‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా.. | Mamatas Sculpture Down Suvendus New Bengal Shift | Sakshi
Sakshi News home page

‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా..

May 19 2026 12:08 PM | Updated on May 19 2026 12:28 PM

Mamatas Sculpture Down Suvendus New Bengal Shift

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేస్తూ, వివాదాస్పద కట్టడాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన ఒక ఫుట్‌బాల్ విగ్రహాన్ని సాల్ట్ లేక్ స్టేడియం నుండి తొలగించాలని నిర్ణయించింది. ఇది  కొత్త ప్రభుత్వం పాలనలో తన మార్క్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

వింత విగ్రహంపై మంత్రి ఫైర్
కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫుట్‌బాల్ విగ్రహం ఆకారం మొదటి నుంచీ విమర్శలకు దారితీసింది. సగం మనిషి కాళ్లు ఉండి, మొండెం స్థానంలో కేవలం ఫుట్‌బాల్ ఉన్న ఈ కట్టడాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి నిసిత్ ప్రామాణిక్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం జరిగిన ఐఎస్‌ఎల్ మ్యాచ్ (మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు కాళ్లు మాత్రమే ఉండి, మొండెం లేకుండా ఫుట్‌బాల్‌తో ఉన్న ఈ విగ్రహం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. దీనికి ఎలాంటి అర్థం లేదు. ఇలాంటి వికృతమైన కట్టడాన్ని స్టేడియం ముందు ఉంచబోము. దాన్ని తక్షణమే తొలగిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

టీఎంసీకి షాక్.. ప్రక్షాళన దిశగా సువేందు
బెంగాల్‌లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కట్టడాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు మింగుడుపడని పరిణామంగా మారింది. నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సువేందు సర్కార్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్ల భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

ప్రభుత్వ విద్యాలయాల రూపురేఖల మార్పు
మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల మౌలిక సదుపాయాల మెరుగుదలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. సోమవారం నాడు 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘విద్య అనేది ప్రాథమిక హక్కు. అయితే ప్రభుత్వ విద్యాలయాలు.. ప్రైవేటు సంస్థల కన్నా పోటీలో, సదుపాయాల్లో వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల పురోగతిని నేను కోరుకుంటాను, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని సీఎం హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్?
 

Advertisement
 
Advertisement
Advertisement