బీహార్‌లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్‌తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన తమ తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.
అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు. "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.
సోదరుడితో సంజు చివరి మాటలు
మే 13న అమ్మాయికి పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్ ఆరోపించాడు.
ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
హత్య , హడావిడిగా అంత్యక్రియలు
సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.
శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.
పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను


