ధార్: మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖితమయ్యింది. ధార్ జిల్లాలోని చరిత్రాత్మక భోజ్‌శాల సముదాయం సరస్వతీ దేవి ఆలయమేనని హైకోర్టు కీలక తీర్పునిచ్చిన నేపథ్యంలో హిందువుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపధ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న పూజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గత 23 ఏళ్లుగా సాగుతున్న నిరంతర పోరాటానికి దక్కిన విజయంగా భావిస్తూ, భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇక్కడ పూజల్లో మునిగితేలుతున్నారు.
700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి
హైకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో భోజ్‌శాల సముదాయంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. రాజా భోజ్ నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 700 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ‘అఖండ జ్యోతి’ని వెలిగించారు. అంతేకాకుండా, 2003 తర్వాత మొదటిసారిగా గర్భగుడిలో వాగ్దేవి (సరస్వతీ దేవి) ప్రతీకాత్మక విగ్రహాన్ని ప్రతిష్టించారు. భోజ్‌శాల ఉద్యమంతో ముడిపడి ఉన్న ముగ్గురు అమరవీరుల చిత్రపటాలను సైతం తొలిసారిగా ఆలయంలో ఉంచి ఘన నివాళులర్పించారు.
ఏడాది పొడవునా పూజలు
2003 నుండి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. హిందువులు కేవలం మంగళవారం మాత్రమే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకోవడానికి, ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో ఆ పాత నిబంధనల బోర్డుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) రంగు వేసి, పూర్తిగా చెరిపివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు హిందువులకు మంగళవారమే కాకుండా, ఏడాది పొడవునా ప్రతిరోజూ పూజలు చేసుకునే హక్కు లభించింది. ప్రస్తుత నిబంధనలను మారుస్తూ సరికొత్త మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమైంది.
‘మహా సత్యాగ్రహం’ లక్ష్యం ఇదే
భోజ్‌శాల ఉత్సవ కమిటీ జనరల్ మేనేజర్ హేమంత్ దౌరాయా మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక సరస్వతీ ఆలయాన్ని దక్కించుకునేందుకు 2003 నుండి ప్రతి మంగళవారం హిందూ సమాజం శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తోందని గుర్తుచేశారు. కోర్టు తీర్పుతో 23 ఏళ్ల పోరాటం ఫలించిందని, భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమేనని నిరూపితమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ‘మహా సత్యాగ్రహం’ ఇక్కడితో ఆగదని, ఆలయ సముదాయానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న మసీదు, సమాధులను పూర్తిగా తొలగించడమే తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..


