరించారు.– సాక్షి, విశాఖపట్నంశత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పట్టేస్తుంది సముద్ర నిఘా, శోధన, రెస్క్యూ, తీరప్రాంత రక్షణ కార్యక్రమాల్లో ఆండ్రోత్ చురుగ్గా వ్యవహరిస్తుందని పెందార్కర్ చెప్పారు. శత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పసిగట్టేలా అధునాతన సెన్సార్లు, అత్యా«ధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఈ వార్íÙప్ నిరి్మంచినట్టు తెలిపారు. తూర్పు తీర సముద్ర రక్షణ విషయంలో తూర్పు నౌకాదళం రాజీలేని పోరాటం చేస్తోందని పునరుద్ఘాటించారు.ఆండ్రోత్ భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరిన తర్వాత.. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్లో నావికాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసినట్టేనని తెలిపారు. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని శత్రుదేశాల సబ్‌మెరైన్లని ఆండ్రోత్ వేటాడుతుందనీ.. తీరప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘావేసే సామర్థ్యంతో పాటు విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాముల్ని వేటాడే సత్తా ఆండ్రోత్ సొంతమని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు, జీఆర్ఎస్ఈ అధికారులు పాల్గొన్నారు.‘ఆండ్రోత్’ విశేషాలు ఇవీ..పొడవు: 77.6 మీటర్లు వెడల్పు: 10.5 మీటర్లు డ్రాఫ్ట్: 2.7 మీటర్లు బరువు: 1,500 టన్నులు వేగం: గంటకు 25 నాటికల్ మైళ్లుసామర్థ్యం: ఏకధాటిగా 100 నాటికల్ మైళ్లుఎక్కడ తయారు చేశారు: కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)వ్యయం: రూ.789 కోట్లు పనులు ప్రారంభం: 2023 మార్చిలో సిబ్బంది: ఏడుగురు అధికారులు, 50 మంది సెయిలర్స్ (మొత్తం 57 మంది) లక్ష్యం: సముద్రం లోపల దాగివున్న శత్రు జలాంత ర్గాముల్ని గుర్తించడం, వాటిని ట్రాక్ చేసి నాశనం చేయడం అదనపు విధులు: సముద్ర నిఘా, పరిశోధన, విపత్తు, యుద్ధ సహాయక చర్యలు, తీరప్రాంత పరిరక్షణ సెన్సార్ వ్యవస్థ: డీఆర్డీవో కాంబాట్ సూట్, డీఆర్డీవో హల్ మౌంటెడ్ సోనార్, తక్కువ లోతులో సబ్మెరైన్లను గుర్తించే ఎల్ఎఫ్వీడీ సోనార్ ఆయుధ సంపత్తి: దేశీయంగా తయారు చేసిన 30 ఎంఎం సర్ఫేస్ గన్, 6,000 యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ ఒకటి, 2 ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్లు, యాంటీ సబ్‌మెరైన్ మైన్స్, 2 ఓఎఫ్టీ రిమోట్ కంట్రోల్ గన్స్ -
డీజే సౌండ్‌కు వ్యక్తి మృతి
పెందుర్తి: మండలంలో పెదగాడి గ్రామంలో ఆదివారం రాత్రి కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌కు గ్రామానికి చెందిన అప్పికొండ (56) మృతి చెందాడు. దుర్గాదేవి ఊరేగింపులో శ్రుతిమించిన సౌండ్ పెట్టడంతో త్రినాథ్ కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పటి వరకు త్రినాథ్ డీజే సౌండ్‌కు డ్యాన్సు చేశాడు. ఉన్నట్టు ఈ పరిణామం చేసుకోవడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాస్తవానికి ఊరేగింపుల్లో డీజే సౌండ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెపుతున్నా కూటమి నాయకులు ఆ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. నియోజకవర్గంలో కూటమి ముఖ్యనాయకులతో పాటు చోటా మోటా నాయకులు సైతం పోలీసుల తీవ్ర వత్తిడి తెచ్చి డీజే సిస్టమ్స్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో డీజే శబ్దాలకు ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అనధికార బాణసంచా దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఎంవీపీకాలనీ: దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో, శివారు ప్రాంతాల్లో అనధికార బాణసంచా దుకాణాలపై సిటీ టాస్క్‌ఫోర్స్ కొరడా ఝులిపిస్తోంది. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంవీపీ కాలనీలోని టాస్క్‌ఫోర్స్ టీమ్ రెండు రోజులుగా నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న దుకాణాలపై దాడులు చేసి, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా సామగ్రిని విక్రయిస్తున్న ఆనందపురం మండలం బొడ్డపాలెంకు చెందిన లక్ష్మి, నెల్తేరుకు చెందిన దాసరి దేముడు, భీమిలి మండలం ఎగువపేటకు చెందిన బడిదబోయిన గంగాధర్, పద్మనాభం మండలం అచ్చుకున్నపాలెంకు చెందిన గేదెల రమణపై కేసులు నమోదు చేసి..ఆయా పోలీస్స్టేషన్లకు వీరిని అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం వెల్లడించారు. అనధికారిక బాణసంచా దుకాణాలపై 112కు గాని, 79950 95799 నంబర్‌కు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పొట్ట కొట్టొద్దు
భూములు లాక్కొని తగరపువలస : ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీకి చెందిన దళితవాడలో సోమవారం నిర్వహించిన గ్రామసభ.. దళిత రైతుల తీవ్ర ఆందోళన మధ్య వాయిదా పడింది. గూగుల్ టెక్ సంస్థకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం దళితులకు చెందిన డీ పట్టా, బంజరు భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, తహసీల్దార్ సూరిశెట్టి శ్రీనుబాబుల ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవనాధారంగా ఉన్న భూములను లాక్కొని పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తెలియకుండానే తీర్మానం తర్లువాడ పంచాయతీలో సర్వే నంబర్–1తో పాటు 35, 71, 72, 74, 75లలో ఉన్న సుమారు 350 ఎకరాల భూమిని గూగుల్ టెక్ సంస్థకు ఇవ్వడానికి ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే సాగులో ఉన్న రైతులకు, ఇద్దరు దళిత వార్డు సభ్యులకు కూడా తెలియకుండానే పంచాయతీ తీర్మానం చేసి పంపడం రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. అంతేకాకుండా సోమవారం గ్రామసభ నిర్వహిస్తున్న సమాచారం కూడా రైతులకు తెలియనివ్వలేదు. గ్రామ సచివాలయంలో ప్రదర్శించకుండా, దండోరా వేయించకుండా తూతూ మంత్రంగా గ్రామసభ నిర్వహించడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ తరపున వైఎస్సార్సీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, సర్పంచ్ బీఆర్బీ నాయుడు హాజరయ్యారు. మూడు తరాల జీవనాధారం 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 49 మంది దళిత రైతులకు రెండు ఎకరాల వంతున డీ పట్టా భూములు కేటాయించింది. అప్పటి నుంచి మూడు తరాలుగా రైతులు ఈ భూముల్లో తోటపంటలు, కూరగాయలు, పువ్వులు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వాలు బోరుబావులు, విద్యుత్, సోలార్ యంత్రాలు మంజూరు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయని రైతులు గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శవంతమైన ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని తుడిచిపెట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రతిపాదించడం తమను హత్య చేయడమేనని రైతులు ఆక్రోశం వ్యక్తం చేశారు. గతంలో 80 ఎకరాలు మాత్రమే ఇస్తామని చెప్పి, ఇప్పుడు 200 ఎకరాల వరకు పెంచుకుంటూ పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భూమి ఇవ్వడానికి నిరాకరణ ప్రభుత్వం ఎకరానికి రూ.48 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నాన్ టెక్నికల్ ఉద్యోగం ఇవ్వనుందని అధికారులు ప్రతిపాదించారు. దీనికి ఒక రైతు మాత్రమే అంగీకరించగా, 48 మంది దళిత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఒక ఎకరా ఉచితంగా ఇస్తాం, మిగిలిన ఒక ఎకరానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇవ్వాలి’ అని రైతులు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం, ఆందోళన మధ్య అధికారులు గ్రామసభను వాయిదా వేసుకుని వెనుదిరిగారు. బెదిరిస్తే ఉద్యమిస్తాం బెదిరించి సాగులో ఉన్న భూములు తీసుకుంటామంటే ఉద్యమిస్తాం. ఇప్పుడు ఈ భూములు కోల్పోతే పేద దళిత కుటుంబాలు అన్నీ రోడ్డున పడిపోతాయి. మాకు వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియదు. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కుటుంబంలో వాటాలు వేసుకుంటే నెలరోజుల భత్యానికే సరిపోదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మాకు అండగా నిలవాలి. – చందల వెంకన్నఏడాది పొడవునా పంటలు మేము ఇద్దరం అన్నదమ్ములం. పిల్లలు, మనుమలు అందరూ కలిపి 10 మంది కుటుంబ సభ్యులం. మాకు ఈ భూమే ఆధారం. ఏడాది పొడవునా బీర, ఆనప, మినప, కొర్రలు, సజ్జలు, కందులు, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలు పండించుకుని ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా మా భూములు లాక్కొనే బదులు చాలా వరకు బంజరు భూములు ఉన్నాయి. మా పొట్ట కొట్టకండి. – పైల రాముఅంతా రహస్యమేనా.. పంచాయతీ పాలకవర్గంలో కొండ్రు శంకర్, పైల బంగారమ్మ అనే ఇద్దరు దళిత సభ్యులు ఉన్నారు. వారికి గానీ, రైతులకు గానీ తెలియకుండా భూములు తీసుకోవడానికి పంచాయతీ ఎలా తీర్మానం చేస్తుంది. కనీసం గ్రామసభ పెడుతున్నట్టు కూడా సమాచారం లేదు. టీడీపీ నాయకులు తమ భూములను దొడ్డిదారిన పాస్ పుస్తకాలు చేయించుకొని, మిగిలిన రైతుల భూములను ఫణంగా పెడతామంటే ఊరుకోం. – రెల్లి రామకృష్ణ -
వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలి
అల్లిపురం : సమాజంలో వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే చలో అమరావతికి సిద్ధం కావాలని కోరారు. తెలంగాణలో కులగణన నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉంటే 10–12 కులాలకు చెందినవారు మాత్రమే అభివృద్ధి చెందారన్నారు. మిగిలిన కులాలవారు ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. బంగారు కుటుంబాల పేరుతో పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ధనికులను కోరుతోందని, వారి దయాదాక్షిణ్యాలపై పేదలు బతకాలా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఎర్ని శ్రీనివాసరావు, నగరాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగపిళ్ల అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, ఉత్తరాంధ్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.సుధాకర్, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, వాడబలిజ సంక్షేమ సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం, బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ బీసీఎస్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సీపీఐ కార్యదర్శులతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ -
29 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత
మహారాణిపేట: వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసేందుకు, కారుణ్య నియామకాల కింద ఎంపికై న 29 మందికి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోమవారం నియామక పత్రాలను అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ పాల్గొన్నారు. నియామక పత్రాలు పొందినవారిలో 16 మంది జూనియర్ అసిస్టెంట్లు, 8 మంది టైపిస్ట్‌లు, ఐదుగురు ఆఫీసు సబ్–ఆర్డినేట్లు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియమితులైనవారు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. -
డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి
బీచ్‌రోడ్డు: దసరా పండుగ సందర్భంగా కొనుగోలు చేసిన కొత్త ద్విచక్రవాహనం ఓ యువకుడికి శాపంగా మారింది. బైక్ కొనుగోలు చేసిన నాలుగు రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాణిపేట నివాసి సీరందాస్ హరీష్ (19) దుర్మరణం పాలయ్యాడు. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలను అందించారు. పోలీసుల వివరాల ప్రకారం..హరీష్ ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితుడు వినయ్‌తో కలిసి రూ. 2.80 లక్షల విలువైన యమహా ద్విచక్రవాహనంపై టిఫిన్ చేయడానికి కాంప్లెక్స్‌కు వెళ్లాడు. టిఫిన్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, దత్త ఐల్యాండ్ మలుపు వద్ద బైక్ అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న హరీష్‌కు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెనకాల కూర్చున్న వినయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీరని విషాదం తండ్రి శ్రీనివాసరావుతో గొడవపడి మరీ దసరాకు బైక్ కొనిపించుకున్నాడు. హరీష్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుక్కల పట్టివేత... డెబ్రిస్ తరలింపు
కొమ్మాది: రాష్ట్రంలో ఏకై క అంతర్జాతీయ గుర్తింపు పొందిన (బ్లూ ఫ్లాగ్) రుషికొండ బీచ్ నిర్వహన అధికారులు గాలికి వదిలేశారు. దీనిపై ఈ నెల 4వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అపహాస్యం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీచ్ వద్ద పెద్ద ఎత్తున డెబ్రిస్ డంప్ చేయడం, చిల్డ్రన్స్ పార్కు నీట మునగడం, కుక్కలు, పశువులు బీచ్‌లో సంచరించడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురించిన కథనానికి సోమవారం అధికారులు చర్యలు చేపట్టారు. బీచ్ వద్ద డంప్ చేసిన డెబ్రిస్‌ను తొలగించారు. చిల్డ్రన్స్ పార్కును మట్టితో చదును చేశారు. అదే విధంగా జీవీఎంసీ సిబ్బందితో కుక్కలను పట్టుకుని వేరొక చోటుకు తరలించారు. దీనిపై పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రజల సంపూర్ణ సహకారంతోనే విశాఖ అభివృద్ధి
సందడిగా స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ఎంపీ శ్రీ భరత్ బీచ్‌రోడ్డు : ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు గడించిన విశాఖను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. నగర పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మార్పు రావాలని, ఈ దిశగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్’కు 80 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫుట్‌పాత్‌లు కేవలం ప్రజలు నడవడానికి మాత్రమేనని, వాటిని వ్యాపార ఆక్రమణలకు ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటన అనుభవాలను పంచుకుంటూ, అక్కడ జంతువులతో పాటు మనుషుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ‘బయో ఫ్లెక్స్ సిటీ’ విధానాన్ని జూ పార్క్, కై లాసగిరి ప్రాంతాల్లో అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ప్లాస్టిక్ జెండాలు, ఫ్లెక్సీలకు బదులుగా డిజిటల్ బోర్డులు వినియోగించాలని సూచించారు. స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర ముఖ్యం : కలెక్టర్ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా స్వచ్ఛాంధ్ర సాధించాలని అన్నారు. జిల్లాలో పరిశుభ్రత కోసం ప్రతి మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా 45 జిల్లా స్థాయి, 7 రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు నాగలక్ష్మి, రాము, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి స్వచ్ఛాంధ్ర అవార్డు డాబాగార్డెన్స్: స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎంపికై ంది. నగరంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు అందుకున్నారు. -
పీజీఆర్ఎస్కు ‘రెవెన్యూ’ సమస్యలే అధికం
మహారాణిపేట: కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నాయి. అయితే వాటి పరిష్కారం మాత్రం ఆలస్యమవుతోంది. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో మొత్తం 248 వినతులు అందగా, అందులో 86 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి కాగా, జీవీఎంసీకి 66, పోలీస్ శాఖకు 16, ఇతర విభాగాలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల సంఖ్య తగ్గకపోవడంపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్లకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినా, పీజీఆర్ఎస్కు మళ్లీ మళ్లీ అర్జీదారులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీవీఎంసీ పరిధిపై ఫిర్యాదులు ఎక్కువ అనుకున్నా, ఇప్పుడు 11 తహసీల్దార్ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తించారు. అధికారులు అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. అధికారులు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకుని సంతృప్తికర పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు. ఎండార్స్‌మెంట్‌ను సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే దరఖాస్తులు రీ–ఓపెన్ అవుతున్నాయని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చిన అర్జీలను చూడని అధికారులపై, అలాగే పరిష్కారంలో అలసత్వం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి, రానివారికి మెమోలు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 81 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 81 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మలు ఫిర్యాదులు స్వీకరించారు. అందిన 81 వినతుల్లో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 5 ఫిర్యాదులు రాగా, పట్టణ ప్రణాళిక విభాగానికి అత్యధికంగా 46, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 12, మొక్కల విభాగానికి 2, యూసీడీకి 6 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్‌కుమార్, గోవిందరావు, డీడీహెచ్ దామోదరరావు, డీసీపీలు హరిదాసు, కె.వెంకటేశ్వరారవు, రామ్మోహన్, మదుసూధనరావు, యూసీడీ పీఓ ప్రసన్నవాణి పలువురు అధికారులు పాల్గొన్నారు. -
బామ్మ, మనవడ్ని కట్టేసి భారీ చోరీ
సమయం: ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట స్థలం: విశాఖపట్నం, రెడ్డి కంచరపాలెం, ఇందిరానగర్–5 ఏం జరిగింది : ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి భారీ చోరీ మర్రిపాలెం: ఆనంద్‌రెడ్డి ఇల్లు గాఢ నిద్రలో ఉంది. రైల్వే కాంట్రాక్టర్ అయిన ఆనంద్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంట్లో కేవలం ఆయన తల్లి ఎల్లమ్మ (65), కుమారుడు కృష్ణకాంత్‌రెడ్డి (18) మాత్రమే ఉన్నారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు..ముఖాలకు మాస్కులు వేసుకుని పక్కా ప్రణాళికతో ఇంటి వెనుక తలుపుల వద్దకు చేరుకున్నారు. క్షణాల్లో వారు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుండగులు నేరుగా నిద్రిస్తున్న బామ్మ, మనవడి గదిలోకి వెళ్లారు. దుండగులను చూసి తేరుకునేలోపే బామ్మ, మనవడ్ని ప్లాస్టిక్ తాడుతో చేతులు, కాళ్లు గట్టిగా కట్టేశారు. అరుపులు వినిపించకుండా ఉండేందుకు నోటికి ప్లాస్టిక్ టేప్‌లను చుట్టేశారు. ఊపిరి ఆడటానికి కష్టం అవుతున్నా, భయం వారికి మాట రాకుండా చేసింది. నిస్సహాయంగా కళ్ల ముందు జరుగుతున్న దోపిడీని వారు వీక్షించాల్సి వచ్చింది. బాధితులను బంధించిన తర్వాత, దొంగలు ఇంట్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లమ్మ మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకున్నారు. కృష్ణకాంత్‌రెడ్డి చేతికి ఉన్న డైమండ్ రింగ్ లాక్కున్నారు. బీరువాను పగలగొట్టి, అందులో దాచిన పది తులాల బంగారం వస్తువులు, రూ. 3 లక్షలు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత.. దుండగులు తాము దొంగిలించిన వస్తువులను బ్యాగుల్లో సర్దుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంటి యజమాని ఆనంద్‌రెడ్డికి చెందిన మహేంద్ర ఎక్స్‌యూవీ కారుతో పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానికుల సహాయంతో విడిపించుకున్న ఎల్లమ్మ, కృష్ణకాంత్‌రెడ్డి హుటాహుటిన కంచరపాలెం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ క్రైమ్ సీఐ చంద్రమౌళి కేసు నమోదు చేసి, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ చంద్రమౌళి, ఫోరెన్సిక్ టీమ్ ఇంటి వెనుక తలుపుల వద్ద పగిలిన భాగాలను, లోపల చెల్లాచెదురైన బీరువాను పరిశీలించారు. దొంగల కోసం వెస్ట్ క్రైమ్ సీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు తీసుకువెళ్లిన మహేంద్ర ఎక్స్‌యూవీ కారు నంబర్‌తో నగరంలోని అన్ని అవుట్‌పోస్టులకు సమాచారం అందించారు. కారును మారిక వలస వద్ద విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చంద్రమౌళి తెలిపారు. -
పరవళ్లు
పోర్టుసాక్షి, విశాఖపట్నం : ఈస్ట్‌కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ నేటితో 92 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో పోర్టు వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి సరికొత్త సొబగులద్దుకోనుంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో.. విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. ఈ ఏడాది స్వచ్ఛతా అవార్డుల్లో దేశంలో ప్రథమ స్థానం సాధించింది. తొలి పాసింజర్ షిప్ జలదుర్గతో.. 1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ తొలి పాసింజర్ షిప్ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్ డన్ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజనీర్లు డబ్ల్యూసీ యాష్, ఓబీ రాటెన్‌బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టుకు సమీపంలోనే స్టీల్‌ప్లాంట్, సెయిల్, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ షిప్‌యార్డు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హెచ్‌పీసీఎల్ వంటి భారీ పరిశ్రమలున్నాయి. పోర్టులో ప్రధానంగా స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్ పోర్టులోనే ఉండటం విశేషం. సరికొత్త సంస్కరణలు..సాంకేతిక పరుగులు గ్రీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్‌ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తోంది. 2055–26 నాటికి 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ● ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ● 845 మీటర్ల పొడవు, 16 మీటర్ల సహజ సిద్దమైన లోతును కలిగి విశాఖ కంటైనర్ టెర్మినల్ కంటైనర్ ట్రాఫిక్ కు ముఖ ద్వారంలా ఉంది. ఏపీ, తెలంగాణా, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర జార్ఖండ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్ గేట్ వేగా వ్యవహరిస్తోంది. ● మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌ను 666 వాహనాల పార్కింగ్ సామర్ధ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణాలు, యార్డు నిర్మాణం పూర్తి చేసింది. ● పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్త్ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు. ● రూ.800 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సీఎన్జీ బంకరింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు హెచ్‌పీసీఎల్, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది. ● రూ.276 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్–2 నిర్మాణం, అడ్వాన్స్డ్ ఫైర్‌ఫైటింగ్ ఫెసిలిటీ, ఆర్ఎఫ్ఐడీ గేట్ మేనేజ్మెంట్ సిస్టమ్, మోడ్రన్ పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రారంభించారు. ● ఇటీవలే ఏడు దేశాలకు ఆతిథ్యమిస్తూ బిమ్స్టెక్–2025 కాంక్లేవ్‌ని విజయవంతంగా వీపీఏ నిర్వహించింది. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద 11 జిల్లాల ఉద్యోగుల ఆందోళన బీచ్‌రోడ్డు: గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు 11 జిల్లాల విద్యుత్ ఉద్యోగులు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఈ చైర్మన్ ఎస్. కృష్ణయ్య, కన్వీనర్ ఎంవీ రాఘవ రెడ్డి మాట్లాడుతూ యాజమాన్యాలకు, రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకున్నామని తెలిపారు. జూనియర్ లైన్ మెన్ గ్రేడ్–2లకు వర్తింపజేసిన కొత్త సర్వీసు నిబంధనలను తక్షణమే రద్దు చేసి, పాత నిబంధనలు అమలు చేసి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 లకు వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు. 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీపీఎఫ్ , పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం నిబంధన అమలు చేసి, పొరుగుసేవల సిబ్బందికి, కాంట్రాక్టు కార్మికులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు, అలవెన్సులను చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు వాయిదాల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యాన్ని తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి, తమ ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఏపీఎస్పీఈ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కో–ఛైర్మన్ కె.వి. శేషారెడ్డి, డిస్కం యూనిట్ చైర్మన్ గణపతి తదితరులు పాల్గొన్నారు. -
యాప్‌రోగం
మహారాణిపేట: కేజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ యాప్ (ఏబీహెచ్ఏ) ద్వారా ఓపీ టికెట్ల జారీలో ఆన్లైన్ సర్వర్ సమస్య కారణంగా జాప్యం జరిగింది. సోమవారం, ముఖ్యంగా దసరా పండుగ తర్వాత కావడంతో, ఓపీకి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం 1200 నుంచి 1300 టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద సోమవారం దాదాపు 1800 మందికి ఓపీలు, 80 మందికి కే–షీట్లు జారీ చేశారు. ఆరు కౌంటర్లు రోగులు, వారి బంధువులతో కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దీ కొనసాగింది. ‘యాప్’సోపాలు ఒకవైపు సర్వర్ సమస్యతో పాటు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ఏబీహెచ్ఏ యాప్ ద్వారా టికెట్లను జారీ చేయడంలోనూ రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు స్మార్ట్‌ఫోన్ లేక, యాప్ డౌన్లోడ్ చేయలేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సిగ్నల్ లేకపోవడం, ఆధార్ అప్డేట్ కాకపోవడం, వేలిముద్రలు సక్రమంగా పడకపోవడం వంటి కారణాల వల్ల యాప్ డౌన్లోడ్ ప్రక్రియ ఆలస్యమై, రోగులు మరింత ఎక్కువ సమయం కౌంటర్ల వద్ద నిరీక్షిస్తున్నారు. ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో టికెట్లు జారీ నిలిచిపోయి, కౌంటర్ల వద్ద రద్దీ పెరగడంతో రోగులు, వారి బంధువులను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి కూడా కష్టమవుతోంది. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ఉవ్వెత్తున ఉద్యమిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కళాశాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా సాగుతుందన్నారు. వైఎస్ జగన్‌ను స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలవనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టంగా వెల్లడిస్తున్నా.. కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులు ఏమీ పట్టనట్లుగా ఉన్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకోవడంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా.. కూటమి నేత సొంత యూనివర్సిటీ కోసం నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా జీవీఎంసీ పరిధిలోని చిరువ్యాపారుల దుకాణాలను తొలగించి వారి పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణే్ష్కుమార్, మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట రామయ్య, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, డిప్యూటీ మేయర్ కె.సతీష్, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథ రెడ్డి రాష్ట్ర, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ, ఎస్ఈసీ సభ్యులు ఉరుకూటి అప్పారావు, బాణాల శ్రీనివాసరావు, డాక్టర్ జహీర్ అహ్మద్, పిన్నమరాజు సతీష్ వర్మ, ఐ.హెచ్.ఫారూఖీ, పోతిన హనుమంత రావు, జోనల్ అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, ముట్టి సునీల్ కుమార్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, ఉరుకూటి చందు, బోని శివ రామకృష్ణ, భర్కత్ అలీ, పులగం కొండారెడ్డి, అనిల్ కుమార్, కర్రి రామా రెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, శ్రీదేవి వర్మ, వాసుపల్లి యల్లాజీ, వంకాయల మారుతీ ప్రసాద్, దిలీప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్‌రావు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలి రవి, పార్టీ ముఖ్యనాయకులు నడింపల్లి కృష్ణరాజు, పిల్లా సుజాత సత్యనారాయణ, అల్లంపల్లి రాజబాబు, పల్లా దుర్గారావు, రామన్నపాత్రుడు, షరీఫ్, వెంకట నారాయణ, చిన్న దాస్, కార్పొరేటర్లు ఎ.శంకర్రావు, పీవీ సురేష్, రేయి వెంకట రమణ, ఏడుకొండలరావు, కోరుకొండ స్వాతి దాస్, నక్కిల లక్ష్మీ, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, చెన్న జానకి రామ్, గుండపు నాగేశ్వరరావు, వావిలపల్లి ప్రసాద్, శశికళ, సాయి అనూష, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహనకు షాపింగ్ ఫెస్టివల్
మహారాణిపేట : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కలగజేయడంతోపాటు లబ్ధిని నేరుగా ప్రజలకు అందించేందుకు షాపింగ్ ఫెస్టివల్‌ను ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’పై కలెక్టరేట్లో 2–వీలర్, 4–వీలర్, ఎలక్ట్రానిక్ గృహపకరణాలు, మొబైల్స్, ఫర్నిచర్ తదితర వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ షాపింగ్ ఫెస్టివల్లో వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పాల్గొనే వారి సంఖ్యను బట్టి స్థలం నిర్ణయించడం జరుగుతుందన్నారు. జీఎస్టీ 2.0 వల్ల చేకూరే లబ్ధిని వివరిస్తూ స్టాల్స్ ముందు బోర్ుడ్స ఏర్పాటు చేయాలని, ఫెస్టివల్‌కి వచ్చే కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. జాయింట్ కలెక్టర్, జీఎస్టీ నోడల్ అధికారి మయూర్ అశోక్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్.శేఖర్, జిల్లా టూరిజం అధికారి మాధవి, రవాణా శాఖ అధికారులు, హోటల్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు -
భవిష్యత్ తరాలకు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలు
సాక్షి, విశాఖపట్నం: అత్యాధునిక, తక్కువ ఖర్చుతో ఇంధన సామర్థ్యాల అమలుపై దృష్టిసారించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు సహకారం అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ముందుకు వచ్చింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్కమ్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్‌తో కలిసి సీనియర్ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సేవలను మెరుగుపరచడం, స్థిరమైన ఆర్థిక వృద్ధినిప్రోత్సహించడం, భూతాపాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను అమలు చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ రూపొందించే అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా ఈఈఎస్ఎల్తో భాగస్వామ్యం ద్వారా విద్యుత్ విని యోగదారుల కోసం ఇ–రిటైల్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన దేశంలో మొట్టమొదటి డిస్కంగా ఈపీడీసీఎల్ నిలిచినట్లు ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్‌కుమార్ ప్రకటించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు డిస్కం పోర్టల్ ద్వారా నేరుగా స్టార్–రేటెడ్, ఇంధన–సమర్థవంతమైన ఉపకరణా లను పోటీ ధరలకు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈపీడీసీఎల్ జాతీయ ఈ–మొబిలిటీ కార్యక్రమం ద్వారా కర్బన ఉద్గారాలు నియంత్రణ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ రూఫ్‌టాప్, గ్రౌండ్–మౌంటెడ్ ప్రాజెక్ట్‌లు నిర్వహణతో విద్యుత్ ఉత్పత్తి, వికేంద్రీకృత సౌర పీవీ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్, ఇంధన సామర్థ్య ఉపకరణాలు వినియోగంపై విస్త్రృత స్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు సీఎండీ ఫృథ్వీతేజ్ వెల్లడించారు. ఇంధన సామర్థ్య నిర్వహణ అమల్లో ఈపీడీసీఎల్ పనితీరును గుర్తించిన ఈఈఎస్ఎల్ -
‘బాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఈనెల తొమ్మిదిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్‌లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం? -
అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం రికార్డు స్థాయిలో నిత్యకల్యాణాలు, స్వర్ణపుష్పార్చన సేవలు వైభవంగా జరిగాయి. చైన్నెకి చెందిన కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ ఆధ్వర్యంలో ఏకంగా 125 నిత్యకల్యాణాలు, 125 స్వర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆ సంస్థకు చెందిన 125 మంది ఉభయదాతలు ఈ సేవల్లో పాల్గొన్నారు. వీరికి అదనంగా మరో 13 మంది ఉభయదాతలు కూడా నిత్యకల్యాణంలో పాల్గొనడంతో.. మొత్తం 138 నిత్య కల్యాణాలు జరిగాయి. ఉభయదాతలతో ఆలయ కల్యాణ మండపం కిక్కిరిసిపోయింది. తొలుత ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలను కల్యాణ మండపంలో కూర్చోబెట్టారు. స్వామి వారి ఉత్సవమూర్తులను శేషతల్పంపై అధిష్టింపజేసి.. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తరశతనామావళి సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతి అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. అలాగే సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధిలో స్వామికి పెద్ద ఎత్తున తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పర్యవేక్షించారు. కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ నిర్వాహకులు యు.వి.కృష్ణన్ స్వామి సేవల్లో పాల్గొన్నారు. -
నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ శిక్షణ
సబ్బవరం : దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘మెగా డీఎస్సీ – 2025’ ద్వారా నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 400 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆదివారం ఉపాధ్యాయులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణ సమర్థవంతంగా జరిగేందుకు పర్యవేక్షక కమిటీలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థులకు అనారోగ్యం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ డాబాగార్డెన్స్: పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మొదట పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, గుమ్మలక్ష్మీపురం పీహెచ్‌సీల్లో చికిత్స పొందినప్పటికీ, 37 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. ఆయన విశాఖలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం పరామర్శించారు. పాఠశాలలో మంచినీరు, వాష్‌రూమ్‌లు, వసతి గదులు, డైనింగ్ హాల్ వంటి సరైన సదుపాయాలు లేకపోవడం, అలాగే హెల్త్ చెకప్‌లు నిర్వహించకపోవడం, హెల్త్ అసిస్టెంట్లు లేకపోవడమే ఈ దుర్ఘటనకు, ఇద్దరు విద్యార్థుల మరణానికి, 110 మంది ఆసుపత్రిలో చేరడానికి కారణమని వారు విమర్శించారు. చనిపోయిన విద్యార్థులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్స్‌ను నియమించాలని, విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. -
జూ పార్కుకు కొత్త అందాలు
‘డక్ ఏవరీ’లో అలరిస్తున్న బాతులు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో బాతులు సందర్శకులను అలరిస్తున్నాయి. జూ అధికారులు ఇటీవల ఈ బాతులను ఇతర జూ పార్కుల నుంచి మొదటిసారిగా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇంతవరకు ఇక్కడ బాతుల జాతి అందుబాటులో లేదు. వీటి కోసం లవ్ బర్డ్స్ జోన్ పక్కన ప్రత్యేకంగా ‘డక్ ఏవరీ’ నిర్మించారు. ఈ ఏవరీలో తెలుపు, బూడిద రంగు, నలుపు–నీలం కలిసిన రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే బాతులను విడిచిపెట్టారు. కొద్ది రోజులుగా ఈ బాతులు సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఏవరీ లోపల వాటి కోసం ఏర్పాటు చేసిన చిన్న కొలనులో ఈత కొడుతూ, పచ్చని పచ్చికపై హుషారుగా తిరుగుతూ సందడి చేస్తున్నాయి. యానిమల్ కీపర్లు అందించే గింజలు, పండ్ల ముక్కలను తింటూ ఆకట్టుకుంటున్నాయి. -
నవంబర్ 7న ‘ఫ్యాప్టో’ మహాధర్నా
తగరపువలస: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7న విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ బమ్మిడి కేశవరావు కోరారు. ఆదివారం ఆనందపురంలో మహాధర్నా పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేసి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బకాయి ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మిత్ర సంఘాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
జూలో ఉత్సాహంగా బర్డ్స్ వాచ్
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో జరుగుతున్న వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బర్డ్స్ వాచ్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని, జూలోని చెట్లపై తిరుగుతున్న వివిధ పక్షి జాతులను గుర్తించి, పరిశీలించారు. అలాగే దూరంగా ఎగురుతున్న సీతాకోక చిలుకలను బైనాక్యులర్ల ద్వారా వీక్షించారు. జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ పిల్లలకు వన్యప్రాణులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఎలక్యూషన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనదలచినవారు 9491569344ను సంప్రదించాలని కోరారు. -
గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం
మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆదివారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. పాఠశాలలో మొత్తం 129 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, అందులో 37 మందిని కేజీహెచ్‌కు తరలించామని మంత్రి తెలిపారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని, కొందరిలో హెపటైటిస్–ఏ ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని, మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉందని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ఎవరి తప్పిదం ఉన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
బీసీఐ ఎన్నికల నిబంధనలు సడలించాలి
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా అల్లిపురం: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఎన్నికల నిబంధనలను సడలించాలని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల నియమ నిబంధనల్లో ముఖ్యమైన రూ.1,25,000 నామినేషన్ ఫీజు మధ్య తరగతి న్యాయవాదులకు ఆర్థిక భారమని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు లేని ఈ నిబంధనలు.. బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఎందుకని ప్రశ్నించారు. ఈ నిబంధన వల్ల డబ్బున్న న్యాయవాదులు మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని, మధ్య తరగతి న్యాయవాదులకు పోటీ చేసే హక్కు లేదా అని నిలదీశారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ న్యాయవాదులు పోటీలో లేకుండా చేయాలనే కుట్రపూరితమైన జీవో అని పాకా ఆరోపించారు. ఈ నిబంధనను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు ఈ జీవోపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. జిల్లాల బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ సభ్యులు అత్యవసర సమావేశాలు నిర్వహించి,.. ఒక తీర్మానం చేసి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జీపీలు, ఏజీపీలు, పీపీలు, ఏపీపీలు, స్పెషల్ పీపీలు నియామకాల్లో అన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నవంబరు 30న విజయవాడలో కాపుల భారీ సభ
కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం మధురవాడ: కాపుల ఉనికి, శక్తిని చాటే విధంగా నవంబరు 30న విజయవాడలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. దివంగత మిరియాల వెంకటరావు నాయకత్వంలో ఏర్పాటైన కాపు ఉద్యమం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధురవాడ ఎన్వీపీ లా కాలేజీ ఇందిరా విహార్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన కాపునాడు జోన్–1 శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 24 శాతం ఓటింగ్‌కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో కాపులకు సీట్లు ఇవ్వాలని, విశాఖలో కాపు భవనం నిర్మాణానికి అవకాశం కల్పించాలని, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాపునాడులో ఏ పార్టీ వారైనా ఉండవచ్చన్నారు. ఇటీవల చంద్రబాబు రాయలసీమలోని గిరి బలిజ పేరుతో ఒక కులాన్ని బీసీలో చేర్చారని, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో దానిపై స్టేటస్కో వచ్చిందన్నారు. విజయవాడ సభకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ఆహ్వానిస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే ఆయన వచ్చే అవకాశం లేదన్నారు. కాపు నాయకులు కర్రి వెంకటరమణ, పాండ్రంకి జయరాజు, నీరుకొండ రామచంద్రరావు, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
సీతంపేట: యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఈ నెల 9వ తేదీ నుంచి 12 వరకు జరగనున్న 50వ జాతీయ యోగా పోటీలకు అక్కయ్యపాలేనికి చెందిన చెల్లుబోయిన నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. నాగేశ్వరరావు జిల్లా మలేరియా కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన విద్యార్థులకు ట్రయథ్లాన్‌లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న నాగేశ్వరరావును జిల్లా మలేరియా అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు. -
సమ్మోహనం.. నృత్యవిన్యాసం
మద్దిలపాలెం: ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి, బంగారు పతక విజేత అరుణ పరమేశ్ స్థాపించిన సంయుక్త మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవం ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో 60 మందికి పైగా శిష్యులు కూచిపూడి నృత్య విన్యాసాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ.. భారతీయ శాసీ్త్రయ కళల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా తరహాలో.. కల్చరల్ కోటాను ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. కూచిపూడి నాట్య నిపుణురాలు సూదగాని గీతా నారాయణ్ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ‘బ్రహ్మాంజలి’, ‘భో శంభో’, ‘వాలపుల సోలపుల’ వంటి నృత్యరూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐసీసీఆర్ సౌత్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఎన్ఎండీఏ ప్రిన్సిపాల్ కె.వి.లక్ష్మి, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
యువకులను రక్షించిన లైఫ్‌గార్డ్స్
ఏయూక్యాంపస్: ఆర్కే బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను పోలీసులు, లైఫ్‌గార్డులు రక్షించారు. మింది ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు బీచ్‌కు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా.. వారిలో కిలారి సిద్ధు, అకిరి చరణ్ తేజ అలల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన మైరెన్ పోలీసుల సమాచారంతో జీవీఎంసీ లైఫ్‌గార్డులు పోలిరాజు, అచ్చన్న రంగంలోకి దిగారు. యువకులిద్దరినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధు ఆరోగ్యం నిలకడగా ఉండగా.. చరణ్ తేజకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. -
ఉత్తరాంధ్ర సమస్యలపై సమరభేరి
సాక్షి, విశాఖపట్నం: దిక్కులేని ప్రజల గొంతుకై .. వారి తరపున పోరాటానికి సిద్ధమై.. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్గా నిలుస్తూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కూటమి సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం తప్పులు, వైఫల్యాలను ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమరశంఖం పూరించాలని నిర్ణయించినట్టు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం ఆనందపురంలోని పెద్దిపాలెంలో ని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ సమా వేశంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 7 కాలేజీలను పూర్తి చేశారని, వాటిని కూడా ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు తన వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించేందుకు ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారని చెప్పారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారని వివరించారు.కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, సురేష్‌బాబు, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్పర్సన్లు జె.సుభద్ర, పిరియా విజయ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్లమెంట్ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, సూర్యానారాయణ రాజు, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్ర స్వామి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి, గొర్లె కిరణ్‌కుమార్, తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెట్టి ఫాల్గుణ, పిరియా సాయిరాజు, విశ్వసరాయి కళావతి, కె.భాగ్యలక్ష్మి, చెంగల వెంకట్రావ్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శాంప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టిశాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే, మనం చేసే ప్రతీ కార్యక్రమం ప్రజల్లోకి వెళుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా, మండల కమిటీలను, గ్రామ ఇన్చార్జిల నియామకాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం అనంతరం ఉత్తరాంధ్రకు మేలు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. మూలపేట పోర్టు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వైఎస్సార్ సీపీ హయాంలోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, దొరికిన ప్రతీ అంశాన్ని మనం ప్రశ్నించాలి. స్థానిక అంశాలపై దృష్టి సారించాలి. యువ నాయకత్వం పార్టీ బలోపేతానికి కృషి చేసి, నాయకులుగా ఎదగాలి.’అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వరుదు కల్యాణి మాట్లాడుతూ స్థానిక కమిటీల్లో మహిళలకు సమన్వయకర్తలు ప్రాధాన్యమివ్వాలని కోరారు. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ..ప్రతీ నియోజకవర్గంలో సమన్వయకర్త సమక్షంలో నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వాటిని పరిష్కరించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటం చేయాలని సూచించారు.ప్రభుత్వ భూముల కేటాయింపుపై..లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉన్న విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం కట్టబెడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పనులకు, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కోసం భూసేకరణ చేపట్టాం. దానిపై చాలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు లులూ వంటి అడ్రస్ లేని కార్పొరేట్ సంస్థలకు ఖరీదైన భూములను అప్పగిస్తున్నారు.’అని అన్నారు.చిరు వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా..జీవీఎంసీ పరిధిలో 42 వేల మంది చిరు వ్యాపారుల షాపులను, ఫుడ్‌కోర్టులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసింది. హాకర్లకు ఏయూ స్థలంలో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని మభ్యపెడుతున్నారు. దీన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యాపారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం.’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, మళ్ల మాట్లాడుతూ.. ‘ చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసి కూటమి ప్రభుత్వం వారి పొట్టకొట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ క్రూరంగా వ్యవహరించారు. పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని అన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై..
ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న వంశధార, జంఝావతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి వంటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ‘వంశధార రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి మంచి నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు వైఎస్సార్ సీపీ ప్రారంభించింది. పలాస నియోజకవర్గంకు పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించాం. మిగిలిన పనులు పూర్తి చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. 1995లో ప్రారంభమైన వంశధార ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.’ అని అన్నారు. ఈ తీర్మానానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సాగు నీరు అందకపోవడంతో అనకాపల్లి జిల్లాలో చెరకు, వరి సాగు తగ్గిపోయిందన్నారు. జిల్లాలోని ఐదు షుగర్ ఫ్యాక్టరీల్లో చోడవరం ఒకటే మిగిలిందని, దానికి కూడా కాపాడుకోలేదని పరిస్థితి నెలకొందన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చాలా సార్లు ప్రశ్నించాను. స్టీల్‌ప్లాంట్‌కు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు చెబుతున్నా.. ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే కేంద్రం వైఖరి ఉందన్నారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ కాపాడుకునేందుకు మనమంతా ఏకతాటిపై వచ్చి పోరాడాలి’ అని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, గాజువాక సమన్వయకర్త దేవన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక వైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 34 విభాగాలను ప్రైవేటీకరిస్తున్నారు. మరో వైపు నుంచి వీఆర్ఎస్కు వెళ్లని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో భారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.’ అని అభిప్రాయపడ్డారు. -
విద్యుత్ ఉద్యమంపై కూటమి కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ కాంట్రాక్ట్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రధాన డిమాండ్‌తో దశలవారీగా సమ్మె నిర్వహిస్తున్న జేఏసీ కార్యచరణ పై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సంఘాల మధ్య చిచ్చుపెట్టేలా తమ అనుబంధ అసోసియేషన్ తెలుగునాడు ని పావుగా వినియోగించుకుంటోంది. గత నెల చివరివారం నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న చీమకుట్టినట్టైనా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు జేఏసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అడ్డగోలు చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అక్టోబర్ 15 నుంచి తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. విద్యుత్ రంగములో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్స్ ను పరిష్కరించుకుంటే అక్టోబర్ 15 వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ మరోసారి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. సోమవారం ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు అన్ని ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుపెట్టి ఉద్యమాన్ని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పొందుతుంది. టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ని అడ్డం పెట్టుకొని ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. డిస్కౌంట్ లో పనిచేస్తున్న దాదాపు అందరూ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం జేఏసీ ఉద్యమ కార్యచరణ చేపడుతుంటే తాము మాత్రం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంటామంటూ ఉద్యమంలో పాల్గొంటూ తెలుగు నాడు సంఘం ప్రకటన చేయడం వెనక ప్రభుత్వం ఉందనేది స్పష్టమవుతుంది. అనుబంధ సంస్థ వైఖరి బట్టి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమని మరోసారి బట్టబయలైంది. పలుమార్లు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం వల్లే దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు పునరుద్ధాటించారు. ప్రభుత్వ అనుబంధ ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిమాండ్లు నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో సుమారు 27 వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాల తక్కువ వేతనాలకు పనిచేస్తున్నరనీ వారిని పెర్మనెంట్ చేయాలనీ డిమాండ్ చేస్తుంటే... తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చూస్తే ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేందుకు నెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేటట్లుగా కనిపించడం లేదని సుస్పష్టమౌతోంది. ఎన్నికల సమయాల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విద్యుత్ కార్మికులను విస్మరించడం తగదని జేఏసీ చెబుతోంది. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ డిమాండ్లేవీ పరిష్కరించకుండా ఉద్యమాన్ని నీరుగారిచేందుకు ప్రభుత్వం శాయశక్తుల కుయుక్తులు పన్నుతూ ఆందోళన కార్యక్రమాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. వాటిని తిప్పికొట్టేందుకు జేఏసీ దూకుడుగా వ్యవహరిస్తోంది. -
KGH: గిరిజన బాలికలకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో గిరిజన బాలికలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామెర్లకు చికిత్స పొందుతున్న బాలికలను ఆ పార్టీ నేతలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎంపీ తనూజారాణి, మజ్జి శ్రీను పరామర్శించి.. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు బాలికలు చనిపోయారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కురుపాం గిరిజన హాస్టల్లో సమస్యలున్నాయని మేం ముందే చెప్పాం. ఈ నెల 1న బాలికలు అస్వస్థతకు గురైతే 5న మంత్రి వచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది.కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద ఉండకూడదని.. అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ(జి) ముమ్మడివరంలో 79.7మిమీ, పల్నాడు(జి) గుట్లపల్లిలో 60మిమీ, నెల్లూరు(జి) జలదంకిలో 33.5మిమీ వర్షపాతం నమోదైంది. -
సంక్షేమం.. అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని.. ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీపడేది లేదని స్పష్టం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించినది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడం. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అందులో ఇద్దరూ మరణించారు. కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడింది...అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆయనకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతి రాజు పరామర్శించారా? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి’’ అని బొత్స పేర్కొన్నారు. -
యారాడ బీచ్‌లో విషాదం.. ఇద్దరు విదేశీయులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు విదేశీయులు.. అలలు ఎగసిపడటంతో కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి విశాఖకి ఇద్దరు పర్యాటకులు వచ్చారు. ఒకరు మృతి చెందగా.. మరొకరిని లైఫ్ గార్డ్స్ రక్షించారు. కేసు నమోదు చేసిన న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం.. ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్‌గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో.. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. -
‘బాబు అంటనే మోసం.. కబుర్లు తప్ప అభివృద్ధి శూన్యం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అంటనే మోసం అని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప.. అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని తెలిపారు.ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజ రాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంటు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది.అనంతరం, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంది. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం. చంద్రబాబు కబుర్లు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు’ అని తెలిపారు.రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు లేదా మూసివేత తప్పదు అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఎన్నికలు తరువాత మాట మార్చారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు. చంద్రబాబు నిజం చెప్పితే ఆయన తల పగిలిపోతుంది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. 800 కోట్ల కేటాయించి కిడ్నీ హాస్పిటల్ కట్టించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక మంచి పని అయినా చేశారా?. వైఎస్ జగన్ చేసిన పనులను తాము చేసినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మూలపేట పోర్టులో 90 శాతం పని వైఎస్ జగన్ హయంలో జరిగింది. చేసింది చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డము అని తెలిపారు.బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. కూటమి ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే సంహరించుకోవాలి. ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలి.. లేదా సెయిల్‌లో విలీనం చేయాలి. గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. కానీ ప్రజలకు ఏమీ చేయరు.ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశం. స్థానిక సమస్యలు మీద నాయకులు పోరాటం చేయాలి. ఉత్తరాంధ్ర నిర్లక్షం చేయబడిన ప్రాంతం. అన్ని వనరులు ఉండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరంగా ఉంది. విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన 23 సంస్థల్లో ఒకటి కూడా చంద్రబాబు శ్రీకాకుళంలో పెట్టలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ 800 కోట్లతో ఏర్పాటు చేశారు. మూలపేటలో 3,600 కోట్లతో పోర్ట్ ఏర్పాటు చేశారు. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశారు. దివంగత నేత వైయస్సార్, వైఎస్ జగన్ హయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. స్టీల్ ప్లాంట్‌పై మన వైఖరి స్పష్టంగా ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. -
ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ గత రికార్డులను అధిగమిస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌బొహ్రా తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సంలో గడిచిన ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబరు) అధిక వృద్ధిని సాధించి, గత రికార్డులను అధిగమించినట్లు వెల్లడించారు. గతేడాది కంటే రోజువారీ లోడింగ్‌లో సగటున 10.78 శాతం, సరకు రవాణాలో 12.18 శాతం అధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సరకు రవాణాలో రోజుకు సగటున 59.6 రేక్‌ల లోడింగ్ జరిగిందన్నారు. మొత్తంగా 39.19 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ ద్వారా రూ.4841 కోట్ల ఆదాయం సమకూరిందని, గత ఏడాది ఇది కేవలం రూ.4315.56 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 1.64 కోట్ల మంది ప్రయాణికులు ఒక్క విశాఖపట్నం స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారని, వీరి ద్వారా సుమారు రూ.426 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రయాణికుల భద్రతలో రాజీ పడకుండా.. రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్ రైల్వే పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసినట్లు డీఆర్ఎం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా 22 ప్రత్యేక రైళ్లు, 3,300 అదనపు కోచ్‌లు నడుపుతున్నట్లు చెప్పారు. ఇందులో విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో మొత్తం 15 స్టేషన్లను అమృత్‌భారత్ స్టేషన్ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో విశాఖపట్నానికి సమాంతరంగా సింహాచలం, దువ్వాడ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అరకు వంటి పర్యాటక స్టేషన్లు కూడా మరింత అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి.దూబే పాల్గొన్నారు. గత రికార్డులను అధిగమించినట్లు డీఆర్ఎం వెల్లడి -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించండి
మహారాణిపేట: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ రాష్ట్ర ప్రజల జీవనాడి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఈ అంశాన్ని ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభలో ప్రస్తావించానని, కేంద్ర ఉక్కు మంత్రి కూడా తనకు లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం ప్రస్తుతం సీఎం చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్నందున, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఎంపీ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యులు దొండా రాంబాబు, పైల సన్యాసిరాజు, పెంటకోట స్వామి సత్యనారాయణ తొలుత స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ప్రస్తావించగా.. బాబూరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్పర్సన్ సుభద్ర ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గొల్ల బాబూరావు సభ దృష్టికి తెచ్చారు. ఈ రసాయన పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారి ఆందోళనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. సమావేశంలో పలు ఇతర కీలక అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జెడ్పీ చైర్మన్ సుభద్ర డిమాండ్ చేశారు. రైతుల బకాయిలు చెల్లించాలి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బకాయి లు చెల్లించకుండా రైతులకు మొక్కజొన్న వేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని చైర్పర్సన్ ఆమోదించారు. అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టు వద్దు అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టును నిలుపుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు, చెట్టి రోష్మిణి డిమాండ్ చేశారు. అల్లూరి కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం విచారించదగిన విషయమన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. సెప్టెంబర్ 5న గిరిజన బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్‌కు ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలో లైంగిక దాడులు జరుగుతున్నా.. చర్యలు తీసుకునే వారు లేరని ఆరోపించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం ఎంత జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. యూరియా సరఫరా చేయడంలోనూ కూటమి విఫలమైందని ఆమె మండిపడ్డారు. -
గాలుల బీభత్సానికి జూ విలవిల
ఆరిలోవ: విజయదశమి రోజున కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆ రోజు ఉదయం సంభవించిన ఈదురుగాలుల బీభత్సానికి జూలోని వందకు పైగా వృక్షాలు నేలకొరిగాయి. దశాబ్దాల నాటి సిరిసిం, టేకు, కానుగ, వేప వంటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. ఈ గాలుల ఉధృతికి పులుల ఎన్‌క్లోజర్ నుంచి పాముల జోన్ వరకు ఉన్న ప్రాంతంలో చెట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. సింహాలు, కణుజులు, ఎలుగుబంట్లు ఉండే ఎన్‌క్లోజర్‌లతో పాటు, సీతాకోకచిలుకల పార్క్, క్యాంటీన్ పరిసరాల్లోని పచ్చదనం కూడా భారీగా దెబ్బతింది. కొన్ని చెట్లు మధ్యలో విరిగిపోగా, మరికొన్ని వేళ్లతో సహా కూలిపోయాయి. వృక్షాలు కూలడంతో సందర్శకుల మార్గాలు, జంతువుల ఎన్క్లోజర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన జూ సిబ్బంది.. ముందుగా సందర్శకుల రాకపోకలకు అడ్డంగా ఉన్న చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించి, మార్గాన్ని సుగమం చేశారు. ఎన్క్లోజర్లలో కూలిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా సింహాల ఎన్‌క్లోజర్‌లో భారీ టేకు, సిరిసిం చెట్లు కూలిపోవడంతో, వాటి భద్రత దృష్ట్యా రెండు రోజులుగా సింహాలను సందర్శనకు అనుమతించడం లేదు. ఎన్క్లోజర్ను శుభ్రపరిచే పనులు పూర్తయ్యాక తిరిగి సింహాలను అనుమతిస్తామని జూ అధికారులు తెలిపారు. అదేవిధంగా.. పిల్లల ఆట స్థలంలోని పరికరాలపై చెట్లు విరిగిపడటంతో, ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. -
పాతికేళ్ల నృత్య పండగ
మద్దిలపాలెం: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవం శనివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. వేడుకల్లో భాగంగా అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, సంగీత ప్రదర్శనలు భారతీయ సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టాయి. వారి అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ముందుగా విశ్రాంత ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ సదగాని రవిశంకర్ నారాయణ్, అకాడమీ వ్యవస్థాపకుడు బత్తిన విక్రమ్‌కుమార్ గౌడ్, ప్రిన్సిపాల్ కె.వి.లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్ మాట్లాడుతూ.. గడిచిన 25 ఏళ్లలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు. వీరిలో చాలామంది నేడు ప్రఖ్యాత కళాకారులుగా, గురువులుగా స్థిరపడటం తమకు గర్వకారణమన్నారు. అకాడమీ కళాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చి బహుమతులు, ప్రశంసలు అందుకుందని వివరించారు. అనంతరం గురువుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపాల్, నాట్యాచారిణి కె.వి.లక్ష్మిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. పాతికేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులను కళల వైపు ప్రోత్సహించడమే తమ లక్ష్యమని లక్ష్మి పేర్కొన్నారు. అబ్బురపరిచిన నటరాజ్ విద్యార్థుల నృత్యాలు -
బాణసంచా తయారీలో ప్రమాదం
ముగ్గురికి తీవ్రగాయాలుతగరపువలస: వలందపేట రెడ్డివీధిలో అమ్మవారి మండపం వద్ద బాణసంచా తయారీలో భాగంగా శుక్రవారం రాత్రి మంటలు వ్యాపించి అదే గ్రామానికి చెందిన బాకి మహేష్‌రెడ్డి(35), నగిరెడ్ల వాసు(32), చిల్ల కనకరెడ్డి(26) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో మండపం నిర్మించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. శనివారం అమ్మవారి నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా రూ.18 వేల విలువైన బాణసంచా కొనుగోలు చేశారు. ఇంకా బాణసంచా అవసరమని సొంతంగా తయారు చేసుకోవడానికి శుక్రవారం సాయంత్రం ఉపక్రమించారు. అందులో భాగంగా బాణసంచా తయారీకి అవసరమైన పొటాషియం తదితర ముడిపదార్థాలను బీరు సీసాతో నూరే క్రమంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఈ ముగ్గురు గాయపడ్డారు. వీరిని తక్షణం సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కనకరెడ్డికి శస్త్రచికిత్స చేయగా మహేష్‌రెడ్డి, వాసులకు సోమవారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ ముగ్గురు స్థానికంగా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరిలో మహేష్‌రెడ్డి, వాసులకు వివాహాలు కాగా కనకరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. సంఘటనా స్థలాన్ని భీమిలి సీఐ తిరుపతిరావు, తాళ్లవలస అగ్నిమాపకశాఖాధికారి జి.శ్రీనివాసరాజు సందర్శించారు. బాకి మహేష్రెడ్డినగిరెడ్ల వాసుచిల్ల కనకరెడ్డి -
చంద్రబాబు పథకాలన్నీ కాపీ పేస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని, వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నవి అర్థం లేని మాటలు స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అమర్నాథ్, కేకే రాజు అన్నారు. ‘అయ్యన్నలో కనీసం ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అబద్దాలు, అర్థం లేని మాటలు మాట్లాడటం ఆయన నైజం’ అని విమర్శించారు. నేడు వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలన తగరపువలస: పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్‌హాలులో ఆదివారం జరిగే వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను శనివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, పార్టమెంట్ ప్రధాన కార్యదర్శి తైనాల విజయకుమార్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, ఎంపీపీ దంతులూరి వాసురాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంక సత్యం, మజ్జి వెంకటరావు, షిణగం దామోదరరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షిణగం రాంబాబు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కరెంటోళ్ల నిర్లక్ష్యం!
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం సాక్షి, విశాఖపట్నం: కరెంట్ బిల్లు కట్టకపోతే.. సామాన్యుల ఇళ్లని చీకటిమయం చేసే విద్యుత్‌శాఖ.. తాము చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 37 వేల మంది విద్యుత్ కనెక్షన్ల ఆధార్ సీడింగ్‌ని తప్పుగా నమోదు చేసేసింది. ఫలితంగా దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చేసిన పరిశీలనల్లో.. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి బట్టబయలైంది. ఒకే ఒక్క ఆధార్ నంబర్ని ఏకంగా 500 ఇళ్లకు అనుసంధానం చేసేశారు. ఇలా.. ఒక ఆధార్ నంబర్ని 10 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేస్తూ.. అడ్డగోలుగా వ్యవహరించారు. నెలరోజుల్లో తప్పులు సరిదిద్దాలంటూ సీజీఆర్ఎఫ్ ఈపీడీసీఎల్‌కు హెచ్చరిక జారీ చేసింది. 11 సర్కిళ్ల పరిధిలో 37,749 ఇళ్లకు తప్పుడు సీడింగ్.! ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు సర్కిళ్ల పరిధిలోని కొందరు వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్‌కు గత కొద్ది నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. తాము అర్హులమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని.. విద్యుత్ బిల్లుల కారణంగానే జరుగుతోందని సచివాలయంలోనూ, మండల కార్యాలయాల్లో చెబుతున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై సీజీఆర్ఎఫ్ ఆరా తీసింది. సీజీఆర్ఎఫ్ చైర్మన్ విశ్రాంత జడ్జి బి.సత్యనారాయణ అధ్యక్షతన సభ్యులు ఎస్.రాజాబాబు(టెక్నికల్), ఎస్ మురళీకృష్ణ(ఇండిపెండెంట్) క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. ఆగస్ట్ 19న తుది విచారణ పూర్తి చేశారు. మొత్తం తమ పరిశీలనలో విస్తుపోయేలా విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అద్దంపట్టే అంశాలు బట్టబయలయ్యాయి. ఆగస్టు 19 నాటికి ఈపీడీసీఎల్ పరిధిలోని 11 సర్కిళ్లలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్ జరిగిందని తేలింది. పరిశీలన సమయంలో సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొని సీడింగ్ ప్రక్రియలో లోపాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా సరిదిద్దే ప్రక్రియ నిర్వహించారు. విశాఖ సర్కిల్లో 2 ఆధార్లతో 1000 ఇళ్లకు సీడింగ్! విద్యుత్ కనెక్షన్లను ఆధార్ సీడింగ్ చేయాలంటే ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్ని సేకరించడం.. లేదా ఫోన్ ద్వారా సేకరణ ప్రక్రియ చేపట్టడం చేయాల్సి ఉంది. కానీ ఈపీడీసీఎల్లోని కొంతమంది సిబ్బంది తమ వద్ద ఉన్న కనెక్షన్ల ప్రకారం.. అందులో ఉన్న ఆధార్ నంబర్లను సేకరించి.. సీడింగ్ ప్రక్రియని అడ్డగోలుగా చేసేశారు. కొన్ని చోట్ల ఒకే ఆధార్ నంబర్ని 500కి పైగా విద్యుత్ కనెక్షన్లకు సీడింగ్ చేసేశారు. కొన్ని ఆధార్ నంబర్లను 10, 20, 100, 400.. ఇలా.. తమకు నచ్చినట్లుగా అనుసంధానం చేసేసి.. చేతులు దులిపేసుకున్నారు. ఫలితంగా పరిమితికి మించి విద్యుత్ వినియోగించకున్నా లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో ఒకే ఆధార్ నంబర్‌తో 500 ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను సీడింగ్ చేసేశారంటే.. ఎలా కళ్లుమూసుకొని పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. సీజీఆర్ఎఫ్ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యుత్‌సిబ్బంది దిద్దుబాటు ప్రక్రియ చేపడుతున్నారు. 37,749 కనెక్షన్లలో ఇంకా 13,572 కనెక్షన్లు సరిచేయాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సీజీఆర్ఎఫ్ తీర్పునిచ్చింది. ఒకే ఆధార్‌ని 500కిపైగా ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2 ఒకే ఆధార్‌ని 401 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2 ఒకే ఆధార్‌ని 301 నుంచి 400 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 5 ఒకే ఆధార్‌ని 201 నుంచి 300 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3 ఒకే ఆధార్‌ని 101 నుంచి 200 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 20 ఒకే ఆధార్‌ని 51 నుంచి 100 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 59 ఒకే ఆధార్‌ని 10 నుంచి 50 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3,921 మొత్తం కేసులు – 4012 ఈపీడీసీఎల్ పరిధిలో ఆధార్ సీడింగ్‌లో లోపాలు విశాఖపట్నం సర్కిల్లో... ఈపీడీసీఎల్ సిబ్బంది బాధ్యతారాహిత్యం 11 సర్కిళ్ల పరిధిలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్ ఒకే ఆధార్‌తో 500 ఇళ్లకు అనుసంధానం విశాఖ సర్కిల్ పరిధిలోనే అత్యధికంగా 4,012 కేసులు విద్యుత్ వినియోగదారులసమస్యల పరిష్కార వేదికలో బహిర్గతం తప్పులు సరిచేశాక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఏపీఈపీడీసీఎల్ డేటాబేస్‌లో వివిధ కారణాల వల్ల కొన్ని విద్యుత్ సర్వీస్‌ల ఆధార్ సీడింగ్‌లో తప్పులు దొర్లాయి. ఆధార్ సీడింగ్ తప్పుగా జరగడం వల్ల చాలా మంది అర్హులు ప్రభుత్వ పథకాలను దక్కించుకోలేకపోయారు. నష్టపోయిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్‌ను ఆశ్రయించి నష్టపరిహారం, న్యాయం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ గోప్యత హక్కు కూడా కలిగి ఉన్న నేపథ్యంలో వినియోగదారుల అనుమతి, సంతకం లేదా వేలి ముద్ర తప్పనిసరిగా తీసుకుని ఆధార్ నెంబర్‌ను విద్యుత్ సర్వీస్ కనక్షన్కు అనుసంధానం చేయాలి. తప్పులు సరిచేయాలని ఆదేశించాం. సరిచేసిన తర్వాత నివేదికలు ఇవ్వాలని ఈపీడీసీఎల్ అధికారులకు స్పష్టం చేశాం. బి.సత్యనారాయణ, విశ్రాంత జడ్జి, సీజీఆర్ఎఫ్ చైర్మన్ బాధిత వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి ఆధార్ సీడింగ్ తప్పిదాలను రియల్ టైమ్ సాంకేతికతతో సరిచేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సీడింగ్ సమాచారం ఎప్పటికపుడు అప్డేట్ కావడం లేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆధార్ సీడింగ్ వల్ల నష్టపోయిన వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి. ఇప్పటికే సీజీ నెం. 235/2024 కేసులో బాధితులకు నష్టపరిహారం మంజూరైంది. ఆధార్ అనుసంధానంలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. సీజీఆర్ఎఫ్ తీర్పు బాధ్యతరాహిత్యం.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందికి చెంపపెట్టులాంటిది. –కాండ్రేగుల వెంకటరమణ, కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘ఆటో డ్రైవర్ల సేవలో’ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం కింద జిల్లాలో 22,955 మంది ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.34.43 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకం కింద ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తామన్నారు. భీమిలి నియోజకవర్గంలో 5,892 మందికి, విశాఖ తూర్పులో 3,457, పశ్చిమలో 2,212, విశాఖ దక్షిణలో 2,358, ఉత్తరలో 2,563, గాజువాకలో 3,283, పెందుర్తిలో 3,190 మంది డ్రైవర్లకు ఈ పథకం కింద లబ్ధి చేకూరిందన్నారు. అర్హత ఉండి కూడా ఈ పథకం వర్తించని వారు సచివాలయం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. ఎమ్యెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పలువురు కార్పొరేటర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బాలల భద్రత, సంరక్షణకు ప్రాధాన్యం
విశాఖ లీగల్: బాలల సంరక్షణ, భద్రత అత్యంత ప్రాధాన్య అంశాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సంబంధించిన పోలీసు, బాలల సంరక్షణ చట్టం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో న్యాయమూర్తి ప్రసంగించారు. బాలలకు సంబంధించి ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు భద్రత కల్పించడం, వారి ఆరోగ్యం, సంక్షేమం కీలకంగా చూడాలన్నారు. జువనైల్ సంక్షేమ పోలీస్ యూనిట్, బాలల సంక్షేమ కమిటీ, పోక్సో చట్టం, బాలలపై జరిగే లైంగిక నేరాల తీవ్రత, ప్రత్యేక భద్రతా వ్యవస్థ వంటి కమిటీల ప్రాధాన్యం, పనితీరు, ప్రభుత్వ సంస్థల చొరవ వంటి అంశాలపై న్యాయమూర్తి మాట్లాడారు. బాలల నేరాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి.రామలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా అందుకు సంబంధించిన సంస్థలు బాధ్యత వహించి, అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిత్, చోడవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.సూర్యకళ, విశాఖ జిల్లా ప్రొబిషన్ అధికారి జి.శ్రీధర్, బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఎం.ఆర్.ఎల్.రాధ, జువనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు పి.సూర్య భాస్కరరావు, బాలల సంక్షేమ బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఐఎన్ఎస్ కళింగలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
కొమ్మాది: బీచ్ రోడ్డులోని ఐఎన్ఎస్ కళింగలో శనివారం సాయంత్రం ఒక సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన బాజీ బాబా సాహిక్ (44) ఇక్కడ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సాహిక్ తన వద్దనున్న సర్వీస్ తుపాకీతో గొంతు వద్ద కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. నేవీ అధికారులు ఫిర్యాదు మేరకు భీమిలి సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిసెంబరు 19 నుంచి క్రెడాయి ఎక్స్పో
బీచ్‌రోడ్డు: ఎంవీపీకాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో డిసెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించనున్నారు. క్రెడాయ్ విశాఖ చైర్మన్ ధర్మేందర్ వరదా, అధ్యక్షుడు ఈ.అశోక్ కుమార్, కార్యదర్శి వి.శ్రీను, సంయుక్త కార్యదర్శి/కార్యక్రమ కన్వీనర్ సీహెచ్.గోవిందరాజు నగరంలోని ఒక హోటల్లో శనివారం మీడియాకు ఈ వివరాలను వివరించారు. ఈసారి కూడా బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని, వినియోగదారుల సౌకర్యార్థం నిర్మాణ సామగ్రి, అధునాతన ఇంటీరియర్ తదితర వివరాలను ఈ ఎక్స్పో ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. సిమెంట్‌పై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీలు ధరల్ని పెంచి జీఎస్టీ తగ్గించామని చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్నదానంలో అపశ్రుతి
డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జాలరిపేటలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడి గంజి పడిన ఘటనలో చిన్నారులు, వృద్ధులు సహా 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జాలరిపేట పిల్లా అప్పయ్యమ్మ కాలనీలో వీర్రాజు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం అమ్మవారి నిమజ్జనం నేపథ్యంలో మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఇరుకై న ప్రదేశంలో జరగడం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నిర్వాహకులు అదనంగా అన్నం వండటానికి గ్యాస్ స్టవ్‌పై పెద్ద పాత్రలో నీటిని మరిగించి బియ్యం వేశారు. అయితే స్టవ్ స్టాండు సరిగ్గా లేకపోవడంతో మరుగుతున్న నీటితో(ఎసరు) ఉన్న ఆ పాత్ర ఒరిగిపోయింది. అన్న ప్రసాదం కోసం క్యూలో ఉన్న చిన్నారులు, మహిళలు, వృద్ధుల కాళ్లపై గంజి నీళ్లు పడి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 18 మందికి స్వల్ప గాయాలు (2–3 శాతం కాలిన గాయాలు) కావడంతో.. ప్రథమ చికిత్స అందించి, మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. అయితే.. పి.నక్షత్రలహరి (5), పి. ధనుష్(8) అనే ఇద్దరు చిన్నారులకు 20 శాతం కాలిన గాయాలవడంతో వారిని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మోహన్‌రావు తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
మరణశయ్యపై విశాఖ ఉక్కు..!
‘‘విశాఖ స్టీలులో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై 2021 జనవరిలో కేబినెట్ కమిటీ తీర్మానం చేసింది. దీనిని వెనక్కి తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు’’⇒ వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు ఆగస్టు 1వ తేదీన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన ప్రకటన‘‘అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వహణ సాధ్యం కాకుండా ఉన్న విశాఖ స్టీలు ప్లాంటు మూతపడటానికి దగ్గరగా ఉంది. ఉద్యోగుల భారాన్ని తగ్గించేందుకే వీఆర్ఎస్ అమలు చేస్తున్నాం’⇒ వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఆగస్టు 8వ తేదీన అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సెప్టెంబరు 16న సభలో ఇచ్చిన సమాధానం‘‘ఆర్ఐఎన్ఎల్కు సంబంధించి ప్రైవేటీకరణపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదు’’⇒ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్‌రావు 2025 మార్చి 2వ తేదీన ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు మార్చి 18న కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) అండర్ సెక్రటరీ అజయ్ నాగ్‌పాల్ వివరణసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనేక సందర్భాల్లో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని... ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అయినప్పటికీ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్, లోకేశ్‌లు ప్రకటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు స్టీలు ప్లాంటు సిబ్బందిని మభ్యపెట్టేందుకు పదేపదే ప్రజలను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. వేతన బకాయిల సమస్యలో ఉద్యోగులుస్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సమయంలో క్రెడిట్ తమదంటే తమదంటూ కూటమి నాయకులు గొప్పలు పోయారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ మొత్తం రాకపోగా, ఇప్పటికీ స్టీలు ప్లాంటు కార్మికులు భారీ వేతన బకాయిలతో సతమతమవుతున్నారు. మరోవైపు ఉద్యోగులను తొలగించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అమలు చేస్తున్నారు. మొదటి దఫాలో వీఆర్ఎస్ ద్వారా 1,120 మంది కార్మికులతో రాజీనామా చేయించారు. రెండో విడతలో 464 మందిని ఇంటికి సాగనంపారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులు 5,000 మందిని ఇప్పటికే తొలగించారు.కార్మిక సంఘాల ఆగ్రహంఅన్నింటికీ మించి విభాగాల వారీగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకుగానూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 32 విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకెళుతోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలు మాత్రం ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందంటూ ప్రకటనలు ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముడిసరుకుల కొరతతో విశాఖ స్టీల్ ఉత్పత్తి పెరగని పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది.సెయిల్‌లో విలీనం అవశ్యం...స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుతం రోజుకు 6 ర్యాక్‌ల బొగ్గు అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయి ఉత్పత్తికి 9 ర్యాక్‌లు కావాలి. నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేటు ప్లాంటు ప్రారంభమైతే మొత్తం 13–14 ర్యాక్‌ల బొగ్గు అవసరం ఏర్పడుతుంది. కానీ ఒక్క రైల్వే లైన్‌తో ఈ సరఫరా సాధ్యం కాదు. మిట్టల్ సంస్థలు తమ వనరులతో సమస్య పరిష్కరించుకోగలుగుతాయి. విశాఖ స్టీలుకు అది కష్టమే. ఉద్యోగుల సంఖ్యను 12 వేల నుంచి 7 వేలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా, ఈ సిబ్బందితో పూర్తి ఉత్పత్తి సాధ్యం కాదంటున్నారు. కాబట్టి బొగ్గు గనులు కలిగిన సెయిల్‌లో విలీనం చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని భావిస్తున్నారు.వైఎస్సార్సీపీది దీర్ఘకాలిక పోరాటం...!విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచీ వైఎస్సార్సీపీ ఒకే నిర్ణయంపై ఉంది. కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తోంది. విశాఖ స్టీలు ప్లాంటును 100 శాతం ప్రైవేట్‌పరం చేసేందుకు అనుగుణంగా 2021 జనవరిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 2021 ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు 2021 మేలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎప్పటికప్పుడు పార్లమెంటులో కూడా తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్రానికి పలు దఫాలుగా విశాఖ స్టీలును ప్రైవేటీకరించవద్దంటూ వినతిపత్రాలను వైఎస్ జగన్ సమర్పించారు.లక్షల మంది సాక్షిగా ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోడీ సభలో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించవద్దంటూ స్వయంగా ఆయన ఎదుటే వైఎస్సార్సీపీ తన గళాన్ని వైఎస్ జగన్ వినిపించారు. తద్వారా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమయంలో ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేయడం ప్రారంభమైంది. -
వైభవం.. అప్పన్న జమ్మివేట ఉత్సవం
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరిగింది. కొండదిగువ పూలతోటలో జరగాల్సిన ఈ ఉత్సవాన్ని వర్షం కారణంగా సింహగిరిపైనే అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచార పూజలు, వేద పారాయణాలు, పంచశూక్త పారాయణాలు జరిపారు. నృసింహమండపంలో ఉన్న శమీ వృక్షం చెంత విశేష పూజలు నిర్వహించారు. చెట్టు నుంచి శమీ దళాలను కోసి, స్వామికి సమర్పించారు. విశేష అర్చన అనంతరం ఆలయ బేడామండపంలో స్వామికి తిరువీధి జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు పెద్దరాజు, పవన్ తదితరులు ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, పూర్వ ఈవో సూర్యకళ ఉత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఈ రమణ, ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
50 అడుగుల ‘రావణ’ దహనం
కొమ్మాది: బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ ఇస్కాన్ టెంపుల్లో గురువారం విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా ‘రామకళామృతం, రామగానామృతం’ కీర్తనలు, ఆలాపనలు భక్తిభావంతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా సాయంత్రం 50 అడుగుల భారీ రావణ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమం జరిగింది. రావణ దహనం అనంతరం నిర్వహించిన ఫైర్ క్రాకర్స్ షో , సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయి సేవినీ తదితరులు పాల్గొన్నారు. -
దేశరక్షణ రంగంలో హెచ్ఎస్ఎల్ కీలక పాత్ర
సింథియా: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి షిప్‌యార్డ్ సీఎండీ గిరిదీప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాంతి, అహింస సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీజీ సేవలను ఆయన కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగులకు, భాగస్వాములకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా స్వదేశీ నౌకా నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, అలాగే అక్టోబర్ 2 నుంచి 31 వరకు ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. -
నగర సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయండి
డాబాగార్డెన్స్: నగరంలో జరగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్‌కు ముందు నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులను త్వరగా పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రానున్నందున, నగరాన్ని మరింత సుందరంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్, ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజు, ఇతర అధికారులతో కలిసి ఆర్కే బీచ్, పార్క్ హోటల్, సిరిపురం వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద డ్రోన్ కెమెరా ద్వారా పలు ప్రాంతాలను పరిశీలించి, అభివృద్ధి పనులపై ఇంజనీర్‌కు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బీచ్‌రోడ్డులో చేపట్టాల్సిన సుందరీకరణ పనులను కమిషనర్ వివరించారు. వీటిలో ముఖ్యంగా ఫుట్‌పాత్ కర్బ్‌వాల్స్ మరమ్మతులు, పెయింటింగ్‌లు, స్టడ్స్ ఏర్పాటు పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. మొక్కల ఏర్పాటు, విద్యుత్ అలంకరణ, వీధిలైట్ల మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించారు. సమ్మిట్ పూర్తయ్యే వరకు జీవీఎంసీ అధికారులు, సంబంధిత విభాగాలు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహించి పనులను పర్యవేక్షించాలని ప్రధాన ఇంజనీర్‌కు సూచించారు. పర్యటనలో జోనల్ కమిషనర్లు కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌కుమార్, కె.శ్రీనివాసరావు, రాయల్ బాబు, పాల్గొన్నారు. -
‘అండమాన్ చూద్దాం రండి’ పుస్తకావిష్కరణ
మద్దిలపాలెం: అండమాన్ వెళ్లేందుకు గతంలో మాదిరి భయపడాల్సిన పనిలేదని, ఇప్పుడది చాలా మంచి సందర్శన స్థలమని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజ్ఞశ్రీ డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన అండమాన్ చూద్దాం రండి(యాత్రా కథనం) పుస్తకాన్ని ఏయూలో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రా రచనల ప్రయోజనాలను వివరించారు. తాను పాకిస్థాన్‌పై రాసిన యాత్రా రచనను సభ ముందుంచారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత(పార్వతీపురం) నారంశెట్టి ఉమామహేశ్వరరావు పుస్తక పరామర్శ చేస్తూ, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడని, పుస్తకాలు నేస్తాలని అభివర్ణించారు. ఈ పుస్తకం చదివిన తరువాత అండమాన్ వెళ్లాలని ఆరాటం కలుగుతోందన్నారు. గౌరవ అతిథి సెంట్రల్ ఎకై ్సజ్ అధికారి నల్లా అపర్ణ మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు అండమాన్‌లో పనిచేస్తున్నారని, ఇలాంటి సమయంలో అండమాన్ చూద్దాం రండి పుస్తకాన్ని సత్యనారాయణ రాయడం ఆనందంగా అన్నారు. రచయిత బండి సత్యనారాయణ స్పందిస్తూ ఈ పుస్తక రచనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, యార్లగడ్డ అందించిన ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మస్తాన్ రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో తొలి పుస్తకాన్ని దూరదర్శన్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ సి.సుబ్బారావు స్వీకరించారు. మార్టూరు శ్రీనివాసరావు, ఉప్పల అప్పలరాజు, డా.కేవీఎస్ హనుమంతరావు, సీహెచ్ చిన సూర్యనారాయణ, మరడాన సుబ్బారావు, స్వర్ణ శైలజ, పీఎల్వీ ప్రసాద్, శీరేల సన్యాసిరావు పాల్గొన్నారు. -
పడవ బోల్తాపడి మత్స్యకారుడి మృతి
ఆరిలోవ: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పడవ బోల్తాపడి మృత్యువాతపడ్డాడు. ఆరిలోవ ఎస్ఐ రాందాస్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ 9వ వార్డు పరిధి జోడుగుళ్లుపాలేనికి చెందిన గరికిన నూకరాజు(36) శుక్రవారం చేపల వేటకు పడవపై బయలుదేరాడు. తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో సముద్రంలో ప్రవాహం, అలల తాకిడి అధికంగా ఉండటంతో పడవ బోల్తాపడింది. దీంతో నూకరాజు నీటిలో మునిగిపోయి మరణించాడు. అలలపై తేలియాడతున్న అతని మృతదేహాన్ని గమనించిన స్థానిక మత్యకారులు గరికన నర్సింగ్, అప్పలరాజు ఒడ్డుకు చేర్చారు. మృతుడి తండ్రి గరికిన గురుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ వద్ద నిరసన’
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ పార్లమెంట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు తెలిపారు. శుక్రవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నగరంలో ఎంపీను కలిసి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సొంత గనులు ఉంటేనే ప్లాంట్‌కు భవిష్యత్తు ఉంటుందని, గనుల సాధనకు సహకరించాలని విన్నవించారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఆనాడు తమ పార్టీ కేంద్రాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్లాంట్‌ను రక్షిస్తామని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. నవంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఎంపీను కలిసిన వారిలో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, సీహెచ్ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్‌లు ఉన్నారు. -
కొత్త పింఛన్లు కష్టమే..!
మహారాణిపేట: కూటమి సర్కార్ కొలువుదీరి 16 నెలలు కావస్తున్నా.. కొత్త పింఛన్ల ఉసే ఎత్తడం లేదు. ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు, వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో బాకాలు ఊదారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించే పరిస్థితి లేదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో ఈ దరఖాస్తులే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. ఇంటి సమీపంలో ఉన్న సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం కానరావట్లేదని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వాపోతున్నారు. దివ్యాంగ పింఛన్లకు ఎసరు సామాజిక పింఛన్లు తీసుకుంటున్న పలు కేటగిరీల్లోని దివ్యాంగులపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. సామాజిక పింఛన్లు తీసుకునేవారిపై ర్యాండప్ సర్వేతో లబ్ధిదారులను తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫీకేషన్ పేరిట పింఛన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1,60,200 మంది పింఛన్లు పొందుతున్నారు. వివిధ రకాలైన దివ్యాంగులు 21,306 మంది ఉన్నారు. వీరికి కేటగిరీ వారీగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. ఇందులో 16,187 మందికి రీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మంది దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వీరిలో కొందరు రీ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయారు. దీంతో 1,579 మందికి పింఛన్ నిలిపేశారు. ఇందులో తమ పనులు తాము చేసుకోలేని వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏటా రెండుసార్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు ఇచ్చేవారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. చాలా వరకు ఇంటికే వచ్చి వలంటీర్లు దరఖాస్తులు తీసుకునేవారు. ఏటా జనవరి, జూలై నెల్లో అర్హులను ఎంపిక చేసి, ఆ మరుసటి నెల నుంచే పింఛన్ మొత్తం అందించేవారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇచ్చిన దాఖలాల్లేవు. 50 ఏళ్లకే పింఛన్ ఏమైంది? సూపర్–6 హామీల్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించట్లేదు. ఇప్పుడు సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ కూటమి నేతల హడావుడి ప్రజల్లో నగుబాటుకు గురవుతోంది. కొత్త పింఛన్ కోసం సచివాలయాల్లోకి వెళ్తే 50 ఏళ్ల కేటగిరీపై ఇంకా ఆప్షన్ రాలేదని చెప్పి, సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. పింఛన్ల కోసం గతంలో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. వాటిని ఇంకా విచారణే చేయలేదు. ఇలాంటి సమయంలో కొత్త దరఖాస్తులు ఎలా స్వీకరించేందంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘దివ్యాంగుల’నేతకే కోత దివ్యాంగుల హక్కులు, సమస్యలపై పోరాటం చేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు పింఛన్‌కే ఎసరెట్టారు. 2003లో విశాఖ విమానాశ్రయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ కాలు దెబ్బతినడంతో మోకాలి వరకు తొలగించారు. ఈ నేపథ్యంలో అప్పారావుకు 60 శాతంతో సదరం సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం మూడుసార్లు సదరం సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇప్పుడు పింఛన్ నిలుపుదల నోటీసు జారీ చేశారు. ఇది చాలా అన్యాయమని, దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తన పింఛన్ తొలగింపుపై అధికార యంత్రాంగం స్పందించాలని అప్పారావు కోరుతున్నారు. -
దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి
మద్దిలపాలెం: విశాఖలోని రాంనగర్లో దసరా మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో హోటల్ నిర్వాహకులపై దాడి జరిగింది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న చిట్టినాయుడు కోడి పలావ్ దుకాణాన్ని నడుపుతున్న అబ్బిరెడ్డి నరేంద్ర, అతని సోదరుడు మణికంఠపై ఈ దాడి జరిగింది. గురువారం ధనకోటి సురేష్, మడ్డు హరి, చంద్రాల మహేంద్రతో పాటు మరికొంతమంది వచ్చి దసరా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రశ్నించినందుకు, నిందితులు తీన్మార్ కర్రలతో నరేంద్ర, మణికంఠపై దాడికి దిగారు. ఈ దాడిలో నిర్వాహకుల్లో ఒకరికి కుడి కంటికి తీవ్ర గాయం అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ పల్లా పైడియ్య ఆదేశాలతో ఎస్ఐ షేక్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిట్టినాయుడు కోడి పలావ్ నిర్వాహకులకు తీవ్ర గాయాలు -
గాంధీ మార్గం అనుసరణీయం
జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: మహాత్మా గాంధీ ఆచరించిన అహింస, శాంతి మార్గాలు మనందరికీ అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో సత్యం, అహింస ఆయుధాలుగా, శాంతి, సహనం కవచాలుగా చేసుకుని భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్న మనం ఆర్థిక స్వాతంత్య్రం పొంది ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. శాస్త్రి చిరస్మరణీయుడు : జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని దేశానికి అందించి, కష్టపడే రైతు, సరిహద్దుల్లో సైనికుడిని సమానంగా గౌరవించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాస్త్రి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. సాధారణ జీవనశైలి, నిజాయితీ, దేశం పట్ల అంకితభావం కలిగిన శాస్త్రి చిరస్మరణీయుడన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి బీవీ రాణి, డీపీవో శ్రీనివాసరావు, జీవీఎంసీ, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దసరా పండగ వేళ విషాదం
కంచరపాలెం: దసరా పండగ వేళ చిరు వ్యాపారి కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి చిరువ్యాపారి దుర్మణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన సంఘటన వివరాలివి. కంచరపాలెం నేతాజీ కూడలి ఫ్లైఓవర్ వంతెన సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం పక్క రోడ్డులో బత్తిన ఈశ్వరరావు(52) టీ బడ్డీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం కురిసిన కుండపోత వర్షంతో పాటు ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో టీ దుకాణంపై హైటెన్షన్ వైర్లు తెగి, సర్వీస్ వైర్లపై పడ్డాయి. ఆపై అవి బడ్డీపై వాలాయి. అదే సమయంలో దసరా పురస్కరించుకుని మామిడి కొమ్మలు ఐరన్ బడ్డీకి ఆలంకరణ చేస్తున్న ఈశ్వరరావు విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందారు. అదే సమయంలో బడ్డీ వద్దకు టీ తాగేందుకు వచ్చిన మామిడి తులసీరావు కూడా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక, విద్యుత్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పండగ పూట జరిగిన ఈ సంఘటన గాంధీనగర్ ప్రజల్లో విషాదం నింపింది. సీఐ కె.రవికుమార్ నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జోన్–5 కమిషనర్ రాము, ఏపీఈపీడీసీఎల్ కంచరపాలెం జోన్ ఈఈ బీకే నాయుడు వైర్ల పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. -
హోరు గాలి.. చెట్లు కూలి
డాబాగార్డెన్స్ : నగరంలో గురువారం ఈదురుగాలులు, వాన బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల తీవ్రత గతంలో సంభవించిన హుద్‌హుద్ తుఫానును తలపించేలా ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. నగరం వ్యాప్తంగా దాదాపు 80 ప్రాంతాల్లో 168 వరకు చెట్లు నేలకూలాయి. దీంతో సాధారణ జనజీవనానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జీవీఎంసీ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో, జీవీఎంసీ యంత్రాంగం తక్షణమే స్పందించి, ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావంతో నగరంలో 80 ప్రాంతాల్లో చెట్లు పాక్షికంగా, 168 వరకు పూర్తిగా నేలకూలాయని, 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయని కమిషనర్ తెలిపారు. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో హార్టికల్చర్, మెకానికల్, ప్రజారోగ్య విభాగాలు సంయుక్తంగా పనిచేసి, 62 ప్రాంతాలలో అడ్డుగా ఉన్న వాటిని ఇప్పటికే తొలగించాయి. మిగిలిన చోట్ల కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జీవీఎంసీ 8 ప్రత్యేక బృందాలు, 17 జేసీబీల సాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టి, 145 చెట్లను పూర్తి స్థాయిలో తొలగించామన్నారు. . మిగిలిన 23 చెట్లను తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈదురు గాలులకు 9 విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయని, వాటిని వెంటనే పునరుద్దరణ కార్యక్రమం చేపట్టి విద్యుత్‌కు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. కమిషనర్ స్వయంగా బిర్లా జంక్షన్ సర్వీస్ రోడ్డు, సర్క్యూట్ హౌస్ ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించారు. ఈదురు గాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్లు ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు తెలిపారు. వర్షాల ప్రభావంతో నగర పరిధిలోని 3 డివిజన్లలో విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, కొమ్మలు విరిగిపడటంతో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మొత్తం 95కు గాను 39 33కేవీ ఫీడర్లు, 574కు గాను 120 11కేవీ ఫీడర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. -
బలహీన పడ్డ తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు వర్షాలు..
విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ కాస్తా వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఒడిశాలో దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్‌ఘడ్ వరకు పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు గా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉంది. 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టం గా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. టెక్కలి, మందస 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకులం జిల్లాలో భారీ వర్షాలుతీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కేరాసింగ్‌లో రోడ్డుపై కొండచరియుల విరిగిపడ్డాయి. వరద ఉధృతికి రహదారి భారీగా కోతకు గురైంది. ఆముదాలవలస, సిరుబుజ్జిలి మండలాల్లో భారీ వర్షం కురవగా, ఎల్‌ఎన్‌పేట, బూర్గ, జలుమూరు మండలాల్లో భారీ వర్షం పడింది. పార్వతీపురం నాగావళి నదికి వరద ఉధృతి పోటెత్తింది. బాసింగి గ్రామం వరద ముంపునకు గురైంది. సంగమేశ్వరస్వామి వారి ఆలయం నీట మునిగింది. మరొకవైపు అల్లూరి జిల్లాలో సైతం పలుచోట్ల వర్షం పడింది. చింతూరు, వీఆర్‌పురం మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సోకిలేరు ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీనిపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు తక్షణ ఆర్థిక సాయం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. శ్రీకాకుళంలో అలర్ట్
సాక్షి, శ్రీకాకుళం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటం.. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.దంచికొడుతున్న వర్షాలతో వంశధార నదిలోకి వరదనీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాలా రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గొట్టా బ్యారేజీ నుంచి 80వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు లక్ష క్యూసెక్కుల వరకు వరద రావ్చొచ్చని అక్కడి ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పాటు భారీ వర్షం కురిసింది.శ్రీకాకుళం, మన్యం,విజయనగరం జిల్లా ప్రభావిత ప్రాంతాలుఅప్రమత్తంనదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 3, 2025అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా చోడవరం నాలుగు రహదారుల గోయలో వర్షపు నీరు చేరిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం కారణంగా ఇళ్ల ముందు వర్షపు నీరు చేరిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.రెండు రోజులు వర్షాలు..ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో టెక్కలిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత జాతీయ రహదారి, తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి రోడ్డు ప్రాంతాల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీనివాస్ నగర్, రాందాసుపేట ప్రాంతాలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. -
తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
విశాఖ: కళింగపట్నం వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా పారాదీప్-గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుగుతుందని వెల్లడించింది. ఫలితంగా రేపు కూడా పలు ప్రాంత్లాఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 55 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.కాగా, ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండ ప్రబావంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళ రాదని ఐఎండీ ముందుగానే హెచ్చరికలు పంపింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. -
ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వంశ ధార, నాగావళి నదులకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. ఫ్లాష్ ప్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.కళింగపట్నం సమీపంగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి పారాదీప్-గోపాల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 70 కి.మీ పైబడిన వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. వాతావరణ శాఖ.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు
అధికారులకు కలెక్టర్ ఆదేశం మహారాణిపేట: ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథక జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఆమోదంపై చర్చించి.. బోట్లు, ఇంజన్లు, వలలు, ట్రాన్స్పాండర్లు, టెడ్ యూనిట్లను ప్రతిపాదించారు. బ్యాక్‌యార్డ్ ఆర్నమెంటల్ హ్యాచరీలు, సీ–వీడ్ పెంపకంపై దృష్టి సారించాలని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావును కలెక్టర్ ఆదేశించారు. సమావేశం అనంతరం తిమ్మాపురం మహిళా మత్స్యకార సంఘానికి విశాఖపట్నం పోర్ట్ సీఎస్సార్ నిధులతో సమకూర్చిన చేపల రవాణా వాహనాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డా.జోయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, సత్యారావు, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. -
● పెదగాడిలో యూరియా రగడ ● జీఎస్టీ ప్రచారానికి వస్తే యూరియా ఇస్తామన్న కూటమి నాయకులు ● అనంతరం యూరియాఇవ్వకుండా వెనక్కి పంపిన వైనం ● అధికారులు, నాయకుల తీరుపై మండిపడ్డ మొగలిపురం రైతులు
యూరియా ఎర పెందుర్తి: అధికార కూటమి నాయకులు ప్రచార యావతో యూరియాను ఎరగా చూపించి మోసం చేయడంతో ఒక గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై అవగాహన సదస్సు కోసం బుధవారం పెందుర్తి మండలం పెదగాడి రైతు సేవా కేంద్రం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సదస్సు, ర్యాలీ కోసం పెదగాడి, పినగాడితో పాటు, పినగాడి రెవెన్యూ పరిధిలో భూములు ఉన్న సబ్బవరం మండలం మొగలిపురానికి చెందిన రైతులను కూటమి నాయకులు ఆహ్వానించారు. సదస్సు, ర్యాలీకి వచ్చిన ప్రతీ రైతుకు యూరియా ఇస్తామని నాయకులు నమ్మబలికారు. అసలే యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న మొగలిపురం రైతులు.. ఈ హామీతో సదస్సుకు ఉత్సాహంగా హాజరయ్యారు. తీరా జీఎస్టీపై ప్రచారం పూర్తయిన తరువాత, పెదగాడికి చెందిన కూటమి నాయకులు తమకు నచ్చిన కొందరి పేర్లను అధికారులకు చెప్పి, వారికి మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మొగలిపురం రైతులకు పెదగాడి క్లస్టర్లో యూరియా ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు. రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం దీంతో రైతులు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మండలం పరంగా సబ్బవరం అయినప్పటికీ, తమ భూములు పినగాడి రెవెన్యూలోనే ఉన్నాయని రైతులు వివరించారు. పినగాడి రెవెన్యూ పరిధిలో ఉన్న వారికి ఇస్తామని చెప్పి, అదే ప్రాంతంలో భూములు ఉన్న తమకు ఎరువు ఇవ్వకపోవడమేంటని నిలదీశారు. అదే సమయంలో యూరియా నిల్వలు కూడా అయిపోవడంతో చేసేది లేక, కూటమి నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ మొగలిపురం రైతులు వెనుదిరిగారు. ‘యూరియా సరిపడా అందించడంలో విఫలమై, చివరకు చిన్నపాటి ప్రచారానికి మాయమాటలు చెప్పి మమ్మల్ని తరలించారు. ఇలా ఉసూరుమనిపించడం తగదు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు స్పష్టం చేశారు. -
వృద్ధులను గౌరవించడం మన బాధ్యత
గాజువాక: వృద్ధాప్యంలో ఉన్నవారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక క్లబ్, వరిష్ట పౌరుల సమాఖ్య, లైన్స్ క్లబ్, వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రపంచ వృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దలంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం అన్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. వృద్ధుల దినోత్సవం అనడం కన్నా ఎల్డర్స్ డే అని పిలిస్తే బాగుటుందన్నారు. ఈనాటి యువత ఎంత బిజీగా ఉన్నా తాత, బామ్మలను కాపాడుకొని భవిష్యత్ తరాలు ఎలా మెలగాలో తెలుసుకోవాలన్నారు. 75 ఏళ్లు దాటిన వృద్ధులను ఈ సందర్భంగా సత్కరించారు. సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఎ.జె.స్టాలిన్, ఆర్కే హాస్పిటల్ ఎండీ వేమూరి కృష్ణమూర్తి, నిర్వాహక సంఘాల ప్రతినిధులు చిక్కా సత్యనారాయణ, ఎస్.వి.రమణరాజు, నున్న శ్రీనివాసరావు, టి.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఖాదీ సంత
ఎంవీపీకాలనీ: బీజేపీ ఆధ్వర్యంలో గురు,శుక్రవారాల్లో బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఖాదీ సంతను నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. బుధవారం లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ’ అనే నినాదంతో స్వదేశీ వస్తువుల తయారీదారులను ప్రోత్సహించడానికి ఈ సంతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంత ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తుల విక్రయాలకు, ప్రోత్సాహానికి అవకాశం కల్పించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న జమ్మివేటకు సర్వం సిద్ధం
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో జరిగే ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి మధ్యాహ్నం 3.30 గంటలకు సింహగిరి నుంచి కొండదిగువకు మెట్లమార్గంలో తీసుకొస్తారు. కొండదిగువ పూలతోటలో ఉన్న మండపంలో స్వామిని అధిష్టింపజేసి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. పూలతోటలోనే ఉన్న జమ్మిచెట్టు వద్ద శమీపూజ నిర్వహిస్తారు. తదుపరి, స్వామికి అడవివరం గ్రామ పురవీధుల్లో అశ్వవాహనంపై తిరువీధి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు పూలతోటను పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. గోపాలపట్నం పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, జమ్మివేట ఉత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల వరకే సింహగిరిపై స్వామి వారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. -
దసరా.. ధరల జోరు..
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరం దసరా శోభను సంతరించుకుంది. పండగ పూజలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు నగరవాసులు మార్కెట్లకు పోటెత్తడంతోబుధవారం బజార్లన్నీ కిటకిటలాడాయి. అయితే ఈ పండగ ధరల భారం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పూజా సామగ్రి, పువ్వులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ఒకవైపు నగరంలోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడితే.. శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షం వ్యాపారులను నిరాశకు గురి చేసింది. జగదాంబ/డాబాగార్డెన్స్/తగరపువలస: విజయదశమి సందర్భంగా నగరంలోని పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, అల్లిపురం, దండుబజార్, అక్కయ్యపాలెం, గాజువాక వంటి ప్రధాన మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం కాస్త సాధారణంగా ఉన్నా.. సాయంత్రం 4 గంటల తర్వాత జనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పూజా సామగ్రి కోసం వచ్చిన జనంతో మార్కెట్ లోపల, బయట వెలిసిన దుకాణాలు నిండిపోయాయి. గతంలో రూ.200 తీసుకెళ్తే సంచి నిండా సరకులు వచ్చేవని, ఇప్పుడు రూ.500 పెట్టినా సంచి నిండడం లేదని వినియోగదారులు వాపోయారు. ధరల పెరుగుదల తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా పువ్వుల ధరలు భగ్గుమన్నాయి. కిలో బంతి పువ్వులు రూ.250, చామంతి రూ.500కు చేరాయి. వాహనాలకు కట్టే పూల దండలు రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించారు. నాణ్యత, పరిమాణాన్ని బట్టి ఒక్కో కొబ్బరికాయ రూ.40 నుంచి రూ.70 వరకు అమ్మారు. డజను అరటిపండ్లు రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయించారు. నగరంలో రూ.20కి కేవలం మూడు నిమ్మకాయలు అమ్మగా, కొన్నిచోట్ల వాహన పూజల కోసం రూ.20కి ఆరు కాయలు విక్రయించారు. పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తి వంటి ఇతర సామగ్రి కొనాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వచ్చింది. చివరికి మామిడి ఆకుల కొమ్మలు కూడా రూ.20కి అమ్మడం గమనార్హం. పూర్ణామార్కెట్‌లో ఈ సారి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను వన్ వేలో మళ్లించడం ద్వారా వినియోగదారులు సులభంగా కొనుగోళ్లు జరుపుకోగలిగారు. జేబు దొంగల పట్ల పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శివారు మార్కెట్లపై వర్షం ఎఫెక్ట్ నగర కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. తగరపువలస, ఆనందపురం వంటి శివారు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షం వ్యాపారుల ఆశలపై నీళ్లు చల్లింది. రహదారులు జలమయమై, బురదగా మారడంతో వినియోగదారులు మార్కెట్లకు రాలేకపోయారు. దీంతో పూజా సామగ్రి, పండ్లు, కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పూజా సామగ్రి ధరలు పెరిగినప్పటికీ, దసరా సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గడంతో వాటి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. కొత్త దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు కూడా జనం షాపింగ్‌మాళ్లకు పోటెత్తారు. కిటకిటలాడిన మార్కెట్లు.. చుక్కలనంటిన పూల ధరలు -
ఏపీఈపీడీసీఎల్‌లో పలువురికి పదోన్నతులు
తాటిచెట్లపాలెం: ఏపీఈపీడీసీఎల్‌లో పలువురు ఇంజినీర్లకు చీఫ్ జనరల్ మేనేజర్లగా పదోన్నతులు లభించాయి. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సోలార్ ఎనర్జీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎల్ దైవప్రసాద్, పర్చేజెస్ అండ్ మెటీరియల్స్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎస్ విజయ్ప్రతాప్లకు పదోన్నతులు లభించాయి. కమర్షియల్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎస్.రాజబాబు, సీజీఆర్ఎఫ్ టెక్నికల్ మెంబర్‌గా బి.సులేఖ రాణిలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లను సీఎండీ పృఽథ్వీతేజ్ సోమవారం జారీ చేశారు. బుధవారం విశాఖపట్నం కార్పోరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఎల్.దైవప్రసాద్, బి.సులేఖరాణి, ఎస్.రాజబాబులకు పలువురు విద్యుత్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. సులేఖరాణి దైవప్రసాద్ -
మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు భక్తులను మహాలక్ష్మి అలంకరణలో కటాక్షించారు. పలు రకాల తాజా కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా సహస్రనామాచార్చన నిర్వహించారు. నగరానికి చెందిన భక్తులు ఒ.నరేష్కుమార్, రాధిక కుటుంబ సభ్యులు రూ.45 వేలు చెల్లించి ఈ పూజలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గురువారం అమ్మవారు స్వర్ణకవచాలంకరణలో దర్శనమివ్వనున్నారని, 108 స్వర్ణపుష్పాలతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహిస్తామని ఈవో శోభారాణి తెలిపారు. పద్మావతిగా కన్యకాపరమేశ్వరి డాబాగార్డెన్స్: పాతనగరం కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం కన్యకాపరమేశ్వరి పద్మావతిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు ఆర్బీబీ కుమార్శర్మచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వాసవీ కనకదుర్గాదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు, హోమం చేశారు. సత్యవతి, వెంకటేశ్వర సుందరకాండ గ్రూప్‌చే సుందరకాండ గానం భక్తులను అలరించింది. గురువారం కన్యకాపరమేశ్వరి విజయదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. -
సీఎం చంద్రబాబుకు స్వాగతం
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. విజయనగరంలో జరిగే పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన.. ట్రాన్సిట్ హాల్ట్‌లో భాగంగా బుధవారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్లో విజయనగరం బయలుదేరి వెళ్లారు. -
ఏయూ దూర విద్య..అక్రమాల అడ్డా
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యకు చెదలు పట్టింది. అధికారుల హస్తలాఘవానికి కేంద్రంగా మారిపోయింది. పరీక్షా కేంద్రాల పేరుతో అక్రమాలకు అడ్డాగా తయారైంది. ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది చేతివాటం కారణంగా ఎగ్జామినేషన్ సెంటర్లు హద్దులు దాటి ప్రైవేటు చేతికి వెళ్లిపోయాయి. ఈ ప్రైవేటు సెంటర్లు ఒక పేరుతో అనుమతి పొంది మరోచోట పరీక్షలు నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా ఈ పరీక్షల నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార కేంద్రాలు మాస్ కాపీయింగ్‌కు నిలయాలుగా మారిపోయాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే దూర విద్య పరీక్షా కేంద్రాలు నిర్వహించాలని ఏయూ పాలకులు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని లొసుగులతో ఇప్పటికీ ప్రైవేటుకే పెద్ద పీట వేస్తున్నారు. సెంటర్‌కు రూ.2 నుంచి రూ.5 లక్షలు ఏయూ పరీక్షా కేంద్రాలను ఇష్టానుసారంగా ప్రైవేటుకు అప్పగించేశారు. ప్రైవేటు సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిన సందర్భాలు అనేకమున్నాయి. అయినప్పటికీ పరిధి దాటి అనంతపురం, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌లలో కూడా ప్రైవేటు విద్యా కేంద్రాలకు పరీక్షా కేంద్రాల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇటువంటి సెంటర్లపై ఎన్ని ఫిర్యాదు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి సెంటర్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుని అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ప్రైవేటు కేంద్రాలు రద్దు చేయాలని నిర్ణయించినా.. ఏయూ దూర విద్య పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రైవేటు పరీక్షా కేంద్రాల అనుమతులు రద్దు చేయాలని రెండేళ్ల క్రితమే ఏయూ అధికారులు నిర్ణయించారు. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని భావించారు. కానీ అధికారుల బదిలీలు.. సిబ్బంది చేతివాటం.. ప్రైవేటు మామూళ్లతో ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇప్పటికీ ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రైవేటు సెంటర్లలో నిర్వహిస్తూనే ఉన్నారు. గత నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆదాయం పోతుందన్న కారణంగానే ప్రైవేటు సెంటర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్‌కు కేంద్రాలుగా... ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని ప్రైవేటు సెంటర్లు అనధికారికంగా మరికొన్ని చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను నిర్వహించి అక్కడ విద్యార్థులతో పరీక్షలు రాయించి వాటిని అనుమతి పొందిన కేంద్రాల్లో నిర్వహించినట్లు చూపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెల 12వ తేదీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇదే తరహాలో అనధికారికంగా పరీక్షలు నిర్వహించిన ట్లు సమాచారం. మరికొంత మంది ఇతర జిల్లాల్లో అనధికారికంగా పరీక్షలు రాయించి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు రాసినట్లు చూపిస్తున్నారని, ఇందుకు దూర విద్యా విభాగం సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
భలే మందుస్తు ఏర్పాట్లు
దసరా వచ్చిందంటే చాలు... చాలామందికి మందు, ముక్క లేకుండా పండగ అస్సలు మొదలైనట్టే కాదు.. ఈ రెండూ ఉంటేనే ఆ రోజుకి అసలు ‘జోష్’ వచ్చినట్టు. ఈ ఏడాది అసలు ట్విస్ట్ ఏంటంటే... దసరా పండగ సరిగ్గా గాంధీ జయంతి రోజునే వచ్చింది. ‘నియమం’ ప్రకారం, ఈ శుభదినాన ప్రభుత్వం మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు రెండింటికీ సెలవు ప్రకటించింది. అంటే పండగ రోజున మందు బాబుల ‘హోమ్ డెలివరీ’కి కూడా దారి లేదన్నమాట..‘ఏం? పండగని ఆపేస్తారా? మా ఆనందాన్ని ఆపగలరా?’ అంటూ మద్యం ప్రియులు రంగంలోకి దిగారు. గురువారం షాపులు మూతపడతాయని తెలియగానే, బుధవారాన్ని వాళ్లు ‘అంతర్జాతీయ అత్యవసర నిల్వల దినోత్సవం’ గా మార్చేశారు. వైన్‌షాపుల ముందు క్యూ చూస్తే, అంతా తమ ఇళ్లలో కనీసం నెల రోజులకు సరిపడా ‘ద్రవ్య నిల్వలు’ పెట్టుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. వీళ్ల ప్రణాళిక చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. వైన్‌షాపుల ముందు గుమిగూడిన జనాన్ని చూసి, పక్కన ఉన్నవాళ్లంతా దసరా జోష్ అంటే ఇదే కదా.. అంటూ చమత్కరించారు. ఇక మాంసం దుకాణాల వద్ద రద్దీ అయితే ఇంకో లెవల్..మటన్, చికెన్ ముక్కలు కొని, పావడకుండా ఉండేందుకు ‘ఐస్ క్యూబ్ ప్లానింగ్’ ఎలా చేయాలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకున్నారు. ‘ముక్కను ఫ్రిజ్‌లో దాచడం ఒక కళ, దాన్ని సేఫ్‌గా పండగ రోజు వరకూ ఉంచడం ఒక విజ్ఞానం’ అంటూ డిస్కషన్లు పెట్టుకున్నారు. –సీతంపేట అక్కయ్యపాలెంలో మద్యం దుకాణం వద్ద -
ప్రైవేటు బస్సులపై 14 కేసుల నమోదు
గోపాలపట్నం: దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయడం, అనుమతులు లేకుండా నడపడం వంటి పలు నిబంధనల ఉల్లంఘనలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 14 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.80,000 జరిమానా విధించినట్టు ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. -
పల్లె వైద్యంపై సమ్మె ప్రభావం
మహారాణిపేట: సమ్మెలో భాగంగా జిల్లాలోని పది పీహెచ్‌సీల్లో 20 మంది వైద్యులు సమ్మె బాట పట్టారు. ఇందులో భీమిలి, రేవిడి, ఆర్.తాళ్లవ లస, ఆనందపురం, శోంఠ్యాం, మధురవాడ, కణితదేవాడ, గాజువాక, పెదగంట్యాడ వంటి ప్రాంతాల వైద్యులు ఉన్నారు. గత నెల 29 నుంచి వైద్యులు ఔట్ పేషెంట్ సేవలను పూర్తిగా బహిష్కరించారు. అంతకుముందు 26వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు, అధికారిక కార్యక్రమాలు, రోగుల పేర్ల నమోదు ప్రక్రియ మరియు అధికారిక వాట్సప్ గ్రూప్‌ల నుంచి బయటకు వచ్చారు. గత నెల 26 నుంచి ఆన్లైన్లో రోగులు, వారి వివరాలను నమోదు చేయకుండా నిలిపివేశారు. దీనివల్ల ప్రతిరోజు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సమాచారం నిలిచిపోయింది. ‘స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ కింద జరుగుతున్న నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వే, క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్లు యూనియన్ నేత డాక్టర్ జగదీష్ తెలిపారు. సంచార చికిత్సలు, ఇతర మెడికల్ క్యాంపుల నుంచి కూడా వైద్యులు దూరంగా ఉంటున్నారు. రేపు విజయవాడలో దీక్షలు అత్యవసర వైద్య సేవల్లో భాగంగా కేవలం డెలివరీలు, పాము కాటు, పాయిజనింగ్ కేసులకు మాతమ్రే ఇంతవరకు చికిత్సలు అందించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే శుక్రవారం విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ ప్రకటించారు. నర్సులే డాక్టర్లు కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులు, ఫార్మసిస్టులు వైద్యుల అవతారం ఎత్తి రోగులను చూస్తున్నారు. గ్రామాల్లో సంచార వైద్యసేవలు నిలిచిపోవడంతో, రోగులు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విశాఖ నగరానికి పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, వైద్యుల డిమాండ్లను పరిష్కరించి, గ్రామీణ ప్రజలకు నిరాటంకంగా వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ వైద్యులు బుధవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెలోకి దిగడంతో పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పీహెచ్సీ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం గత నెల 26వ తేదీ నుంచే ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యులు ప్రధా నంగా జీవో నం. 99 ద్వారా కోత విధించిన ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతుల కల్పన, గిరిజన అలవెన్స్‌లు, 104 సంచార చికిత్స అలవెన్స్‌ల అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవి పరిష్కారం కాకపోవడంతో సమ్మె బాట పట్టారు. రోగుల పడిగాపులు వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వెలవెలబోతున్నాయి. రోజుకు 74 నుంచి 140 మంది వరకు ఓపీ నమోదు అయ్యే కేంద్రాలు నేడు బోసిపోయి, వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, ముఖ్యంగా గర్భిణులు, తీవ్ర అవస్థలు పడుతూ పడిగాపులు కాస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కొందరు వైద్యులను ప్రత్యామ్నాయంగా నియమించినప్పటికీ, వారు గత వైద్యుల వలే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారు. -
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మహారాణిపేట: జీఎస్టీ తగ్గింపు ధరలను మెడికల్ షాపులు ఎక్కడా అమలు చేయడం లేదంటూ బుధవారం ‘సాక్షి’లో మందులపై ‘జీఎస్టీ’ మతలబు శీర్షికతో ప్రచురించిన కథనంపై ఔషధ నియంత్రణ శాఖ స్పందించింది. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయకుమార్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మెడికల్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, ఎంవీపీ కాలనీ, ఆరిలోవ, గాజువాక, చిన్నగంట్యాడ, కుర్మన్నపాలెం, అనకాపల్లి, కశింకోట వంటి ప్రాంతాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేశారు. మొత్తం 43 మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టారు. సాక్షిలో కథనం రాగానే కొన్ని షాపులు జీఎస్టీ తగ్గింపు ధరలను తెలియజేసే సైన్ బోర్డులను ప్రదర్శించాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ స్వయంగా పెదవాల్తేరు, చిన్నవాల్తేరు ఏరియాల్లోని 11 షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లో ఎక్కడా జీఎస్టీ ధరల బోర్డులు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. తక్షణమే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డ్రగ్గిస్టులను ఆదేశించారు. జీఎస్టీ నిబంధనలతో మాత్రమే మందులను విక్రయించాలని మెడికల్ షాపుల యజమానులను ఆదేశించారు. మందులను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా జీఎస్టీ సైన్ బోర్డులు లేకపోయినా, జీఎస్టీ తగ్గింపు ధరలకు అమ్మకాలు జరగకపోయినా డీఆర్సీ నంబర్ 863233 0909కు గాని, లేదా dca& grams@ap.gov.inకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తం
మహారాణిపేట: ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను మరింత పెంచాలని, సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జూన్ క్వార్టర్ బ్యాంకర్ల జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగే సమయంలో బ్యాంకర్లు సునిశిత పరిశీలన చేయాలని, అనుకోని రీతిలో ఎవరైనా ఒత్తిడికి గురైనా, సందేహస్పద వ్యవహారశైలి ఉన్నా గమనించి తగిన చర్యలు చేపట్టాలని, ఆపదలో ఉన్నవారికి సహకారం అందించాలని పేర్కొన్నారు. విశాఖలో ఇటీవల జరిగిన పలు ఘటనలను సోదాహరణంగా వివరిస్తూ బ్యాంకర్లు ప్రజలకు ఇలాంటి విషయాల్లో అండగా నిలవాలని హితవు పలికారు. సామాన్యులు, రైతుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, సులభతర విధానంలో రుణాలు మంజూరు చేయాలని సూచించారు. స్వయం ఉపాధి నిమిత్తం వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి పూర్తిస్థాయి సహకారం అందించాలన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టబోయే ప్రాజెక్టులకు బ్యాంకులు మద్దతు తెలిపాలని, కొత్త కొత్త ప్రాజెక్టులతో వచ్చే వారికి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో భాగంగా, ముందుగా గత క్వార్టర్లో నిర్వహించిన సమావేశం తాలూకు లక్ష్యాలను, ఫలితాలను విశ్లేషించారు. జూన్ క్వార్టర్లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులకు, బ్యాంకర్లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రుణాల నిమిత్తం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల కార్యకలాపాలను పెంచాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు చెప్పారు. ఎల్డీఎం శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
వాయుగుండం ప్రభావం.. వచ్చే రెండురోజులు వర్షాలు
సాక్షి,అమరావతి/విజయపురిసౌత్/ధవళేశ్వరం/పోలవరం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర–వాయువ్య దిశగా కదిలి బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపటా్ననికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 420, పూరికి 450, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని, శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడనున్నాయని.. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రా గల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
సింహాచలం దేవస్థానానికి బ్యాటరీ కారు అందజేత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ బ్యాటరీ కారును వితరణగా అందజేసింది.సుమారు రూ. 8 లక్షలు విలువ చేసే ఈ బ్యాటరీ కారును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఎమ్‌వో శంకర్ సుబ్రహ్మణ్యం సింహగిరిపై దేవస్థానం అధికారులకు అందజేశారు. అనంతరం దేవస్థానం అర్చకులు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇతర అధికారులు, కోరమాండల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన గళం
డాబాగార్డెన్స్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, దళితులపై దాడులు, విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం ప్రైవేటీకరణ యత్నాలపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ నేతృత్వంలో నగరంలోని డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్య, వైద్యం ప్రజల హక్కు అని, వాటిని ప్రైవేటీకరించకూడదని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుతో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు కేవలం కార్పొరేట్ శక్తుల కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను దృష్టిలో ఉంచుకుని, వారి భవిష్యత్ తరాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇవి అమల్లోకి వస్తే లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత మెడికల్ విద్య అందుతుందని తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా ఈ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి యత్నించడం చాలా దుర్మార్గమని ధ్వజమెత్తారు. ● మాజీ ఎమ్మెల్యే, పార్టీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ దళితులు, పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేలా ఎస్సీ సెల్ చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. మెడికల్ ఆందోళనకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు -
నేడు సీఎం చంద్రబాబు రాక
ఎయిర్‌పోర్ట్‌లో సీపీ భద్రతా సమీక్షమహారాణిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, దత్తి గ్రామానికి పయనమవుతారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత పార్టీ నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి తిరిగి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ మేరీ ప్రశాంతి, సీఐఎస్ఎఫ్ అధికారి నవనీత్ కౌర్‌తో పాటు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. -
సీఈటీఏతో అదనపు ప్రయోజనాలు
ఏయూక్యాంపస్: భారత్–యూకేల మధ్య ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)పై విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి(వీఎస్ఈజెడ్) ఆధ్వర్యంలో నోవాటెల్ హోటల్లో మంగళవారం ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాల సీఈటీఏ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. రూల్ ఆఫ్ ఆరిజిన్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, సేవల కోసం మార్కెట్ యాక్సెస్, వస్తువులకు సుంకం లేని యాక్సెస్ వంటి కీలక అంశాలను వివరించారు. జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిణి కోరాటి మాట్లాడుతూ ఎగుమతిదారుల్లో అవగాహన పెంచడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ భారత్–యూకే సీఈటీఏ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎగుమతిదారులకు లభించే ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. రాయల్బరో ఆఫ్ కెన్సింగ్టన్(లండన్) డిప్యూటీ మేయర్ అరీన్ ఉదయ్ ఆరేటి మాట్లాడుతూ భారతీయ ఎగుమతిదారులు వ్యవసాయ, ఆహార శుద్ధి రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. నూతన ఒప్పందం ఫలితంగా రెండు దేశాలకు మేలు జరుగుతుందని తెలిపారు. వీఎస్ఈజెడ్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.వి.శివ ప్రసాద్‌రెడ్డి ‘భారతీయ ఎగుమతిదారులకు అవకాశాలు’అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రావణ్ షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సాంబశివరావు, ఈపీసీఈఎస్ చైర్మన్ శ్రీకాంత్ బడిత తదితరులు తమ ఆలోచనలను పంచుకున్నారు. కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్ -
రైల్వే విశ్రాంత ఉద్యోగి నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన తన తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు కుమారులు పెద్ద మనసు చాటుకున్నారు. పెందుర్తిలోని వెలమతోటలో నివాసం ఉంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నేమాని భవానీశంకరం(84) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం మృతుని కుటుంబాన్ని సంప్రదించారు. దీంతో తండ్రి నేత్రాలను దానం చేయడానికి కుమారులు నేమాని రాంబాబు, వంశీ అంగీకారం తెలిపారు. వెంటనే ఎల్వీ ప్రసాద్ మోషిన్ ఐబ్యాంక్ ప్రతినిధి కృష్ణ.. భవానీశంకరం నేత్రాల(కార్నియా)ను సేకరించారు. తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు సహకరించిన కుమారులను పలువురు ప్రశంసించారు. -
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి
లక్ష గాజులతో సహస్రనామార్చన డాబాగార్డెన్స్: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకమహాలక్ష్మి అమ్మవారు మంగళవారం గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష గాజులతో సహస్రనామార్చన వైభవంగా నిర్వహించారు. నగరానికి చెందిన సుంకర రామరవీంద్ర, హైదరాబాద్‌కు చెందిన రామిరెడ్డి అనిత, విజయవాడకు చెందిన వెంకట బుజ్జి కిరణ్ రూ.1.25 లక్షల చొప్పున చెల్లించి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజలో పాల్గొన్నారు. బుధవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్నారని, అమ్మవారికి అన్ని రకాల కూరగాయల(శాకంబరీ)తో సహస్రనామార్చన చేయనున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు. అలాగే అంబికాబాగ్ రామాలయంలో బెంగాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
వాణిజ్యాన్ని గాలికొదిలేశారు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని అందించే రెండో డివిజన్. చంద్రబాబు పదే పదే ఆర్థిక రాజధాని నగరమని చెప్పే ప్రాంతం.. దీనికి తోడు.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల అమలు కసరత్తులు.. ఇలా.. నిరంతర పనిభారం ఉన్న డివిజన్‌పై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల డివిజన్ ప్రధాన కార్యాలయంలో ప్రధాన పోస్టుల భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా.. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సహా ప్రతి ఒక్కరిపైనా పనిభారం పెరిగిపోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. విశాఖ జిల్లాని మొత్తం 8 సర్కిల్స్‌గా విభజించి జీఎస్టీ వసూలు చేసేవారు. విశాఖ మహా నగర పరిధిలో మొత్తం 7 సర్కిల్స్, రూరల్ జిల్లాలోని మండలాలన్నీ కలిపి ఒక సర్కిల్ (అనకాపల్లి) మొత్తం 8 సర్కిల్స్ పరిధిలో 42 వేల మంది డీలర్స్ నుంచి పన్ను వసూళ్లు జరిగేవి. అయితే విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఈ నేపథ్యంలో డివిజన్లో ఉన్న ఎనిమిది సర్కిల్స్‌ని 14 సర్కిల్స్‌గా విభజించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తాన్ని ఒక సర్కిల్‌గా ఏర్పాటు చేసి దీనికి పాడేరు సర్కిల్ అని పేరుని సూచించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాను రెండు సర్కిల్స్‌గా విభజించారు. ఒకటి అనకాపల్లి సర్కిల్, రెండు అచ్యుతాపురం సర్కిల్‌గా నామకరణం చేశారు. ఇక మిగిలిన విశాఖ జిల్లాను మొత్తం 11 సర్కిల్స్‌గా విభజించారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డులతో పాటు జిల్లా పరిధిలో ఉన్న ఆనందపురం, భీమిలి మండలాల్ని కలుపుకొని విభజన చేపట్టారు. కొత్తగా భీమిలి, మాధవధార, ఎయిర్‌పోర్టు సర్కిల్‌ని ఏర్పాటు చేశారు. వీటికితోడుగా గాజువాక, సిరిపురం, కురుపాం, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, సిరిపురం, చినవాల్తేరు, స్టీల్‌ప్లాంట్ సర్కిల్స్‌గా విభజించారు. ప్రస్తుతం ఉన్న గాజువాక సర్కిల్‌ని గాజువాక, ఎయిర్‌పోర్టుగా విభజించారు. ప్రతి సర్కిల్ నుంచి దాదాపు సమాన ఆదాయం వచ్చేలా సర్దుబాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ అధికారుల నియామకాలు సక్రమంగా నిర్వహించారు. కూటమి వచ్చిన తర్వాత డివిజన్‌ని గాలికొదిలేసింది. ఏడాదికి పైగా ముక్కుతూ మూలుగుతూ.. డివిజన్ విభజన సమయంలో జాయింట్ కమిషనర్ పోస్టులను రెండుగా విభజించారు. జేసీ–1గా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో జేసీ–1గా ఓ.ఆనంద్ వ్యవహరించారు. జేసీ–2గా సుధాకర్ విధులు నిర్వర్తించారు. ఆనంద్‌ని 2024 ఎన్నికల తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెగ్యులర్ జాయింట్ కమిషనర్‌ను నియమించలేదు. జేసీ–2గా సుధాకర్ స్థానంలో కిరణ్‌కుమార్‌ని నియమించారు. మూడు నెలల క్రితం జేసీ–2గా కిరణ్‌కుమార్ స్థానంలో శేషాద్రిని నియమించారు. కానీ.. జేసీ–1 నియామకం విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇప్పటి వరకూ జేసీ–1తో పాటు ఆయన విభాగంలో పనిచేసే మిగిలిన అదికారుల నియామకంపైనా కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. జేసీ–1తో పాటు.. డిప్యూటీ కమిషనర్–1, డిప్యూటీ కమిషనర్–2, నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు(సీటీవోలు) పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారిని మూడు నెలల క్రితం బదిలీ చేసి వారి స్థానాల్ని ఇంతవరకూ భర్తీ చెయ్యలేదు. దీంతో జేసీ–1 పరిధిలో ఉన్న ఐదుగురు అధికారులు నిర్వర్తించే విధులన్నీ ఒకే అధికారిపై భారం పడింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో ఫైళ్లు భారంగా కదులుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలు వచ్చిన తర్వాత పని ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో జేసీ–2తో పాటు ఇతర విభాగాల్లో ఉన్న అందరు ఉద్యోగులు నిరంతరం పనిచెయ్యాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నారనీ.. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చెయ్యాలని అసోసియేషన్లు ప్రభుత్వానికి పదే పదే నివేదించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో.. అతి పెద్ద డివిజన్లో పనుల నిర్వహణ ఒత్తిడితో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే అధికారుల పోస్టులు భర్తీ చెయ్యాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రేపు రావణవధ ఉత్సవం
హరేకృష్ణ వైకుంఠంలో ఏర్పాట్లు తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలోని హరేకృష్ణ వైకుంఠం వద్ద గురువారం రావణవధ ఉత్సవం జరగనుంది. విజయదశమి సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 25 అడుగుల ఎత్తుగల రావణుడి బొమ్మను బాణసంచాతో తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ త్రేతాయుగంలో విజయదశమి నాడు శ్రీరామచంద్రుడు రావణుడిపై సాధించిన విజయానికి సంకేతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని.. రెండో ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ అష్టోత్తర హోమం, శ్రీరామలీలా ప్రవచనం, మహా మంగళ హారతి, రావణవధ, సాంస్కృతిక కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమానికి ముందు జాగ్రత్తగా అగ్నిమాపకశాఖ సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి అంబరీష దాస కోరారు. -
వెంటిలేటర్లకు సుస్తీ
ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న కేజీహెచ్‌లో పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లే శ్వాస తీసుకోలేక మూలకు చేరాయి. దాదాపు 400 వెంటిలేటర్లకు గాను 300కు పైగా పనిచేయకపోవడం, ప్రభుత్వ వైద్యంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం యంత్రాల వైఫల్యం కాదు.. పేదల పట్ల వ్యవస్థ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. –మహారాణిపేట కేజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలు కునారిల్లుతున్నాయి. ఇటీవల ఆర్టీ రియల్ బ్లడ్ గ్యాస్(ఏబీజీ) పరీక్షలు నిలిచిపోయాయి. వ్యాధులు నిర్ధారించే రక్త పరీక్షల కోసం పేదలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రోగికి పునర్జన్మనివ్వడంలో కీలక పాత్ర పోషించే వెంటిలేటర్లు భారీ సంఖ్యలో మరమ్మతులకు గురై మూలనపడటంతో.. నిరుపేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. పనిచేయనివి 311 కేజీహెచ్‌లోని 26కు పైగా విభాగాల్లో సుమారు 403 వెంటిలేటర్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 92 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిసింది. అంటే సుమారు 311 వెంటిలేటర్లు పనిచేయడం లేదు. క్యాజువాలిటీ, ఐసీయూ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ వంటి అత్యంత కీలకమైన విభాగాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డు, అగ్ని ప్రమాద బాధితులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారికి వెంటిలేటర్ అత్యవసరం. అలాంటి ప్రాణదాతలే పనిచేయకపోవడంతో.. వైద్యులున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. వార్డుల్లో పనిచేయని యంత్రాలను పక్కన పడేయడం గమనార్హం. వెంటిలేటర్లదే కీలకపాత్ర రోగుల ప్రాణాలను కాపాడడంలో వెంటిలేటర్ ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న వారికి, ఈ యంత్రం ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపి, వారు తిరిగి తమంతట తాము శ్వాస తీసుకునే వరకు జీవనాధారంగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఆస్పత్రి, అంబులెన్స్, ఇతర ముఖ్యమైన ఆరోగ్య సేవా కేంద్రాల్లో వెంటిలేటర్లను అత్యవసరంగా సిద్ధంగా ఉంచుతారు. అయితే, ఇంతటి కీలకమైన వెంటిలేటర్లు కేజీహెచ్‌లో పనిచేయకపోవడం ఇప్పుడు రోగులకు ప్రాణాలకు సంకటంగా మారింది. కాగా.. కేజీహెచ్‌లో వెంటిలేటర్ సదుపాయం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం మోయలేక ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ప్రైవేట్‌లో చికిత్స చేయించలేక, చివరికి కేజీహెచ్‌కే తిరిగి వస్తున్న రోగులు ఎందరో.. అలాంటి వారికి ఇక్కడ కూడా వెంటిలేటర్ సదుపాయం అందకపోవడంతో.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పట్టని యంత్రాంగం కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో 1,187 పడకలు ఉండగా.. నిత్యం 2,500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 1,500 నుంచి 2,200 వరకు ఓపీ నమోదవుతుంది. రోజూ 300 నుంచి 600 మంది రోగుల వరకు ఇన్‌పేషంట్లుగా చేరుతుంటారు. అయితే వారికి తగ్గట్లు మౌలిక వసతులు పెరగడం లేదు. ఉన్న వైద్య పరికరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. కొద్ది రోజుల కిందట ఏబీజీ రక్త పరీక్షల యంత్రాలు పనిచేయకపోవడం, ఇప్పుడు వెంటిలేటర్ల సమస్య రావడం ఇక్కడి నిర్లక్ష్యానికి నిదర్శనం. పాలనాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. పేదల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించాలని, మరమ్మతులకు గురైన వెంటిలేటర్లను బాగు చేయించాలని రోగుల బంధువులు, ప్రజలు కోరుతున్నారు. మూలకు చేరిన వెంటిలేటర్ మూలకు చేరిన ప్రాణదాతలు -
రేపటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో గురువారం నుంచి 8 వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు క్యూరేటర్ జి. మంగమ్మ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, ప్రజల కోసం వివిధ పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో బర్డ్‌వాక్, ఫొటోగ్రఫీ, రేఖాచిత్ర పోటీలు, ప్రసంగ పోటీలు వంటివి ఉన్నాయి. పోటీల్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 78936 32900 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. -
అప్పన్న జమ్మివేట ఉత్సవం రేపు
సింహాచలం: విజయదశమి పర్వదినం పురస్కరించుకుని గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరగనుంది. కొండ దిగువన ఉన్న పూలతోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు విశేష ఏర్పాట్లు చేస్తున్నారు. పూలతోటలోని ప్రధాన మండపానికి, శ్రీకృష్ణ కొలనుకు నూతనంగా రంగులు వేశారు. పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు, పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఉత్సవం జరుగుతుంది ఇలా.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సింహగిరి నుంచి మెట్ల మార్గంలో పల్లకీలో కొండ దిగువకు తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని అధిష్టింపజేస్తారు. సాయంత్రం పూలతోటలోని శమీ వృక్షం చెంతన శమీ పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆ శమీ దళాలను స్వామి చెంతన ఉంచి ప్రత్యేక పూజలు చేసి, జమ్మివేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామిని పుష్కరిణి మండపం వద్దకు తీసుకొచ్చి, అక్కడ ఉండే అశ్వవాహనంపై అధిష్టింపజేస్తారు. అనంతరం అడవివరం గ్రామంలో స్వామికి అశ్వవాహనంపై గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో స్వామిని తిరిగి కొండపైకి చేరుస్తారు. జమ్మివేట ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై స్వామి దర్శనాలు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు లభిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. -
● మెడికల్ షాపుల్లో కనిపించని జీఎస్టీ తగ్గింపు బోర్డులు ● తనిఖీ చేయని డ్రగ్స్ డిపార్ట్మెంట్ ● పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖ
మహారాణిపేట: ప్రజలకు దసరా కానుకగా జీఎస్టీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈనెల 22 నుంచి కొత్త శ్లాబులను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా నిత్యావసరాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలతోపాటు, ప్రజారోగ్యం దృష్ట్యా పలు మందులపైనా జీఎస్టీని కుదించింది. అయితే ప్రతి ఇంట్లో ఉపయోగించే మందులపైన ప్రజల్లో అవగాహన లోపం వ్యాపారులకు వరంగా మారింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తేదీకి ముందే రేట్లు ముద్రించడంతో అవి కాస్తా హోల్‌సేల్ నుంచి రిటైల్ షాపులకు చేరాయి. దీంతో జీఎస్టీ తగ్గింపు సాధ్యపడే పరిస్థితి లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కేంద్రం పాత రేట్లతో పనిలేదు.. జీఎస్టీ తగ్గింపు నాటి నుంచే అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే అది అమలుకావడం లేదు. దీంతో మందుల్లో మతలబుతో జనానికి ఎటువంటి ఊరట లభించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అదనపు బేరం చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సొంతంగా మెడికల్ షాపులు నడుపుతూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు అక్కడే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యులు సైతం తమ షాపుల్లో లభించే మందులనే రాయడం గమనార్హం. ఈ షాపుల్లో మందులపై ఎలాంటి తగ్గింపులు లేకుండా ఎంఆర్పీకే విక్రయిస్తున్నారు. ప్రతి షాపులో జీఎస్టీ తగ్గింపు బోర్డు పెట్టాలి ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని మెడికల్ షాపులు, హోల్‌సేల్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపు ప్రకారం తగ్గించిన ధరలకే మందులు విక్రయించాలని ఉత్తర్వులు ఇచ్చాం. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులతో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాం. అంతేకాక ప్రతి షాపులో జీఎస్టీ తగ్గింపు ధరలు బోర్డు పెట్టి ధరలు ప్రకటించాలని ఆదేశించాం. –విజయకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, విశాఖ నిలువు దోపిడీ, బిల్లుల మాయం జిల్లాలోని దాదాపు 2,200 మెడికల్ స్టోర్స్, 600 హోల్‌సేల్ షాపుల్లో మందుల కొనుగోలుకు బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లు అడిగితే ఇస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారు. కొనుగోలు ధర ఒకటి, బిల్లులో నమోదు చేసే ధర మరొకటిగా ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక మందుల ప్యాకెట్లపై గడువు తేదీలు కూడా సరిగా కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.అమల్లోకి కొత్త జీఎస్టీ మందులపై జీఎస్టీ తగ్గింపు ధర ఈనెల 22 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన ధరలతో మెడికల్ షాపుల్లో బోర్డులు పెట్టాలి. ఎక్కడ ఈ బోర్టులు కనపించడం లేదు. -
ఇద్దరి రైల్వే ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం
విశాఖపట్నం జిల్లా: రైల్వే ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాహేతర సంబంధం చివరికి చాకుపోట్లకు దారితీసింది. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని ఒక ఉద్యోగి ఈ దాడికి పాల్పడ్డాడు. తొలుత దోపిడీ కేసుగా నమోదైన ఈ ఘటన.. పోలీసుల దర్యాప్తులో వివాహేతర సంబంధమే అసలు కారణంగా తేలడంతో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం, గణపతినగర్‌లోని ఒక రెసిడెన్సీలో నివాసముంటున్న చంద్రకళ(రైల్వే ఉద్యోగి) భర్త మరణానంతరం ఉద్యోగం పొందింది. ఆమెకు రైల్వే మెకానికల్ విభాగంలో పని చేసే ఏనుగుల నాగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి నాగరాజు చంద్రకళ ఇంటికి వచ్చాడు. రాత్రి అక్కడే ఉన్నాడు. అయితే, చంద్రకళ మరొకరితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్న నాగరాజు.. మధ్య రాత్రి తాను వెళ్లిపోతున్నానని చెప్పి.. అపార్ట్మెంట్ టెర్రస్‌పై దాక్కున్నాడు. నాగరాజు వెళ్లిపోయాడని భావించిన చంద్రకళ.. లోకో పైలెట్‌గా పని చేస్తున్న గౌరి నాయుడును తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తీసుకువచ్చింది. కొద్దిసేపటి తర్వాత, మేడపై దాగి ఉన్న నాగరాజు ఆమె ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో గౌరి నాయుడు, చంద్రకళ ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురూ చంద్రకళ కారులో బయలుదేరగా.. నాగరాజు గోపాలపట్నంలో దిగిపోయాడు. గౌరి నాయుడు, చంద్రకళ చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో చేరారు. దోపిడీగా నమ్మించే ప్రయత్నంఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన గౌరి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తాను డ్యూటీ దిగి ఉత్తర సింహాచలం నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారని పేర్కొన్నాడు. బంగారు చైన్, డబ్బులు అడిగారని, నిరాకరించడంతో కత్తితో దాడి చేశారని చెప్పాడు. దీంతో గోపాలపట్నం పోలీసులు తొలుత దోపిడీ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు దాడికి కారణం రైల్వే ఉద్యోగుల మధ్య ఉన్న వివాహేతర సంబంధమేనని తేలింది. రహస్యం బయటపడకుండా ఉండేందుకే బాధితులు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో వాస్తవం బయటపడటంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. -
కై లాసగిరి కిటకిట
ఆరిలోవ: కైలాసగిరి పర్యాటక కేంద్రం సోమవారం సందర్శకులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది పర్యాటకులు తరలిరావడంతో కొండపై పండగ వాతావరణం నెలకొంది. పర్యాటకుల తాకిడికి కొండపైకి వెళ్లే వాహనాలు బారులు తీరాయి. కొండపై ఉన్న పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోవడంతో, ఘాట్ రోడ్డుపై మొదటి మలుపు వరకు ఇరువైపులా కార్లు, టూరిస్ట్ బస్సులతో సహా ఇతర వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండపై ఉన్న పచ్చిక బయళ్లు, ఆట స్థలాలు సందర్శకులతో నిండిపోయాయి. పిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపారు. శివపార్వతుల విగ్రహాలు, సీ వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. సాధారణంగా ఆదివారాలు రద్దీగా ఉండే కై లాసగిరి.. సోమవారం కూడా జనసంద్రంగా మారడానికి పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడం ఒక కారణమైతే, సోమవారం జంతు ప్రదర్శనశాలకు సెలవు దినం కావడం మరో కారణం. దీంతో జూకు వెళ్లాలనుకున్న పర్యాటకులు సైతం కై లాసగిరికి తరలిరావడంతో రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువైంది. ఈ రద్దీ కారణంగా టాయ్ ట్రైన్ నిరంతరం పర్యాటకులతో తిరిగింది. సందర్శకుల తాకిడితో వీఎంఆర్డీఏకు గణనీయమైన ఆదాయం లభించింది. సీ వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు కై లాసగిరిపై ఆటలాడుతున్న పిల్లలు -
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం. కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్‌జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. బాలుర చాంపియన్‌షిప్‌ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్‌షిప్‌ను 113 పాయింట్లతో సాధించింది. -
తల్లికి వందనం.. కలెక్టరేట్‌కు క్యూ
మహారాణిపేట: ‘తల్లికి వందనం’పథకం లబ్ధి కోసం తల్లులు అష్టకష్టాలు పడుతున్నారు. తమకు అర్హత ఉన్నప్పటికీ నగదు ఖాతాల్లో జమ కాలేదంటూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదులు చేశారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ కుమార్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల ఇన్చార్జి ఉషారాణిలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే కలెక్టరేట్లోనే ల్యాప్‌టాప్‌లతో లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. కొర్రీలతో లబ్ధిదారుల కోత ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా చాలా మందికి ఈ పథకం అందకుండా పోయింది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద 25శాతం కోటాలో ఉచిత సీటు పొందిన విద్యార్థుల తల్లులకు ఈ పథకాన్ని నిలిపివేశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి, ఒకరికి ఉచిత సీటు వస్తే, రెండో బిడ్డకు తల్లికి వందనం వర్తింపజేయలేదు. అంతేకాకుండా, నెలవారీ విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటినా లేదా ఇతర ప్రభుత్వ పథకాలు పొందుతున్నా అనర్హులుగా ప్రకటించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని పలువురు తల్లులు ఆరోపించారు. తమకు ఉచిత సీటు రాకపోయినా, ఆన్లైన్లో వచ్చినట్లుగా తప్పుగా చూపిస్తూ పథకాన్ని నిలిపివేస్తున్నారని మరికొందరు వాపోయారు. ఇది మూడోసారి.. నాకు ఇద్దరు పిల్లలు. ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుతున్నారు. అయినా తల్లికి వందనం రాలేదు. సచివాలయం చుట్టూ తిరిగినా ఎవరూ సరైన కారణం చెప్పడం లేదు. కలెక్టరేట్‌కు రావడం ఇది మూడోసారి. ఇప్పుడు నా భర్త జి.రమణ పేరు మీద రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయని చెబుతున్నారు. మాకు ఉన్నది చిన్న ఇల్లు మాత్రమే. ఆ రెండో మీటర్ ఎక్కడిదో విచారణ చేయాలి. దయచేసి నా పిల్లలకు న్యాయం చేయండి. – గరికిన సింహాచలం, దిబ్బపాలెం, పెదగంట్యాడ న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో వినతులు -
కోర్టు కేసుల్లో అలసత్వం వద్దు
మహారాణిపేట: కోర్టు కేసుల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు కాలయాపన చేయకుండా ఎప్పటి ఫైళ్లను అప్పుడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పీ–4 పథకంలో భాగంగా జిల్లాలో గుర్తించిన 64 వేల బంగారు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తొలి దశలో వారిలో పది శాతం మందికై నా ప్రాథమిక అవసరాలను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థికపరమైన అంశాలతోపాటు, సామాజిక అంశాల్లో వారికి ప్రత్యేక సాయం అందించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ఈ బంగారు కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల పరిధిలో చేసిన సాయం, ఇతర అంశాలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సీపీవోకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి అధికారులంతా సమష్టి కృషి చేయాలని కలెక్టర్ నిర్దేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోని అంశాలను ఆధారంగా చేసుకొని.. జిల్లా అభివృద్ధికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో చేపట్టబోయే ప్రగతిశీల పనులకు సంబంధించి మూడు నెలలు, ఏడాదికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎడమ కాలితో పరీక్ష రాసి ఉద్యోగం
సింహాచలం నాయుడిని అభినందించిన కలెక్టర్ మహారాణిపేట: పుట్టుకతోనే రెండు చేతుల అంగవైకల్యం ఉన్నా, ఎడమ కాలుతో పరీక్ష రాసి మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం (ఎస్జీటీ) సాధించిన జామి సింహాచలం నాయుడును కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభినందించారు. కష్టపడి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా గనిశెట్టిపాలేనికి చెందిన నాయుడు.. రాష్ట్ర స్థాయిలో 320 వ ర్యాంకు సాధించగా, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు వచ్చింది. అయితే ఆయన ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జేసీ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ– అరకు కార్వాన్ రెడీ
మహారాణిపేట: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆర్.డి. కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్‌కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించారు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. వసతులను పరిశీలించిన కలెక్టర్ -
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్–1గా ఏపీ
విశాఖ సిటీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్–1 స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రీజినల్ అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు, పాలసీలను రూపొందించిందని తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 8 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో విశాఖలో వైట్ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, స్టీల్ ప్లాంట్‌తో పాటు మరెన్నో యూనిట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. పరిశ్రమల శాఖ అడిషినల్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు మాట్లాడుతూ సింగిల్ డెస్క్ ప్రోగ్రాం ద్వారా 23 విభాగాలకు చెందిన 123 అనుమతులు, లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సులభతరమైన వ్యాపారాల కోసం 2024–25లో 435 సంస్కరణలు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడాలంటే, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సర్వే కాల్స్/మెసేజ్‌లకు సరైన సమాధానాలు ఇవ్వాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో విశాఖ డీఐసీ జీఎం ఆదిశేషు, పారిశ్రామికవేత్తలు సాంబశివరావు, పాండురంగ ప్రసాద్ పాల్గొన్నారు. -
గజ్జె కట్టిన డాక్టరమ్మ
ఏయూక్యాంపస్: రోగులకు వైద్యం అందించే ఓ వైద్యురాలు నృత్య కళాకారిణిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ జాహ్నవి ప్రసాద్ బొడ్డేపల్లి, తాను చిన్నతనం నుంచి నేర్చుకున్న కూచిపూడి నృత్యాన్ని బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఆలయ కళావేదికపై ఆమె నిర్వహించిన కూచిపూడి నృత్య అరంగేట్రం ఎంతో ఘనంగా జరిగింది. గురువు లలిత గుప్తా వద్ద నృత్యాన్ని అభ్యసించిన జాహ్నవి, తన కళా ప్రతిభను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తిలో ఉంటూనే, నృత్యంపై తనకున్న ఆసక్తితో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. -
జీవీఎంసీకి 112 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 112 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 59 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 6, రెవెన్యూ విభాగానికి 8, ప్రజారోగ్య విభాగానికి 5, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 18, మొక్కల విభాగానికి 7, యూసీడీ విభాగానికి 9 ఫిర్యాదులు వచ్చినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ తెలిపారు. ఫిర్యాదులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
మసీదు పక్కన మద్యం దుకాణమా?
మహారాణిపేట: రామా టాకీస్ సమీపంలోని యాసీన్ మసీదు పక్కన మద్యం దుకాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని యాసీన్ మసీదు ముస్లిం కమిటీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు కోరారు. సొసైటీ నాయకులు మహ్మద్ అహ్మదుల్లా ఖాన్, సయ్యద్ మహ్మద్ పీజీఆర్ఎస్లో సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. 70 ఏళ్ల కిందట నిర్మించిన యాసీన్ మసీదుకు ఎంతో చరిత్ర ఉందని, ఈ మసీదు దగ్గరలో మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడం తగదని సొసైటీకి చెందిన డాక్టర్ అబ్దుల్ రహ్మాన్, దేవరకొండ మార్కండేయులు అన్నారు. ప్రార్థనా స్థలం, బుల్లయ్య కాలేజీ పక్కన మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని, మద్యం దుకాణం ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. రద్దు చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు -
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించాలి
గోపాలపట్నం: దసరా పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యజమానులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ ఇన్చార్జ్ ఉపరవాణా కమిషనర్ ఆర్సీహెచ్. శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం నగరంలో పలుచోట్ల రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్సులకు నిర్దేశించిన పర్మిట్, పన్ను తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా వాహన యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 3 రోజుల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలపై 28 కేసులు నమోదు చేసి, వాటి ద్వారా రూ.4.82 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
వేడుకగా అప్పన్న ఆయుధ పూజ
సింహాచలం: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరుగుతున్న విజయదశమి ఉత్సవాల్లో భాగంగా.. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేంచేసి ఉన్న సింహవల్లీ తాయారు సన్నిధిలో ఈ పూజలను పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆయుధాలైన గద, ధనస్సు, బాణం, కత్తి, పరశురామ గొడ్డలి, ఖైజార్ తదితరాలను పూజ కోసం ఉంచారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆయుధ దేవత ఆవాహనం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయుధాలకు విశేషంగా హారతులిచ్చారు. అనంతరం పూజలో ఉంచిన ఆయుధాలను సింహవల్లీ తాయారుకి అలంకరించారు. ఆలయ స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు ఈ పూజను నిర్వహించారు. విజయదశమి వరకు ఆయుధాలను సింహవల్లీ తాయారు సన్నిధిలోనే ఉంచి, ప్రతి రోజూ విశేషంగా ఆరాధన నిర్వహిస్తారు. అలాగే స్వామి సన్నిధిలో శ్రీరామ నవరాత్ర పారాయణం పఠించారు. ఆలయ సూపరింటిండెంట్ సత్య శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కూటమి దసరా దందా
సాక్షి, విశాఖపట్నం: ‘ఏదయా మీదయా.. మా మీద లేదు... ఇంత సేపుంచుట ఇది మీకు తగునా.. దసరాకి వస్తిమని విసవిసలు పడక...’ అంటూ గురువులు, పిల్లలు గతంలో వీధుల్లో దసరాపాటలు పాడుతూ తిరగేవారు. ఇప్పుడు కాలం మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. బడా నేతల అండదండలతో అధికార పార్టీకి చెంది చోటా మోటా నేతలు దసరా వస్తున్న సమయంలో పాటలు కాదు.. దందాటలు చేస్తున్నారు. ‘ఏదయా.. మాకు దసరా మామూళ్లు ఏదయా.. వచ్చిన వెంటనే ఇచ్చుట మీకు మర్యాద.. లేదంటే ఉంటాయి తదుపరి చర్యలయా..!’’ అంటూ పేట్రేగిపోతున్నారు. కనిపించిన దుకాణం, వ్యాపారి దగ్గరికి వెళ్లి దసరా మామూళ్లపేరుతో దందా చేస్తున్నారు. నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అనుచరులమని చెబితే.. కొందరు ఇవ్వరేమోనని.. పలు ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ.. అని తేడా లేకుండా.. ఎమ్మెల్యేల అనుచరులమంటూ మార్కెట్లో కొందరు చోటా మోటా నేతలు పండగ పేరుతో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన వాణిజ్య సముదాయాలు, వ్యాపారులు, మార్కెట్లు, రియల్ ఎస్టేట్ సంస్థలని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులమని, దసరా మామూళ్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారం జరిగే ప్రాంతాన్ని బట్టి.. రూ.1000 నుంచి మొదలు పెట్టి రూ.10 వేలు, రూ.20 వేలు కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు నచ్చినట్లు ఇస్తామంటూ కుదరదంటూ.. ముందుగానే వ్యాపారి, లేదా వ్యాపార సంస్థ పేరు రాసి.. దానిపక్కన.. తాము అనుకున్న అమౌంట్ వేసి.. అంతే ఇవ్వాలని ఆదేశిస్తున్నారంట. విశాఖ దక్షిణం, పెందుర్తి, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ తరహా వసూళ్లు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరంలోనూ ఒకరిద్దరు కషాయం నేతలు కూడా దేవుడి పేరుతో దందాకు దిగినట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల సిబ్బందితో కలిసి.. కొందరు వ్యాపారులు తమ మాటని లెక్క చెయ్యరని తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యేల అనుచరులు.. వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందితో కలిసి ఈ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఆయా నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తిస్తున్న దిగువస్థాయి సిబ్బంది కొందర్ని వీరి వెంట తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. జీవీఎంసీ వాటర్సప్లై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది, ఈపీడీసీఎల్ లైన్ఇన్స్పెక్టర్లు, కొన్ని చోట్ల ఏఈఈలు ఇలా వీరిని పక్కన పెట్టుకొని చోటా నేతలు దసరా దందాలు చేస్తున్నట్లు సమాచారం. పైగా ఎమ్మెల్యేపేరు చెప్పి చేస్తుండటంతో ఎవ్వరూ ఏమీ అనకుండా చోటా నేతలు ఎంత చెబితే అంత చేతిలో పెట్టి పంపించేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తెలీకుండా జరగదని ఎంతోకొంత ప్రమేయం ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు. మొత్తానికి కూటమి నేతలు కబ్జాల పర్వమే కాకుండా దసరా మామూళ్ల పర్వానికి కూడా దిగజారిపోవడం కొసమెరుపు. -
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
ఆరిలోవ: దసరా పండుగ సందర్భంగా నాటుకోళ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సాధారణంగా దసరా సమయంలో కేవలం రూ.10 నుంచి రూ.25 మాత్రమే పెరిగే ధర ఈసారి ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. మటన్‌కు దీటుగా ధరలు పెరిగినప్పటికీ, దసరా మొక్కుల కోసం వినియోగదారులు నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత డెయిరీఫారం వద్ద ఉన్న నాటుకోళ్ల సంతలో ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. మంగళ, బుధవారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. 40 ఏళ్ల నాటుకోళ్ల సంత పాత డెయిరీఫారం వద్ద సుమారు 40 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల సంత జరుగుతోంది. ప్రారంభంలో కోడి రూ.20, రూ.30కే విక్రయించేవారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు. గిరిరాజు కోళ్లతో జాగ్రత్త నాటుకోళ్ల మాదిరిగానే కనిపించే ‘గిరిరాజు’ కోళ్లను కొందరు వ్యాపారులు అధిక ధరకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుందని, కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు. -
ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 365 వినతులు అందజేశారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 121, జీవీఎంసీకి 124, పోలీస్ శాఖకు 26, ఇతర అంశాలకు చెందిన 94 వినతులు ఉన్నాయి. ముస్లింల అభివృద్ధికి వినతి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ నూర్ భాషా/దూదేకుల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలి. మైనార్టీ నూర్ భాషా జీవన ప్రమాణాలు మేరుగు పడే విధంగా పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలి. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథులు, అవివాహిత మహిళలకు రుణాలు మంజూరు చేయాలి. చికెన్, మేక మాంసం వ్యాపారం చేసే నూర్ భాషా/దూదేకుల సామాజిక వర్గాలకు ఫ్లోర్ వీలర్ మోపెడ్ వాహనాలు ఇవ్వాలి. చేనేత కార్మికులకు, పరుపులు కుట్టే దర్జీలకు, ఇతర చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలి. –షేక్ బాబ్జీ, సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, ఉత్తర నియోజకవర్గం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ -
పీలా...ఢీలా
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం.. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికై ంది. సమావేశానికి కమిషనర్ వస్తారని మేయర్ చెప్పగా, ‘కమిషనర్ ఊర్లో లేరని మీకు తెలియదా? లేక తెలిసీ అడుగుతున్నారా?’ అంటూ కవిత నిలదీశారు. దీనికి మేయర్ స్పందిస్తూ మీరు కూర్చోండి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అనడంతో వివాదం మరింత రాజుకుంది. మీతో మాకు పర్సనల్ ఏముంటాయని ప్రశ్నించారు. మీరు మేయర్‌గా కాకుండా కేవలం చైర్మన్‌గా మాత్రమే వచ్చారు. మేము కూడా ప్రజలతో ఎన్నికయ్యాం. సమావేశం సోమవారం అయితే మాకు ఆదివారం చెబుతారా? మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి పీలా శ్రీనివాసరావు ఇది అత్యవసర సమావేశం. ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చు అని బదులిచ్చారు. అంతేకాకుండా, స్థాయీ సంఘంలో మీకు స్థానం కల్పించింది నేను, నా పార్టీ నుంచి మీకు అవకాశం ఇచ్చాను అని మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మాకు క్లాసులు చెబుతారా? మీ వ్యవహార శైలి బాగాలేదు అంటూ కవిత..మేయర్‌పై విరుచుకుపడ్డారు. జిరాయితీ భూమికి ప్లానింగ్ ఎలా? శానాపతి వసంత మాట్లాడుతూ జిరాయితీ భూమికి అధికారులు ప్లానింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దానికి చైర్మన్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు లేరు, ఆ విషయం వదిలేయండి.. అని చెప్పగా, సభ్యురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా నేను స్థాయీ సంఘంలో ఉన్నాను, అప్పుడు అధికారులంతా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అధికారులు లేకపోతే ఎలా? అని మేయర్‌ను ప్రశ్నించారు. బంజరు భూమిలో రోడ్డు వేయగలమా అని ప్రశ్నిస్తూ, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడ? అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు రూ. 40 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘నగరాభివృద్ధి, సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ మా వార్డుల పరిస్థితి ఏమిటి? మరో నాలుగైదు నెలల్లో పదవీకాలం ముగుస్తుంది, తిరిగి ఎన్నికలకు వెళ్లాలంటే మేము చేసిన అభివృద్ధి చూపించాలా వద్దా?’ అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా తాము విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అంశాలకు సభ్యుల ఆమోదం ఈ తీవ్ర చర్చలు, నిరసనల అనంతరం, సమావేశంలో చర్చకు వచ్చిన 91 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. వీటిలో ముఖ్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 27.60 కోట్ల అంచనా వ్యయంతో నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు, రూ. 5.3 కోట్ల అంచనా వ్యయంతో ఇతర ఇంజినీరింగ్ పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు. సమావేశంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోన్–1 జోనల్ కమిషనర్ ఇప్పినాయుడు, 6వ జోన్ జోనల్ కమిషనర్ విజయశంకర్, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్‌కుమార్, రాయల్‌బాబు, గోవిందరావు, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఏఎంవోహెచ్‌లు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యురాలి ఆగ్రహం సమావేశం ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సభ్యురాలు సాడి పద్మారెడ్డి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ముఖ్యంగా సెక్రటరీ మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని, స్థాయీ సంఘం సమావేశాల విధివిధానాలు ఏమిటో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశం ఉందని సోమవారం ఉదయం తనకు ఫోన్ చేసి చెప్పారని, అజెండా అంశాలు చదవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. గత సమావేశంలో అడిగినా ఇప్పటివరకు విధివిధానాలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. తమ వార్డులు, జోన్లలో చేపట్టే ఏ కార్యక్రమమైనా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. ‘స్థాయీ సంఘం’లో రచ్చ రచ్చ మేయర్‌పై గుర్రుమన్న కూటమి భాగస్వామి బీజేపీ కార్పొరేటర్ పర్సనల్‌గా మాట్లాడుకుందామన్న మేయర్ శ్రీనివాసరావు మీతో మాకు పర్సనల్ ఏంటి? అని నిలదీసిన వైనం సొంత సభ్యులనుంచేమేయర్కు చుక్కెదురు విలీన గ్రామాలకు అన్యాయం? మరో సభ్యుడు మొల్లి ముత్యాలు జీవీఎంసీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ’జీవీఎంసీ అంటే కేవలం నగరం మాత్రమే కాదు, విలీన గ్రామాలూ ఉన్నాయి. కేవలం నగరంలోనే సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడితే విలీన గ్రామాలను ఎందుకు కలుపుకున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. శ్మశాన వాటికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అభివృద్ధి పనులు అడిగితే బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌లో జరిగే సదస్సుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం బడ్జెట్ ఉంటుందా అని ఆయన దుయ్యబట్టారు. -
మెరుగు పేరుతో ఘరానా మోసం
కూర్మన్నపాలెం: పాత బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని న మ్మించి.. మహిళను మోసం చేసిన అంతర్ జిల్లా ఘరానా మోసగాడు ముదేరినవారి రమణను దువ్వాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సౌత్ సబ్ డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంతినగర్‌లో స్టీల్‌ప్లాంట్ జనరల్ మేనేజర్ నివాసం ఉంటున్నారు. అతని భార్య వద్దకు ఈ ఏడాది జూలై 15న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపు తీసుకువస్తామని, తమ వద్ద ఉన్న నమూనాలను చూపి నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన ఆమె.. తన వద్ద ఉన్న సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. నిందితులు ఆ ఆభరణాలను ఒక మట్టి కుండలో పెట్టి, ఏదో రసాయన ద్రావణంలో ముంచినట్లు నాటకమాడారు. అనంతరం ఆ కుండకు ఒక తెల్లని వస్త్రం చుట్టి.. ‘ఈ కుండను 10 రోజుల పాటు ఇంటి ఈశాన్య దిశలో సూర్యరశ్మి తగలకుండా ఉంచి, 11వ రోజున తెరవాలి’ అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. వారి సూచన మేరకు 11వ రోజున కుండను తెరిచి చూడగా, అందులో బంగారు ఆభరణాలకు బదులుగా కల్లు ఉప్పు ఉండటంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. కుటుంబ సభ్యుల సాయంతో ఆగస్టు 20వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటై, దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 29న అనకాపల్లి జిల్లా మారేడుపూడి బస్టాప్ వద్ద ప్రధాన నిందితుడైన ముదేరినవారి రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రమణది అన్నమయ్య జిల్లా పాతరాయచోటి. గతంలో కూడా అతను పలు ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మారేడుపూడి గ్రామానికి చెందిన చప్పిది నూకరాజు పాత్రపై విచారణ కొనసాగుతోందని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారు హారం–1, బంగారు నెక్లెస్‌లు–2, పెద్ద బంగారు గొలుసు–1, చిన్న బంగారు గొలుసులు–3, బంగారు లాకెట్లు–2, చెవి దిద్దులు–3 జతలు, బంగారు ఉంగరాలు–10, బ్రాస్లెట్–01, పాపిడి బిళ్ల–1, రూ.5300 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఉక్కునగరం: బతుకమ్మ సంబరాలు ఉక్కునగరంలో సోమవారం ఘనంగా ముగిశాయి. స్టీల్‌ప్లాంట్ తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉక్కునగరం సీ భవనంలో ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అంతకుముందు స్టీల్‌ప్లాంట్ హెచ్ఆర్ జీఎం ఎన్.భాను, హెచ్ఆర్ డీజీఎం డి.రాధిక ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ముఖ్య సలహాదారు ఎన్.వీరేశం, అధ్యక్షుడు ఎన్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్, బి.వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, రవిశేఖర్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ.999కే గుండె పరీక్షల ప్యాకేజీ
ఆరిలోవ: ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రి హార్ట్స్మార్ట్ ప్యాకేజీని ప్రారంభించింది. ఆస్పత్రిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వైద్యులు ఈ ప్యాకేజీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.వి.రావు మాట్లాడుతూ.. గుండె జబ్బులు యువతలో కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చాలా మంది యువతలో ఉన్న ప్రమాదకరమైన నిశ్శబ్ద కారకాలు గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వంటి జీవనశైలి కారకాలు యువతలో గుండె వ్యాధులకు దారి తీస్తున్నాయని తెలిపారు. నిశ్శబ్ద కారకాలను ముందుగానే గుర్తించి నివారించడానికి ప్రతి ఒక్కరూ తరుచూ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సి.వి.రావు సూచించారు. కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ చైదురి మాట్లాడుతూ హార్ట్స్మార్ట్ ప్యాకేజీలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ తదితర పరీక్షలు కేవలం రూ.999కే చేస్తామని తెలిపారు. -
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
విశాఖపట్నం: దసరా పండుగ సందర్భంగా నాటుకోళ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సాధారణంగా దసరా సమయంలో కేవలం రూ.10 నుంచి రూ.25 మాత్రమే పెరిగే ధర ఈసారి ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. మటన్‌కు దీటుగా ధరలు పెరిగినప్పటికీ, దసరా మొక్కుల కోసం వినియోగదారులు నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత డెయిరీఫారం వద్ద ఉన్న నాటుకోళ్ల సంతలో ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. మంగళ, బుధవారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. 40 ఏళ్ల నాటుకోళ్ల సంత పాత డెయిరీఫారం వద్ద సుమారు 40 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల సంత జరుగుతోంది. ప్రారంభంలో కోడి రూ.20, రూ.30కే విక్రయించేవారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు. గిరిరాజు కోళ్లతో జాగ్రత్త నాటుకోళ్ల మాదిరిగానే కనిపించే ‘గిరిరాజు’ కోళ్లను కొందరు వ్యాపారులు అధిక ధరకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుందని, కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు. -
కూటమి సర్కార్‌పై స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది మలి దశకు విశాఖ ఉక్కు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులతో కలిసి సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పోరాట కమిటీ ఉంది.మరోవైపు, కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ సేవలో తరిస్తోందని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత శనివారం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై చూపిస్తున్న తపన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చూపకపోవడం ప్రజలను వంచించడమేనన్నారు. -
ఒక సార్.. ఇద్దరు బాస్‌లు
● వాల్తేరు డివిజన్లో ఇద్దరు జీఎంల హడావుడి ● దక్షిణ కోస్తా జోన్ జీఎం సందీప్ మాధుర్ వరుస రివ్యూలు ● అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ జోన్ జీఎం పరమేశ్వర్ పర్యటనలు ● గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతోనే తలపోటు ● ముంబై బదిలీ కోసం డీఆర్ఎం ప్రయత్నాలు ముమ్మరం కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) పరిస్థితి. ఒక సార్‌కి ఇద్దరు బాస్‌లు ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక అయోమయంలోనూ.. అదే సమయంలో ఒత్తిడికి గురవు తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంని ప్రకటించిన కేంద్రం.. ఇంకా గెజిట్ విడుదల చేయకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య నలిగిపోతున్న డీఆర్ఎం.. ఇదేం బాధరా భగవంతుడా అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి’ అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యకలాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా నియమితులైన సందీప్ మాధుర్ నెల రోజులుగా విశాఖలోనే ఉంటూ, గెస్ట్ హౌస్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్ఎం లలిత్ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆర్ఎంపై ఒత్తిడి మొదలైంది. నాకొద్దు బాబోయ్.! ఒక సార్ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్ ఫోన్లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, డివిజనల్ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం కలిసి డీఆర్ఎంతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. సమీక్షలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం. గెజిట్ లేకపోవడమే అసలు సమస్య వాల్తేరు డివిజన్లో నెలకొన్న మొత్తం ‘తలపోటు’ వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్ వస్తేనే సందీప్ మాధుర్ జోన్‌కు అసలైన జనరల్ మేనేజర్‌గా వ్యవహరించగలరు.. అప్పుడు కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్‌తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎంతో పాటు అసిస్టెంట్ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్ హెచ్వోడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుంది. వీరి నియామకం తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరాకు కూడా జోన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. అడకత్తెరలో పోకచెక్కలా వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితిచురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు వీఎంఆర్డీఏ ‘ది డెక్’లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్‌కు ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్ విభాగంలో హెచ్ఏజీ అధికారి (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇది నా సంస్థానమంటూ..! దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు కొత్త జీఎంను నియమించినా గెజిట్ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే వాల్తేరు డివిజన్ కొనసాగుతోంది. జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్ రాకపోవడంతో వాల్తేరు డివిజన్‌కు తానే జీఎంనంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
మర్రిపాలెం: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోందని, దీని వల్ల ప్రజలు, పలు శాఖల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ భాషా అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కార్పొరేటర్ బర్కత్ అలీ, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రెడ్ బుక్ పాలన నుంచి విముక్తి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయా సమస్యలను తక్కువ వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఐహెచ్ ఫరూఖీ, పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ డాక్టర్ల ఆందోళన తీవ్రతరం
అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ మహారాణిపేట: తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు ఆందోళనను మరింత తీవ్రం చేశారు. నిరసనలో భాగంగా ఆదివారం నుంచి సుమారు 15 అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి డాక్టర్లు బయటకు వచ్చారు. ఈ గ్రూపుల్లో రోగుల సమాచారం , ప్రభుత్వ డేటా సేకరణ వంటి ముఖ్యమైన అధికారిక పనులు జరుగుతుంటాయి. భీమిలి, ఆనందపురం, గాజువాక వంటి పలు ప్రాంతాల పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సుమారు 20 మంది వైద్యులు ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈనెల 26 నుంచే వారు అన్ని అధికారిక పనులను నిలిపివేశారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయకుండా నిలిపివేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి పంపాల్సిన రోజు వారీ రోగుల సమాచారం నిలిచిపోయింది. ‘ స్వస్త్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్’, క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు, నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 సర్వేలతో పాటు సంచార చికిత్స, ఇతర మెడికల్ క్యాంపులను కూడా డాక్టర్లు బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ తెలిపారు. సోమవారం పీహెచ్‌సీల్లో అన్ని ఓపీ డ్యూటీల బహిష్కరిస్తున్నామన్నారు. -
టెట్ నుంచి ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆరిలోవ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఐదేళ్ల పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని పైడిరాజు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. రాష్ట్రంలో 1995 నుంచి వివిధ డీఎస్సీల ద్వారా నియమితులైన వేలాది మంది ఉపాధ్యాయులకు ఈ నిబంధన తీవ్ర సమస్యగా మారింది. ఈ నిబంధన వల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోవడంతో పాటు, కొందరు ఉద్యోగాలను కూడా విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని పైడిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. -
రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి మృతి
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం పులపర్తి కూడలి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి పి.రఘురామిరెడ్డి (31) దుర్మరణం పాలయ్యారు. దసరా పండగను కుటుంబంతో ఆనందంగా గడపడానికి విశాఖ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్‌పై వస్తుండగా.. రోడ్డు దాటుతున్న పాదచారి పులి మల్లికార్జున్ (55)ను తప్పించ బోయి అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రఘురామిరెడ్డికి హెల్మెట్ ఉన్నప్పటికీ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కిలోమీటరు రాయి సైతం విరిగిపోయింది. మల్లికార్జున్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, అతనికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి అన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమ సమాజమే జాషువా ఆకాంక్ష
సీతంపేట: కవి కోకిల గుర్రం జాషువా కోరుకున్న సమ సమాజ స్థాపనకు అందరం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్స్ హాల్లో జరిగిన జాషువా జయంతి సభలో ఆయన మాట్లాడారు. నాటక రచయితగా రచనా రంగంలో ప్రవేశించిన జాషువా, తన స్వీయ అనుభవాన్ని కవిత్వీకరించడం వల్లే మహాకవి అయ్యారని రామబ్రహ్మం కొనియాడారు. సీ్త్రని కేవలం శృంగార వస్తువుగా చిత్రీకరించే కవిత్వానికి భిన్నంగా, తెలుగు పద్య లోకాన్ని నూతన మార్గంలోకి నడిపించిన ఘనత జాషువాదని ప్రశంసించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, బుల్లయ్య కళాశాల తెలుగు విభాగాధిపతి ఎం.సుబ్బారావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
వీఆర్వోల అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఎన్నిక
పరవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అసోసియేట్ అధ్యక్షుడిగా పరవాడ మండలం, భరణికం గ్రామ రెవెన్యూ అధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాసరావును రాష్ట్ర వీఆర్వో సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, విశాఖ జిల్లా పూర్వపు అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామదాస్, రాష్ట్ర వీఆర్వోల అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు పోతుల శంకరరావు తదితరులు శ్రీనివాసరావును అభినందించారు. -
మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు
సీతంపేట: నగరానికి చెందిన పైడి శంకర్రావు దర్శకత్వంలో సుదీప్ సాయి హీరోగా నటించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ మాజీ సభ్యుడు డాక్టర్ సుందర్ మురుగన్ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్ సాయిని సీఎం సత్కరించారు. చిత్ర యూనిట్ తరఫున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.