చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల తుషార్ కుమార్
లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్‌డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్‌వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

రాజకీయ ప్రస్థానం
లేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్‌వుడ్' టౌన్ కౌన్సిల్‌లో చేరారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్‌గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్‌కు స్వాగతం పలికారు.

లక్ష్యాలు
లండన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్‌గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు.
తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్‌లోని 'సివిక్ లీడర్‌షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్‌గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 'బుక్‌మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు.


