ఆస్పత్రికి సోనియా.. ఆందోళనలో పార్టీ కేడర్ | Sonia Gandhi Hospitalized in Gurugram | Sakshi
Sakshi News home page

ఆస్పత్రికి సోనియా.. ఆందోళనలో పార్టీ కేడర్

May 13 2026 11:39 AM | Updated on May 13 2026 12:01 PM

Sonia Gandhi Hospitalized in Gurugram

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ కీలక నేత సోనియా గాంధీ అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్పత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం కొన్ని వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆమె ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు అక్కడే అడ్మిట్ అయ్యారు. ఈ వార్త వెలువడగానే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత కోసం అటు పార్టీ శ్రేణులు, ఇటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెదాంతలో వైద్య చికిత్స
సోనియా గాంధీ బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లోని ప్రముఖ మెదాంత ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కొన్ని వైద్య సంబంధిత ప్రక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో వైద్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 79 ఏళ్ల వయస్సులో ఉన్న ఆమె, గత కొంతకాలంగా వయస్సు సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గతంలో ఇన్‌ఫెక్షన్ సమస్యలు
ఈ ఏడాది మార్చి నెలలో కూడా సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమెకు ‘సిస్టమిక్ ఇన్‌ఫెక్షన్’ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తీవ్రమైన జ్వరంతో మార్చి 24న ఆసుపత్రిలో చేరిన ఆమె, దాదాపు ఏడు రోజుల పాటు అక్కడే ఉండి చికిత్స పొందాల్సి వచ్చింది. అప్పట్లో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ నేతృత్వంలోని బృందం ఆమెకు యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స అందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సిస్టమిక్ ఇన్‌ఫెక్షన్ అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో చెప్పాలంటే, బ్యాక్టీరియా వంటి రోగకారక క్రిములు రక్తప్రవాహంలో చేరి ,శరీరం అంతటా వ్యాపించడాన్ని ‘సిస్టమిక్ ఇన్‌ఫెక్షన్’ అంటారు. ఇది శరీరంలోని ఏదో ఒక భాగానికి పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మెదాంతలో జరుగుతున్న పరీక్షలు కూడా గతంలో వచ్చిన సమస్యకు సంబంధించినవేనా లేదా మరేదైనా కొత్త కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ వెలువడే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement