breaking news
Visakhapatnam District Latest News
-
మిస్ ఎర్త్ ఇండియాగా ముస్కాన్
ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ముస్కాన్ నయ్యర్ ప్రతిష్టాత్మక ‘మిస్ ఎర్త్ ఇండియా–2025’ కిరీటాన్ని కై వసం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఫినాలేలో బ్రెజిల్, స్పెయిన్, వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చిన కఠిన పోటీని తట్టుకుని ఆమె ఈ విజేతగా నిలిచారు. చివరి దశలో ఎనిమిది మందితో తలపడిన ముస్కాన్, తన ప్రతిభతో విజయాన్ని అందుకున్నారు. గతంలో మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ వైజాగ్ రన్నరప్, మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ వంటి టైటిళ్లను గెలుచుకున్న ముస్కాన్, తన పాఠశాల స్థాయిలోనే మిస్ టింపనీగా గుర్తింపు పొందారు. కోల్‌కతాలో బీబీఏ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ బృందానికి నాయకత్వం వహించిన ఆమె, ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తూ విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. -
చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, భద్రతకు పటిష్ట చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ , భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కమిటీల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించాలని, డ్రాప్ఔట్లను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టం చేశారు. బాలల సంరక్షణ గృహాల్లో మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలని ఆదేశిస్తూ, సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు.బాల, బాలిక సంరక్షణ గృహాలను పక్కాగా నిర్వహించాలని, వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు సూచించారు. పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవలందించాలని చెప్పారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ రామలక్ష్మి శాఖాపరమైన అంశాలను వివరించారు. సమావేశాశంలో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువైనెల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ – అరకు మధ్య రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–అరకు– విశాఖపట్నం మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. విశాఖపట్నం–అరకు(08525) స్పెషల్ రైలు ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం 8.40 గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 12.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అరకు–విశాఖపట్నం (08526) స్పెషల్ రైలు అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు నడుస్తాయి. ఈ రైళ్లు ఇరువైపులా సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రాగుహలు, స్టేషన్ల్లో ఆగుతాయి. ● విశాఖపట్నం–షాలిమర్(08507) స్పెషల్ రైలు ప్రతీ మంగళవారం విశాఖలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు(బుధవారం) తెల్లవారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఫిబ్రవరి 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగుప్రయాణంలో షాలిమర్– విశాఖపట్నం (08508) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్‌లో తెల్లవారు 5గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఫిబ్రవరి 25వ తేదీ వరకు నడుస్తాయి. -
భిన్నత్వంలో ఏకత్వంపై కార్పొరేట్ దాడి
ఏయూక్యాంపస్ : భారతదేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వంపై ప్రస్తుతం కార్పొరేట్ శక్తులు దాడి చేస్తున్నాయని ప్రముఖ ప్రజాకవి, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో జరుగుతున్న సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘శ్రామికోత్సవ’ వేదికపై ఆయన మాట్లాడారు. తాను సినీ కవిగా కంటే ముందే భవన నిర్మాణ కూలీగా పనిచేశానని, తన పెన్నులో సిరా కాదు.. శ్రామికుల రక్తం, చెమట ఉంటాయని పేర్కొన్నారు. శ్రీశ్రీ తర్వాత కార్మిక, కర్షక జనం కోసం అత్యధిక పాటలు రాసింది తానేనని ఆయన సగర్వంగా చెప్పారు. ‘విశాఖ ఉక్కును అమ్మేదెవడు.. కొనేదెవడు’ వంటి పాటలు రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రాణం ఉన్నంతవరకు ప్రజా గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టడానికి బదులు కల్లు పట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలు, స్వాతంత్య్రం తర్వాత కూడా నెలకొన్న దౌర్భాగ్య స్థితిగతులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పాటలు, కవితలతో సభికుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి తపన్ సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగ రావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ కె.రమాప్రభ, సీతాలక్ష్మి, దర్శకులు యాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు గీతాలు, నృత్యాలతో కళాకారులు అలరించారు. -
ట్రక్ క్లీనర్‌ను రక్షించిన సీఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది
ఉక్కునగరం: పిట్లో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుంటున్న ట్రక్ క్లీనర్‌ను సీఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది సకాలంలో రక్షించారు. వివరాలివి.. కర్నూల్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ కృష్ణారెడ్డి, క్లీనర్ తలారి కౌలుట్ల స్టీల్‌ప్లాంట్‌కు ట్రక్‌లో సిలికాన్ మెగ్నీషియాన్ని తీసుకొచ్చారు. ప్లాంట్‌లోని ఫెర్రో స్టోర్‌కు చేరుకుని మెటీరియల్ అన్‌లోడింగ్‌కు ట్రక్ పెట్టారు. అక్కడ నుంచి తప్పిపోయిన కౌలుట్ల ఎల్ఎంఎం విభాగం సమీపంలోని ఆయిల్ పిట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కాని కొద్దిసేపటికి 20 అడుగుల లోతులో ఉన్న ఆయిల్ పిట్ నుంచి అరుపులు వినిపించాయి. అటుగా వెళ్లున్న ఉద్యోగులు వెంటనే సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. వారు మొదట తాడుతో ప్రయత్నించారు. అది జారి పోతుండటంతో ఎట్టకేలకు అగ్నిమాపక నిచ్చెన ద్వారా బయటకు తీశారు. అతని కోసం అప్పటికే ప్రయత్నిస్తున్న డ్రైవర్ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకుని కౌలుట్ల మానసిక స్థితి బాలేదని చెప్పారు. వెంటనే అతన్ని సీఐఎస్ఎఫ్ వాహనంలో బీసీ గేటు బయటకు తరలించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించిన ఫైర్ సిబ్బందిని ఉద్యోగులు అభినందించారు. -
సింటర్ ప్లాంట్‌లో ఫ్లక్స్ కన్వేయర్ ప్రారంభం
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ సింటర్ ప్లాంట్ విభాగం ఉత్పాదక అభివృద్ధిలో ముందడుగు పడింది. విభాగం సొంత వనరులతో ఏర్పాటు చేసిన 25 ఎంటీఆర్ఎస్ ఫ్లక్స్ కన్వేయర్‌ను సోమవారం స్టీల్‌ప్లాంట్ సీజీఎం (వర్క్స్) రంజన్ మహంతి ప్రారంభించారు. ఈ నూతన కన్వేయర్ వల్ల 1,500 టన్నుల వరకు అదనపు లైమ్‌ను మాన్యువల్‌గా లోడింగ్ చేయవచ్చన్నారు. తద్వారా సింటర్ ప్లాంట్‌కు లైమ్ స్టోన్ కొరత చాలా వరకు తగ్గుతుందన్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులతో కన్వేయర్‌ను తయారు చేసిన విభాగం అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీజీఎం (మెయింటెనెన్స్) ప్రవీణ్‌కుమార్, జీఎం (స్టీల్, మిల్స్, ప్లానింగ్) ఇన్చార్జ్ పి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఇన్చార్జ్ జి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఆచార్యులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్’
మహారాణిపేట: సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ‘రెవెన్యూ క్లినిక్’లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకుని అధికారులు పని చేయాలని, ఈ క్లినిక్‌ల ద్వారా దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే ఆన్లైన్లో పరిశీలించి సమాధానం చెప్పడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్‌ల పనితీరును ఇకపై ప్రతి వారం జేసీతో కలిసి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా దరఖాస్తులు నింపేందుకు సహాయకులను నియమించడమే కాకుండా, ఫిర్యాదుదారులు అధికారుల ఎదుట కూర్చుని ప్రశాంతంగా సమస్యలు వివరించుకునేలా కుర్చీలు, ఇతర వసతులు కల్పించారు. సోమవారం జరిగిన ఈ సదస్సులో సాధారణ పీజీఆర్ఎస్కు 262 వినతులు రాగా, రెవెన్యూ క్లినిక్‌కు 72 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ, జిరాయితీ భూముల ఆక్రమణలు, అసైన్మెంట్ అంశాలు, జీవో 296 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, 22–ఏ జాబితా నుంచి తొలగింపు వంటి సమస్యలు ఉన్నాయి. ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితుల వినతులను స్వీకరించారు. పెన్షన్ల కోసం ఎక్కువ మంది దివ్యాంగులు తరలివచ్చారు. -
క్రీడలతో మానసిక ఆరోగ్యం
మురళీనగర్: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 28వ ప్రాంతీయ స్థాయి అంతర పాలిటెక్నిక్ క్రీడలు, ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 24 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 816 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలోని నిరుపయోగంగా ఉన్న బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపీ, తుప్పలను తొలగించి వసతులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ పులిపాటి కింగ్, గండి బాబ్జీ, జోనల్ కమిషనర్ రాము, అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కళావేదికను నిర్మించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 100 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తం 100 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను అదే రోజు పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్‌కు 43 ఫిర్యాదులు అందగా.. ఇంజినీరింగ్–18, అడ్మినిస్ట్రేషన్–14, రెవెన్యూ–11, ప్రజారోగ్యం–6, యూసీడీ–5, హార్టికల్చర్ విభాగానికి 3 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎంహెచ్వో నరేష్ కుమార్ పాల్గొన్నారు. -
జీవీఎంసీలో 10 జోన్ల పాలన
ఎందెందు చూసినా.. అవే వైఫల్యాలు న్యూ ఈయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి● ఈ ఏడాదీ చంద్రబాబు పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యం ● వైఎస్సార్సీపీ హయాంలో నిర్మాణాల్నే తమ గొప్పలుగా డప్పులు ● భాగస్వామ్య సదస్సులో రూ.లక్షల కోట్ల ఒప్పందాల పేరుతో బురిడీ ● సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను హిట్ వికెట్‌గా అవుట్ చేసిన సర్కారు ● పదే పదే ఆర్థిక రాజధాని పేరుతో అబద్ధాలే తప్ప.. అభివృద్ధి లేదు ● ఇప్పుడు విశాఖ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో పీపీటీ మాయాజాలం నాడు వైభవం.. 2019 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసిన తర్వాత.. నగరం దశ దిశలా పరుగులు తీసింది. గత విశాఖ వేరు.. 2019–24 మధ్యలో అభివృద్ధి చెందిన విశాఖ వేరు అన్న రీతిగా జంక్షన్లు, పర్యాటక ప్రాంతాలు, నగరదారుల రూపురేఖలు మారిపోయాయి. 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ పాత విశాఖవైపుగా తీసుకెళ్తోంది. 2025 అంతా విశాఖను అభివృద్ధి చేసేశామంటూ మాయమాటలు చెబుతూ.. నగర వైభవాన్ని బంగాళాఖాతంలో ముంచేసిందని విమర్శలొస్తున్నాయి. 2025లో ఏ ఒక్క వర్గాన్నీ సంతోషంగా ఉంచిన రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని అన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అన్నదాతల తిప్పలు ఈ ఏడాది అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. విత్తనాలు దొరక్క, సరైన సమయంలో వర్షాలు కురవక.. ఖరీఫ్ తొలిసీజన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా పాట్లు పడి.. విత్తులు దొరికిన తర్వాత.. చేను కాపాడుకోవడానికి ఎరువుల కోసం యుద్ధాలే చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల రోజుల పాటు కష్టపడి ఎరువులు సంపాదిస్తే.. మోంథా తుపాను వచ్చి.. మొత్తం పంటని నాశనం చేసేసింది. జిల్లాలో 26 గ్రామాల పరిధిలో 415 మంది రైతులకు చెందిన 286.88 ఎకరాలు పంటలు తుపాను ముంపునకు గురైతే.. పరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వని దుస్థితిలో ఉంది. 2025.. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానంటూ చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు సాక్ష్యంగా మారింది. భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులంటూ.. చంద్రబాబు ప్రభుత్వ అంకెల గారడీ పోటీల్లో 2016, 2017, 2018ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు పరుగులు తీయగా ప్రేక్షకపాత్ర పోషించింది. గత ప్రభుత్వం మొదలెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే, వాటిని ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్న క్రెడిట్ చోరీకి ప్రధాన సాక్షిగా నిలిచింది. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను హిట్ వికెట్‌గా అవుట్ చేయగా.. అంపైర్ అవతారమెత్తింది. ఇలా.. చంద్రబాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2025 సంవత్సరాన్ని గంగార్పణం చేసేసింది. ఈ ప్రభుత్వం 2025లో ఏం చేసిందని వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నది స్పష్టమవుతోంది. – సాక్షి, విశాఖపట్నం పర్యాటక మాయలేనా.? పర్యాటక రాజధానిగా విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టలేదు. కై లాసగిరిపై ఇటీవల గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనంటూ నిస్సిగ్గుగా బాకాలు ఊదుకుంటోంది. కానీ.. ఈ ప్రాజెక్టుకు 2024 జనవరిలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సూచనల మేరకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్వోఈ) ఇచ్చారు. వీఎంఆర్డీఏ ఆవరణలో ది డెక్ భవనం పనులు కూడా గత ప్రభుత్వ హయాంలో 80 శాతం వరకూ పూర్తయ్యాయి. ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోగా.. యాత్రీనివాస్, ఇతర పర్యాటక స్థలాలు, భవనాలు ప్రైవేటుకు ధారాదత్తం చేసేసింది. సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపారు. నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసినా వెలవెలబోయిన పార్టనర్ షిప్ సమ్మిట్ పీ4 పేరుతో పేదలకు మోసం.! పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున్న ఉన్న పేద కుటుంబాల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మార్చుతామంటూ బీరాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం.. ఏడాది గడిచినా మొండిచెయ్యి చూపిస్తోంది. 2025 ఉగాది నాటికి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతామంటూ చంద్రబాబు బాకాలు కొట్టారు. 2026లో వస్తున్నా ఆ ఛాయలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాల్ని దత్తత తీసుకునే మార్గదర్శులు దొరక్క.. ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పటివరకూ 10 శాతం కుటుంబాలకు మాత్రమే మార్గదర్శులు దొరికారంటే బాబు పాలన ఎలా ఉందో స్పష్టమవుతోంది. పర్యావరణాన్ని ‘గాలి’ కొదిలేసింది.! చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలి కాలుష్య నియంత్రణకు రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. పర్యావరణానికి పెద్దపీట వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల ఆరోగ్యంపై శీతకన్నేశారు. దీంతో దేశంలోనే రెండో స్థానానికి వాయు కాలుష్య స్థాయిలు ఎగబాకాయంటే.. ఇక్కడ పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2019 డిసెంబర్లో పీఎం10 స్థాయిలు 108 ఉండగా.. 2021 నాటికి 90కి చేరుకుంది. 2025 డిసెంబర్లో మాత్రం ఇది 3 రెట్లకు పైగా పెరిగి 308కి చేరుకుందంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది. సింహాచలం చరిత్రలో తొలిసారిగా ఘోరం.! చరిత్ర కలిగిన సింహాద్రి అప్పన్న దేవాలయంలో 2025 ఓ విషాద మరకగా మారిపోయింది. ఏటా నిర్వహించే సింహాద్రి అప్పన్న నిజరూపదర్శన భాగ్యం చందనోత్సవం ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏప్రిల్ 30న దర్శనం మొదలైన కాసేపటికే గోడ కూలి.. ఏడుగురు భక్తులు కొండపైనే మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రతి అంశంలోనూ మోసమే.! తమకు నచ్చిన కంపెనీలకు విశాఖలో భూములను ఽకారు చౌకగా కట్టబెట్టేసింది. అనేక నగరాల్లో లూలూ సంస్థ సొంత భూములు కొనుగోలు చేసి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే.. విశాఖలో మాత్రం రూ.వేల కోట్లు విలువ చేసే భూముల్ని ఎకరం 99 పైసలకే ఆ సంస్థకు కట్టబెట్టింది. ఇదే తీరులో ఊరు పేరు లేని ఉర్సా వంటి సంస్థలకు కూడా భూ పందేరాలు చేసేసింది. గత ప్రభుత్వం పక్కగా మెట్రో డీపీఆర్‌ని తయారు చేస్తే కేంద్రం ఆమోదముద్ర వేసే సమయానికి ఆపించేసి.. మార్పులు చేస్తామంటూ మోసం చేసింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లు పిలిచి.. ఇదిగో మెట్రో అంటూ హడావుడి చేసి.. టెండర్లను కూడా వాయిదా వేస్తూ వస్తోంది. ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్‌ని కాపాడే బాధ్యత తనదంటూ చెప్పిన చంద్రబాబు.. ఇటీవల ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రశ్నించిన ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. మీరేం పనిచేస్తున్నారు అంటూ వీరంగమాడారు. 2025లోనే ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడ్డాయంటే.. బాబు మోసం ఎలా ఉందో అర్థమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పేరుతో విశాఖవేదికగా 2016, 2017, 2018లో సదస్సులు నిర్వహించారు. ఒక్కో ఏడాది రూ.5 లక్షల కోట్లు, రూ.2 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టారు. అందులో ఒక్క శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారు. 2025లో నిర్వహించిన సమ్మిట్‌లో ఏకంగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ మాయ చేశారు. ఇందులో సగానికి పైగా పెట్టుబడులు 2023లో వైఎస్సార్సీపీ హయాంలో 2023లో నిర్వహించిన జీఐఎస్ సమ్మిట్‌లో వచ్చినవే కావడం కొసమెరుపు. విశాఖ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో వందల పేజీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో గ్రాఫిక్ మాయాజాలంతో మరోసారి మభ్యపెట్టారు. ఇలా.. ‘ఇందుగలడందులేడు.. ఎందెందు వెతికినా.. అందందే.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కనబడును’ అన్నట్లుగా 2025లో చంద్రబాబు పాలన పాలిపోయింది. దర్శన వివరాలు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనాలు ఉంటాయి. -
సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయం
నగరంలో నేవీ, కోస్ట్‌గార్డ్ కీలక సమావేశం సింథియా : తూర్పు నావికాదళం, తీరప్రాంత రక్షణ దళం మధ్య 13వ ‘కామ్నవ్గార్డ్’ సమావేశం సోమవారం నగరంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి తూర్పు నావికాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్, కోస్ట్‌గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ డోనీ మైఖేల్ సహ అధ్యక్షత వహించారు. సముద్ర భద్రత, నిఘా, సమాచార మార్పిడిలో ఉమ్మడి సమన్వయాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఇరు విభాగాల సీనియర్ అధికారులు కీలక చర్చలు జరిపారు. సముద్ర తీర రక్షణను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలు, పరస్పర సహకారంపై ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. -
రైల్వే అభివృద్ధి పనుల వేగవంతానికి జీఎం ఆదేశం
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం విస్తృతంగా పర్యటించి, పలు రైల్వే యూనిట్లు, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి ముడసర్లోవలో నిర్మాణంలో ఉన్న దక్షిణ కోస్తా రైల్వే నూతన జోనల్ కార్యాలయ భవన పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీజిల్ లోకోషెడ్‌ను సందర్శించి, ఎలక్ట్రికల్ లోకోల నిర్వహణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్లపూడి వర్క్‌షాప్‌లోని సదుపాయాలను, విశాఖ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం అరణ్య క్యాంపింగ్ ఏరియాలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాలీ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, క్యాంప్ ఫైర్‌ను ప్రారంభించారు. అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచిన స్కౌట్స్ బృందాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. -
మాఫియా
నగరంలో మిక్స్డ్ సాల్వెంట్ మహారాణిపేట: నగర శివారు ప్రాంతాల్లో అనధికార మిక్స్డ్ సాల్వెంట్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాల్సిన రసాయనాలను వాహనాలకు వాడే ఇంధనంగా మార్చి విక్రయిస్తున్నా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి వంటి శివారు ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం అడ్డుఅదుపూ లేకుండా విస్తరించింది. హైదరాబాద్, చైన్నె కేంద్రంగా పనిచేసే కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు ఈ మిక్స్డ్ సాల్వెంట్‌ను కొనుగోలు చేస్తున్నాయి. దానికి మరికొన్ని రసాయనాలు కలిపి ‘ఇండస్ట్రియల్ డీజిల్’ అనే ముసుగులో విక్రయిస్తున్నాయి. సాధారణ డీజిల్ ధర కంటే తక్కువగా లభిస్తుండటంతో వాహనదారులు కూడా దీనివల్ల కలిగే ప్రమాదాలను ముందే ఊహించినప్పటికీ, ఆర్థిక లాభం కోసం వీటిని పిలిపించుకుని మరీ ట్యాంకుల్లో నింపుకుంటున్నారు. ఫార్మా, కెమికల్, పాలిమర్ వంటి పరిశ్రమల్లో రసాయనాల విభజన కోసం మాత్రమే వాడాల్సిన ఈ సాల్వెంట్‌ను వాహనాలకు వాడటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. అంతేకాకుండా ఇలాంటి కల్తీ ఇంధనం వల్ల వాహనాల ఇంజన్ భాగాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ ఈ వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మిక్స్డ్ సాల్వెంట్ అమ్మకాలు జరపాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. ఏటా అవసరమైన కోటా కోసం పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ ఫైలు జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్‌కు చేరి, తుది అనుమతి లభించిన తర్వాతే క్రయవిక్రయాలు జరగాలి. విశాఖలో మాత్రం ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఆనందపురం శివారులో నిరంతరం ఒక ట్యాంకర్‌ను సిద్ధంగా ఉంచి, అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే.. ఇంత జరుగుతున్నా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ మత్తు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మొక్కుబడి చర్యగా ఇటీవల పెందుర్తిలో విజిలెన్స్ అధికారులు ఒక ట్యాంకర్‌ను పట్టుకుని, 26,277 లీటర్ల సాల్వెంట్‌ను సీజ్ చేసి సివిల్ సప్లైస్ ద్వారా 6–ఏ కేసు నమోదు చేశారు. అయితే ఇది కేవలం కంటితుడుపు చర్యేనని, అసలు దారిమళ్లింపుదారులు మాత్రం స్వేచ్ఛగా వ్యాపారాన్ని మూడు ట్యాంకర్లు, ఆరు డ్రమ్ముల చందంగా కొనసాగిస్తు న్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా, చమురు సంస్థలు సైతం మౌనం దాల్చడం వెనుక ఉన్న మర్మమేమిటో అధికారులకే తెలియాలి. ఇండస్ట్రియల్ డీజిల్ తయారీ -
సహకార రంగంపై కేంద్రం పెత్తనమా?
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సహకార చట్ట సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. బి.ఆర్.అంబేడ్కర్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బ్యాంకు అధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2020లో తీసుకువచ్చిన సవరణల వల్ల సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని విమర్శించారు. ముఖ్యంగా పాలకవర్గ పదవీ కాలపరిమితిని నిర్దేశించడం, సభ్యుల పదవులను రద్దు చేసే అధికారాలను రిజర్వ్ బ్యాంకుకు అప్పగించడం వంటి నిర్ణయాలు సభ్యుల ప్రజాస్వామిక హక్కులను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు చలసాని రాఘవేంద్రరావు, పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు మాట్లాడుతూ ఈ చట్ట సవరణలు సహకార స్ఫూర్తికే విఘాతమని, ఇది జాతీయ స్థాయి సమస్య అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్లు ఇప్పటికే వీటిని వ్యతిరేకిస్తున్నాయని, ఈ నిబంధనల అమలును ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. న్యాయపరమైన ఇబ్బందులను చర్చిస్తూ, సహకార రంగాన్ని కాపాడుకునేందుకు అవసరమైన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం సభ్యులు సీఆర్ సుకుమార్ ఈ చట్టాలలోని న్యాయపరమైన ఇబ్బందులను వివరించారు. పాలకవర్గ సభ్యుడు సి.కృష్ణమోహన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
నయనానందకరం.. కూచిపూడి నృత్య రూపకం
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా మూడు రోజుల పాటు జరిగిన నృత్యోత్సవాలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా కుర్మన్నపాలెం నృత్య కలానికేతన్ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కూచిపూడి నృత్య రూపకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్ రాజేంద్ర,నర్సింగ్ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు కె. హైమావతి పర్యవేక్షణలో 47 మంది విద్యార్థులు ప్రదర్శించిన ఈ రూపకంలో గోవిందుని జననం నుంచి కళ్యాణ ఘట్టం వరకు అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే బెంగళూరుకు చెందిన పి. ప్రవీణ్ కుమార్ భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్ రాజేంద్ర మాట్లాడుతూ ప్రాచీన కళలను కాపాడటంలో కళాభారతి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా కళాకారులను, నిర్వాహకులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. జనవరి 6 నుంచి 12 వరకు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ రాంబాబు ప్రకటించారు. -
డాక్టర్ కమల్ బయిద్కు ‘ఐకానిక్ అశోక’ పురస్కారం
ఎంవీపీకాలనీ: ఏసీఎన్ ఇన్ఫోటెక్ డైరెక్టర్ డాక్టర్ కమల్ బయిద్కు ప్రతిష్టాత్మక ఐకానిక్ అశోక అవార్డ్ లభించింది. ఢిల్లీలో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఐకానిక్ పీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గత 50 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా కౌన్సిల్ ఈ అవార్డును అందజేసింది. ఎంవీపీకాలనీకి చెందిన కమల్ బయిద్.. గత ఐదు దశాబ్దాలుగా రోటరీ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్, మహావీర్ ఇంటర్నేషనల్, జైన్ శ్వేతాంబర్ తెరాపంత్ సభ వంటి సంస్థల ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమంతో పాటు క్రీడలు, పోలియో, హెచ్ఐవీ, కోవిడ్ అవగాహన, నిర్మూలనపై పెద్ద ఎత్తును అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు క్లబ్‌లకు అధ్యక్షుడిగా, గవర్నర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ అవార్డు దక్కించుకున్న సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
‘నారాయణ’ మంత్రాంగంలో మేయర్ గల్లంతు!
తీసేసిన కరివేపాకేనా.. నగర ప్రథమ పౌరుడిగా గౌరవం అందుకోవాల్సిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు సొంత ప్రభుత్వం నుంచే అవమానం ఎదురైంది. సాక్షాత్తు చంద్రబాబు సర్కార్‌లోని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన కీలక సమీక్షా సమా వేశంలో మేయర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. నగర అభివృద్ధికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ భేటీలో మేయర్‌ను పక్కన పెట్టడం ద్వారా ఆయనను ‘చారులో కరివేపాకు’లా తీసిపారేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. –డాబాగార్డెన్స్ విశాఖ పర్యటనకు ఆదివారం వచ్చిన మంత్రి నారాయణ, నగరంలోని బీచ్‌రోడ్డులో ఉన్న స్మార్ట్‌సిటీ కార్యాలయంలో ఒక రహస్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో పాటు అభివృద్ధి పనులకు సంబంధించిన ముఖ్య అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, మురుగునీటి పారుదల వ్యవస్థ పనితీరు వంటి కీలక అంశాలపై ఇక్కడ సుదీర్ఘంగా చర్చించారు. అయితే నగర పాలక సంస్థకు అధిపతిగా ఉన్న మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఈ సమావేశానికి సంబంధించి సమాచారం లేకపోవడం లేదా ఆయనను ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అధికార పార్టీ నాయకులకు, మేయర్‌కు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. సమావేశం అక్కడెందుకో? మరోవైపు ఈ సమావేశం జరిగిన వేదికపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ కార్పొరేషన్లను ఎత్తివేసి నెలలు గడుస్తోంది. విశాఖలో కూడా ఈ విభాగం ఉనికిలో లేదు. సమీక్షల కోసం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ వంటి ప్రతిష్టాత్మక భవనాలు అందుబాటులో ఉండగా, మూతపడిన స్మార్ట్‌సిటీ కార్యాలయాన్ని ఎంచుకోవడం వెనుక ఆంతర్యమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి ప్రయోజనాల కోసమే ఈ వేదికను ఎంచుకున్నారని, సదరు అధికారి కనుసన్నల్లోనే మంత్రి ఈ సమీక్ష నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి చెబుతున్న మాటలకు మంత్రి తలొగ్గడం ఇక్కడ కొసమెరుపు. ఆ ప్రాజెక్టు కోసమేనా.. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టిన మురుగునీటి ప్రాజెక్టు, దాని అనుబంధ పనుల గురించే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా మంత్రి నారాయణ ఇదే ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించడం చూస్తుంటే, దీని వెనుక ఏదో పెద్ద భాగోతమే ఉందన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ‘రహస్య సమీక్ష’ విశాఖ రాజకీయాల్లో మేయర్ వర్సెస్ మంత్రిగా రూపాంతరం చెంది, కొత్త సమీకరణాలకు తెరలేపింది. మేయర్‌ను పిలవలేదా? పిలిచినా వెళ్లలేదా? ఈ వ్యవహారంపై నగరంలోని పలు పార్టీల నాయకులు, కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి, మేయర్‌కు మధ్య నెలకొన్న ఈ సమన్వయ లోపం నగర ఆధునీకరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు మేయర్‌ను మంత్రి పిలవలేదా? లేక పిలిచినా ఆయన హాజరు కాలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఒక అధికారిక సమీక్షలో ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. -
మద్యం మత్తులో నేవీ అధికారి వీరంగం
ట్రాఫిక్ ఎస్ఐపై దాడి మల్కాపురం: నేవీ అధికారి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మల్కాపురంలో ఐవోసీ పైప్‌లైన్ పనులు జరుగుతుండటంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నేవీ లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణ.. పూటుగా మద్యం సేవించి అదే మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాహుల్ కృష్ణ.. ఎస్ఐతో వాగ్వాదానికి దిగి, ఆయనపై దాడి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు, దాడికి పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
క్లిక్..ఆర్డర్
స్మార్ట్ షాపింగ్‌లో స్టైల్‌దే అగ్రస్థానం సాక్షి, విశాఖపట్నం: ఫంక్షన్‌కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్‌కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..! ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్‌కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్‌కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్‌స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్‌లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్‌లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు. 2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించిందని సర్వేలో వెల్లడించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్‌ని ఇంటికి రప్పించుకుంటున్నారు. ● విశాఖలో 434 శాతం పెరిగిన బ్యాగులు, వాలెట్ల విక్రయాలు ● ఐఫోన్ నుంచి గోల్డ్ కాయిన్ దాకా.. ఫాస్ట్ షాపింగ్ ● ఆన్లైన్ కొనుగోళ్లలో కిరాణేతర వస్తువులదే హవా ● ఇన్‌స్టామార్ట్ సర్వేలో వెల్లడి ఏం ఆర్డర్ చేస్తున్నారంటే? ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 434 శాతం పెరిగాయి. క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు 374 శాతం మేర నమోదయ్యాయి. నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు 249 శాతం వృద్ధి చెందాయి. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 161 శాతం, పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు 166 శాతం పెరిగాయి. స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు 100 శాతం వరకు వృద్ధి చెందాయి. నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. -
● ఇద్దరు యువకుల దుర్మరణం ● నుజ్జునుజ్జయిన వాహనం ● మృతులు విశాఖ వాసులుగా గుర్తింపు
చెట్టును ఢీకొట్టిన వ్యాన్ గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కుమార్ (35), ఎల్లాబిల్లి దినేష్ (24) శనివారం సాయంత్రం బేకరీ సామగ్రి లోడుతో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లారు. అక్కడ పని ముగించుకొని ఆదివారం తిరిగి వస్తుండగా, గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోయి, గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న గజపతినగరం ఎస్ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొక్లెయిన్ సాయంతో వ్యాన్‌ను పక్కకు తీసి, అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వినయ్‌కుమార్ భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, దినేష్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్దలు మరణించడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విశాఖ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పా రు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. కాగా.. ఇండోర్ గేమ్స్(టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్)ను గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. బాలబాలికలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాలికల విభాగంలో చెస్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాలుర విభాగంలో కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర పోటీలు ఫిజికల్ డైరెక్టర్ అబ్బాస్ బేగ్ పర్యవేక్షణలో జరుగుతాయని వివరించారు. -
జాతర
పర్యాటకసందర్శకులతో కిటకిటలాడుతున్న ఉమ్మడి విశాఖ నగరం, అల్లూరి జిల్లాకు పోటెత్తిన పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు జనవరి రెండో వారం వరకూ హోటల్స్, రిసార్టులు ఫుల్ గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న విశాఖ సాక్షి, విశాఖపట్నం : అల్లంత దూరాన ఎగసిపడే సాగర కెరటాలు ఒకవైపు.. మంచు దుప్పటి కప్పుకుని ఆహ్వానించే మన్యం అందాలు మరొకవైపు.. ఈ ప్రకృతి రమణీయతను చూసేందుకు పర్యాటక లోకం పరుగున వస్తోంది... నీలి సముద్రం పర్యాటకుల జన సంద్రాన్ని చూసి మురిసిపోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి వెల్లువలా వస్తున్న సందర్శకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్ సెలవులు.. ఇయర్ ఎండింగ్ కలిసి రావడంతో గత ప్రభుత్వ సమయంలో మొదలైన ప్రాజెక్టులు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో కొత్తందాల్ని చూసేందుకు పర్యాటక లోకం విశాఖ వైపు క్యూ కట్టింది. సాగర తీరంలోని ఇసుక తిన్నెల నుంచి.. మన్యం అడవుల్లోని మంచు కొండల వరకు ఎటు చూసినా సందర్శకుల సందడే కనిపిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ప్రకృతి ప్రేమికులు పోటెత్తడంతో.. విశాఖ జిల్లా పర్యాటక కేంద్రాలన్నీ ‘హౌస్‌ఫుల్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మారిపోతున్న క్యాలెండర్ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి విశాఖలో పర్యాటక జాతర మొదలైంది. క్రిస్మస్ సెలవులు, వారాంతం, నూతన సంవత్సర వేడుకలతో కలిసి.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ పర్యాటకులతో పోటెత్తింది. సూర్యోదయపు అందాలతో మెరిసే ఆర్కే బీచ్ నుంచి, సాహసాలకు నిలయమైన రుషికొండ వరకు.. ప్రశాంతతను పంచే కై లాసగిరి నుంచి, ప్రకృతి ఒడిలో సేదతీర్చే తెన్నేటి పార్క్ వరకు ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. కై లాసగిరి రోప్‌వే ఎక్కేందుకు కొండ దిగువన క్యూ కట్టిన సందర్శకులుహోటళ్లు ఫుల్.. ఈ విపరీతమైన రద్దీ కారణంగా నగరంలోని స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వెకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 25 శాతం పెరిగిన ఫుట్‌ఫాల్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది. రుషికొండ -
రైల్వేస్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్లో డీఆర్ఎం లలిత్ బోహ్రా ఆదివారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పండగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, స్టేషన్లో వారికి అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా రద్దీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, ప్లాట్‌ఫాంలపై భద్రతను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలోని బుకింగ్ కార్యాలయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, ప్రయాణికులకు అందుతున్న తాగునీటి సౌకర్యం, ప్లాట్‌ఫాంల పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె. రామారావు, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫరెవర్ మిస్ ఇండియాగా నిహారిక
బీచ్‌రోడ్డు: రాజస్థాన్ జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ వేడుకలో నగరానికి చెందిన నిహారిక బేతనపల్లి ఫరెవర్ మిస్ ఇండియా కిరీటం కై వసం చేసుకున్నారు. విశాఖకు చేరుకున్న ఆమె ఆదివారం నగరంలోని ఒక హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఫరెవర్ స్టార్ ఇండియా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అందాల పోటీలో సుమారు 10,000 నామినేషన్లు రాగా.. 105 మంది ఫినాలేకు ఎంపికయ్యారని తెలిపారు. తొలుత మిస్ బెంగళూరు కిరీటం గెలుచుకుని, ఇప్పుడు జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కిరీటం పొందటం ఒక కీలక మైలురాయిని ఆమె పేర్కొన్నారు. -
విగతజీవులుగా సముద్ర జీవరాశులు
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట తీరంలో ఆదివారం విషాదకర దృశ్యం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో సముద్ర జీవరాశులు విగతజీవులుగా మారి అలల తాకిడికి తీరానికి కొట్టుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా కటిల్ఫిష్లతో పాటు తాబేళ్లు, ముళ్లకప్ప చేపల కళేబరాలు బీచ్ అంతటా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యం, మత్స్యకారుల బోట్లు బలంగా తగిలినప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తాయని తీరప్రాంత మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. కటిల్ ఫిష్, ముళ్లకప్ప చేప -
ఉత్తరద్వార దర్శనానికి సింహగిరి సిద్ధం
సింహాచలం : ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య దర్శనానికి పెద్దపీట వేస్తూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి, ఆనువంశిక ధర్మకర్తలకు తొలి దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు సాధారణ భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 11 గంటల తర్వాత స్వామివారిని మాడ వీధుల్లో తిరువీధి మహోత్సవం నిర్వహిస్తారు. 5 కి.మీ. మేర క్యూ లైన్ల ఏర్పాటు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 ప్రత్యేక దర్శన క్యూలైన్లు అందుబాటులో ఉంటాయి. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈసారి ఆలయం లోపల నీలాద్రి గుమ్మం వద్ద నుంచే మూలవిరాట్ లఘు దర్శనం కల్పిస్తారు. వీఐపీలకు సైతం అంతరాలయంలో ఎటువంటి పూజలు ఉండవు. భద్రత కోసం అదనపు సీసీ కెమెరాలు, 190 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి సాయంత్రం 6 గంటల వరకే ప్రైవేటు వాహనాలకు అనుమతి సోమవారం సాయంత్రం 6 గంటల వరకే ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ, దేవస్థాన బస్సులు షటిల్ సర్వీసులుగా భక్తులను కొండపైకి చేరుస్తాయి. ప్రసాదాల విషయానికి వస్తే లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. భక్తులందరికీ ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆరు చోట్ల వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య కల్యాణం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు విరామం మినహా సాయంత్రం 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనం లభిస్తుంది. 29వ తేదీ సాయంత్రం వరకు ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు కొనసాగుతాయి. -
విశాఖ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
ఏయూక్యాంపస్: నగరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రాబల్యం అధికంగా ఉందని, కార్మిక శక్తి ఈ నగరానికి వెన్నెముక అని వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ మైదానంలో జరుగుతున్న సీఐటీయూ ‘శ్రామిక ఉత్సవ్’ రెండో రోజు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970లో ప్రారంభమైన సీఐటీయూ కార్మిక హక్కుల సాధనలో ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు. కార్మిక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖను పారిశ్రామికంగానే కాకుండా ఐటీ, పర్యాటక రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తర్లువాడలో గూగుల్ కార్యకలాపాలు, కాపులుప్పాడ, మధురవాడల్లో ఐటీ హబ్‌ల విస్తరణతో పాటు నగరాన్ని ‘అడ్వెంచర్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలోని 50 మురికివాడలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. కార్మికుల సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధికి లేబర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాంగణంలోని పుస్తక ప్రదర్శనను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు వి.కృష్ణయ్య, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, జిల్లా కన్వీనర్ మణి, శ్రామికత ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ, అల్లూరి హాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
‘ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ -
వైజ్ఞానిక ప్రదర్శనకు ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు’
సీతంపేట: మధురానగర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.విష్ణువర్ధన్ కుమార్, పి.రామచరణ్ రూపొందించిన ‘పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఫర్ ఫ్యూచర్’ ప్రాజెక్టు జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. గైడ్ టీచర్ వి.వి. అశోకవాణి పర్యవేక్షణలో విద్యార్థులు సిద్ధం చేసిన ఈ నమూనా, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతను వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ గొప్ప విజయం సాధించిన విద్యార్థులను, మార్గదర్శకత్వం వహించిన టీచర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్, ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.లక్ష్మీనరస, పీడీ సునంద్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉగ్యోగుల సంక్షేమానికి కృషి
కొమ్మాది: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సాగర్‌నగర్‌లో గల ఏపీఈపీడీసీఎల్ సీవోఈఈటీ భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సంబంధిత అధికారులతో సమీక్ష ని ర్వహించారు. అనంతరం 34 మంది లబ్ధిదా రులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ పనులు పురోగతిని సమీక్షించిన ఆయన ఫేజ్–1 పనులు వేగవంతంగా పూర్తి చేసి, ఫేజ్–2కు వెళ్లేందుకు అధికారులు కృషి చేయా లని సూచించారు. కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణు కుమార్రాజు, సంస్థ డైరెక్టర్లు పివి సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు పాల్గొన్నారు. -
ఫార్మా నిర్వాసితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తాటిచెట్లపాలెం: గాజువాక నియోజకవర్గం లేమర్తి గ్రామానికి చెందిన ఫార్మాసిటీ నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకు బాధితులు వినతిపత్రం అందజేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కేకే రాజును కలిశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. 2005లో ఫార్మా పరిశ్రమల స్థాపన కోసం తమ భూములను ఇచ్చామని, ఆ సమయంలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం, కంపెనీలు హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అయితే 20 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ పూర్తిగా అమలు కాలేదన్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే పర్మినెంట్ చేశాయని, మరికొన్ని యాజమాన్యాలు ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేకే రాజు సానుకూలంగా స్పందించారు. నిర్వాసితుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేవరకు వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు అధ్యక్షుడు పూర్ణనాథ శర్మ, యల్లపు వాసు, నక్క రమణబాబు తదితరులు పాల్గొన్నారు. -
నో హెల్మెట్.. నో పెట్రోల్
అల్లిపురం: నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను అరికట్టేందుకు సిటీ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ పేరిట తీసుకువచ్చిన ఈ నిబంధనను జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. బంకు యజమానులకు ఆదేశాలు ఈ విధానం అమలుపై నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల యజమానులకు పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ లేని వాహనదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయవద్దని, ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు బంకు సిబ్బంది కూడా వాహనదారులను ముందుగానే హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ లభించదని స్పష్టం చేస్తూ.. బంకుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జరిమానాలు వేసినా మారని తీరు హెల్మెట్ లేని వాహనదారుల ఫొటోలు తీసి నిరంతరం జరిమానాలు(ఈ–చలానాలు) విధిస్తున్నప్పటికీ, చాలామందిలో మార్పు రావడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు హెల్మెట్‌ను భారంగా భావిస్తున్నారని, మరికొందరు పోలీసుల కోసమే ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో మార్పు తెచ్చేందుకు పెట్రోల్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల భద్రత కోసమే.. ఇది వాహనదారులను ఇబ్బంది పెట్టేందుకు కాదని, వారి ప్రాణ రక్షణ కోసమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని గుర్తుచేస్తున్నారు. కేవలం వాహనం నడిపే వ్యక్తే కాకుండా, వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని హితవు పలికారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాద రహిత విశాఖ జిల్లా నిర్మాణానికి సహకరించాలని పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. జనవరి 1 నుంచి అమలు -
పోలీసింగ్‌లో ఇతర శాఖల సహకారం కీలకం
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అధ్యక్షతన శనివారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో వార్షిక నేర సమీక్ష సమావేశం–2025 జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ, జ్యుడీషియల్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఎకై ్సజ్, కోస్ట్ గార్డ్, ఎన్సీబీ తదితర శాఖల అధికారులతో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నగరంలో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన విధివిధానాలను సూచించారు. తమ శాఖల నుంచి పోలీసు శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గడిచిన ఏడాది కాలంగా నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్, నేరాల తీరుపై సీపీ ఆయా అధికారులతో విశ్లేషించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోతో మాట్లాడి.. ఈ ఏడాది వారి స్టేషన్ పరిధిలో అమలు చేసిన ఉత్తమ పోలీసింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఏడాదిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 94 మందికి రివార్డుల ప్రదానం సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ప్రోత్సాహకాలు అందించారు. నగర పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు.. ప్రతి నెలా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 94 మందిని గుర్తించి, ఉన్నతాధికారుల సమక్షంలో సీపీ రివార్డులు అందజేశారు. 13 మందికి పదోన్నతులు కమిషనరేట్‌కు చెందిన 13 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక మహిళా ఏఎస్ఐకి ఎస్ఐగా, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు ఏఎస్ఐగా, ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లకు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన సిబ్బందిని వారి కుటుంబ సభ్యులతో సహా వేదికపైకి ఆహ్వానించి, సీపీ స్వయంగా ర్యాంకులను అలంకరించి, పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. -
ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం
మహారాణిపేట: ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ఆధారంగా ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి పెండింగ్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ, భీమిలి డివిజన్ల రెవెన్యూ అధికారుల సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాజువాక ప్రాంతానికి చెందిన జీవో నం.45, యూఎల్సీ పరిధిలోని జీవో నం.27, కన్వెయన్స్ డీడ్లకు సంబంధించిన జీవో నం.296, సాధారణ ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవోలపై క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్లకు సూచించారు. జీవో ఎం.ఎస్. నం.30 ప్రకారం అమలవుతున్న ఆక్రమణల క్రమబద్ధీకరణ–2025 పథకం కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెట్రో పనుల్లో జాప్యం వద్దు భూ క్రమబద్ధీకరణ, రీ–సర్వే, హౌసింగ్, యూఎల్సీ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, మెట్రో మార్గాల వెంట అక్రమ దుకాణాలు, వీధి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధిలో విద్యుత్ లైన్లు, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్లైన్ల ఏర్పాటులో సమన్వయం పాటించాలని సూచించారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, మ్యుటేషన్ వంటి సేవల్లో నిర్ణీత గడువు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో విశాఖ, భీమిలి ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, సర్వే శాఖ డీడీ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
స్లో..లార్!
పీఎం సూర్యఘర్‌కు అంతంతమాత్రంగా స్పందనసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పీఎం సూర్యఘర్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్ రూఫ్టాప్లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్‌లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్‌పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..! ఈపీడీసీఎల్ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)కరెంట్ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..! అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్‌పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్ అధికారుల మెడపై కత్తిగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటివరకు 36 వేల మంది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు -
రసాయన ట్యాంకర్ ఇంజిన్‌లో మంటలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ, బోయిపాలెం కూడలిలో శనివారం సాయంత్రం ఓ రసాయన ట్యాంకర్ ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మీథైల్ ఆల్కహాల్ లోడుతో వెళ్తున్న ఈ ట్యాంకర్ కేబిన్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే చిట్టివలస అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ట్యాంకుకు మంటలు వ్యాపించకుండా ఫోమ్‌తో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖాధికారి జి.శ్రీనివాసరాజు తెలిపిన వివరాలివి. అనకాపల్లికి చెందిన వై.సాయికుమార్‌కు చెందిన ట్యాంకర్, విశాఖ నుంచి మీథైల్ ఆల్కహాల్ లోడుతో జాతీయ రహదారి మీదుగా ఆనందపురం వైపు వెళ్తోంది. బోయిపాలెం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు వ్యాపించి, క్షణాల్లో కేబిన్ కాలి బూడిదైంది. అప్పటికే డ్రైవర్, క్లీనర్ దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వెనుక ఉన్న కెమికల్ ట్యాంకుకు మంటలు అంటుకోకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అర గంటకు పైగా నిలిపివేసి, ఆనందపురం పోలీసుల సాయంతో వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన కేబిన్, ఇంజిన్ విలువ సుమారు రూ.9లక్షలు ఉంటుందని అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తప్పిన పెను ప్రమాదం -
ఆకట్టుకుంటున్న కళాసిల్క్ ప్రదర్శన
కరీంనగర్: అందం, హుందాతనం కలగలిపిన ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను విశాఖపట్నం వాసులకు చేరువ చేసేందుకు కళాసిల్క్ సంస్థ శ్రీకారం చుట్టింది. మురళీనగర్, లక్ష్మీగణపతి గుడి ఎదురుగా ఉన్న మాధవధార వుడా కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కళాసిల్క్ హస్తకళా ప్రదర్శన విశాఖవాసులను ఆకట్టుకుంటోంది. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడంతోపాటు చేనేత హస్తకళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు ఈ సంస్థ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశంలో ఎంపిక చేసిన చేనేత కళాకారులు అద్భుతంగా నేసిన సిల్క్, పట్టు, కాటన్ వస్త్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలాంకరి, ఉప్పాడ, అసోంలోని మూగా, ఎరిశిల్బ్, బిహార్‌లోని బాగల్పుర సిల్స్స్, టస్సర్, చత్తీస్‌గఢ్‌లోని ట్రిబిల్ వర్క్, కోసా సిల్క్, గుజరాత్‌లోని బాందని, కచ్చ ఎంబ్రయిడరీ డ్రెస్‌లు, శారీస్, జమ్మూ కాశ్మీర్‌లోని ఎండ్రాయిండరీ శారీస్, డ్రెస్ మెటీరియర్, పాస్మిక్ చేనేత వస్త్రాలతోపాటు హ్యాండీక్రాఫ్ట్స్, న్యూట్రీషన్ ఫుడ్, అతివల అలంకరణ వస్తువులు, హోంఫుడ్స్, బ్యాంగిల్స్‌ను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. -
‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి
బీచ్‌రోడ్డు: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా యూనిట్ శనివారం నగరంలో సందడి చేసింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్గా రూపుదిద్దుతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా యూనిట్ విశాఖ వచ్చింది. ఈ సందర్భంగా నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుందని, విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ఇందులో తాను ‘కొండవీటి ప్రశాంతి’ అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్ వ్యాన్ యజమాని ‘అంబటి ఓంకార్ నాయుడు’గా నటించినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత కథ ఆద్యంతం మలుపులు తిరుగుతుందని, భార్యాభర్తల మధ్య గొడవలను పందెంకోళ్ల పోరును తలపించేలా దర్శకుడు ఆసక్తికరంగా చూపించారని చెప్పారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, పక్కాగా ప్రేక్షకుల మనసు దోచుకునేలా ఉంటుందని దర్శకుడు ఏఆర్ సజీవ్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. -
సర్క్యూట్ ట్రైన్ మళ్లీ మొరాయింపు
ఆరిలోవ: కై లాసగిరిపై వీఎంఆర్డీఏ నిర్వహిస్తున్న విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్(సర్క్యూట్ ట్రైన్) మళ్లీ మూలకు చేరింది. సందర్శకులతో శుక్రవారం స్టేషన్ వద్ద బయలుదేరిన ఈ ట్రైన్ కొద్ది మీటర్లు ముందుకు వెళ్లిన అనంతరం బ్రేకులు పనిచేయకపోవడంతో తిరిగి వెనక్కి మళ్లింది. లోపల ఉన్న సందర్శకులు భయంతో కేకలు వేయడంతో డ్రైవర్ నెమ్మదిగా ట్రైన్ నిలిపేశాడు. సందర్శకులంతా కిందకు దిగిపోవడంతో అంతా ఊపిరి ఊల్చుకొన్నారు. దీంతో శనివారం నుంచి దీన్ని నిలిపేశారు. ఎన్నిరోజులు ఇది మూలన ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత 10 నెలల్లో మూడుసార్లు మొరాయించింది. ఇది తరచూ బ్రేకులు ఫెయిల్ కావడంతో సందర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఇది మూడోసారి వీఎంఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యంతో సర్క్యూట్ ట్రైన్ సందర్శకులతో దోబూచులాడుతోంది. ఇది తరచూ మరమ్మతులకు గరవుతున్నా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంతవరకు మూడుసార్లు మొరాయించింది. ఫ్యాన్లు తిరగకపోవడం, ఏసీలు పనిచేయకపోవడం, జనరేటర్ మూలకు చేరడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న దీన్ని నిలిపేశారు. మరమ్మతులు చేపట్టి రెండు వారాలకు మళ్లీ పట్టాలు ఎక్కించారు. అనంతరం రెండు వారాలు పనిచేసిన ఈ ట్రైన్ మార్చి 17న చక్రాలు విరిగిపోయి పట్టాలు తప్పింది. ఆ సమయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. పట్టాలు తప్పినచోటే రైలు సుమారు నాలుగు నెలలు పాటు నిలిచిపోయింది. అనంతరం దీనిలో బాగా పాడయిన ఒక బోగీని తొలగించి మిగిలిన రెండింటితో నడుపుతున్నారు. అది కూడా ఇప్పుడు మొరాయించింది. సంక్రాంతి పండగ సందర్భంగా కనీసం వారంరోజుల పాటు కై లాసగిరి సందడిగా ఉంటుంది. వారికి సర్క్యూట్ ట్రైన్ దూరమైనట్లే. -
నగర పోలీస్ కమిషనర్‌కు డీజీగా పదోన్నతి
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లకు అబవ్ సూపర్ టైమ్ స్కేల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లెవెల్–16)గా పదోన్నతికల్పించారు. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, లా అండ్ ఆర్డర్ ఏడీజీగా బాగ్చి విశేష సేవలు అందించారు. సీపీ బాగ్చికి పదోన్నతి లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి స్థాయి డీజీ హోదాలో, తన అపార అనుభవంతో విశాఖ నగర భద్రతను మరింత మెరుగుపరుస్తారని ఆశిస్తూ పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
నిరుద్యోగ భృతి చెల్లించాలి
ఏయూ ఆర్చ్ వద్ద ఏఐవైఎఫ్ భిక్షాటనమద్దిలపాలెం: ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆర్చ్ వద్ద ఫెడరేషన్ నాయకులు వినూత్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్యుతరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న సీఎం చంద్రబాబు.. ఆవకాయ్ ఫెస్టివల్‌కు రూ.5 కోట్లు, సోషల్ మీడియా ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, ఈ 19 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎస్సీ, బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు నేటికీ రుణాలు మంజూరు కాలేదన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, లేని పక్షంలో జనవరిలో యువతను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి, లక్ష్మణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో మనువాదం అమలుకు కుట్ర
ఎంవీపీకాలనీ: దేశంలో మనువాదాన్ని మరోసారి అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని, భారతావని అనే మానస సరోవరానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు బ్రహ్మరాక్షసులుగా దాపురించాయని సినీనటుడు ప్రకాష్‌రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏయూ వేదికగా ‘శ్రామిక ఉత్సవ్’ పేరిట నిర్వహిస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. మత విద్వేషాల ముసుగులో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశాన్ని విడదీస్తున్నాయన్నారు. ‘కమలం పువ్వు కింద వేళ్లూనుకుంటున్న ఆర్ఎస్ఎస్ దేశానికి పట్టిన విషం. వందేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారు ఒక్కరైనా ఉన్నారా? ఈ వందేళ్లలో వారు చెడ్డీల నుంచి ప్యాంటులకు మారారు తప్ప.. దేశానికి సాధించిందేమీ లేదు.’ అని ఎద్దేవా చేశారు. అమ్ముడుపోయిన మీడియా, ప్రభుత్వం ఉద్యమం అవసరమున్న విశాఖ ప్రాంతంలో సీఐటీయూ మహా సభలు నిర్వహించడం అభినందనీయమని ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వంతో పాటు మీడియా కూడా అమ్ముడుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడుపోతే ప్రజలకు న్యాయం ఏం జరుగుతుందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ చాపకింద నీరులా కార్పొరేట్ల చేతుల్లోకి మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని అడ్డుకోవడానికి నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘నేను నటుడిని మాత్రమే కాదు.. అభ్యుదయ ఆలోచనలకు అండగా ఉండేవాడిని. సిటూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావ డం నా బాధ్యత. చెమట చుక్కకి ఓటమి లేదంటారు.. కానీ నేడు ఆ చెమట చుక్కకు అన్యాయం జరుగుతోంది.’అని అన్నారు. సిని మాల్లో నటిస్తూ ఆనందంగా ఉన్నప్పటికీ.. సీఐటీయూ మాదిరిగా కార్మికులు, సామాన్యుల గొంతుకగా నిలవడమే తనకిష్టమన్నారు. ప్రజలు రాజకీయం చేయాలి.. పాలకులు పనిచేయాలి ‘ప్రవాహం వెంట వెళ్లి చచ్చిపోయే చేప మాదిరిగా నేను ఉండాలనుకోవడం లేదు.. ప్రవాహానికి ఎదురీదే చేపగా ఉండాలనుకుంటున్నా. అబద్ధం మాట్లాడటానికి ధైర్యం కావాలి.. కానీ నిజం మాట్లాడటానికి కాదు’అంటూ ఆయన కార్మికుల్లో స్ఫూర్తి నింపారు. ప్రజలు రాజకీయం చేయాలని, పాలకులు పనిచేయాలని, కానీ మన దగ్గర అది రివర్స్ అయ్యిందని వ్యాఖ్యానించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలిండియా సీఐటీయూ నాయకుడు కందారపు మురళీ, జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.కె. కుమార్, కె.రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు సీఐటీయూ మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాన వేదికపై రాష్ట్రంలోని వివిధ కళా బృందాలు ప్రదర్శించిన స్ఫూర్తిదాయక గీతాలు, నాటికలు అలరించాయి. పుస్తక ప్రదర్శనను సాహితీ పరిశోధకుడు ఆచార్య వెలమల సిమ్మన్న, లఘుచిత్ర ప్రదర్శనను స్టార్ మేకర్ సత్యానంద్, సాహిత్య ఉత్సవాన్ని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి, సైన్స్ ఎగ్జిబిషన్‌ను డాక్టర్ ఆర్.వి.ఎస్.సుబ్రహ్మణ్యం, కార్టూన్ ఎగ్జిబిషన్‌ను మహాసభల చైర్మన్ సీహెచ్ నరసింగరావు, ఫొటో ఎగ్జిబిషన్‌ను కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. సామాజిక అంశాలను ప్రతిబింబించే లఘు చిత్రాలు, విశాఖ ఉద్యమాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి. శ్రామిక ఉత్సవ్‌కు హాజరైన వివిధ వర్గాల ప్రజలు సిటూ అఖిల భారత మహాసభల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న సినీనటుడు ప్రకాష్‌రాజ్ -
ట్రాన్స్‌పర్సన్స్ గౌరవం, బాధ్యత పోలీసులదే..
అల్లిపురం: మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా ట్రాన్స్‌పర్సన్స్‌కు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా విశాఖ సిటీ పోలీసులు కృషి చేయడం అభినందనీయమని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన ట్రాన్స్‌పర్సన్స్‌కు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహించిన నియామక పత్రాల పంపిణీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన, వివాహాలు ఇతర శుభకార్యాల సమయంలో తలెత్తుతున్న సమస్యలు, బీచ్‌లు, రైళ్లు, బస్ స్టాండ్ల వంటి ప్రదేశాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు, కొన్ని చోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ గమనించి, ఈ సమస్యలను శిక్షాత్మక దృష్టితో కాకుండా మానవతా దృష్టితో పరిశీలించారు. గత మే 10న ట్రాన్స్పర్సన్స్తో అవగాహన సమావేశంలో సుమారు 160 మంది ట్రాన్స్‌పర్సన్స్ పాల్గొని సామాజిక వివక్ష, ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాల కొరత, భద్రత వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమిషనర్ ట్రాన్స్‌పర్సన్స్ గౌరవం, భద్రత పోలీసుల బాధ్యత అని భరోసా ఇచ్చి, భిక్షాటన పరిష్కారం కాదని, ఉపాధి, స్వావలంబన ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. బ్యాంకుల సహకారంతో ముద్రా రుణాలు మంజూరు చేయడం, ఆరుగురు ట్రాన్స్‌పర్సన్స్‌కు ఐరన్ కియోస్కులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే జీవీఎంసీ ద్వారా 20 మంది ట్రాన్స్‌పర్సన్స్‌కు పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాస్‌కు, మెడికల్ ఆఫీసర్‌కు, ఎస్బీఐ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్‌పర్సన్స్ ఆనందం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నగర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్త సంస్కృతికి తెరలేపుతున్న టీడీపీ?
ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధిలోని దుర్గాబజార్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు శనివారం ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోవడంతో అతను వెనుదిరిగారు. వార్డులోని దుర్గాబజార్ రామాలయం వద్ద రోడ్డు పక్కన కొన్నేళ్లుగా వైఎస్సార్సీపీ జెండా దిమ్మ ఉంది. సందర్భాన్ని బట్టి ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 21న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు ఇక్కడ జెండాను ఆవిష్కరించారు. అయితే, శనివారం ఓ వ్యక్తి ఆ దిమ్మను పాక్షికంగా ధ్వంసం చేశాడు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు అతడిని అడ్డుకుని నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకుడి సూచన మేరకే తాను తొలగిస్తున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో.. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆ టీడీపీ నాయకుడిని ప్రశ్నించారు. దీంతో ఆ టీడీపీ నాయకుడు మాట మారుస్తూ.. వార్డు కార్పొరేటర్ భర్త తొలగించమన్నారని సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల కిందట కూడా ఇదే వార్డులోని ఆరిలోవ ఆఖరి బస్టాప్ వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ జెండా దిమ్మను.. స్థానిక టీడీపీ నాయకుల సూచనలతో జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకులు సిబ్బందిని నిలదీసి, ఆ దిమ్మను తిరిగి అక్కడ ఏర్పాటు చేయించారు. ఇలా వార్డులో టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటంపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ జెండా దిమ్మ ధ్వంసానికి విఫలయత్నం -
22–ఏ ఫైళ్లకు మోక్షమెప్పుడో?
మహారాణిపేట: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు, చివరకు కలెక్టరేట్లోని పలు విభాగాల్లో కూడా కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారు. అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. రెవెన్యూ దస్త్రాల ఊసెత్తడానికే సాహసించడం లేదు. కొంతమంది ఉన్నతాధికారులు అయితే ఫైళ్ల మీద డిస్కస్ అని రాసి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా నిషేధిత జాబితా(22ఏ)లోని ఫైళ్ల విషయంలో ఈ పరిస్థితి ఉంది. తిరస్కరణకే అధికారుల మొగ్గు జిల్లాలో 22–ఏ జాబితాలో చేరిన భూములను, ఆ జాబితా నుంచి తొలగించేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. జిల్లాలోని ఐఏఎస్ అధికారులు సైతం 22–ఏ ఫైల్ అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ కేటగిరీకి సంబంధించి దాదాపు 80 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పోస్టులు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉండటంతో కలెక్టరేట్లో ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. 22–ఏ జాబితా నుంచి తమ భూములను క్లియర్ చేయించుకోవడానికి దరఖాస్తుదారులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు ఎక్కువగా ఒత్తిడి చేస్తే, ఏదో ఒక సాకు చూపి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. గతంలో అయితే ఫైళ్లు పెండింగ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు 22–ఏ ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఇబ్బందుల్లో రైతులు భూములు 22–ఏ జాబితాలో ఉండటం వల్ల అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలు రైతులకు అందడం లేదు. ఆన్లైన్(1–బి)లో వివరాలు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయి. ఎంతోమంది రైతుల భూములను 22–ఏ లోనూ, జీరో ఖాతాల్లోనూ చేర్చారు. వాస్తవానికి హక్కులు కలిగిన రైతుల భూములను కూడా 22–ఏలో చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతోకాలంగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను, హక్కులతో అనుభవిస్తున్న వారి స్థలాలను జీరో ఖాతాలకు బదిలీ చేయడం వల్ల వారు యజమాన్య హక్కులను కోల్పోతున్నారు. జిరాయితీకి తప్పని 22–ఏ బెడద జిరాయితీ భూములను సైతం 22–ఏ జాబితాలో చేర్చుతున్నారు. ఇది కావాలని చేస్తున్నారో లేక, ఇతర రాజకీయ కారణాల వల్ల జరుగుతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కొంతమంది రెవెన్యూ అధికారులు జిరాయితీ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతుంటే, ఉన్నతాధికారులు సైతం ఆమోదముద్ర వేస్తున్నారు. ఒకసారి 22–ఏలో చేరిన తర్వాత, ఆ జాబితా నుంచి భూమిని బయటకు తీసుకురావడం కష్టంతో కూడుకున్న పనిగా మారింది. అడ్డంకిగా సబ్ డివిజన్ జిల్లాలో కొన్ని సర్వే నంబర్లను మొత్తం 22–ఏలో చేర్చారు. ఈ భూములకు సబ్ డివిజన్ కాకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే సర్వే నంబరులో ఉన్న వివాదాస్పద భూమి వల్ల, మిగిలిన క్లియర్ భూములు కూడా 22–ఏలో మగ్గుతున్నాయి. సదరు సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేస్తే ఎంతోమంది ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ అధికారులు సబ్ డివిజన్ చేయడానికి సహకరించడం లేదు. దీనివల్ల ఎంతోమంది ఇళ్లు కట్టుకుని కూడా, రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ అక్కడే నివసిస్తున్నారు. -
అనుమానమే ఉసురు తీసింది...
భార్యను కడతేర్చిన భర్త అరెస్టుయలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్‌నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలోని ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్‌తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు.. -
ప్రజా ఉద్యమకారులపై పీడీ యాక్టా?
డాబాగార్డెన్స్: బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని పోరాడుతున్న సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా సీపీఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు కొత్తపల్లి లోకనాథం, సీహెచ్ నరసింగరావు, జగ్గునాయుడు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై స్మగ్లర్లకు, నేరస్తులకు వేయాల్సిన పీడీ యాక్ట్‌ను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ల కోసం ఉద్యమాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజును వెంటనే భేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, బి.పద్మ, వి.కృష్ణారావు, ఈశ్వరమ్మ, ఎం.సుబ్బారావు, పి.పైడిరాజు, ఆర్ఎస్ఎన్ మూర్తి, యూఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అప్పలరాజు అరెస్ట్‌పై భగ్గుమన్న సీపీఎం -
27న భీమిలిలో జాబ్ మేళా
మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని 800కి పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అర్హత ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్‌తో హాజరు కావాలని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 901475 8949 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. అదే రోజు భీమిలి పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్‌లో ఐటీ సెక్టార్‌కి చెందిన సెక్యూరిటీ అనలిసిస్ట్ కోర్స్‌లో చేరడానికి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ అర్హత కలిగి ఆసక్తి కలిగిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. -
● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం
కొండల వెనుక నుంచి వచ్చే ఆ వెలుగు చారలు, నిశ్చలంగా ఉన్న నీటిపై పడి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న అసలైన ప్రశాంతతను చూడాలంటే ఇలాంటి ప్రదేశాలకు రావాల్సిందే. పడవలు తీరానికి చేరుకున్న వేళ, ఆకాశం గులాబీ రంగును పులుముకున్న వేళ... ఈ దృశ్యం మనసులోని అలజడిని తగ్గించి, ఉత్తేజాన్ని ఇస్తుంది. బిజీ జీవితం నుంచి కాసేపు విరామం తీసుకుని, ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టులోని మత్స్యగెడ్డ ప్రాంతం చక్కని ప్రదేశం. – ముంచంగిపుట్టు -
వెలుగురేఖ సమైక్య
ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నాను. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్‌క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్‌గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ‘సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈ)లో జూనియర్ ఇంజనీర్‌గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్‌కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్‌లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్‌గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
మధుర ఫలం.. ముందే వచ్చేసింది!
సీతంపేట: ఒకప్పుడు ఉగాదికి మామిడి పిందెలు వచ్చేవి. మామిడి పండ్ల రుచిని ఆస్వాదించాలంటే మే వరకు ఆగాల్సి వచ్చేది. కానీ, కాలం మారింది.. దాంతో పాటు పంట విధానాలూ మారాయి. ఇప్పుడు విశాఖ వాసులకు శీతాకాలంలోనే ఫలరాజు దర్శనమిస్తున్నాడు. సాధారణ సీజన్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ.. శంకరమఠం రోడ్డులో మామిడి పండ్లు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ పండ్లను స్థానిక వ్యాపారులు విక్రయిస్తున్నారు. సీజన్ కాని సీజన్లో పసుపు రంగులో మెరుస్తున్న మామిడిని చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 300గా ఉంది. ధర కాస్త ఘాటుగానే ఉన్నా.. మామిడిపై ఉన్న మక్కువతో మ్యాంగో లవర్స్ ఎగబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఏడాదికి మూడు సార్లు కాపు కాసే కొత్త రకం మామిడి పంటలు వచ్చాయని, దీని వల్ల ఏడాది పొడవునా మామిడి కాయలతో పాటు, పండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. శీతాకాలంలోనే నోరూరిస్తున్న మామిడి -
అమ్మా అని పిలిచేదెవరు.?
ఆ బుడిబుడి అడుగులకు తెలియదు.. అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని ఉందని. ఆడుకునే ఆశతో అడుగు వేసిన చిన్నారిని నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ బలిగొంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాల మరణం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ముచ్చర్లలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. – తగరపువలస ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన లెంక గణేష్, కనకం దంపతులు నిత్యం కష్టపడితే గానీ ఇల్లు గడవని పేద కుటుంబం. గణేష్ పెట్రోల్ బంకులో పనిచేస్తుండగా, కనకం వ్యవసాయ కూలీ. తమ కష్టమంతా పిల్లల భవిష్యత్తు కోసమే అని బతుకుతున్నారు. వీరికి మూడేళ్ల ఢిల్లీశ్వరి, ఏడాదిన్నర బాబు చాణక్య ఉన్నారు. అక్కా తమ్ముడు ఇల్లంతా సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ కష్టాన్ని మరిచిపోయేవారు. కాగా.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయం. ఢిల్లీశ్వరి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కల ఆడుకుని తిరిగి వచ్చే కూతురు, ఎంతసేపటికీ రాకపోయే సరికి తండ్రి గణేష్ గుండెలో ఆందోళన మొదలైంది. ఊరంతా గాలించాడు. చివరికి గ్రామంలోని రెండో వీధిలో పైడి రాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో చూడగా.. లోపల తన చిట్టితల్లి విగతజీవిగా కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. కూతురిని వెంటనే బయటకు తీసి, గుండెకు హత్తుకుని, ఇంకా ఊపిరి ఉందేమోనన్న చిన్న ఆశతో సంగివలసలోని అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని, పాప మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కన్నీటి సంద్రంలో ముచ్చర్ల ‘నా బిడ్డ లేని ఇల్లు చిన్నబోతుంది.. ఇక మాకు అమ్మా అని ఎవరూ పిలుస్తారు?’అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఢిల్లీశ్వరి స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండేది. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ రోజున జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. కాగా చిన్నారి ఎవరితో ఆడుకోవడానికి వెళ్లిందో తెలియరాలేదు. ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో ఏఎస్ఐ బాలంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో అప్పన్న ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం టికెట్లను శుక్రవారం నుంచి ఆన్లైన్లో లభ్యం కానున్నాయి. ఈనెల 29 తేదీ సాయంత్రం 5 గంటల వరకు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. www.aptemples.ap.gov.in వెబ్సైట్లో కానీ, మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా కానీ భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో ముక్కోటి దర్శనం టికెట్లు లభ్యం కావని తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి దర్శనం ముగిసిన తర్వాత సింహగిరిపై కౌంటర్లలో యథావిధిగా దర్శనం టికెట్లు విక్రయాలు జరుగుతాయని తెలిపారు. -
ఏయూలో స్టిక్కరింగ్ గందరగోళం
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో వివాదాస్పద నిర్ణయానికి అధికారులు తెరతీశారు. క్యాంపస్‌లో భద్రత పేరుతో వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అవి ఉన్న వాహనాలనే యూనివర్సిటీలోకి అనుమతించనున్నారు. ఇందుకోసం ఉద్యోగులు, డే స్కాలర్, రీసర్చ్ స్కాలర్ల వాహనాల వివరాలు ఇవ్వాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేశారు. అయితే దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందస్తు చర్చ లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏయూతోపాటు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు సైతం విస్తుపోతున్నారు. గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తే.. ఏయూలో బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు వినియోగించుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనుల కోసం వచ్చేవారు ఎలా? ఏయూలోకి కేవలం గుర్తింపు స్టిక్కర్లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించేలా ఆలోచన చేస్తుండడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏయూలో కోర్సులు, ఇతరత్రా సందేహాలు, అవసరాల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. ప్రధానంగా క్యాంపస్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీస్‌లు ఉన్నాయి. వీటి సేవలను ఏయూ ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, సిబ్బంది, అలాగే బయట వ్యక్తులు కూడా అనేక ఏళ్లుగా వినియోగిస్తున్నారు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో వారికి బ్యాంక్, పోస్టాఫీస్ సేవలు అందకుండా పోతాయి. అలాగే క్యాంపస్‌లో ఐఐపీఈ, ఐఐఎం సంస్థలు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంటన్న దానిపై అయోమయం నెలకొంది. నిత్యం సర్టిఫికెట్ల కోసం పరీక్షా విభాగానికి, ఇతరత్రా సమాచారం, అవసరాల కోసం అనేక మంది విద్యార్థులు వస్తుంటారు. వీరికి స్టిక్కర్లు ఇచ్చే అవకాశం లేదు. వీరిని ఏయూలోకి అనుమతించని పక్షంలో ఏయూ సేవలు, సమాచారాన్ని ఎలా పొందుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు వాహనాలకు గుర్తింపు స్టిక్కర్లతో కలిగే ఇబ్బందులపై ఎటువంటి ముందస్తు ఆలోచన చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ ఉద్యోగులే వ్యతిరేకిస్తున్నారు. ఏయూ క్యాంపస్‌లో భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ అన్ని విభాగాలకు లేఖ పంపించారు. వెంటనే ఏయూలో అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తోపాటు డే స్కాలర్లు, రీసెర్చ్ స్కాలర్లు తమ వాహనాల వివరాలను ఎక్సెల్ ఫార్మట్‌లో ఏయూ సెక్యూరిటీ ఆఫీస్‌లో అందజేయాలని అందులో పేర్కొన్నారు. వీటిని మంజూరు చేసిన తర్వాత.. ఈ స్టిక్కర్లు ఉన్న వాహనాలనే ఏయూలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సిరుల ట్యూనా.. దళారులకేనా?
● రోజుకు 200 టన్నుల వరకు వలకు చిక్కుతున్న చేపలు ● కేరళతో పాటు వియత్నాం, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో భారీ డిమాండ్ ● కిలో రూ.120 నుంచి రూ.180కే కొనుగోలు చేస్తున్న దళారులు ● విదేశీ మార్కెట్లో కిలో రూ.350 నుంచి రూ.800 పైగా ధర ● మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యం లేక నష్టపోతున్న మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం: వలకు చిక్కితే సిరులు కురిపిస్తుంది.. తింటే పుష్కలంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఎగుమతి చేస్తున్నామంటే చాలు, కొనుగోలు చేసేందుకు విదేశాలు క్యూ కడతాయి. అలాంటి అపారమైన మత్స్య సంపద తూర్పు తీరానికి సొంతం. ఆరోగ్య ప్రయోజనాలు, ఎగుమతి డిమాండ్ పరంగా అంతా సానుకూలంగా ఉన్నా.. సిరులు కురిపించే విషయంలో మాత్రం మత్స్యకారులకు అన్యాయమే జరుగుతోంది, వారి శ్రమ దోపిడీకి గురవుతోంది. వందల కిలోమీటర్ల దూరం వెళ్లి, గంటల తరబడి వేచి చూస్తే గానీ చిక్కని ట్యూనా చేపలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో దళారులకే లబ్ధి చేకూరుతోంది. జాతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్ఎస్ఐ) సర్వే ప్రకారం.. ఇక్కడి నుంచే ట్యూనా అత్యధికంగా ఎగుమతి అవుతున్నా, గంగపుత్రులకు మాత్రం ఆశించిన లాభం చేకూరడం లేదు. అపారమైన సంపద ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ ఇన్చార్జి సి.ధనుంజయరావు నేతృత్వంలో శాస్త్రవేత్త జి.వి.ఎ.ప్రసాద్ ట్యూనా సంపదపై సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు విశాఖ ఫిషింగ్ హార్బర్, పెదజాలారిపేట, పూడిమడక, కాకినాడ కేంద్రాలుగా లభ్యమైన సముద్ర ఉత్పత్తులపై సర్వే చేసిన సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. విదేశీయులకు అత్యంత ఇష్టమైన, డిమాండ్ ఉన్న ట్యూనా చేపలు ఎక్కువ శాతం ఇక్కడే లభ్యమవుతున్నట్లు తేలింది. తూర్పు ఎగువ తీరంలో ట్యూనా చేపల దిగుబడి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో మత్స్యకారులు జరిపే వేటలో 50 నుంచి 60 రకాల చేపలు లభ్యమైతే.. వాటిల్లో ట్యూనాల వాటా 50 శాతానికి పైగా ఉంటోందంటే.. ఇక్కడ వీటి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎల్లో ఫిన్ ట్యూనా(పసుపురెక్కల సూర), బిగ్ ఐ ట్యూనా(పెద్దకన్ను సూర), స్కిప్‌జాక్ ట్యూనా (నామాల సూర) తదితర రకాలు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు వస్తున్నాయి. కాకినాడ తీరంలోనూ 100 టన్నుల వరకు లభ్యత ఉన్నట్లు ఎఫ్ఎస్ఐ శాస్త్రవేత్త ప్రసాద్ సర్వేలో స్పష్టమైంది. శ్రమకు తగిన ధర ఎక్కడ? ఇంత కష్టపడి రోజుల తరబడి సముద్రంలో వేటాడి వస్తే.. ట్యూనా విషయంలో మాత్రం మత్స్యకారులకు ఆశించిన రాబడి రావడం లేదు. స్థానిక ప్రజలు ట్యూనాను తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. దీంతో లోకల్ మార్కెట్లో గిరాకీ ఉండదు. ఇక చేసేది లేక.. దళారులు ఎంత ధర ఇస్తామంటే అంత ధరకు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడ ట్యూనా మార్కెట్‌పై దళారులే పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మత్స్యకారులకు కిలోకు రూ.120 నుంచి గరిష్టంగా రూ.180 వరకూ మాత్రమే ముట్టజెబుతున్నారు. ఇక వేట నిషేధ సమయంలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు చిన్న పడవలపై వందల కిలోమీటర్లు వెళ్లి ట్యూనా తీసుకొస్తుంటే.. దళారులు మాత్రం అన్ సీజన్ అంటూ కిలోకి రూ.90 నుంచి రూ.100 మాత్రమే చేతుల్లో పెడుతున్నారని వారు వాపోతున్నారు. 1000 మీటర్ల లోతు వరకు వేట విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రతి రోజూ 300 బోట్ల వరకు ట్యూనా వేట కోసం బయలుదేరుతుంటాయి. తీరం నుంచి 70 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత, 700 నుంచి 1000 మీటర్ల లోతులో ట్యూనా సంపద విస్తృతంగా ఉంది. కాకినాడ, విశాఖకు చెందిన మత్స్యకారులు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సముద్ర జలాల వరకూ వెళ్లి వేటను సాగిస్తుంటారు. వేట కోసం సుమారు 90 బాస్కెట్లను సముద్రంలో విడిచిపెడతారు. ఒక్కో బాస్కెట్లో 6 హుక్స్(గాలాలు) ఉంటాయి. 4 గంటల పాటు హుక్స్‌ని నీటిలో ఉంచి, తర్వాత ఒక్కో బాస్కెట్‌ని బయటికి తీసి ట్యూనాలను పట్టుకొని తిరిగి వస్తుంటారు. ఇంజిన్ బోట్లతో పాటు సంప్రదాయ మరపడవలపై వెళ్లి మరీ ఈ వేట సాగిస్తుంటారు. ట్యూనా తర్వాత ఎక్కువగా కొమ్ముకోనాం చేపలు ఇక్కడి మత్స్యకారులకు చిక్కుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్యూనాయే దిక్కు వేట విరామ సమయంలో చిన్న పడవలు వేసుకొని వెళ్తున్నాం. అప్పుడు ట్యూనా చేపలే మాకు దిక్కవుతున్నాయి. కానీ.. ఇంత కష్టపడి తీసుకొస్తున్నా ఆశించిన ధర రావడం లేదు. ఎంత చెబితే అంతకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. అందుకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – మేరుగు ఎల్లాజీ, మత్స్యకారుడు, మంగమారిపేట దేశీయ మార్కెట్లో అయితే ఎక్కువగా విశాఖ నుంచి కేరళకు ట్యూనా ఎగుమతి జరుగుతోంది. శుద్ధి చేసిన ట్యూనాలు అమెరికా, థాయ్‌లాండ్, హాంకాంగ్, మలేసియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువగా ఉంటాయి. అధికశాతం ప్రొటీన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది. కేరళలో ప్రాసెస్ చేసిన తర్వాత.. కిలో రూ.350 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. కానీ.. శ్రమకోర్చి చేపలు పట్టిన మత్స్యకారుడు మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. విశాఖ, కాకినాడ తీరాల్లో భారీగా లభిస్తున్న ట్యూనా సంపద మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ట్యూనా చేపలు హార్బర్‌కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కష్టానికి సరిపడా ధర అందడం లేదు. ఇక్కడ మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తే మత్స్యకారులంతా లాభపడతారు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు నేరుగా ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా, జపాన్, యూరప్, దక్షిణ ఆసియా దేశాల్లో ట్యూనాల వినియోగం అధికంగా ఉంది. అక్కడకు ఎగుమతి చేస్తే మంచి ధర లభిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. –సూరాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, వైశాఖి మరపడవల సంఘం -
జిల్లాలో రేషన్ దుకాణాలు లబ్ధిదారులు ప్రతి నెలా ఇచ్చే బియ్యం
జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. అడిగితే తిరగబడుతున్నారు.. ఈనెల 7వ తేదీన సీతంపేట ఏరియాలో ఉన్న రేషన్ డిపోకు వెళ్లాను. మా కుటుంబంలో నలుగురికి గాను 20 కిలోల బియ్యం తీసుకున్నాను. బియ్యం తక్కువగా ఉన్నాయన్న అనుమానంతో మా ఇంటి పక్కన ఉన్న చిన్న కిరాణా షాపులో తూకం వేయగా 18 కిలోలు వచ్చాయి. డీలర్‌ను అడిగితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాకు వచ్చిన బియ్యంలో కోత పడుతోంది. అందుకే కార్డుదారుల మీద భారం వేస్తున్నట్టు డీలర్ చెప్పడంతో అవాక్కయ్యాను. – పి.లత, కనకమ్మవారి వీధి, సీతంపేట చర్యలు తప్పవు రేషన్ షాపుల్లో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు. తూకాల్లో తేడా వచ్చినా.. వెంటనే నిలదీయండి. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే ఫలితం ఉండదు. తూకాల్లో మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయండి. ఆకస్మిక తనిఖీలు చేసి నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రవక్తే లేదు. – వి.భాస్కరరావు, డీఎస్వో, సివిల్ సప్లయిస్ విభాగం -
అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు, శ్రీచరణికి చిత్రపటం, ప్రసాదం అందిస్తున్న ఏఈవో సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. స్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. క్రికెటర్ శ్రీచరణి కూడా.. : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. -
జాతీయ సైన్స్ ప్రదర్శనకు రెండు ప్రాజెక్టులు
ఆరిలోవ: జిల్లా నుంచి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో ఒకటి సదరన్ సైన్స్ ఫెయిర్‌కు కూడా ఎంపిక కావడం విశేషం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఇటీవల నిర్వహించారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో కూడా ఉత్తమంగా నిలిచాయి. విజయవాడలో బుధవారంతో ముగిసిన రెండు రోజుల ప్రదర్శనలో విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం నుంచి గైడ్ ఉపాధ్యాయుడు(ఫిజికల్ సైన్స్) బి.సీతారాం ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులు బి.మహేష్, కె.యోగి తయారు చేసిన ‘హైడ్–ఫ్రైడ్ వాటర్ టాప్స్’ప్రాజెక్టు జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనకు, ఆ తర్వాత జరగనున్న జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని మధురానగర్ హైస్కూల్లో గైడ్ టీచర్ వి.వి.అశోకవాణి ఆధ్వర్యంలో విద్యార్థులు విష్ణువర్ధన్, పి.రామ్‌చరణ్ తయారు చేసిన ‘పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఫర్ ఫ్యూచర్’ప్రాజెక్టు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందన్నారు. ఆయా ప్రాజెక్టులు తయారుచేసిన విద్యార్థులు, గైడ్ టీచర్లను డీఈవోతోపాటు, జిల్లా సైన్స్ అధికారి పి.రాజారావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు
సాక్షి, విశాఖపట్నం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు మేలు జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం మద్దిలపాలెంలో గల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చర్చి పాస్టర్లకు ప్రతీ నెల రూ.5000 గౌరవ వేతనం ఇచ్చామన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రూ.416 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం క్రైస్తవులకు గౌరవ వేతనం ఇవ్వకుండా కాలక్షేపం చేయడమే కాకుండా.. క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే శాంతి, కరుణ, దయ, జాలి అన్నారు. క్రైస్తవులందరూ కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తులని తెలిపారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మతాలు, కులాలకతీతంగా సుపరిపాలనను అందించారని, అందుకే తెలుగు ప్రజలంతా గుండెల్లో సుస్థిర స్థానం పొందారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటేనే సేవకు చిహ్నమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు చెప్పిన మాటలను అనుసరిస్తే ఈ ప్రపంచం శాంతిమయంగా మారుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ తాను క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో చదవడం వల్ల ఎంతో క్రమశిక్షణ నిజాయితీ అలవడిందని, ఆ ప్రేరణతోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవిబాబు, బిషప్ ఎంఏ పాల్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, సీహెచ్ వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు ఎంఏ పాల్ సుధాకర్, గరికిముక్కల పాల్ విక్టర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చింతాడ శ్రీనివాసరావు, ప్రభాకర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకుడు నిడిగట్టు రాజశేఖర్, జిల్లా సెక్రెటరీ కందిమల్ల రాజశేఖర్, పాస్టర్స్ పాల్గొన్నారు. -
ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గాజువాక : ఏటీఎం కార్డుల ద్వారా నగదు మోసాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు. చినగంట్యాడ ప్రాంతానికి చెందిన బలిరెడ్డి కుమారి గత నెల 28న గాజువాకలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లింది. ఆ సమయంలో ఏటీఎంలో టోపీ ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సహాయం చేస్తున్నట్టు నటించి ఆమె వెనుక నిలబడి పిన్ నంబర్‌ను గమనించి మోసపూరితంగా ఏటీఎం కార్డును మార్చేశాడు. ఆమె వెళ్లిపోయిన తరువాత నిందితుడు మార్చిన ఏటీఎం కార్డు ద్వారా రూ.26,500 డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసానికి పాల్పడింది తెలంగాణలోని మెహబూబాబాద్ దరి బాబాగుట్ట ప్రాంతానికి చెందిన బానోతు రాజు అలియాస్ నాయక్‌గా గుర్తించారు. గాజువాకలో అతడిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్టు సీఐ తెలిపారు. నిందితుడిపై ఏడు పోలీస్ స్టేషన్లలో 12 కేసులున్నాయన్నారు. నిందితుడి నుంచి రూ.50,500 నగదు, నాలుగు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లోని ఏడు పీఎస్‌లలో కేసులు -
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
తూకాల్లో నొక్కుడు
చర్చ్చిలో ఆకట్టుకున్న సెట్టింగ్లుట్రినిటీ లూథరన్ చర్చిలో బుధవారం అర్ధరాత్రి క్రైస్తవుల ప్రార్థనలుబియ్యం పంపిణీలో రేషన్ డీలర్ల చేతివాటంఅల్లిపురం ప్రాంతంలో ఓ మహిళ చౌక దుకాణం నుంచి బియ్యం తీసుకువెళ్లింది. ఇంటికి వెళ్లి తూకం వేయగా 15 కిలోలకుగాను 13.50 కిలోలే వచ్చాయి. వెంటనే వెళ్లి డీలర్‌ను ప్రశ్నించింది. ఆయన బియ్యం బస్తాను తూకం చూడగా 47.600 కిలోలు వచ్చింది. మధురవాడ వాంబేకాలనీలోని ఓ డిపోలో బియ్యం తూకంలో తేడా రావడంతో లబ్ధిదారుడు డీలర్‌తో గొడవకు దిగాడు. కావాలంటే సరుకు తీసుకెళ్లు.. లేదంటే అక్కడ పడేసి వెళ్లాలంటూ డీలర్ దబాయించాడు. దీంతో చేసిది లేక లబ్ధిదారుడు ఉన్న సరుకుతో ఇంటికెళ్లాడు. మహారాణిపేట: జిల్లాలో చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతుండటంతో అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే.. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే తూకాలు తక్కువతో సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వీటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 612 చౌకధరల దుకాణాల షాపుల్లో మొత్తం 5,17,155 కార్డులకు గాను 8,161 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తోంది. కార్డులో ఉన్న కుటుంబ సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం తూకాల్లో మోసాలు జరుగుతుండటంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా.. ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని గోదాముల నుంచి డీలర్లు తీసుకొని చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు సరఫరా చేస్తారు. విశాఖ జిల్లాలో రెండు సర్కిళ్లకు సంబంధించి మర్రిపాలెం ఎఫ్‌సీఐ గోదాం, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాల డీలర్లు వారి పరిధిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి బియ్యం తీసుకుంటున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్స్, మర్రిపాలెం గోదాంల నుంచి వస్తున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోంది. ఇక్కడ నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 47.60 కిలోలే వస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఈ భారాన్ని డీలర్లు కార్డుదారుల మీదకు నెడుతున్నారు. తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల్లో డీలర్లు బియ్యం తీసుకునేటప్పుడు ఎందుకు అడగడం లేదని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం తూనికల్లో తేడా వస్తున్నాయని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నేరుగా బ్లాక్ మార్కెట్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీలర్లను మార్పు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకు డీలర్షిప్ ఇవ్వడంతో అవినీతి దందాకు తెరలేపారు. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే తూకాల్లో తేడా నిర్వాకం జరుగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. డీలర్ల నుంచి మిగిలిన సరుకును నేరుగా బ్లాక్ మార్కెట్‌కు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన తూనికలు కొలతల అధికారులు మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఆర్నెళ్లకు ఓసారి కూడా తనిఖీలు చేయడం లేదు. మరోవైపు పౌరసరఫరాల శాఖాధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అలాగే గోదాముల్లోను, ఎంఎల్ఎస్ పాయింట్లల్లో తనిఖీలు చేయకపోవడంపై మరోవైపు డీలర్లు ప్రశ్నిస్తున్నారు. -
గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!
జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రోజ్ పార్కులో అర్ధంతరంగా నిలిచిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు బుధవారం సందర్శించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన గుర్రాల శిక్షణ పార్కు అవసరమేనన్నారు. ఇక్కడ గుర్రాల శిక్షణ కేంద్రం పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లతో దీని ఏర్పాటుకు సంకల్పించిందన్నారు. నెలకు రూ.3 వేలు తక్కువ అద్దెకు నిర్వాహకుడికి ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దాన్ని ఎక్కువ అద్దె వచ్చేలా తాము ప్రయత్నిస్తామన్నారు. -
గిరి నర్తనం.. మురిసిన విశాఖ జనం
మహారాణిపేట: పీసా మహోత్సవ్ సందర్భంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన రెండు రోజుల కార్యక్రమాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని ఎంతగానో అలరించాయి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయ నృత్య, సంగీతాలతో హోరెత్తించారు. చాలా ప్రదర్శనలకు ప్రేక్షకులు సైతం పదం కలిపారు. అనంతరం కళాకారులతో అధికారులు బృంద చిత్రాలు దిగి, జ్ఞాపికలు అందించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పీసా చట్టంపై అవగాహన పెంచేందుకే.. షెడ్యూల్డ్ ఏరియాస్‌లో పీసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ వీడియో సందేశం ద్వారా గిరిజన హక్కుల కోసం రాజ్యాంగ మద్ధతును తెలిపారు. పీసా పోర్టల్‌ను ప్రారంభించారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తల్లి బాట కింద చేపట్టిన అభివృద్ధి పనుల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అరకు కాఫీ, ఇతర ఉత్పత్తులతో కూడిన కిట్‌ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌కు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి అందించారు. -
సుత్తితో భార్య, అత్తపై దాడి
పెందుర్తి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సుత్తితో ఇంట్లో వీరంగమాడాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని దొగ్గవానిపాలెంలో బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుణ్యవత్తుల అప్పారావు, అతడి భార్య కనకమహాలక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా తీవ్రంగా గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన అప్పారావు ఇంట్లోని సుత్తితో భార్య, అత్త లక్ష్మిల తలలపై కొట్టాడు. అదే సమయంలో నిందితుడు అప్పారావుకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు స్పందించి దాడిలో గాయపడిన వారితో పాటు అప్పారావును స్థానిక సీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావుపై ఇదే తరహా దాడి ఘటనల్లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. -
బార్లు, పబ్‌లు నిబంధనలు పాటించాల్సిందే..
విశాఖ సిటీ : నగరంలో బార్లు, పబ్‌లు నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ–1 మణికంఠ చందోలు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి బార్లు, పబ్‌ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, పబ్‌లు నిర్ణీత సమయం వరకే నడపాలని ఆదేశించారు. ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా, గడువు ముగిసిన లైసెన్స్‌లతో నడపకూడదని, ధ్వని కాలుష్య నియమాలను ఉల్లంఘించరాదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో అనుమతించిన డెసిబెల్ పరిమితులకు మించి శబ్దంతో సంగీతాన్ని ప్లే చేయకూడన్నారు. బార్లు, పబ్‌లు సామర్థ్యం మేరకు కస్టమర్లను అనుమతించాలని, సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వయస్సు ధృవీకరణ పత్రాలను సరిగ్గా తనిఖీ చేయాలని, మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదని అసభ్యకరమైన సైగలు, అసభ్య ప్రదర్శనలు, అనుచిత ప్రవర్తనతో కూడిన డీజే పార్టీలు, డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. సిబ్బంది, బౌన్సర్లు, ఇతర ఉద్యోగులను సరైన పోలీసు వెరిఫికేషన్ లేకుండా నియమించుకోకూడదని తెలిపారు. పబ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం, పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. కస్టమర్లు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పబ్, వైన్‌షాప్ బయట స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్‌తో పాటు సీపీ ఫోన్ నెంబర్ 7995095799 స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. -
ఉత్సాహంగా పీసా రన్
ఏయూక్యాంపస్ : పీసా మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో 10 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి తెన్నేటి పార్క్ వరకు.. అక్కడ నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ పరుగు పోటీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమాన్ని ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడా కారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్త శేఖర్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలు ఇలా.. పురుషుల్లో మహారాష్ట్రకు చెందిన అతుల్ చిత్తోడ్ (34:54.15), సూరజ్ మాషి (34:54.86), మనోజ్ హిలిన్ (35:00.56) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. మహిళల విభాగంలో రాజస్థాన్‌కు చెందిన రాజకుమార్ (43:15.14), జార్ఖండ్‌కు చెందిన హీరా సంఘ (45:18.14), హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రియా (45:18.14) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎస్వో జూన్ గ్యాలయిట్, పంచాయతీరాజ్ అధికారులు, వైజాగ్ వలంటీర్లు పాల్గొన్నారు. -
ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు చర్యలు
ఆరిలోవ: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు తెలిపారు. మంగళవారం ఇందిరాగాంధీ జూ పార్కులో అటవీశాఖ, ట్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల వలలకు చిక్కి తాబేళ్లు మరణించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఇవి గుడ్లు పెట్టే కాలం కావడంతో నిఘా పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లో 73 హెచరీలు ఉన్నాయని, గత ఏడాది సుమారు 6.80 లక్షల గుడ్లు పొదిగించగా, వాటి నుంచి వచ్చిన 2.40 లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల సమీపంలో మిగిలిపోయిన ఆహారాన్ని బయట పడేయడం వల్ల కోతులు, చిరుతలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయని, ఇది ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని చలపతిరావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడిని అరికట్టేందుకు కుంకీ ఏనుగులను తీసుకువస్తున్నామని, మరో మూడు నెలల్లో గుచ్చిమి వద్ద కుంకీ ఏనుగుల క్యాంపును ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే గ్రామాల్లో కోతుల బెడదను నియంత్రించడానికి ‘హనుమాన్’ కార్యక్రమం చేపడుతున్నామని, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ జాతీయ రహదారిపైకి కంబాలకొండ నుంచి వన్యప్రాణులు రాకుండా రెండు కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విశాఖ సర్కిల్ సీఎఫ్ బి.ఎం దివాన్ మైథీన్, జూ క్యూరేటర్ బి.మంగమ్మ, వివిధ జిల్లాల డీఎఫ్‌వోలు రవీంద్రభీమా, వెంకటేష్, ప్రసన్న, కొండలరావు పాల్గొన్నారు.ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు -
జూలో నెమళ్ల ఎన్‌క్లోజర్ ప్రారంభం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన నెమళ్ల ఎన్క్లోజర్ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు మంగళవారం ప్రారంభించారు. ఆలివ్ రిడ్లే తాబేళ్లపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, అడిషనల్ పీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియ పాండే, సీఎఫ్ మైధీన్లతో కలిసి ఈ ఎన్క్లోజర్ను సందర్శించి నెమళ్లను లోపలికి విడిచారు. ప్రస్తుతం ఈ ఎన్‌క్లోజర్‌లో పిల్లలతో కలిపి మొత్తం 40 నెమళ్లను ఉంచినట్లు జూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ జూలోని వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జూ క్యూరేటర్ జి. మంగమ్మ మాట్లాడుతూ.. జంతు దత్తత కార్యక్రమంలో భాగంగా ఇషాన్వి, మనస్వి అనే వ్యక్తులు ఇక్కడి 15 నెమళ్లను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఏపీలో తగ్గిన హెచ్ఐవీ కేసులు
మహారాణిపేట: ఏపీలో పదేళ్లుగా హెచ్ఐవీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంపై శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కేజీహెచ్లను సందర్శించిన కమిటీ ప్రజారోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే అవగాహన పెరగడం వల్లే కేసుల సంఖ్య తగ్గిందని సరైన మందులు వాడితే బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. పీజీ వైద్య విద్యార్థులు ప్రభుత్వ కోటా కింద ప్రయోజనాలు పొందితే నిబంధనల ప్రకారం పదేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో , ప్రభుత్వ సేవలో తప్పనిసరిగా పనిచేయాలని లేనిపక్షంలో సర్టిఫికెట్ల రద్దుతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి శ్రీ, కన్నా లక్ష్మీనారాయణ, ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ కె.పద్మావతి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.వీ.ఎస్.ఎం.సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీపై అవగాహన అవసరం: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని తోట త్రిమూర్తులు సూచించారు. మంగళవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ రిబ్బన్ క్లబ్‌లు, యూత్ క్లబ్బులు, కళాజాత బృందాల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ పరిస్థితులను డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు కమిటీకి వివరించారు. -
గో మాంసం పూడ్చివేతపై గొల్లలపాలెంలో ఉద్రిక్తత
తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం శ్రీమిత్రా మైరెన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో సీజ్ చేసిన 189 టన్నుల గో మాంసాన్ని.. కుసులవాడ పంచాయతీ గొల్లలపాలెం శివారులో పూడ్చిపెట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, తొమురోతు సత్యనారాయణల ఆధ్వర్యంలో మంగళవారం పంచాయతీ రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. సోమవారం కొండవాలు ప్రాంతంలో రహస్యంగా తవ్విన ఐదు అడుగుల గోతుల్లో ఇప్పటికే ఒకచోట మాంసాన్ని పూడ్చిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పంచాయతీలో అయితే మాంసాన్ని సీజ్ చేశారో అక్కడే పూడ్చాలి తప్ప, తమ గ్రామంలో వేయడానికి వీల్లేదని వారు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బెదిరించే ప్రయత్నం చేయగా, చివరకు మరింత లోతుగా గోతులు తవ్వి పూడ్చేలా అధికారులు హామీ ఇచ్చి గ్రామస్తులను ఒప్పించారు. కుసులవాడ పంచాయతీలో నాలుగు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నా, అభివృద్ధి పనులకు మాత్రం అధికారులు ఈ గ్రామాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని షిణగం దామోదరరావు విమర్శించారు. కేవలం కాలుష్య కారక పనులకు మాత్రమే తమ పంచాయతీ అధికారులు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జీవీఎంసీ డంపింగ్ యార్డు, మైనింగ్ వంటి అంశాల్లోనూ కుసులవాడనే లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు గో మాంసం పూడ్చడానికి కూడా తమ ప్రాంతాన్నే ఎంచుకోవడం దారుణమన్నారు. దిబ్బపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరం దాటుకుని ఇక్కడికి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం తమ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పంచాయతీ పాలకవర్గం, రెవెన్యూ అధికారుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయం మరోవైపు ఈ ఘటనపై టీడీపీ నాయకులు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు షిణగం దామోదరరావు ఆరోపించారు. స్థానికులు చేస్తున్న ఈ ఆందోళనను కేవలం వైఎస్సార్సీపీ కార్యక్రమంగా ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. కొండపై పశువులు మేపుకునే వారు ఈ మాంసం పూడ్చివేత వల్ల భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ప్రజల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది గైర్హాజరై కేవలం పోలీసులతో బలవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
(7వ పేజీ తరువాయి)మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్‌లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ విజేతగా నిలవగా, రన్నర్ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్‌గా విజేతగా నిలవగా, రన్నర్‌గా మధ్యప్రదేశ్ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి. ● ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్ మెడల్, రాజస్థాన్‌కు చెందిన బద్రీ లాల్ మీనా సిల్వర్ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్ మెడల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ● సాయంత్రం క్రికెట్ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
పూర్ణామార్కెట్‌లో 16 దుకాణాలు దగ్ధం
రూ.50 లక్షలు ఆస్తి నష్టంజగదాంబ: పూర్ణామార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరిగింది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మార్కెట్లోని సెంటర్ పాయింట్ వద్ద ఉన్న పూజాసామగ్రి దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న వ్యక్తులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. క్రిస్మస్, జనవరి 1వ తేదీ నేపథ్యంలో వ్యాపారులు భారీగా సరుకులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం జరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సంఘటన అర్ధరాత్రి సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, వన్‌టౌన్ సీఐ పూడి వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వాసుపల్లి పరామర్శ దుకాణాలు దగ్ధమైన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వెంటనే పూర్ణామార్కెట్‌కు చేరుకుని పరిశీలించారు. సంబంధిత దుకాణ యాజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రమాద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరుతామని తెలిపారు. వాసుపల్లి వెంట వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి తదితరులు ఉన్నారు. వారి పనేనా.. పూర్ణామార్కెట్‌లో సెంటర్ పాయింట్ దరి గతంలో పండ్ల మార్కెట్ ఉండేది. తరువాత పండ్ల మార్కెట్ పాతబస్టాండ్ వద్దకు మార్చడంతో సుమారు 50 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. వీటి పక్కనే పూజాసామగ్రి దుకాణాలు ఉండడంతో గంజాయి మత్తులో యువకులు మంటలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో మత్తులో యువకులు చెలరేగిపోయి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్టు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా పీసా మహోత్సవ్
మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, (మిగతా 8లో) -
విశాఖ బ్రాండ్ ఖతమ్
కొమ్మాది: చంద్రబా బు ప్రభుత్వంలో విశాఖ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. లక్షల కిలోల గోమాంసం అక్రమ రవాణా, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా జూదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, డ్రగ్స్ సరఫరా వంటి ఘటనలు విశాఖకు అప్రతిష్టను తెచ్చి పెడుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో జరుగుతున్న ఈ వికృత చేష్టలకు స్థానిక పోలీసుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆనందపురంలో శివారులో శ్రీమిత్ర మైరెన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం లభించింది. నెలల తరబడి ఈ వ్యవహారాన్ని నాన్చిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నేత పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకముందే భీమిలి బీచ్‌రోడ్డు కె.నగరపాలెం కూడలి సమీపంలో పాత గోకార్టింగ్ వద్ద గల ఓ ప్రైవేటు రిసార్టులో పేకాట స్థావరం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 21వ తేదీన ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఇక్కడ వనసమారాధన పేరుతో భారీ స్థాయిలో పేకాట నిర్వహించారు. బయటకు పిక్నిక్గా చెప్పినప్పటికీ.. లోపల మాత్రం భారీ స్థాయిలో జూదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ నేతలే అధికంగా పాల్గొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ పెద్ద ఎత్తున జూదం నిర్వహించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో డబ్బు లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో పేకాట జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజే రూ.1.85 కోట్లు జూదంలో చేతులు మారినట్టు సమాచారం. ఇంతజరిగినా పోలీసులు అటుగా కన్నెత్తి కూడా చూడలేదు. నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్లు ఉపయోగించి మందుబాబులను పట్టుకుంటున్న పోలీసులు.. ఈ పేకాట డెన్ జోలికి ఎందుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖను మద్యం, జూదానికి హబ్‌గా, గోమాంసం విక్రయాలకు కేంద్రంగా మార్చేశారని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.సామాన్యులపై కేసు నమోదు ఆదివారం జరిగిన భారీ బహిరంగ జూదంపై పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ జూదంలో టీడీపీ నేతలు పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పాల్గొన్నట్లు స్పష్టంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. వారిని వదిలి సామాన్యులపై మాత్రమే కేసులు నమోదు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. స్థానిక పోలీసులకు నెలవారి మామూళ్లు అందడంతోనే ఈ పేకాట డెన్ వైపు కన్నెత్తి చూడలేదని తెలిసింది. నగరంలో పెట్రోల్ బంక్‌లు నిర్వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేత ఈ పేకాట డెన్ నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు అందగా.. భీమిలి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఈ పేకాట ఆడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. -
లంకను
ఊదేశారుఅదే జోరు..ఎక్కడ తడబడలేదు..బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో మన అమ్మాయిలు అదరగొట్టారు. విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ–20లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు కేవలం 128 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరగానే అవుటైనప్పటికీ, షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత్ సునాయస విజయం సాధించింది. భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే గ్యాలరీల్లోని అభిమానులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. –విశాఖ స్పోర్ట్స్ -
బ్రహ్మాస్త్రం
● కన్నుకుట్టి కుతంత్రం.. కుంటిసాకుతో అడ్డంకులు చిరుద్యోగిపైవీఎంఆర్డీఏలో రాజకీయాలకు చిరుద్యోగి బలి వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమానికి ముందస్తు అనుమతులున్నా రద్దు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు చిల్డ్రన్స్ ఎరీనాలో చేరికల సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆర్ఐపై వేటు వై.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలువిశాఖ సిటీ : వీఎంఆర్డీఏ అధికారుల రాజకీయాలకు ఒక చిరుద్యోగిని బలి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి నిబంధనల్లో డొంకలు వెతుకుతూ ఆర్ఐపై వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉండడం అధికార పార్టీకి కన్నుకుట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ముందస్తుగా చేసుకున్న బుకింగ్‌ను కూడా రద్దు చేయించింది. దీనికి అధికారులతో చెప్పించిన కుంటి సాకు దుమారం రేపుతోంది. అంతటితో ఆగకుండా ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించడం ఇప్పుడు సంస్థలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలకు కింది స్థాయి సిబ్బందిని బలి చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఏడాదిన్నరలోనే వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల్లో కోత.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. స్టీల్‌ప్లాంట్‌లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నా పట్టించుకోకపోవడం.. విశాఖలో విలువైన భూములను ఊరూపేరు లేని బోగస్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడం.. ఇలా చంద్రబాబు వరుస నిర్ణయాల పట్ల ప్రజలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ఆ పార్టీల నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నేతలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 1400 మంది వైఎస్సార్సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ పార్టీ ఈ చేరికలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన చేరికల కార్యక్రమం కోసం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాను ముందస్తుగా ఆ పార్టీ నేతలు బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రుసుము కూడా చెల్లించారు. ముందస్తు బుకింగ్ ఉన్నప్పటికీ.. వైఎస్సార్సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు సర్కార్ అధికార బలాన్ని ప్రదర్శించింది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వీఎంఆర్డీఏ అధికారులపై ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక కుంటి సాకులతో చేరికల కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. ఉదయం 10.30 గంటలకు చిల్డ్రన్స్ ఎరీనా కార్యక్రమం ఉండడంతో ఈలోగానే సిబ్బందితో గేటుకు తాళం వేయించారు. చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వాటిని తొలగించారు. అంతేకాకుండా చిల్డ్రన్స్ ఎరీనా హాల్లో ఆకస్మాత్తుగా ఏసీ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక పథకం ప్రకారమే తమ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చిల్డ్రన్స్ ఎరీనా గేటు ముందే బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. అనంతరం అక్కడే సుమారు 1,400 మందిని పార్టీలో చేర్చుకున్నారు. -
● స్నోయగాల నగరి
నీలి సముద్రపు అంచులపై తెల్లని మంచు తెరలు పరచుకుని, సాగర కన్య ముసుగు వేసుకున్నట్లుగా విశాఖ తీరం ఒక అందమైన కావ్యంలా మెరిసిపోతోంది. సాగరనగరిని ముంచెత్తుతున్న పొగమంచు సోయగాలు ఒకవైపు ప్రకృతి ప్రేమికులకు కేరింతలు పుట్టిస్తుంటే, మరోవైపు జిల్లా వ్యాప్తంగా విసురుతున్న చలి పంజా సామాన్యులను వణికిస్తోంది. ఎముకలు కొరికే గాలి, వెన్నులో వణుకు పుట్టించే చల్లదనం వెచ్చని దుప్పటిని వీడనీయడం లేదు. బారెడు పొద్దెక్కినా మంచు వీడక, బయటకు అడుగు పెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకా?
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 99 వినతులు అందాయి. శాఖల వారీగా చూస్తే పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి అత్యధికంగా 42 ఫిర్యాదులు రాగా, ఇంజనీరింగ్‌కు 22, రెవెన్యూకు 12, అడ్మినిస్ట్రేషన్‌కు 9, యూసీడీ విభాగానికి 7 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమస్యలను అదే రోజు పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, బాధితులు ప్రతి వారం ఒకే సమస్యపై కార్యాలయానికి రాకుండా చూడాలని జోనల్ కమిషనర్లకు, విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో నగరంలో రోడ్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జీవీఎంసీ పరిధిలోని సుమారు 88.3 కిలోమీటర్ల ప్రధాన రహదారులను పదేళ్ల పాటు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు మేయర్‌కు వినతిపత్రం అందజేశారు. మధురవాడ, ఎంవీపీ, గాజువాక వంటి కీలక ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ రూ. 306 కోట్లు చెల్లించడం భారీ కుంభకోణమని ఆయన ఆరోపించారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే కాకుండా, అడ్వర్టైజ్మెంట్లు, పార్కింగ్ ఫీజుల పేరిట సామాన్యులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన సంస్థలకు భారీగా కమీషన్లు చెల్లించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ విధానం వల్ల జీవీఎంసీ తన ఉనికిని కోల్పోయి ప్రైవేట్ కార్పొరేషన్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట
మహారాణిపేట: వినియోగదారులు హక్కులను ఆయుధాలుగా మలుచుకొని మోసాలకు అడ్డుకట్ట వేయాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రూపొందించిన ‘మేలుకో.. హక్కులు తెలుసుకో’ అందరి చుట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. చైతన్యవంతమైన వినియోగదారులే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.భాస్కరరావు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్(నెహ్రౌ యువ కేంద్రం) డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వరావు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, కన్స్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి కె.సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత రామపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
అదే అక్కసు
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింత సోమవారం ఉదయం ఎరీనా గేట్‌కు తాళం వేసిన పోలీసులు గేటు ముందే బైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలు అక్కడే వైఎస్సార్ సీపీలో 1,400 మంది చేరిక సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు సర్కార్ అధికారులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీపై కుట్రలు చేస్తోంది. నేరుగా ఎదుర్కొనలేక తెర వెనుక కుతంత్రాలకు తెర తీస్తోంది. సోమవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోంది. ఈ కార్యక్రమం కోసం వైఎస్సార్సీపీ నేతలు ముందుగానే వీఎంఆర్డీఏకి రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వద్దకు సోమవారం ఉదయం చేరుకున్నారు. వైఎస్సార్సీపీలో భారీ చేరికలని తెలుసుకొన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతి లేదంటూ పోలీసుల అండతో చిల్డ్రన్స్ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించింది. ఈ ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యనేతలు చిల్డ్రన్ ఎరీనా గేటు వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. అక్కడ నుంచి సిరిపురం సర్కిల్ వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు చిల్డ్రన్స్ ఎరీనా గేటు వద్ద ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో కొత్తపల్లి రవిరాజు వర్మ, బొడ్డూరి వాసుదేవరావు, రాయపల్లి ప్రకాష్, రాయపల్లి రాజారావు, వి.వి.రామారావు, పొలిమాటి అశోక్‌కుమార్, పొలిమాటి నవీన్, దాకే రమేష్‌బాబు, దాకే వినూత్న, కొత్తపల్లి వీరస్వామి, గుర్ల కిరణ్‌కుమార్, డి.ఆకాంక్షతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్సకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ఆనంద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పథకాలు పొందిన తామంతా.. గత ఎన్నికల్లో కూటమి పార్టీల అబద్దాలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామన్నారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వైఎస్సార్సీపీలో చేరామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్‌కుమార్ రాజు, పార్టీ ముఖ్య నాయకులు అల్లంపల్లి రాజబాబు, పీపీ నారాయణ, చొక్కర శేఖర్, ఎం.సునీల్, బెవర జగదీష్, పీతల వాసు, కనక ఈశ్వరరావు, శివారెడ్డి, సీహెచ్ నాగేశ్వరరావు, ఎం.ప్రదీప్, పోతిన హరికృష్ణ, నూకరాజు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లలను ఆదుకోవాలి
కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పలువురు తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు విన్నవించారు. విశాఖలో సుమారు 33 మంది పిల్లలు ఈ జబ్బు కారణంగా ఎదుగుదల లేక, కనీసం భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినప్పటి నుంచి ఏ పనీ చేసుకోలేక మంచానికే పరిమితమైన తమ బిడ్డలకు అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. చదువుకు దూరమై, రక్త పరీక్షలు చేయించుకోవడం కూడా భారంగా మారిన తమ పిల్లల దీనస్థితిని గమనించి, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. -
వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వడమే కాకుండా, బాధితులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 377 వినతులు అందగా అందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 121, రెవెన్యూ విభాగానికి 106 ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖకు 34 వినతులు రాగా, ఇతర శాఖలకు కలిపి 116 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో పాటు ఇంచార్జి డీఆర్వో సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఏసీపీ ధనుంజయ రెడ్డి , వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. -
పిక్నిక్ పేరుతో జూదం
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డులో ఆదివారం పిక్నిక్ పేరుతో భారీ ఎత్తున పేకాట శిబిరం నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. కే నగరపాలెం సమీపంలోని పాత గోకార్టింగ్ ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జూద క్రీడలో పాల్గొన్నట్లు సమాచారం. బయటకు వినోద కార్యక్రమంగా కనిపించేలా భారీ షామియానాలు వేసి, లోపల రహస్యంగా లక్షలాది రూపాయలతో పేకాట సాగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా పోలీసులు అటువైపు రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ శిబిరం నిర్వహించారని, పోలీసుల జోక్యం లేకుండా ఆయనే చూసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నగరంలో అక్రమ మద్యం, జూదంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ప్రకటిస్తున్నప్పటికీ, అధికార పార్టీ నేతల విషయంలో నిబంధనలు అమలు కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు. మన మిత్ర యాప్ నంబరు 9552300009, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples. ap. gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్స్ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్‌ను ప్రింట్ తీసుకోవడం, ఫోన్లో చూపించడం ద్వారా స్కాన్ చేయించుకుని భక్తులు వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రసాదాల కొనుగోలుకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటికే 315 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనం చేసుకోగా, 74 మంది భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రసాదాలను పొందినట్లు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, సేవలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందన్నారు. -
ఇక ఆన్లైన్లోనే సర్వే సర్టిఫికెట్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించిన సర్వే సర్టిఫికెట్లను ఇకపై ఆన్లైన్ ద్వారానే సులభంగా పొందవచ్చని మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ఆయన ఈ నూతన ఆన్లైన్ అప్లికేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, పారదర్శక విధానంలో వారం రోజుల్లోనే సర్టిఫికెట్ పొందేందుకు ఈ వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో కూడా నేరుగా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, దీనిపై సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. పౌరులు అధికారిక జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలతో ప్రవేశించి, లేదా కొత్త వినియోగదారులుగా నమోదు చేసుకుని, సర్వేయర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. www.gvmc.gov.in వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత, citizen services-e- Request- Surveyor Certificate విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తుదారుడి వివరాలు, ఆస్తి వివరాలు నమోదు చేసి, అవసరమైన సహాయ పత్రాలు అప్లోడ్ చేస్తూ ఆన్లైన్ నమోదు ఫారమ్ పూరించాలి. దరఖాస్తు అందజేసిన వెంటనే, దరఖాస్తు స్థితిని అనుసరించేందుకు ప్రత్యేక రిఫరెన్స్ నంబరు కనిపిస్తుంది. ఎంచుకున్న జోన్ ఆధారంగా దరఖాస్తు సంబంధిత టౌన్ సర్వేయర్‌కు వెళుతుంది. టౌన్ సర్వేయర్ సమర్పించిన వివరాలు, పత్రాలు పరిశీలించి సంబంధిత ప్రక్రియ జరుపుతారు. టౌన్ సర్వేయర్ ఆమోదించిన అనంతరం, దరఖాస్తు ఎస్టేట్ అధికారికి తుది పరిశీలనకు పంపుతారు. ఎస్టేట్ అధికారి ఆమోదించిన తర్వాత, issued surveyor certificate విభాగంలో సర్వేయర్ సర్టిఫికెట్ రూపొందుతుంది. అక్కడ నుంచి డౌన్లోడు చేసుకోవచ్చు. -
రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం!
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట దళారుల దగ సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్ పరిధిలో రైల్వే ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానంలో ఇప్పిస్తామంటూ దళారులు గాలం వేస్తున్నారు. ప్రస్తుతం గేట్మెన్, పెట్రోలింగ్ విభాగంలో థర్డ్ పార్టీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారంటూ నిరుద్యోగులకు నమ్మబలుకుతున్నారు. ఈ పోస్టుల్లో చేరిన తర్వాత భవిష్యత్తులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టుల భర్తీ అయితే.. పని అనుభవాన్ని బట్టి.. ఉద్యోగం పొందవచ్చంటూ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నిరుద్యోగులను దళారులు టార్గెట్ చేశారు. ఏ పోస్టుకై నా రూ.2 లక్షలు చెల్లిస్తే చాలనీ.. మిగిలిందంతా తాము చూసుకుంటామంటూ ఎరవేస్తున్నారు. థర్డ్ పార్టీ ద్వారా అవుట్ సోర్సింగ్‌లో చేరినా రూ.40 నుంచి రూ.50 వేలకు పైగా జీతం వస్తుందని చెబుతున్నారు. ప్రతి ఏటా రెన్యువల్ అవుతుంటుందనీ.. అప్పుడు రూ.50 వేలు లేదా రూ.లక్ష చెల్లిస్తే చాలనీ.. మళ్లీ మరో ఏడాది పాటు ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండబోదని చెబుతున్నారు. ఉద్యోగుల పేరుతో మోసాలు..! తమకు వాల్తేరు రైల్వే డివిజన్లో ఉన్నతాధికారులు తెలుసు అంటూ ఈ దళారులు నమ్మిస్తున్నారు. వారితో మాట్లాడించినట్లుగా చూపిస్తూ దందాకు తెర తీస్తున్నారు. అయితే.. కొందరు ఉద్యోగులు మాత్రం దళారీ ఫోన్ చేసినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీస్తున్నారనీ చెప్పి కొంత మేర కమీషన్ ముట్టేలా బేరసారాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా దళారుల నుంచి ఫోన్ రాగానే.. మాటామాటా కలిపి పోస్టులు భర్తీ వేగంగా జరుగుతోందనీ.. త్వరగా మీ వాళ్లెవరైనా ఉంటే.. మాట్లాడుకోవాలని చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా రైల్వే ఉద్యోగులే చెబుతున్నప్పుడు, ఈ పోస్టులు నిజమేనని భావించిన నిరుద్యోగులు దళారీల చేతుల్లో డబ్బులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది నుంచి వసూలు చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలోనూ ఇప్పుడిప్పుడే ఈ తరహా మోసాలు మొదలయ్యాయని తెలుస్తోంది. డివిజన్ అధికారులూ స్పందించరా.. ఈ విషయం వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులకు తెలిసినా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులు మోసానికి గురవుతున్నా స్పందించడం లేదు. వాస్తవానికి డివిజన్లో థర్డ్ పార్టీ ద్వారా హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, డేటాఎంట్రీ పోస్టుల భర్తీకి మాత్రమే ఇటీవల టెండర్లు పిలిచారు. ఏడాది కాలం ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. కానీ గేట్మెన్, పెట్రోలింగ్ పోస్టులకు ఎలాంటి టెండర్లు పిలవకపోయినా.. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుంటూ కొందరు దళారులు రూ.లక్షలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా డివిజన్ అధికారులు ఈ పోస్టుల భర్తీపై పారదర్శకంగా వ్యవహరించి.. సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ‘రండి బాబూ.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. కేంద్ర ప్రభుత్వ కొలువులిస్తాం. పోటీ ఎక్కువగా ఉంది. అవుట్ సోర్సింగ్ అయినా.. అదిరిపోయే ఉద్యోగం. కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించండి.. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందండి..’ అంటూ నిరుద్యోగులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఈ తరహా కొత్త మోసం మొదలైంది. -
పింఛన్ కోసం దివ్యాంగుడి తల్లి ఆవేదన
తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని పూర్ణామార్కెట్ ఏరియాకు చెందిన రామలక్ష్మి జాయింట్ కలెక్టర్‌ను వేడుకుంది. చిన్న వయసులోనే కుమారుడు సతీష్ పక్షవాతానికి గురికావడంతో అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో మంచానికే పరిమితమైన కుమారుడిని పోషించడం తమకు భారంగా మారిందని, ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, ఇప్పటికై నా మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. -
పాలిటెక్నిక్ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ కేవీ రమణ
మురళీనగర్: కంచరపాలెం (విశాఖపట్నం) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణను నియమిస్తూ రాష్ట్ర సాంకేతిక శాఖ డైరెక్టర్ జి. గణేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణరావు బదిలీ కావడంతో, తొలుత మెటలర్జీ విభాగం హెడ్ డాక్టర్ కె. రత్నకుమార్‌ను ఈ బాధ్యతల్లో నియమించారు. అయితే తాజాగా అనూహ్య పరిణామాల మధ్య డాక్టర్ కేవీ రమణకు ఈ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాల పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి సాంకేతిక విద్యా శాఖ ఇన్చార్జి సెక్రటరీగా డిప్యుటేషన్‌పై వెళ్లడంతో కొంతకాలంగా ఈ కళాశాల ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ఈ పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రభుత్వం చివరికి కేవీ రమణను నియమించడంతో ఆ ప్రయత్నాలకు తెరపడింది. -
అంధకారంలో కలెక్టరేట్
మహారాణిపేట: నగరంలోని కీలక ప్రభుత్వ విభాగాల్లో వరుసగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేజీహెచ్‌లో అంధకారం నెలకొనగా, సోమవారం జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర సేవలు అందాల్సిన ఆస్పత్రిలోనూ, పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్లోనూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, పనుల కోసం వచ్చిన సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కీలక కార్యాలయాల్లో బ్యాకప్ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విద్యుత్ అంతరాయం కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 11:30 గంటల నుంచి విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడటంతో అధికారులు, సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సిబ్బంది కారణాలను వెతుకుతున్న సమయంలోనే సమావేశ మందిరం బయట ఉన్న విద్యుత్ మీటర్ల వద్ద పెద్ద శబ్దం రావడంతో పాటు ఎంసీబీ ప్లాట్లు, సాకెట్లు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్ మొత్తం అంధకారంగా మారింది. కంప్యూటర్లు, ఏసీలు, లైట్లు అన్నీ నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ వెలుగుల్లో అర్జీలను జేసీ మయూర్ అశోక్ స్వీకరించారు. అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ దరఖాస్తుదారులతో మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు. -
నేటి నుంచి పీసా మహోత్సవ్
సీతంపేట: పీసా(పీఈఎస్ఏ–ది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. పది రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు విచ్చేస్తున్నారని, వారి భాగస్వామ్యంతో కబడ్డీ, ఆర్చరీ పోటీలు, గిరిజన సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సోమవారం పోర్టు స్టేడియంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో 10కె పీసా రన్ జరుగుతుందని, అనంతరం 9 గంటలకు పోర్టు ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు. 10 గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్ల ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు జరుగుతాయని వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి క్రీడాకారులు, అధికారులు, గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడాపోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 24వ తేదీ 11 గంటల నుంచి కళావాణి స్టేడియంలో వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో కూడిన స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా పీసా మహోత్సవ్ మస్కట్ కృష్ణ జింక, పీసా రన్ టీషర్టులను ఆవిష్కరించడంతో పాటు, మహోత్సవ్ బెలూన్ను ఎగుర వేశారు. -
ఆన్లైన్లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయని ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. భక్తులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www. ap temples.ap.gov.in వెబ్సైట్, 95523 00009 వాట్సాప్ నంబరు ద్వారా రూ.100, రూ.300, రూ.500 టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరి దర్శనం ముగిసిన తర్వాతే కౌంటర్లలో టికెట్ల విక్రయం జరుపుతామన్నారు. దర్శనవేళల్లో మార్పులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు ఈనెల 29 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు లభించవని, భక్తులంతా ఈవిషయాన్ని గమనించాలని సింహాచలం దేవస్థానం ఇచచార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసం పూజల్లో భాగంగా ఈ మార్పు చేసినట్టు తెలిపారు. -
వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట: మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి శ్రీ, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణ చట్టం 2017 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును, ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మందుల పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, గృహ వసతి, బీమా వంటి సౌకర్యాలపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన అంశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావాలని, నిబంధనల అమలులో జాప్యం జరిగితే వెంటనే సరిదిద్దాలని చైర్మన్ అధికారులకు సూచించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పురోగతిపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య విద్యా విభాగం పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే.నీలకంఠరెడ్డి, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్డాక్టర్ పద్మావతి, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 120 ఫిర్యాదులు
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 120 ఫిర్యాదు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. -
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు
బీచ్‌రోడ్డు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహమాన్, సీపీఎం నేత పి.మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించడం వల్ల ఈ పథకం నిర్వీర్యమవుతుందని, దీనివల్ల రాష్ట్రంపై ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కోత వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, గ్రామాల నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర కూటమిలో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో మౌనం వీడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని నేతలు విమర్శించారు. దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు, చేతివృత్తిదారులకు జీవనోపాధిని కల్పిస్తూ చట్టబద్ధమైన హక్కుగా ఉన్న ఈ పథకాన్ని పేరు మార్పులు, నిధుల కోతలతో నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. పథకాన్ని రద్దు చేసి కొత్తగా తీసుకువచ్చిన జీరాంజీ పథకం కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఉందని, ఇది గ్రామీణ పేదలను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, సీపీఎం జిల్లా నాయకుడు ఎం కష్ణారావు, సీపీఐఎంఎల్ ప్రజా పోరు నాయకుడు కె.దేవా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, ఎం.మన్మథరావు, ఎన్.నాగభూషణం, కె.వనజాక్షి, సీఎన్ క్షేత్రపాల్, జి.రాంబాబు, పి.సూర్య కుమారి, జి.జయ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ నిలిచిపోవడంతో వీధిన పడ్డాం
గత జగనన్న ప్రభుత్వ హయాంలో నెలకు రూ.3 వేలు పింఛన్ వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నిలిపివేయడం వల్ల తమ కుటుంబం వీధిన పడిందని మద్దిలపాలెం మంగాపురం కాలనీకి చెందిన ఆత్మకూరు జయలక్ష్మి, కుమారుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శ్రీనివాస్ పక్షవాతంతో మంచం పట్టాడని, కుమారుడు ట్రై సైకిల్‌పై ఆధారపడి జీవిస్తున్నాడని పేర్కొన్నారు. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదో అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు. తక్షణమే పింఛన్ పునరుద్ధరించి, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాగరాజు విజ్ఞప్తి చేశాడు. -
అణగదొక్కాలని చూస్తే రెట్టింపు స్పీడ్‌తో ఎదుగుతాం..
చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, పార్టీని అణగదొక్కాలని అనుకుంటే.. గొడకు కొట్టిన బంతిలా అంతకు రెట్టింపు స్పీడ్‌తో ఎదుగుతామని వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఎదురు తిరిగారని, రానున్న కాలంలో ఆ పార్టీలను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి, తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. వీఎంఆర్డీఏ అధికారులు, పోలీసులు టీడీపీ కార్యకర్తలా కాకుండా నిబంధనల లోబడి పనిచేయాలని హితవు పలికారు. -
23 నుంచి ‘పీసా’ మహోత్సవాలు
మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: నగరంలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రతిష్టాత్మక పీసా మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోర్ట్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలకు 10 రాష్ట్రాల గిరిజన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో 10కే రన్‌తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత తగ్గడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కాలుష్య నివారణకు కఠిన నిబంధనలు జారీ చేశారు. చెత్త తగులబెట్టడం, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వంటి పనులకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఫ్యాక్టరీల్లో పొగ నియంత్రణ, పాత వాహనాల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని, విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. -
డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు
అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నగర సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, కూర్గ్, పశ్చిమ గోదావరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి టెలిగ్రామ్ చానల్ ద్వారా వివిధ వ్యక్తుల నుంచి కరెంట్ అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులు పెద్ద రుషికొండలోని ఒక ప్రైవేట్ హోటల్లో గదులు తీసుకొని అక్కడి నుంచే బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఆ హోటల్‌పై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున డెబిట్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి సిద్ధం చేసుకున్న వివిధ సంస్థల రబ్బర్ స్టాంపులు, క్యూఆర్ కోడ్ స్కానర్లు, సిమ్ కార్డులు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఎన్.వినోద్‌కుమార్, పరసురామ సదానంద అలియాస్ పవన్, సలీమ్ కె.హెచ్, పాల్యం చంద్రశేఖర్, సేరు చంటి, కడలి సత్యవరపు లక్ష్మీ శ్రీనివాస్, ఓంకార్ నాథ్ ఉన్నారు. -
చుట్టమే.. దొంగ
గోపాలపట్నం: కొత్తపాలెంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 40 రోజుల పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. 13 1/2 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన దొంగలను పట్టుకున్నారు. గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్లో శనివారం జోన్–2 క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్తపాలెం, సంతోష్‌నగర్‌లో నివసిస్తున్న పెంటకోట చెల్లయ్యమ్మ(65) ఇంట్లో నవంబర్ 10న చోరీ జరిగింది. ఆమె తెల్లవారుజామున 3 గంటల సమయంలో పని మీద బయటకు వెళ్లిన విషయాన్ని గమనించి, దుండగులు ఇంట్లో చొరబడి బంగారాన్ని ఎత్తుకుపోయారు. బాధితురాలు చెల్లయ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి పర్యవేక్షణలో గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జి.తేజ ఈశ్వరరావు, పెందుర్తి క్రైమ్ ఎస్ఐ సూరిబాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టినా, తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో బాధితురాలి ఇంటి పరిసరాలను పరిశీలించి, బంధువులు, పరిచయస్తులను విచారించారు. ఈ క్రమంలో ఫిర్యాదికి దూరపు బంధువైన పీలా లతపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. గతంలో చెల్లయ్యమ్మకు, లత కుటుంబానికి ఆస్తి గొడవలు ఉన్నాయి. చెల్లయ్యమ్మ వద్ద బంగారం ఉందని గమనించిన లత, ఎలాగైనా దాన్ని కాజేయాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆర్.ఆర్.వి పురానికి చెందిన పెంటకోట బాలకృష్ణ, డొక్కర లిఖిత్ కుమార్‌లతో కలిసి చోరీకి పాల్పడింది. నిందితుల నుంచి బంగారాన్ని రికవరీ చేసి, ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారం ఎంతగానో దోహదపడ్డాయని ఏసీపీ తెలిపారు. ఇంటి విషయాలు బయటి వారికి తెలియకూడదని, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. -
ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల ప్రారంభం
అల్లిపురం: ద్వారకా బస్సు స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ డోర్ డెలివరీ మాసోత్సవాలను విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రైవేట్ సంస్థల తరహాలోనే ఆర్టీసీ కూడా 2021 సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ సదుపాయం గురించి వినియోగదారులకు విస్తృతంగా తెలియజేయడమే ఈ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. తక్కువ ధరలకే సులభంగా పార్సిళ్లను ఇంటి వద్దకే చేరవేస్తున్న ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రజారవాణా అధికారి బి. అప్పలనాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బయటపడిన శ్రీరాముడి విగ్రహం
మధురవాడ: వాంబేకాలనీ వద్ద గల సుద్దగెడ్డ సమీపంలో జరుగుతున్న వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ రోడ్డు నిర్మాణ పనుల్లో శ్రీరాముడి విగ్రహం బయటపడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలివి.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బయట వేసిన మట్టి కుప్ప నుంచి.. సుద్దగెడ్డ టిడ్కో హౌసింగ్‌కాలనీ వద్ద శుక్రవారం రాత్రి ఈ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో పశువులు వెళ్తున్న సమయంలో మట్టి జారిపడటంతో విగ్రహం కనిపించింది. దీంతో శనివారం ఉదయం స్థానికులు ఆ విగ్రహాన్ని బయటకు తీసి, శుభ్రం చేసి పూజలు ప్రారంభించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆ ప్రాంతమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీరామచంద్రుని కృప తమపై కలిగిందని, ఇదంతా ఆ స్వామి సంకల్పమేనని స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం తరలివచ్చి విగ్రహాన్ని దర్శించుకున్నారు. -
నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
మహారాణిపేట: విశాఖ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యతపై తక్షణమే స్పందించాలని సూచించారు. ఇటీవల విశాఖలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుందన్న వార్తల నేపథ్యంలో.. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయి క్వాలిటీ మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో చెత్త, వ్యర్థాలను తరలించే వాహనాలను పూర్తిగా టార్పాలిన్‌తో కప్పాలని, పరిమితికి మించి లోడ్‌తో వెళ్లరాదని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు భవన నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పనిసరిగా గ్రీన్ మ్యాట్లు కప్పాలని, కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ పారబోయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలపై నిఘా ఉంచాలని, నిబంధనలు మీరితే వాహనాలను సీజ్ చేయాలన్నారు. పరిశ్రమల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా చూడాలని, సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఇంజిన్ ఆఫ్ చేసేలా చైతన్యం తేవాలన్నారు. బస్టాపుల వద్ద ఆటోలు, బస్సులు ఎక్కువసేపు ఇంజిన్ ఆన్ చేసి ఉంచితే రవాణా, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత వాహనాలకు పొల్యూషన్ చెక్ చేయించాలని, ఆర్టీసీ బస్సుల నుంచి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల్లో కల్తీ జరగకుండా తనిఖీలు చేయాలని పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముకుందరావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డీపీవో శ్రీనివాసరావు, డీఎస్వో భాస్కరరావు, పోర్ట్ అధికారులు, హెచ్‌పీసీఎల్, కోరమండల్, ఫార్మాసిటీ ప్రతినిధులు, రెడ్‌క్రాస్, వలంటీర్స్ పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇదే..: చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (సీపీబీ), సభ్యులుగా నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్, డీటీసీ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, జిల్లాపరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఎస్ఈ ఈపీడీసీఎల్, జిల్లా పంచాయతీ అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు. -
ఇలాగైతే ఎలా పీల్చగలగాలి
విశాఖ సిటీ: విశాఖలో గాలి విషతుల్యంగా మారుతోంది. నగరంలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాదకర ధూళి కణాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతూ గాలి నాణ్యత సూచీలు నమోదవుతున్నాయి. ప్రమాదకర కాలుష్యకారక నగరాల జాబితాలో విశాఖ చేరిపోయింది. సిటీ ఆఫ్ డెస్టినీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇప్పుడిదే ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా ఈ సూచీలు విశాఖవాసులను కలవరపెడుతున్నాయి. గత 24 గంటల్లో విశాఖలో ఏక్యూఐ 313–329 మధ్య నమోదైంది. పగటి పూట కంటే అర్ధరాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, వాహనాల కారణంగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాలంలో విశాఖలో భారీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో పాటు ఐటీ సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో కాలుష్యం మరింత పెరుగుతోంది. వాస్తవానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లోనే విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొంది. కొత్తగా మరే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది. అయితే అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్న అభిప్రాయంతో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూ మళ్లీ 2013లో కాలుష్య నగరాల జాబితా నుంచి విశాఖను తొలగించారు. దీంతో మళ్లీ విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరిశ్రమల రాకతో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ.. అంతే స్థాయిలో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. కాలుష్య నివారణకు పరిశ్రమలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చలికాలంలోనే అధిక కాలుష్యం నగరానికి ఒకవైపు బంగాళాఖాతం ఉండగా.. మిగిలిన మూడు వైపులా తూర్పు కనుములు వ్యాపించి ఉన్నాయి. వీటి మధ్య సుమారు 265 కి.మీ విస్తీర్ణంలో నగరం విస్తరించి ఉంది. నగరానికి నైరుతి దిక్కున భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి 8 నెలల పాటు అంటే మార్చి నుంచి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేస్తున్నాయి. ఇక శీతాకాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్థాలు వాతావరణంలో పైకి పోలేక భూమి మీదనే కేంద్రీకృతం అవుతున్నాయి. సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో హానికర ధూళి పదార్థాలను ఉపరితల వాతావరణంలోకి వెళ్లడం లేదు. ఆందోళనకరంగా గాలి నాణ్యత ప్రస్తుతం గాలి కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాములు మించితే ప్రమాదం. కానీ పీఎం 2.5 రేణువులు శనివారం సాయంత్రం 7 గంటలకు 386గా ఉంది. పీఎం 10 రేణువులు కూడా 436 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. ఈ తరహా వాయు కాలుష్యం ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతోంది. ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. చిన్నారుల్లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం మినహా నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఆందోళనకరంగా సూచీలు విశాఖలో గాలి నాణ్యత సూచీలు(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉన్నాయి. చలికాలంలో కాలుష్య మేఘాలు ఊపిరి సలవనివ్వకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఢిల్లీతో పాటు ఏక్యూఐ 326 దాటుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఏక్యూఐ అత్యధికంగా 329గా నమోదైంది. అది శనివారం ఉదయం 8 గంటలకు 322, మధ్యాహ్నం 12 గంటలకు 313గా ఉంది. పగటి పూట కంటే రాత్రి సమయాల్లోనే కాలుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, అదే ఏక్యూఐ 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్, 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొంటారు. అయితే విశాఖలో మాత్రం ప్రతి గంటకు గాలి నాణ్యత సూచీ పెరుగుతూ పోతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఏక్యూఐ 290 దాటి అర్ధరాత్రికి 329కి చేరుకుంటోంది. అలాగే పార్టికులేట్ మేటర్(పీఎం) 10 రేణువులు ప్రమాదకర స్థాయిలో 436 చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్ ఆటో
ఆరిలోవ: రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. హనుమంతవాక జంక్షన్‌కు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. ఆరిలోవ ప్రాంతం నుంచి ఎంవీపీకాలనీ వైపు పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఒక ఆటో.. జాతీయ రహదారిపై హనుమంతవాక పాత మేకల కబేళా సమీపంలోని బస్టాప్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు చిన్నారులు భయాందోళనతో వణికిపోయారు. స్థానికులు, వాహనచోదకులు వెంటనే స్పందించి విద్యార్థులకు సపర్యలు చేసి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆటో బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గురైన ఆటోను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ఆటోలే కారణం కాగా.. బస్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి రెండు ఆటోలను వరుసగా నిలిపి ఉంచారు. దీంతో ఆరిలోవ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. బస్టాప్‌లో ఖాళీ లేకపోవడంతో ఆ ఆటోల పక్కనే రోడ్డు మధ్యలో బస్సును నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న స్కూల్ ఆటో నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొంది. బస్టాప్‌ల వద్ద ఆటోలు నిలపకుండా, దూరంగా ఆగేలా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు. -
నడకతో ఆరోగ్యం : సీపీ
బీచ్‌రోడ్డు: వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదర్శనీయులని సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కొనియాడారు. శనివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన 34వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దైనందిన జీవనంలో నడకను వ్యాయామంగా మార్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతకు ఆశ చూపి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు రూ. 300 కోట్లు దోచుకున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ డాక్టర్ కమల్ బయిద్, అధ్యక్షురాలు కె. ప్రభావతి, పూర్వ అధ్యక్షులు ఎస్.పి.రవీంద్ర, డిస్ట్రిక్ట్ గవర్నర్ కె. ద్వారాకానాఽథ్, మీడియా కన్వీనర్లు నండూరి రామకృష్ణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
నేడే ‘మహిళా’ పోరు
విశాఖస్పోర్ట్స్: భారత్– శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ–20 సిరీస్ సమరానికి తెరలేచింది. నగరంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సిరీస్‌ను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తుది జట్టులో కీలక మార్పులు చేస్తూ యువతకు అవకాశం కల్పించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా, రిచా ఘోష్ వంటి స్టార్ ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక జట్టు ఈసారి తమ యువ స్పిన్నర్లనే నమ్ముకుంది. శనివారం మైదానంలో ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్ కోసం నగర క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పట్టాభిషేకంపై గుర్రు
అతడిని మార్చాల్సిందే..! ● టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పట్టాభి నియామకంపై విమర్శలు ● వెంటనే మార్చాలంటూ చంద్రబాబుకు ఫిర్యాదులు ● సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారంటూ ఆగ్రహం ● తమను సంప్రదించకుండా నియమించడంపై ఎమ్మెల్యేలు కిన్ను ● సహకరించే ప్రసక్తే లేదని బీసీ నేతల అల్టిమేటం సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చోడె పట్టాభిరామ్ నియామకం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏం అర్హత ఉందని పట్టాభికి అధ్యక్ష పదవి కట్టబెట్టారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. బీసీలే పార్టీకి వెన్నెముక.. వారికే పార్టీలో పెద్దపీట వేస్తామంటూ ప్రతిసారి చెప్పే చంద్రబాబు, లోకేష్.. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత సామాజికవర్గానికే తప్ప.. టీడీపీలో అణగారిన వర్గాలకు పదవులివ్వరా అంటూ క్యాడర్‌లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఈ నియామకంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పట్టాభి నియామకాన్ని మార్చకపోతే.. సహకరించే ప్రసక్తే లేదంటూ బీసీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్యాడర్‌లోనూ అసహనం కీలకమైన టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి బీసీ నేత గండి బాబ్జీని తప్పించి.. తమ సామాజికవర్గానికి చెందిన చోడే పట్టాభిరామ్‌కు బాధ్యతలు అప్పగించడంపై బీసీ నేతలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. పట్టాభిని మించి.. పార్టీకి సేవలందించిన వారు ఎంతో మంది ఉన్నా.. కేవలం సొంత సామాజికవర్గం అనే కారణంతో పదవిని కట్టబెట్టడం సరికాదంటున్నారు. గతంలో పార్టీ నగర కార్యదర్శిగా వ్యవహరించినా.. పట్టాభికి పార్టీని నడిపే అనుభవం లేదనీ.. అలాంటి వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏవిధంగా సముచితమో పార్టీ అధిష్టానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో పోటీకి వెనక్కి? 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తొలుత పట్టాభిరామ్ పేరుని ప్రతిపాదించారు. ఓడిపోయే ఎన్నికల్లో డబ్బులు పెట్టి పోటీ చేయనంటూ అధిష్టానం ఆదేశాల్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఉంటూ కార్పొరేటర్‌గా పోటీచేయాలని చెప్పినా.. పట్టించుకోలేదు. దీంతో పట్టాభిరామ్‌పై జిల్లా సీనియర్ నాయకులకు సదాభిప్రాయం లేకుండా పోయింది. అయినా అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబుకి దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పట్టాభిరామ్ నియామకంపై పెదవి విరుస్తున్నారు. తమను సంప్రదించకుండానే జిల్లా అధ్యక్షుడిని నియమించడమేంటని సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. ఇలా ఎవరికీ తెలియకుండా.. కేడర్ అభిప్రాయాన్ని సేకరించకుండా.. పట్టాభిరామ్‌కు పట్టం కట్టడంపై జిల్లా పార్టీలో చిచ్చురేపుతోంది. వార్డు అధ్యక్షుల నియామకానికి పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాల్ని సేకరిస్తున్న అధిష్టానం.. జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఎందుకు గోప్యతని ప్రదర్శించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా అడగకపోవడం శోచనీయమంటున్నారు. కేవలం సామాజికవర్గాన్ని దృష్టిలోపెట్టుకొని పట్టాభిరామ్‌కు బాధ్యతలు అప్పగించడం పూర్తిగా తప్పుడు నిర్ణయమనీ.. వెంటనే నియామకాన్ని రద్దు చేసి.. బీసీ అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ పార్టీలో మొదలైంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే జిల్లా అధ్యక్షుడికి సహకరించేది లేదని క్యాడర్ అల్టిమేటం జారీ చేయడంతో పచ్చపార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
పోలీస్ కమిషనర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నుంచి అవార్డు అందుకుంటున్న సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చిఅల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ప్రతిష్టాత్మక ‘ఏబీసీడీ’ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) పురస్కారాన్ని అందుకున్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఈ అవార్డును అందజేశారు. సంచలనం సృష్టించిన లోన్ యాప్ ఫ్రాడ్ కేసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, 19 మంది అరెస్టు చేయడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా సీపీకి ఈ గౌరవం దక్కింది. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించింది. సీపీ బాగ్చీతో పాటు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు కె. భవానీప్రసాద్, బీ.ఎం.డీ. ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ ఈ. మహేశ్వరరావు, కానిస్టేబుళ్లు టి. సన్యాసినాయుడు, బి. చంద్రశేఖర్‌లు డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
ఐఈఎస్‌లో అచ్యుత సాయికి 8వ ర్యాంక్
గోపాలపట్నం: యూపీఎస్సీ విడుదల చేసిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఫలితాల్లో విశాఖ ఎన్ఏడీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న దండు అచ్యుత సాయి రామ్ రెడ్డి ఆలిండియా 8వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. 2024లో 14వ ర్యాంక్ సాధించినప్పటికీ, రైల్వే విభాగంపై ఉన్న మక్కువతో ఆయన మళ్లీ పరీక్ష రాసి ఈ ఘనత సాధించారు. తన కోరిక నెరవేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని దివంగత తల్లికి అంకితమిస్తున్నట్లు సాయి రామ్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రతిభను కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు అభినందించారు. -
ఐఐఎంవీలో ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్
సదస్సులో పాల్గొన్న ఫైనాన్స్ రంగ నిపుణులు తగరపువలస: గంభీరంలోని ఐఐఎం విశాఖ వేదికగా జరుగుతున్న 14వ ఇండియా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ రెండో రోజు కార్యక్రమాలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో దేశవిదేశాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 400 పరిశోధన పత్రాలను సమీక్షించగా.. ఫైనాన్స్, అకౌంటింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాలపై 135 పత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఎమోరీ, జార్జ్‌టౌన్, సెయింట్ లూయిస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు తరుణ్ చోర్డియా, రీనా అగర్వాల్, బిదిషా చక్రబర్తి తమ ప్రసంగాల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లలోని సరికొత్త పోకడలను వివరించారు. ఐఐఎంవీ డీన్ విజయభాస్కర్, సదస్సు కన్వీనర్ మోనికా దోచక్, కో కన్వీనర్ కావేరి కృష్ణన్, ఇండియా ఫైనాన్స్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ శంకర్షన్ బసు పాల్గొన్నారు. -
పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు
బీచ్‌రోడ్డు: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే వారికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ స్పష్టం చేశారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అలాగే ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, డీడీవోల సమక్షంలో పెన్షనర్ల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్‌ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించామని, ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరిన పత్రాలను త్వరగా పరిశీలించి బెనిఫిట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ పేజీని ప్రారంభించి, దీని ద్వారా పెన్షన్‌దారులు తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ ప్రయోజనాల మంజూరులో కొంత జాప్యం జరిగేదని, అయితే డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్ దారులు ఈ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
జీడీపీ వృద్ధిలో నిర్మాణ రంగం పాత్ర కీలకం
ఎంవీపీకాలనీ: దేశ జీడీపీ వృద్ధిలో నిర్మాణరంగం పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్ వేదికగా క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11వ ప్రాపర్టీ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ , రాష్ట్రాల వృద్ధిరేటు పెంపులో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని వివరించారు.వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడమే లక్ష్యంగా క్రెడాయ్ వంటి సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ వి. ధర్మేందర్, అధ్యక్షుడు ఇ. అశోక్‌కుమార్ మాట్లాడుతూ విశాఖలో ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఎక్స్పో ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు. ఎక్స్పో కన్వీనర్ గోవిందరాజు మాట్లాడుతూ నగరాభివృద్ధి, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ అపార్ట్మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు , వాణిజ్య స్థలాలకు సంబంధించి మొత్తం 71 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక రాయితీలు, స్పాట్ బుక్కింగ్ సౌకర్యం, సులభతరమైన చెల్లింపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్, ఎస్బీఐ విశాఖ డీజీఎం రాహుల్ సాంకృత్య, క్రెడాయ్ కార్యదర్శి వి. శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు ఎండీ కావలెను!
సాక్షి, విశాఖపట్నం : అక్రమాల పుట్టగా మారిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను గాడిలో పెట్టేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీసీఐ కోసం కొత్త ఎండీ నియామకానికి సంస్థ చైర్మన్, విశాఖపట్నం పోర్టు చైర్మన్ డా.అంగముత్తు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దుర్గేష్‌కుమార్ దూబే బదిలీ అయిన తర్వాత.. గతంలో పనిచేసిన వ్యక్తికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారి విద్యార్హతలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాలతో అధికారం సంపాదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహారంపై ‘సాక్షి’లో ‘డ్రెడ్జింగ్‌కు మళ్లీ నకిలీ బాస్.!’, ‘గోదావరి కోసం అంత తొందరేంటో.?’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై పోర్టు ఇన్చార్జ్ చైర్మన్ డా.అంగముత్తు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ తర్వాత ఎండీ పోస్టుకు సదరు అధికారి అనర్హులని గుర్తించి.. కొత్త ఎండీ నియామకం తప్పనిసరి అని భావించారు. దీనిపై బోర్డులో చర్చించిన అనంతరం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 8 వరకూ దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి నెలాఖరు నాటికి డీసీఐకి కొత్త ఎండీ వచ్చే అవకాశం ఉంది. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేధోసంపత్తి
తాటిచెట్లపాలెం: విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని, అవగాహనను పెంచడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్. ప్రేమకుమార్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రైల్వే న్యూకాలనీలోని జీవీఎంసీ హైస్కూల్ మరియు కేఎన్ఎం గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని 11 మండలాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం ఏడు సబ్ థీమ్‌ల కింద 7 ప్రాజెక్టులు, విద్యార్థుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు, ఉపాధ్యాయుల వ్యక్తిగత విభాగం నుంచి రెండు చొప్పున.. ఒక్కో మండలం నుంచి 11 ప్రాజెక్టుల వంతున మొత్తం 121 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ పోటీలలో విద్యార్థుల విభాగం నుంచి ఎస్. చైతన్య, వి. సాత్విక్, ప్రసన్న, లావణ్య, బి. కుషాలిని, పి. లావణ్య, జి. విష్ణు, బి. రామచంద్రన్, ఎస్. సాయి, ఎస్. కృష్ణతేజ, బి. శ్రీనివాస్, కే. హర్షవర్ధన్, బి. తనూజ, పి.బి. శృతి, కే. యోగి, పి. మహేష్, బి. సంధాన, బి. లాస్య ప్రతిభ కనబరిచారు. అలాగే ఉపాధ్యాయ విభాగంలో బి. సీతారాం, డి. ప్రసన్నలక్ష్మి రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో జీవీఎంసీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని ఎస్.వి. శేషుకుమారి, కేఎన్ఎం గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని డి. శాంతకుమారి, జిల్లా సైన్స్ అధికారి పి. రాజారావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వర్రావు, స్థానిక కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.కేఎన్ఎం బాలిక ఉన్నత పాఠశాలలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు -
న్యాయ విశ్వవిద్యాలయాల
బలోపేతమే లక్ష్యంసబ్బవరం: భారతదేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాలు, అమెరికన్ న్యాయ విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సిల్ సిటిజన్ సర్వీసెస్ చీఫ్ ఆడమ్ హల్ స్పష్టం చేశారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావుతో సమావేశమైన ఆయన వర్సిటీలో అమలవుతున్న పాఠ్యాంశాల అభివృద్ధి, జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత మార్పిడి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆడమ్ హల్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది, సహాయక సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులుపాల్గొన్నారు.పాల్గొన్నారు. -
కట్టిపడేస్తున్న కళారూపాలు
ఏయూక్యాంపస్: ఏయూ మైదానం ప్రస్తుతం గ్రామీణ కళా సౌరభాలతో విరాజిల్లుతోంది. అక్కడ జరుగుతున్న సరస్ డ్వాక్రా బజార్ నగరవాసులను అద్భుతమైన హస్తకళల లోకంలోకి తీసుకెళ్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటు ధర్మవరం తోలుబొమ్మలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అంకుడు కర్రను ఆకర్షణీయమైన ఆకృతులుగా మలచి, వాటికి సహజసిద్ధమైన రంగులు అద్ది ప్రాణం పోస్తున్న ఏటికొప్పాక కళాకారుల నైపుణ్యం ప్రతి బొమ్మలోనూ ప్రతిబింబిస్తోంది. ఇక్కడి విగ్రహాలు, గృహాలంకరణ వస్తువులు కేవలం వస్తువులుగా కాకుండా మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ధర్మవరం కళాకారులు తోలుపై చిత్రించిన పురాణ గాథలు, విభిన్న కళాఖండాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సంప్రదాయ కళకు కొంత ఆధునికతను జోడించి వీరు రూపొందించిన అలంకరణ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తోలుపై రంగురంగుల కలయికతో తీర్చిదిద్దిన గణపతి, గౌతమ బుద్ధుడు, రాధాకృష్ణుల చిత్రాలు వారి అకుంఠిత దీక్షకు, కళా ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. రానున్న పండుగలకు బొమ్మల కొలువు తీర్చాలన్నా లేదా ఇంటిని కళాత్మకంగా అలంకరించుకోవాలన్నా ఈ ప్రదర్శన ఒక అద్భుత వేదికగా మారింది. కుటీర పరిశ్రమల ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. గ్రామీణ హస్తకళలు నేటికీ ఎంత సజీవంగా ఉన్నాయో ఈ బజార్ నిరూపిస్తోంది. ఆకట్టుకుంటున్న హస్తకళలు -
‘ద్రోణంరాజు’ ఓ రాజకీయ యూనివర్సిటీ
బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్ర టైగర్‌గా పేరుగాంచిన ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని, నేడు పదవుల్లో ఉన్న ఎంతోమంది ఆయన శిష్యులేనని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో సిరిపురంలోని జంక్షన్‌లోని ద్రోణంరాజు సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. ద్రోణంరాజు కుమారుడు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారన్నారు. తండ్రి శ్రీనివాస్ అడుగుజాడల్లో శ్రీవత్సవ నడవడం అభినందనీయమన్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన తాతగారు చేసిన కృషి, తన తండ్రి సంపాదించిన నిష్కళంకమైన పేరు తనకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , తిప్పల దేవన్ రెడ్డి , పార్టీ నేతలు కోలా గురువులు, డాక్టర్ జహీర్ అహ్మద్, కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్, చెన్నా జానకీరామ్, బిపిన్ కుమార్ జైన్, ముమ్మన దేముడుు, ఉరుకూటి చందు, కందుల నాగరాజు, మువ్వల లక్ష్మి,, ఆర్.వెంకటరావు, పల్లా దుర్గారావు, వుడా మాజీ చైర్మన్ రవి పాల్గొన్నారు. -
సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి జీవీఎంసీ కమిషనర్ ఆదేశం
ఆరిలోవ: నగర ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ముడసర్లోవతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ముడసర్లోవ పార్కు పరిసరాలు, సాగర్ నగర్ సమీపంలోని రాడిసన్ బ్లూ ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ముడసర్లోవ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఆకర్షణీయమైన సైకిల్ ట్రాక్ నిర్మించాలని అలాగే రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సాగర్ నగర్ బీచ్ వరకు మరో ట్రాక్ ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజును ఆదేశించారు. సైకిల్ ట్రాక్ లతో పాటు బీచ్ రోడ్డులోని టీయూ 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం సమీపంలో సుమారు 75 నుంచి 100 మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం మధురవాడ ప్రాంతంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ ఏడుకొండలు ఏపీయూఐఎల్ రీజినల్ హెడ్ చేతన్, సహాయక ఇంజినీర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
విశాఖ సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఏపీఈపీడీసీఎల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్–ది పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే నినాదంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025ను మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో ఏపీఈపీడీసీఎల్ ప్రతిష్టాత్మక ‘భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జాతీయ అవార్డు’ ను సాధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోక్రియల్ నిశాంక్, పర్యావరణ–అటవీశాఖ మంత్రి శుభోద్ ఉనియల్, పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్‌ల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. ఏపీఈపీడీసీఎల్ తరఫున పీఆర్వో జి.ఎస్.ఎస్.ఎస్.వాసు ఈ అవార్డును అందుకుని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖల సహకారంతో ఈపీడీసీఎల్‌లో పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ గిరిజన న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ద్వారా విద్యుత్‌ను అందించినట్లు వెల్లడించారు. -
మత్స్యకారుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మహారాణిపేట: బంగ్లాదేశ్ జైలులో మగ్గుతున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను తక్షణం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ నేత వాసుపల్లి జానకీరామ్ డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 20న వేటకి వెళ్లి పొరపాటున సరిహద్దు దాటిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ బంధించిందని తెలిపారు. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జైళ్లలో చిక్కుకున్న వారిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విడిపించిందని, బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల విడుదల కోసం కనీసం లాయర్‌ను కూడా నియమించలేకపోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జానకీరామ్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, మత్స్యకారుల క్షేమం కోసం తాను స్వయంగా అక్కడికి వెళ్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మత్స్యకారుల విడుదలకు చర్యలు చేపట్టాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో చొరవ చూపాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో మత్స్యకారులు గుంటూ దానయ్య, అర్జీల్లా హరి, పుక్కల్లా ప్రకాష్ పాల్గొన్నారు. -
కళాభారతిలో ముగిసిన బహుభాషా నాటకోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి ప్రాంగణంలో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన 10వ బహుభాషా నాటకోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ‘ధన్యోస్మి’, ‘ముళ్లతీగలు’ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో డాక్టర్ వేమలి త్రినాథరావు, హేమా వెంకటేశ్వరిల దర్శకత్వంలో రసజ్ఞ సభ్యులు, పీవీఆర్ మూర్తి దర్శకత్వంలో నవరస థియేటర్ ఆర్ట్స్ కళాకారులు తమ నటనతో మెప్పించారు. నాటక ప్రదర్శనకు ముందు రాజేశ్వరి బృందం నిర్వహించిన జానపద, కోలాట నృత్యాలు అలరించాయి. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు. -
పోర్టులో అమెరికా కాన్సులేట్ జనరల్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)ని గురువారం సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దూబే, పోర్టు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో ఆధునిక మౌలికవసతులు, సముద్ర వాణిజ్యంలో విశాఖపట్నం పోర్టు పోషిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలను పోర్టు అధికారులు కాన్సులేట్ జనరల్‌కు వివరించారు. సరుకు నిర్వహణా సామర్థ్యం, పోర్టులో కొనసాగుతున్న ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులు, పోర్టు కార్యనిర్వహణా సామర్థ్యాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కవర్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ఆమె పరిశీలించారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు వంటి గ్రీన్ పోర్టు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏయూతో అనుబంధం మరింత బలోపేతం కావాలి మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అమెరికన్ కాన్సులేట్ అనుబంధం మరింత బలోపేతం కావాలని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆమె ఏయూని సందర్శించి వీసీ ఆచార్య రాజశేఖర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ స్వయంగా కొన్ని కార్యక్రమాలను అమెరికన్ కార్నర్‌తో కలిసి నిర్వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. నోబెల్ గ్రహీతలను ఏయూకు ఆహ్వానిస్తామని, దీనికి సహకారం అందించాలన్నారు. ఫుల్ బ్రైట్ స్కాలర్స్‌ను కొంత కాలం ఏయూలో ఉండే విధంగా ఆహ్వానిస్తామన్నారు. వీరిని ఏయూతో అనుసంధానం చేయాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అమెరికన్ కార్నర్ సమన్వయకర్త ఆచార్య పాల్ డగ్లస్ పాల్గొన్నారు. -
భారత్–శ్రీలంక క్రీడాకారుల ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా భారత్–శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక టీ20 సిరీస్ సందడి మొదలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ 21న, రెండో మ్యాచ్ 23న ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్నాయి. ఈ పోటీల కోసం ఇరుజట్లు గురువారం స్థానిక స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. శ్రీలంక మహిళా జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మైదానంలో కసరత్తులు చేయగా, అనంతరం భారత జట్టు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫిట్నెస్తో పాటు ప్రాక్టీస్ నిర్వహించింది. శిక్షణ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు నోవాటెల్‌కు, శ్రీలంక ఆటగాళ్లు షెర్టాన్ హోటల్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఇండియన్ టీం ఆంధ్రాయూనివర్సిటీని సందర్శించింది. అక్కడ విద్యార్థులతో కాసేపు గడిపింది. స్టేడియంలో ప్రాక్టీస్ -
బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
డాబాగార్డెన్స్: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎల్ఐసీ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ గురువారం డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ డివిజన్ ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లులోని లోపాలు, దాని ప్రభావాలను వివరించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశ ప్రజలు కష్టపడి దాచుకున్న పొదుపు నిధులు విదేశీ మూలధనానికి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో క్లాస్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యంబాబు, గణపతిరామ్, ఫణీంద్ర, తిరుమలరావు, బీటీ ప్రసాద్ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. వీరికి బ్యాంక్ యూనియన్ నాయకురాలు, ఎన్సీబీఈ సెక్రటరీ జనరల్ సుష్మ సంఘీభావం ప్రకటించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు. -
29 నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ తెలిపారు. గురువారం కళాశాలలో ఈ క్రీడల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. బాలబాలికలకు అథ్లెటిక్స్, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్, చెస్ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఆరిలోవ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని, ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్‌కు తగిన సవరణలు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు మాట్లాడుతూ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. దీని కోసం పార్టమెంట్‌లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతికి సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో రెండో శనివారం, ఆదివారం, పండగ రోజులను సెలవు తేదీలుగా ప్రకటించాలన్నారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేసి, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేసే అవకాశం కల్పించాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణలో ప్రతి రోజు పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలన్నారు. సింగిల్ టీచర్ల సెలవులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జీవీఎంసీలో అర్హులైన ఎస్జీటీలకు తెలుగు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పదోన్నతులు కల్పిచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో ఎన్.ప్రేమకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి రాంబాబు, విజయకుమారి, రామకృష్ణ, మహ్మద్ రిజ్వాన్, రాజునాయుడు, సంతోష్‌తో పాటు జిల్లాలో పలు మండలాలు యూనియన్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలి
డాబాగార్డెన్స్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన 10 వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జీవో 500 జారీ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు దెబ్బతినడమే కాకుండా పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని విమర్శించారు. దాదాపు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అన్యాయమని, యాజమాన్య కోటా సీట్ల అమ్మకం వల్ల పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 కళాశాలలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పీపీపీ పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, వసతులు, కాలేజీల ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. మొత్తం 1000 సీట్లు త్వరగా అందుబాటులోకి వస్తాయని, అందులో 76 శాతం సీట్లు పేదలకు లభిస్తాయని ప్రభుత్వం చెబుతున్నా 25 శాతం యాజమాన్య కోటా సీట్లను (371 సీట్లు) ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించి, వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహ్మన్, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.పైడిరాజు, సంత్యాంజనేయ, మన్మధరావు, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, బేగం, వనజాక్షి, నాగభూషణం, నాగరాజు, అచ్యుతరావు, రాంబాబు, సత్యనారాయణ, సూర్య పద్మ, జయ, అప్పన్న, ఆదినారాయణ, ఈశ్వరరావు, దేముడమ్మ, పుష్పలత, లక్ష్మణరావు, కాసుబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చలిపులి పంజా
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత.. రాష్ట్రాన్ని గజగజా వణికిస్తోంది. పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి రెండో వారం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా పడిపోయినప్పుడు దానిని ‘అతి శీతల గాలులు’ (కోల్డ్‌వేవ్)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. ఇన్వర్షన్ లేయర్‌తో ప్రమాదం..! సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో ఉష్ణోగ్రతలు పైకి వెళ్లే కొద్దీ పెరుగుతున్నాయి. దీన్నే ఇన్వర్షన్ లేయర్ అని పిలుస్తుంటారు. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము ధూళి కణాలన్నీ కలిసి ఇన్వర్షన్ లేయర్ కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎందుకు చలి పెరుగుతోంది.? భూతాపం పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు కూడా కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుపాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయి. అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది. పొగమంచు మరో సమస్య పొగమంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పగటి వేళల్లో ఉదయం 9 గంటల వరకూ లైట్లు వేసుకొని ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సైబీరియా గాలులూ ఓ కారణమే..! అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు వేగంగా, భారీగా చల్లని గాలులు కదలడాన్ని ‘కోల్డ్ సర్జ్’ అని పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితులకు ఇది కూడా ఒక కారణంగా మారింది. ముఖ్యంగా.. సైబీరియా, మంగోలియా ప్రాంతాల నుంచి ఇటువైపు గాలులు వస్తున్నాయి. ఇవి గంటకు 25 నుంచి 60 కిమీ వేగంతో వస్తున్నాయి. ఇవి ప్రవేశించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతాయి. దీనివల్లే చల్లని గాలులకు పొగమంచు తోడవుతోంది. జనవరి వరకూ ఈ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈ తరహా చలి తీవ్రత అనారోగ్యాలకు కారణమవుతుంది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. – ప్రొ.భానుకుమార్, వాతావరణ నిపుణుడు -
సిరులతల్లీ.. ప్రణామం
డాబాగార్డెన్స్: బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర నాలుగో గురువారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం వెండి కవచాల అలంకారంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ ఈవో కె. శోభారాణి, ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా టౌన్ కొత్తరోడ్డు వద్ద సుమారు 20 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. శుక్రవారంతో మార్గశిర ఉత్సవాలు ముగియనున్నాయి. క్యూలైన్లలో భక్తులు : అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టౌన్‌కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం నుంచి క్యూలైన్లను ప్రారంభించగా, రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.20, రూ.100, రూ.200 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు రూ.500 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక దర్శన మార్గాలను కేటాయించారు. దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే దారిలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘోషాసుపత్రి, రీడింగ్ రూమ్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించారు. ఆలయ సమీపంలోనే పోలీస్ అవుట్‌పోస్ట్, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. టౌన్‌కొత్తరోడ్డు, ఘోషాసుపత్రి ప్రాంతాల్లో చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయగా, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. క్యూలైన్లో భక్తులు -
రక్షణగిరిలో నవదిన ప్రార్థనలు
కంచరపాలెం: జ్ఞానాపురంలోని పునీత పేతురు చర్చి ఫాదర్ రెవరెండ్ జొన్నాడ జాన్‌ప్రకాష్, పారిస్ పాస్టిల్ కౌనిల్స్ (పీపీసీ) సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం నవదిన ప్రార్థనలు జరిగాయి. విశాఖ ఆర్చి బిషప్ ఉడుముల బాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు కొవ్వొత్తులతో జ్ఞానాపురం వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాబూ కాలనీ, జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం కాలనీల్లో మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. క్రీస్తు రాక కోసం ప్రజలు భక్తిశ్రద్ధలతో మెలగాలని ఫాదర్లు తెలిపారు. నవ దినాలు జరిగే దీపారాధనల్లో అన్ని గ్రామాల భక్తులు పాల్గొనాలని కోరారు. ప్రసంగాల అనంతరం దివ్యబలి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, అలిండియా క్యాథలిక్ యూనియన్ అధ్యక్షుడు బూర శేషుబాబు, పీపీసీ అధ్యక్షుడు రాజేష్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్
కొమ్మాది: సాగర్‌నగర్ సమీపంలోని గుడ్లవానిపాలెం వద్ద బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు జరిగిన ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ గతంలో శిథిలావస్థకు చేరుకున్న తుపాను రక్షిత భవనం ఉండేది. ప్రమాదకరంగా ఉండటంతో జీవీఎంసీ అధికారులు ఇటీవల ఆ భవనాన్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉండటంతో టీడీపీ వార్డు ప్రధాన నాయకుడి కన్ను దీనిపై పడింది. గ్రామస్తుల సహకారంతో ఈ ఖాళీ స్థలంలో చకచక పునాదులు వేసి ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనని, ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించుకున్నాక, అక్కడ నిర్మించిన బేస్మెంట్ను వెంటనే తొలగించారు. ఎవరైనా మళ్లీ ఈ స్థలంలో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. త్వరలోనే ఇక్కడ ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో
డాబాగార్డెన్స్: ఎంవీపీ కాలనీలో గల గాదిరాజు ప్యాలస్ వేదికగా ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్పో–2025 నిర్వహించనున్నట్టు క్రెడాయ్ చైర్మన్ ధర్మేంద్ర వారాడ, అధ్యక్షుడు ఇ.అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ప్రాపర్టీ ఎక్స్పో–2025 పోస్టర్ ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. గతంలో నిర్వహించిన 10 ప్రాపర్టీ ఎక్స్పోలకు మంచి స్పందన వచ్చిందని, అదే స్ఫూర్తితో విశాఖ నగర పౌరుల కోసం 11వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎక్స్‌పోలో క్రెడాయి సభ్యత్వం గల పలు సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని, ఎక్స్‌పోలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్స్కు చెందిన పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని, వినియోగదారులకు తాము అందించే ఆర్థిక సేవలు వివరిస్తారన్నారు. 71 స్టాళ్లలో 50కి పైగా కన్స్ట్రక్షన్కు సంబంధించినవి కాగా, మిగిలినవి మెటీరియల్, వివిధ బ్యాంకుల స్టాళ్లు ఉంటాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రజలకు అవసరమైన.. అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎక్స్పో కన్వీనర్ గోవిందరాజు, గౌరవ కార్యదర్శి వి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పట్టించుకోరా..?
ప్రజాప్రతినిధులూ..సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు దాటినా.. కార్యకలాపాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగితాలపై చక చకా పనులు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కదలడం లేదు. రైల్వే బోర్డు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మాథుర్‌ని నియమించి.. నెలలు గడుస్తున్నా తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే జోన్‌కు కీలకమైన పీసీపీఓ, పీసీఓఎంతో సహా పలు వురు ప్రిన్సిపల్ అధికారులను కూడా నియమించారు. అయితే జోన్‌కు శాశ్వత కార్యాలయం లేకపోవడంతో జీఎం విశాఖకు అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న రైల్వే భవనంలో ఉంటూ కొన్ని కార్యకలాపాలపై సమీక్షలు నిర్వహించేందుకు మాత్రమే జీఎం పరిమితమయ్యారు. మిగతా అధికారులు మాత్రం బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని చంద్రబాబు సర్కారు జోన్ డీపీఆర్ ఆమోదం తెలిపి నెలలు గడుస్తున్నా.. జీఎం నియామకం పూర్తయినా.. గెజిట్ విడుదల చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తుండటం వెనుక చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంగా మారింది. ఎంపీలు కనీసం జోన్ గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడంతో.. రైల్వే బోర్డుకు గెజిట్ విషయంలో ఎలాంటి ఆదేశాలు అందడం లేదు. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ జోన్‌కు ప్రధానాదాయం అయిన వాల్తేరు డివిజన్‌ను రెండుగా చీల్చేందుకు దాదాపు బోర్డు సిద్ధమైంది. ఇందులో కీలక ఆదాయ వనరు అయిన కేకే లైన్‌ని రాయగడ డివిజన్‌కు కేటాయించడంపైనా.. టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి జోన్ వ్యవహారంపై ఎలాంటి ఆసక్తి లేదన్న భావన కేంద్రంలో నెలకొనడంతో.. బోర్డు కూడా కీలకమైన అంశాన్ని కూడా గాలికొదిలేసింది. కేవలం ప్రచార ఆర్భాటానికి జోన్ తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ టీడీపీ ఎంపీలు హడావుడి చేస్తున్నారే తప్ప.. గెజిట్ విడుదల ఎప్పుడనే విషయంపై కేంద్రాన్ని నిలదీయకపోవడం సిగ్గు చేటంటూ వాల్తేరు వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికై నా టీడీపీ ఎంపీలు షోలు మానేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత త్వరగా గెజిట్ విడుదల చేయించాలని, తద్వారా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాస్తయినా పనిచేయాలని కోరుతున్నారు. తాత్కాలిక కార్యాలయం సిద్ధమైనా.. వీఎంఆర్డీఏ ది డెక్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయం నిర్మాణ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఫర్నిచర్, ఇంటీరియర్ పనులు కూడా 90 శాతం వరకూ పూర్తయ్యాయి. అయితే ప్రారంభం మాత్రం ఇంకా చేసేందుకు గెజిట్ మోకాలడ్డుతోంది. గెజిట్ విడుదలైతే తప్ప.. తాత్కాలిక కార్యకలాపాలకు మోక్షం కలిగే అవకాశం లేదని వాల్తేరు డివిజన్ అధికారులు అంటున్నారు. గెజిట్‌తో పాటుగా కార్యాచరణ ప్రకటిస్తే, జీఎంతో సహా మొత్తం 180 మంది అధికారులు, ఉద్యోగులు నియమితులవుతారు. అప్పుడు మాత్రమే జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. తొలుత దసరా అనీ.. తర్వాత దీపావళి.. ఇలా పండగలు పేరుతో పబ్బం గడిపేస్తున్నారే తప్ప.. విశాఖ జోన్ విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతికి కూడా కష్టమేననే నిస్పృహ అందరిలోనూ నెలకొంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వ్యవహారం.. మూడడుగుల ముందుకు ఆరడుగుల వెనక్కి అన్న చందగా మారిపోయింది. ఓవైపు విశాఖ కేంద్రంగా జోన్‌కు అధికారుల నియామకం.. ఉద్యోగులకు ఆప్షన్లు.. విభాగాల వారీగా ఉద్యోగుల విభజన అంటూ హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. గెజిట్ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్రాన్ని నిలదీయాల్సిన ఎంపీలు.. తాత్కాలిక కార్యాలయం పనులు పరిశీలన అంటూ జనాన్ని మభ్య పెడుతున్నారే తప్ప.. రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. జోన్, వాల్తేరు డివిజన్ విభజన విషయంలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. జోన్ గెజిట్ విడుదల జాప్యంపై నోరు మెదపని చంద్రబాబు ప్రభుత్వం జీఎం తాత్కాలిక కార్యాలయం పూర్తయినా అవరోధాలు గెజిట్ విడుదలైతే తప్ప తాత్కాలిక కార్యకలాపాలకు మోక్షం లేదు కేవలం కార్యాలయాల విజిట్‌కి మాత్రమే ఎంపీలు పరిమితం ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతున్నా చలనం శూన్యం -
సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా చివరి గురువారం పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే పంచామృతాభిషేక సేవను కూడా రద్దు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత తిరిగి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం టౌన్ కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వద్ద 20 వేల మంది భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా జగదాంబ, కాన్వెంట్ జంక్షన్, వన్‌టౌన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. -
కాలుష్య నివారణకు చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: నగరంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అమరావతిలోని సచివాలయం ఐదో బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఐదో కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశాఖలో కాలుష్య స్థాయిలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పర్యావరణ విధానాలు, చట్టాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కాలుష్య కారకాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ఇన్చార్జి సీఎండీకి అభినందనలు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఇన్చార్జి సీఎండీగా నియమితులైన సెయిల్ డైరెక్టర్ మనీష్ రాజ్ గుప్తాను ఉక్కు అధికారుల సంఘం (సీ) ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, సెఫీ చైర్మన్ నరేంద్ర కుమార్ బంచార్, వైస్ చైర్మన్ నరేంద్ర సింగ్‌లు అభినందించారు. బుధవారం వారు న్యూఢిల్లీలోని సెయిల్ కార్యాలయంలో మనీష్ గుప్తాను కలిసి స్టీల్‌ప్లాంట్ గురించి వివరించారు. గత కొన్నేళ్లుగా స్టీల్‌ప్లాంట్ యంత్రాలను, ఉద్యోగులను అలక్ష్యం చేశారని, వాటిని చక్కదిద్దాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ కలిసి పనిచేద్దామని.. తద్వారా విశాఖ ఉక్కుకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారీగా ఎస్ఐల బదిలీ
పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా భారీగా ఎస్ఐల బదిలీలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 118 మంది ఎస్ఐలకు స్థానచలనం కలిగించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పరిపాలన సౌలభ్యం నిమిత్తం నగరంలో పలు పోలీస్ స్టేషన్లు, సీసీఆర్బీ, సైబర్ క్రైం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 102 మంది ఎస్ఐలను, బుధవారం రాత్రి మరో 16 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నవారు, సీపీకే ఫిర్యాదులు వచ్చినవారికి స్థానం కలిగించినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల క్రితం త్రీటౌన్ క్రైం ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైం ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్తు టౌన్ క్రైం ఎస్ఐ విజయ్‌కుమార్, భీమిలీ ఎస్ఐ భరత్ కుమార్రాజులను రేంజ్‌కి అటాచ్ చేశారు. -
హమ్మయ్యా.. సక్సేనా గండం గడిచింది
సాక్షి, విశాఖపట్నం: గత రెండు నెలలుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో సెయిల్ డైరెక్టర్‌ను నియమిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, సిబ్బంది తలపై పాలుపోసినంత పని చేసింది. సక్సేనా పాలన.. అంతా ఆవేదన గత ఏడాది సెప్టెంబర్‌లో స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న సమయంలో.. అప్పటి సీఎండీ అతుల్ భట్‌ను సెలవుపై పంపి.. మోయిల్ ఎండీగా ఉన్న ఎ.కె.సక్సేనాకు స్టీల్‌ప్లాంట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, సక్సేనా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పాలన ఉద్యోగులకు ఒక పీడకలలా మారిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దేశంలో మరే పరిశ్రమలోనూ లేని విధంగా, కేవలం ఉత్పత్తి ఆధారంగానే జీతాలు చెల్లిస్తామంటూ సక్సేనా జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘనత ఆయనకే దక్కుతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.1.50 నుంచి ఏకంగా రూ. 8కి పెంచేసి, వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల నడ్డి విరిచారు. జీతాలను నెలలో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కల్పించారు. ఇచ్చే అరకొర జీతాన్ని కూడా 50 శాతం, 60 టశాతం, 75 శాతం అంటూ విడతల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మరోవైపు ప్రభుత్వ విధానామా? లేక నిర్దేశమా? ఏదైనా పొదుపు, సంస్కరణల సాకుతో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,500 మందిని ఇంటికి పంపారు. భయంగుప్పిట్లో అధికారులు చిన్నపాటి మానవ, సాంకేతిక తప్పిదాలకు కూడా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చర్యలతో ప్లాంట్‌లో భయానక వాతావరణం సృష్టించారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మారడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. మరోవైపు, కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయన స్టీల్‌ప్లాంట్‌లో నియంతగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. స్టీల్‌ప్లాంట్‌లో సక్సేనా పాలనలో బాధపడని ఉద్యోగి లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అని ఉద్యోగులు ఎదురుచూపులు చూడటం మొదలు పెట్టారు. సక్సేనాకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతు ఉందన్న ప్రచారంతో, ఆయనకే మళ్లీ ఎక్స్టెన్షన్ లభిస్తుందేమోనని రెండు నెలలుగా ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో సెయిల్ డైరెక్టర్‌ను కొత్త ఇన్చార్జి సీఎండీగా నియమించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాలన గాడిలో పడుతుందని, తమ కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. -
ఇంజినీరింగ్‌లో పరిశోధనలు పెరగాలి
మురళీనగర్ : ఇంజినీరింగ్ విభాగంలో పరిశోధనలు ఎక్కువగా జరగాలని సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ టి.విశ్వేశ్వరరావు అన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్.. ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిర్వహించిన ఏఐసీటీఈ అటల్ వాణి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం వేగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతికతలను స్వీకరించి పరిశోధనాత్మక దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ సాంకేతికతలు, పారిశ్రామిక అభివృద్ధిలో సస్టైనబుల్ ఇంజినీరింగ్ కీలకమవుతుందన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ప్రదర్శించారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, స్మార్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, సస్టైనబుల్ టెక్నాలజీలపై డాక్టర్ కె.రత్నకుమార్ ప్రసంగిస్తూ అధిక శక్తి సాంద్రత, కచ్చితత్వం, లోతైన వెల్డ్ పెనెట్రేషన్ వంటి లక్షణాల ద్వారా ఆధునిక తయారీ రంగాల్లో ‘ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్’’ సాంకేతికత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ మెథడ్స్’ అంశంపై డాక్టర్ కె.రాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ సెన్సార్ ఆధారిత మట్టి పరీక్షా విధానాలు, ఐవోటీ, రియల్–టైమ్ డేటా విశ్లేషణ, మట్టి పోషకాల అంచనా వంటి ఆధునిక పరిష్కారాలను వివరించారు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, డిజిటల్ ట్విన్, డేటా ఆధారిత ఇంజినీరింగ్ అప్లికేషన్లు వివిధ ఇంజినీరింగ్ రంగాలపై చూపుతున్న ప్రభావాన్ని డాక్టర్ రాజు చిట్ల విశ్లేషించారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణ రావు పర్యవేక్షణలో జరిగిన సదస్సులో తుమ్మిడి చారిటబుల్ చైర్మన్ ట్రస్ట్ తుమ్మిడి రామ్‌కుమార్, కో–కోఆర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో వయా దువ్వాడ మీదుగా పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్‌కుమార్ తెలిపారు. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 12వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 10, 12, 16, 18వ తేదీల్లో రాత్రి 7గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 13, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 18న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదే రోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 13న సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ జనవరి 14న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు
గోపాలపట్నం : ద్విచక్రవాహనాలను దొంగిలించిన ముగ్గురు మైనర్లను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని.. జువైనల్ హోమ్‌కు తరలించారు. గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జి.తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి ముందు పెట్టిన స్కూటీని ఈ నెల 12వ తేదీన రాత్రి ఎవరో ఎత్తుకుపోయారని బాజి జంక్షన్ ఎస్సీ కాలనీకి చెందిన రౌతు తరుణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే క్రమంలో కొత్తపాలెం, చంద్రనగర్, బాజి జంక్షన్ ప్రాంతాల్లో తమ ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని చామర్తి సందీప్, బూసల గణేష్, శిరీష, మనుబాల సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎస్ఐ తేజేశ్వరరావు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాతనేరస్తులపై నిఘా పెట్టారు. జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్ వద్ద చంద్రనగర్‌కు చెందిన ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా పై దొంగతనాలు తాము చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి మొత్తంగా 5 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖ చేరుకున్నాయి. ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్‌ల్లో తలపడేందుకు ఇరు జట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్‌లు పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. – గోపాలపట్నం -
దేశ ప్రగతిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం
గాజువాక: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులు, సేవలను ప్రభుత్వ సంస్థలు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు రెండు రోజుల సీపీఎస్ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కమ్ ఎగ్జిబిషన్ 2025 బుధవారం ప్రారంభమైంది. ఎంఎస్ఎంఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బీహెచ్ఈఎల్ ఈడీ గుమ్మళ్ల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 ప్రభుత్వ రంగ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఈడీ మాట్లాడుతూ.. నాణ్యమైన ఉత్పత్తులను, సరసమైన ధరలకు, సకాలంలో సరఫరా చేస్తే స్థానిక పరిశ్రమలకు ఆర్డర్లు నిరంతరం లభిస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పాలసీని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జెమ్ పోర్టల్‌లో సభ్యులుగా చేరితే, దేశవ్యాప్తంగా ఏ పరిశ్రమకై నా తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఆన్లైన్లో కోట్ చేయవచ్చని వివరించారు. ఎంఎస్ఎంఈ జేడీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమని కొనియాడారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, చిన్న తరహా పరిశ్రమలకు మధ్య ఎంఎస్ఎంఈ శాఖ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. పీఎస్‌యూలు తమకు కావాల్సిన విడిభాగాల్లో ఏటా 20 శాతం ఆర్డర్లను తప్పనిసరిగా చిన్న తరహా పరిశ్రమలకే ఇవ్వాలని, దీని అమలు కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో పీఎస్‌యూలను సందర్శించే అవకాశం స్థానిక పారిశ్రామికవేత్తలకు ఉండేదని, దీని వల్ల ఏ సంస్థకు ఎటువంటి ఉత్పత్తులు అవసరమో తెలిసేదని గుర్తుచేశారు. మళ్లీ అటువంటి అవకాశాన్ని కల్పిస్తే ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన విడి భాగాలను నాణ్యతతో అందించగలమని కోరారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషులు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలను అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వాసీవా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, లఘు ఉద్యోగ్ భారత్ కార్యదర్శి ఎ.కృష్ణ బాలాజీ, వివిధ సంస్థల ప్రతినిధులు సత్య సర్వశుద్ధి, వై.సాంబశివరావు, ఎన్.మధుసూదన రెడ్డి, శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!
పెదగంట్యాడ: బెయిల్‌పై బయటకు వచ్చి.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన సూర్య చలపతిరావు గతంలో తాను నేవీ ఆఫీసర్నని నమ్మబలికి, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసగించాడు. బాధితుల ఫిర్యాదుతో అప్పట్లో న్యూపోర్టు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన నిందితుడు, కోర్టు విచారణకు హాజరుకాకుండా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో గాజువాక 8వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సదరు నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
కస్టమ్స్ కత్తెర!
ఎగుమతులకునిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం చైన్నె, ముంబయి వైపు మళ్లుతున్న ఎగుమతులు ధ్రువీకరించే బృందాలు లేక.. విశాఖ మందులు హైదరాబాద్‌కు తరలింపుసాక్షి, విశాఖపట్నం: నగరంలోని ప్రధాన ఫర్నిచర్ షోరూమ్‌లలో విక్రయించే ఫర్నిచర్ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్‌కతా లేదా చైన్నె పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కస్టమ్స్ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫర్నిచర్‌ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నీ ఉన్నా.. అవే లేవు ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. సర్టిఫైడ్ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 200 ఉత్పత్తులకే పరిమితం! విశాఖ కస్టమ్స్ హౌస్‌లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చైన్నెలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్‌లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్ ఇస్తారు. కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చైన్నె లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్‌కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చైన్నెతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి. కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా? కస్టమ్స్ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్ కస్టమ్స్ హౌస్‌కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్ హౌస్ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్‌హోల్డర్స్ చెబుతున్నా, కస్టమ్స్ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్‌కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
న్యాయ సహాయకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
విశాఖ లీగల్: నగరంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థలో న్యాయ సహాయకులుగా పనిచేయడానికి అర్హులైన న్యాయవాదుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సంస్థ చైర్మన్ చిన్నంశెట్టి రాజు తెలిపారు. డిఫెన్స్ కౌన్సిల్‌గా సేవలందించడానికి మూడు కేటగిరిలో న్యాయవాదులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రధాన, ఉప న్యాయ సహాయకులు, లీగల్ అసిస్టెంట్ల పోస్టులకు ఈ నెల 31వ తేదీలోగా న్యాయ సేవా ప్రాధికార సంస్థలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు. -
ప్రత్యేక అలంకరణల్లో గ్రామ దేవతలు
తగరపువలస: భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబకు 133వ అలంకరణలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మంగళవారం లిల్లీ, వివిధ రకాల బంతి, తులసి, గజమాలలతో అలంకరించారు. గ్రామంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. నాలుగేళ్లుగా అమ్మవారిని వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఇదే గ్రామానికి చెందిన తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు పంపిణి చేశారు. దివీస్ రహదారిలో మద్దిపేట వద్ద ఆలయంలో ముత్యాలమ్మను వేరుశనగ కాయలు, తోగాలమ్మను ధాన్యం కంకులతో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, పూజలు చేశారు. -
● స్నోయగం
మంచు వెన్నముద్దసూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దంపట్టింది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపై నుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగించాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలుసందర్శకులను అబ్బురపరిచాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం -
ఏం బ్యాగుంది?
సర్కారు వారి బ్యాగులు.. చిరుగులు మూణ్నాళ్ల ముచ్చటగా విద్యార్థి మిత్ర కిట్లు బయట కొనుగోలు చేసిన బ్యాగులతో తోటగరువు హైస్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. ఈ కిట్లలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉండటంతో కొద్ది రోజులకే చిరిగిపోయాయి. మరోవైపు విద్యార్థులకు వారి కాలి కొలతలకు సరిపడే బూట్లను పంపిణీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ముగిసిన వెంటనే, జూన్ రెండో వారంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, బూట్లు, యూనిఫాంతో కూడిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఏవైనా కిట్లు సరిపోకపోతే, ఒకటి రెండు వారాల్లో మిగిలిన వారికి పంపిణీ చేయడం ఆనవాయితీ. కానీ, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లలోని వస్తువులు చాలీచాలనివిగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతున్నా, ఇంకా చాలా మందికి బూట్లు, బ్యాగులు అందకపోవడం గమనార్హం. హైస్కూల్ విద్యార్థుల పుస్తకాల బరువును తట్టుకునేలా బ్యాగుల నాణ్యత లేకపోవడంతో అవి త్వరగా చిరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పుస్తకాల బరువును బట్టి బ్యాగు నాణ్యత ఉంటే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. చిరిగిపోతున్న బ్యాగులు ఈ ఏడాది జూన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేశారు. అయితే, కొన్ని తరగతులకు పాఠ్య పుస్తకాలు కూడా కొరతగానే ఉన్నాయి. పాఠశాలలు తెరిచిన నెల రోజుల తర్వాత పుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాణ్యత లేకపోవడంతో, పుస్తకాల బరువుకు రెండు నెలలకే అవి చిరిగిపోయాయి. దీంతో కొందరు విద్యార్థులు చిరిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుండగా, కొందరు బయట కొత్త బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. నాసిరకం బ్యాగుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంపిణీ సమయంలోనే కొరత కారణంగా జిల్లాలో 8,789 మంది విద్యార్థులకు అసలు బ్యాగులే అందలేదు. ఇప్పటికీ వారికి బ్యాగులు సరఫరా కాకపోవడం విచారకరం. 6,000 మందికి బూట్లు అందలేదు జిల్లాలో సుమారు 6,000 మందికి పైగా విద్యార్థులకు బూట్లు అందలేదు. అందిన వారికి కూడా సాక్సులు, బూట్లు అరకొరగానే ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల కాలి కొలతల ప్రకారం బూట్లు రాకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల కిందట కొన్ని మండలాలకు బూట్లు వచ్చినప్పటికీ, వాటిని ఇంకా సైజుల వారీగా విద్యార్థులకు సర్దుబాటు చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం సగం గడిచిపోవడంతో విద్యార్థులు బయట కొన్న బూట్లు లేదా చెప్పులతోనే బడికి వెళ్తున్నారు. జిల్లాలో మొత్తం 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 72,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 33,830 మంది బాలురు, 38,697 మంది బాలికలు ఉన్నారు. వీరిందరికీ కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 8,789 మందికి బ్యాగులు అందలేదు. అలాగే సుమారు 6,000 మందికి బూట్లు (ఒక జత), సాక్సులు (రెండు జతలు) అందలేదు. బ్యాగు చిరిగిపోయింది.. నాకు స్కూల్లో ఇచ్చిన బ్యాగు కొద్దిరోజులకే చిరిగిపోయింది. అందుకే కొత్త బ్యాగు కొనుక్కున్నాను. ఇందులో ఎన్ని పుస్తకాలు పెట్టినా తట్టుకుంటోంది. చాలా రోజుల నుంచి ఈ బ్యాగుతోనే స్కూల్‌కు వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది బ్యాగులు చిరిగిపోయాయి. వారు కూడా కొత్తవి కొనుక్కున్నారు. – హేమంత్, 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తోటగరువు


