ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్‌! | Woman coughs blood on train gets Rs 4 crore in donations after video goes viral | Sakshi
Sakshi News home page

ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్‌!

Apr 4 2026 1:07 PM | Updated on Apr 4 2026 2:28 PM

Woman coughs blood on train gets Rs 4 crore in donations after video goes viral

చైనాలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళ,  అనూహ్య పరిస్థితిలో రైలులో  రక్త వాంతి చేసుకుంది. అయితేతన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఆమె చేసిన పని లక్షలాది మంది మనసులను గెలుచుకుంది. అంతేకాదు  ఆమె పరిస్థితి వారిని కదిలించి, కోట్ల రూపాయలను  భారీ విరాళాలను ఆమెకు అందించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగింది? 

స్థానిక మీడియా కథనం ప్రకారం చైనాకు చెందిన  హు జిన్యావో (Hu Xinyao) అనే 23 ఏళ్ల యువతికి చిన్న వయసులోనే ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' (ANCA-associated vasculitis) అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఇంజెక్షన్ తీసుకోవడానికి హు జిన్యావో ఆసుపత్రికి వెళ్తుండగా జీర్ణవ్యవస్థలో అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల అనుకోకుండా రక్తం కక్కుకుంది. దీంతో వెంటనే  తోటి ప్రయాణీకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన కోట్‌తోనే  నెమ్మదిగా ఆ రక్తాన్ని శుభ్రపర్చింది. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ  ఆమె బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

జియుపాయ్ న్యూస్ ప్రకారం, మార్చి 23న,  చాంగ్‌కింగ్‌లోని మెట్రో రైలులో ఒక ప్రయాణికుడు ఆ మహిళను చిత్రీకరించగా, ఆ వీడియో చైనాలోని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె వైద్యం కోసం భారీగా విరాళాలు అందాయి. సుమారు 4,00,000 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.7 కోట్లు  విరాళాలు సమకూరాయి.

ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

నెటిజనుల రియాక్షన్స్‌
"ఆమె మనసు చాలా మంచిది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, "నేను ధన వంతుడ్ని కాకపోయినా, ఆమె చికిత్స కోసం నా వంతు సాయం చేస్తాను" అని మరొకరు తన వంతు సాయం చేశారు. ఇలా వారంలోపే ఆమెకు భారీగా విరాళాలు అందాయి. ఎంతలా అంటే, ఆమె సోషల్ మీడియా ఖాతాకు విరాళాలు వెల్లువెత్తడంతో ప్లాట్‌ఫారమ్ తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో  స్పందించిన ప్రతీ ఒక్కరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. "నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు పంపిన మొత్తాన్ని నేను నోట్ చేసుకున్నాను. ప్రజలు నాపై చూపిన ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. భవిష్యత్తులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా సాయం చేయాలని ఆశిస్తున్నాను," అని హు భావోద్వేగంతో చెప్పింది.

 

ఎవరీ హు 
హు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం నుండి వచ్చింది. 2018లో స్కూల్లో ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఫలితంగా వైద్య ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే ఆపేసింది. ఆపై  రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించింది.  Hu కుటుంబం ఆమె అనారోగ్య చికిత్స కోసం  లక్షల కొద్దీ ఖర్చుపెడుతోంది. గత ఏడాది కాలంలోనే ఆమెకు ఆసుపత్రి నుండి 20 సార్లు 'క్రిటికల్ ఇల్‌నెస్' (ప్రాణాపాయ స్థితి) నోటీసులు వచ్చాయి. అయినా జీవితాన్ని నెట్టుకొస్తూ ప్రస్తుతం ఆన్‌లైన్ నవలలు రాస్తూ నెలకు 5,000 నుండి 6,000 యువాన్లు సంపాదిస్తుండటం గమనార్హం.

ప్రియుడితో బ్రేకప్‌ ఇలా
గత సెప్టెంబర్‌లో ఆమె మాజీ ప్రియుడు 'సియావో' ప్యాంక్రియాటైటిస్‌తో మరణిస్తూ, తన దగ్గర ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని హు చికిత్స కోసం ఇచ్చి వెళ్ళాడు. తమ బంధం కేవలం రెండు నెలలే అయినప్పటికీ, తన అనారోగ్యం వల్ల అతడి జీవితం పాడవకూడదని హు అంతకుముందే అతడికి బ్రేకప్ చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ నిస్వార్థమైన బంధం కూడా ప్రజలను ఎంతగానో కదిలించింది.

గొప్పమనసు
పెద్ద నగరాల్లో వైద్య చికిత్స పొందుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ,వారి బంధువులు బస చేయడానికి వీలుగా ఒక "రోగుల గృహం" నిర్మించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని హు మీడియాకు తెలిపింది. ఇటీవల ఆమె పరిస్థితి కిడ్నీ వైఫల్యానికి దారితీసింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఆమె ఏప్రిల్ ప్రారంభంలో తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లోని నాన్జింగ్‌లో ఉన్న ఒక ప్రధాన ఆసుపత్రిని సందర్శించాలని యోచిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement