షికారీ బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

షికారీ బ్రేక్‌

Mar 6 2026 8:02 AM | Updated on Mar 6 2026 8:02 AM

సముద్ర సర్వేకు
పాత నౌకలతోనే ఫిషరీస్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పోరాటం విశాఖ కేంద్రంగా 50 ఏళ్లుగా సేవలందిస్తున్న సర్వే నౌకలు మత్స్యషికారీ డీ–కమిషనింగ్‌ పెండింగ్‌, మత్స్యదర్శినిపైనే ఆధారం రూ.5 కోట్ల మరమ్మతుల తర్వాత కూడా పరిమిత సామర్థ్యం కొత్త నౌక మంజూరు మాటలు కాగితాలకే పరిమితం

మత్స్యషికారీ నౌక

సాక్షి, విశాఖపట్నం: నీలి విప్లవానికి బాటలు వేయాల్సిన ఫిషరీస్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) విశాఖపట్నం విభాగం ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సముద్ర గర్భంలోని మత్స్య సంపదను అంచనా వేయడంలో కీలకమైన రెండు ప్రధాన సర్వే నౌకలు కాలపరిమితి దాటిపోయాయి. అందులో ఒకటి పూర్తిగా నిలిచిపోవడంతో సముద్ర అన్వేషణ దాదాపు ఒకే నౌకపై ఆధారపడాల్సి వస్తోంది. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థను ఆధునికీకరించడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం కొత్త నౌక మంజూరు చేస్తామని ప్రకటించిన కేంద్ర మత్స్యశాఖ ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు.

తీరానికే పరిమితమైన ‘మత్స్యషికారీ’

ఎఫ్‌ఎస్‌ఐ విశాఖ పరిధిలోని మరో నౌక ‘మత్స్యషికారీ’. 1979లో డెన్మార్క్‌లో నిర్మితమైన ఈ ట్రాలర్‌ కమ్‌ పర్స్‌ సీనర్‌ గత మూడు సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్లలేదు. ప్రస్తుతం రేవులోనే నిలిపివేశారు. దీనికి మరమ్మతులు చేయాలంటే రూ.5 నుంచి 10 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. అంత ఖర్చు చేసినా పూర్తిస్థాయి పనితీరు హామీ ఇవ్వలేమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డీ–కమిషనింగ్‌’ చేయాలని విశాఖ విభాగం ముంబై ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. ఫైళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు వెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు. ఫలితంగా ఈ నౌక రేవులోనే తుప్పు పడుతోంది.

కొత్త నౌక.. మాటలకే పరిమితం

ప్రస్తుత నౌకలు కాలపరిమితి దాటాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం విశాఖ యూనిట్‌కు కొత్త సర్వే నౌకను కేటాయిస్తామని ప్రకటించింది. అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలు, శాటిలైట్‌ ట్రాకింగ్‌, లోతైన సముద్రంలో మత్స్య నిల్వలను గుర్తించే ఆధునిక సాంకేతికతతో నౌక అందుబాటులోకి వస్తుందని ఆశించారు. అయితే ఆ ప్రకటనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కొనుగోలు ప్రక్రియలో స్పష్టమైన పురోగతి లేకపోవడంతో ఎఫ్‌ఎస్‌ఐ సముద్ర అన్వేషణలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

పరిశోధనలపై ప్రభావం

సముద్రంలో ఏ ప్రాంతాల్లో చేపల సంతతి అధికంగా ఉంది? ఏ కాలంలో ఏ రకమైన చేపలు ఎక్కువగా లభిస్తాయి? వాతావరణ మార్పుల ప్రభావం ఎంతవరకు ఉంది? వంటి కీలక అంశాలపై ఎఫ్‌ఎస్‌ఐ సర్వేలు నిర్వహిస్తుంది. ఆధునిక నౌకలు లేకపోవడంతో శాసీ్త్రయ సమాచార సేకరణలో జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుతం మత్స్యదర్శినిపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ఇతర దేశాల ఆధునిక సర్వే నౌకలతో పోలిస్తే సమాచారం సేకరణ సామర్థ్యం పరిమితంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నౌకల కొరత కారణంగా సిబ్బంది, విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన విశాఖపట్నం కేంద్రాన్ని బలోపేతం చేయాలంటే పాత నౌకలను డీ–కమిషన్‌ చేసి, తక్షణమే కొత్త సర్వే నౌకలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్త పనితీరుపై ఎఫ్‌ఎస్‌ఐ సమీక్ష సమావేశం చైన్నెలో జరగనుంది. ఈ సమావేశంలో కొత్త నౌకల అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement