తరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. కానీ ఆ ఇద్దరూ జీవితపు చివరి దశలో తోడును సంపాదించుకున్నారు. వారి ఆసక్తికర కథ ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటోంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో 76 ఏళ్ల థామస్, 74 ఏళ్ల లీలమ్మ తమ మిగిలిన జీవితాన్ని కలసి పంచుకోవాలని నిర్ణయించుకుని, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలవడమే జీవితానికి అర్థం అని ఈ జంట నిరూపిస్తోంది.
ఒంటరి పోరాటం.. థామస్ గతం
కల్లర కన్నరతిల్ కు చెందిన కేసీ థామస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, కేరళ పోలీసు విభాగంలో టెక్నికల్ వింగ్ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. 2020లో ఆయన భార్య కన్నుమూశారు. ఆయన కుమారుడు అలెక్స్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో స్థిరపడగా, వివాహం చేసుకున్న కుమార్తె మెర్సీ స్థానికంగా ఉంటూ, తండ్రి బాగోగులు చూసుకుంటోంది. పిల్లలు అండగా ఉన్నప్పటికీ, జీవితంలో ఆయనకు ఏదో తెలియని ఒంటరితపం వెంటాడుతోంది.
ఆస్పత్రిలో పరిచయం.. కలసిన మనసులు
కడుతురుతికి చెందిన లీలమ్మ 16 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు జోమోన్, జైమోన్ ఇటలీలో స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్‌లో థామస్, లీలమ్మ తొలిసారిగా కలుసుకున్నారు. ఆమెతో ఏర్పడిన అనుబంధంతో థామస్ తన జీవితాన్ని పంచుకోవాలని ఆహ్వానించగా, మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ నెలన్నర క్రితం ఆయన మళ్లీ ఫోన్ చేసి ప్రతిపాదించడంతో, పిల్లలతో మాట్లాడిన తర్వాత లీలమ్మ తన అంగీకారాన్ని తెలిపారు.
థామస్, లీలమ్మల పిల్లలు అనుమతవ్వడంతో..
ఇద్దరి పిల్లలు కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా మద్దతు పలకడంతో, సోమవారం సాయంత్రం కల్లరలోని సెయింట్ మేరీస్ పుతెన్‌పల్లి చర్చిలో థామస్, లీలమ్మల వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో, థామస్ బంధువు ఫాదర్ అబ్రహం తరతట్టెల్ ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు థామస్ కుమార్తె కుటుంబంతో పాటు, పారిష్ వికార్ ఫాదర్ థామస్ కరింపుకలాయిల్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: భోజ్‌శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి


