ముగిసిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత వేడుకలు
ఏయూక్యాంపస్ : జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ఆదివారం ఆర్కే బీచ్‌లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్‌తో ముగిశాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను కాలువల్లో వేసి సముద్రాలను కలుషితం చేయవద్దని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి. సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. ఔత్సాహికులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసి సైక్లోథాన్ నిర్వహించారు. అనంతరం 20 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన విజేతలకు, ఫిషర్‌మెన్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


