breaking news
East Godavari
-
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్‌ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారుగోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుంచనపల్లిలో..తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
అతి వేగానికి ముగ్గురు బలి
● ఎదురెదురుగా బైక్‌లు ఢీకొని ఇద్దరు.. ● మంచు వల్ల రోడ్డు కనపడక ఒకరు మృతి ● మరో ఇద్దరికి తీవ్రగాయాలు తాళ్లరేవు/పి.గన్నవరం: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. 216 జాతీయ రహదారిపై కోరంగి వంతెన సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పి.గన్నవరం మండలం కొత్త అక్విడెక్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేటకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన కొండ్రు వినయ్‌కుమార్ ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు నుంచి యానాం వైపు వెళ్తున్నాడు. ధవళేశ్వరం వేమగిరికి చెందిన కుందు సతీష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒకే స్కూటీపై యానాం వైపు నుంచి కాకినాడ వెళ్తున్న క్రమంలో ఆ రెండు వాహనాలూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వినయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కుందు సతీష్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ధవళేశ్వరం సున్నంబట్టీ వీధికి చెందిన కొమర లక్ష్మీ నీలేకర్, కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన సూరాడ అనిల్‌కుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీలో ఉంచారు. అలాగే పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు కొత్తపేటకు చెందిన ఆరి సుమంత్ కుమార్ (25) గ్యాస్ కంపెనీ ఏజన్సీలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు మోటారు సైకిల్‌పై తాటిపాకలోని సోదరి ఇంటి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై శుక్రవారం ఉదయం గ్యాస్ కంపెనీలో విధులకు వెళ్లాల్సిన నేపథ్యంలో తెల్లవారు జామున అక్కడి నుంచి కొత్తపేటకు మోటారు సైకిలుపై బయలుదేరాడు. కొత్త అక్విడెక్టు వద్దకు వచ్చేసరికి అతడి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంచు వల్ల రహదారి కనపడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సుమంత్ మృతదేహానికి కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ట్స్ కళాశాల కామర్స్ బ్లాక్ ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఆ కళాశాలలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ నిర్మాణానికి రూ.42 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆర్ట్స్ కాలేజీలోని స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ భవనాన్ని తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లోకేష్ మాట్లాడుతూ మనం చదివిన విద్యా సంస్థలకు తోడ్పడడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో తిరుమల విద్యాసంస్థల అధినేత తిరుమలరావు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఈ సందర్భంగా తిరుమలరావును సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. తిరుమలరావు కుమార్తె, విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా.శ్రీరష్మిని మంత్రి లోకేష్ అభినందించారు. కార్యక్రమంలో గవర్నమెంటు కాలేజీ (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, ఆర్టీఐహెచ్ నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
సొమ్ము వారిది.. సోకు వీరిది
● ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో పలు భవనాల నిర్మాణం ● వాటిని ప్రారంభించిన మంత్రి లోకేష్ ● చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని గొప్పలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన ఆయన.. చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని, కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గొప్పలు చెప్పుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) ఆధ్వర్యాన రూ.32 లక్షలతో కళాశాల మెయిన్ అవుట్ గేట్ ఎలివేషన్ నిర్మించారు. పూర్వ విద్యార్థి, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, రూసా సహకారంతో రూ.70 లక్షలతో ఇండిపెండెంట్ కామర్స్ బ్లాక్ నిర్మించారు. అలాగే, పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవీఎస్ రాజు (యూఎస్ఏ), సీపీడీసీ సహకారంతో రూ.11 లక్షలు వెచ్చించి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పారు. హన్స సొల్యూషన్స్ రూ.1.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన రూ.55 లక్షలతో ఏఐ – డ్రివెన్ డిజిటల్ క్లాస్ రూములు, రూ.కోటితో రీసెర్చ్ అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్ సైన్స్ సెంటర్ అప్‌గ్రెడేషన్, కాలేజీ ఇంటర్నల్ ఫండింగ్ కింద రూ.2.2 కోట్లతో బుద్ధ భవన్ బ్లాక్ విస్తరణ, రూ.1.2 కోట్లతో టెక్నోస్పియర్ కంప్యూటర్ ల్యాబ్, రూ.27 లక్షలతో యాంఫీ థియేటర్, రూ.12 లక్షలతో ఇన్నర్ గేట్, సెంట్రల్ ఆర్చ్ నిర్మించారు. వీటిలో రుడా ఇచ్చిన రూ.32 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.55 లక్షలు మినహా మిగిలినవన్నీ దాతల సహకారంతో నిర్మించినవే కావడం విశేషం. వీటినే లోకేష్ ప్రారంభించి, వాటిని తమ ప్రభుత్వమే నిర్మించినట్లు చెప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వోత్కర్ష.. సానుభూతికి యత్నం తన పర్యటనలో ‘హలో లోకేష్’ పేరిట మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆయన స్వోత్కర్షకే సరిపోయింది. స్టాన్‌ఫర్డ్‌లో తాను ఎలా చదివారో.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో.. తన శరీర ఆకృతిపై వచ్చిన విమర్శలు.. తనను ఏవిధంగా ట్రోల్ చేశారు.. తన తల్లిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నో మాటలని అవమానించారనే సమాధానాలు తనను అడిగే ప్రశ్నలో ఉండేలా చూసుకున్నారు. తద్వారా సానుభూతి కోసం ప్రయత్నించారు. అవే ప్రశ్నలు.. అవే జవాబులు ఇదివరకు యువగళం పాదయాత్రలో లోకేష్ చాలాచోట్ల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అవన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలు సైతం అవే కావడం విశేషం. వాటికి ఇదివరకు చెప్పిన సమాధానాలనే లోకేష్ చెప్పడం గమనార్హం. ‘నన్నయ’లో నూతన భవనాలు ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో రూ.33.80 కోట్లతో నిర్మించిన వివిధ భవనాలను రాష్ట్ర హెచ్ఆర్డీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. రూ.20.05 కోట్లతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, రూ.8.25 కోట్లతో ఎగ్జామినేషన్స్, రూ.5.50 కోట్లతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖరం, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, ఆర్డీఓ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ వివాదం రాజానగరం: మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, స్థానికుడైన తమ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరుతో ఫ్లెక్సీ ఎందుకు పెట్టలేదంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని ప్రశ్నించేందుకు లోపలకు వెళ్లబోయిన ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మిని వీసీ సిబ్బంది నెట్టివేశారంటూ వర్సిటీ పరిపాలన భవనం ముంగిట ఆందోళన చేశారు. ఎమ్మెల్యేను, ఆయన భార్యను అవమానించారంటూ వీరంగం సృష్టించారు. దీంతో, వర్సిటీలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే బలరామకృష్ణ కొద్దిసేపటికి కలగజేసుకుని, ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ చాన్సలర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. తనను, తన భార్యను అవమానించినప్పటికీ దీనిని వివాదం చేయదలచుకోలేదని, తమ నాయకుల పట్ల వర్సిటీ సిబ్బంది వ్యవహరించి తీరుకు నొచ్చుకున్న కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారని అన్నారు. వీసీ వైఎస్సార్ సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివాదానికి కారణం అదేనా? ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం వర్సిటీ ప్రాంగణంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే బత్తులనుద్దేశించి వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ అన్న మాటలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కొంతమంది వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వర్సిటీ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం తగదని, ఆయన పేరు చెప్పి ఆయన అనుయాయులు తరచూ వర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆ సందర్భంగా ఎమ్మెల్యేతో వైస్ చాన్సలర్ అన్నారని అంటున్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయమై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని వివరణ కోరగా.. ఈ రోజు ఎటువంటి వివాదమూ జరగలేదని, ఇంతకు మించి చెప్పేది లేదని అన్నారు. -
రేపు పల్స్‌పోలియో
రాజమహేంద్రవరం రూరల్: పల్స్‌పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యమన్నారు. దీనికోసం 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్లు సిద్ధం చేశామన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్‌పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం బస్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో ట్రాన్సిట్ టీముల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని వివరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని, దీనికోసం 4,782 మంది సిబ్బందిని నియోగిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ తమ ఇంట్లోని ఐదేళ్లలోపు పిల్లలను సమీప పల్స్‌పోలియో కేంద్రానికి తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి, వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బంది ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్తారని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పోలీసు విభాగానికి ఏబీసీడీ అవార్డు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు జిల్లా పోలీసు విభాగం సాధించింది. ఎస్పీ డి.నరసింహకిశోర్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలలకు గాను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసును ఛేదించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ అందుకున్నారు. జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కేందుకు, ఆ కేసును ఛేదించేందుకు కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా మరిన్ని కేసులను సమర్థవంతంగా ఛేదించేందుకు కృషి చేయాలని కోరారు. ‘అన్నవరం, వాడపల్లి’ నిర్వహణలో గోదావరి హారతి అన్నవరం: రాజమహేంద్రవరంలో నిత్యం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇకపై అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అన్నవరం దేవస్థానం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకూ జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం ప్రతి నెలా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇకపై అన్నవరం దేవస్థానం రూ.1.5 లక్షలు (60 శాతం), వాడపల్లి దేవస్థానం రూ.లక్ష (40 శాతం) ఖర్చు చేయాలని కమిషనర్ ఆదేశించారు. తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.49.58 లక్షల ఆదాయం సమకూరింది. లోవ దేవస్థానంలో హుండీలను శుక్రవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 71 రోజులకు గాను రూ.45,76,941 నగదు, రూ.3,81,514 నాణేలు కలిపి రూ.49,58,455 ఆదాయం సమకూరిందని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బంగారం 59.20 గ్రాములు, వెండి 1,156 గ్రాములు లభించిందన్నారు. ఆదాయం లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
మహానేతకు అపూర్వ గౌరవం
● డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం నిర్మించి మాట నిలబెట్టుకున్న మల్లాడి ● రేపు ప్రారంభోత్సవం ● తరలిరానున్న నాయకులు, అభిమానులు యానాం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరం నేడు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పట్టణ పరిధిలో యర్రాగార్డెన్స్లో మల్లాడి నివాసం ఎదుటే రూ.లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి రెండస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 21 నాటికి 36 ఏళ్లు అవుతోందని, దానిని పురస్కరించుకుని మహానేత రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరున నిర్మించిన ఈ మందిరాన్ని, గో నిలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మందిరంలో మహిళలు, పురుషులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేలా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహానేతతో తనకున్న అనుబంధంపై రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ దూరమై 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన స్మృతులు యానాం నిండా ఉన్నాయన్నారు. యానాంకు సాగు, తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం, సాగునీటిని 19 నుంచి 30 క్యూసెక్కులకు పెంచడం, మంచినీటి నిల్వ కోసం ఏపీ రైతుల నుంచి సేకరించిన 52.5 ఎకరాల భూమిని యానాంకు కేటాయిండం, ధవళేశ్వరం వద్ద పంప్‌హౌస్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు, అక్కడి నుంచి యానాం వరకు 80 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. యానం–ద్రాక్షారామ రోడ్డును బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వరకు యానాం ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎస్సార్ నిధులను సైతం ఆంధ్రాకు 70 శాతం, యానాంకు 30 శాతం కేటాయించారన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ ఫ్రెంచి లింకింగ్ చానల్, వైఎస్సార్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వైఎస్సార్ కాలనీ వంటివి ఉన్నాయన్నారు. పుదుచ్చేరి క్యాబినెట్లో తనకు మంత్రి పదవి ఇచ్చేలా అఽధిష్టానాన్ని ఒప్పించడంతో అప్పటిలో తొలిసారిగా తాను మంత్రిగా ప్రమాణం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మందిరంలో వైఎస్సార్ విగ్రహం -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి
● అనారోగ్యం పాలైన మహిళ ● కలెక్టర్ ఆదేశాలతో ● స్పందించిన కేసీఎం అధికారులు అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడిన పి.జ్యోతి అనే మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జ్యోతి భర్త పి.దుర్గాప్రసాద్ వృత్తి రీత్యా వంట పని చేస్తూ జీవిస్తుంటాడు. కుటుంబ పరిస్థితులు బాగులేక తన భార్యను గల్ఫ్ దేశానికి పంపించాలని నిర్ణయించి కాకినాడకు చెందిన పి.శేషగిరిరావు అనే ఏజెంట్ ద్వారా మే నెలలో మస్కట్‌కు పంపించారు. అక్కడ 8 నెలలు పని చేసిన తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో రెండు నెలలుగా పని చేయలేక ఇబ్బంది పడింది. ఈ మేరకు జ్యోతిని ఇండియాకు తీసుకురావాలని ఆమె భర్త మైగ్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించాడు. ఈ మేరకు కలెక్టర్ అత్యవసర చర్యలు తీసుకుని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని సురక్షితంగా ఇండియాకు చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థ జ్యోతిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు ఆ కేంద్రం నోడల్ అధికారి మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ శుక్రవారం తెలిపారు. -
సుదర్శనం.. సకల ఫలప్రదం
● అంతర్వేదిలో నిత్య హోమాలు ● 2010 నుంచి దేవస్థానంలో అమలు ● ఎఫ్‌డీల రూపంలో భక్తుల విరాళాలు సఖినేటిపల్లి: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి నారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఽఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభువుగా స్వామివారు వెలసినట్టు చరిత్ర చెపుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన మేరకు ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్య సుదర్శన హోమం స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధాలు, 16 భుజాలు కలిగిన సుదర్శన చక్రధారుడైన స్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛలు, ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కోసం ఈ హోమాలను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పదిహేను సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలో నిత్య సుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంత ఖర్చులతో ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు. కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ఆలోచించి, నిత్య నారసింహ సుదర్శన హోమం నిర్వహణకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించిన అనంతరం 2010 సంవత్సరంలో హోమాలను ప్రారంభించి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. రుసుములు ఇలా ఒక రోజుకు రూ.400 నెలకు రూ.4,000 మూడు నెలలకు రూ.10,000 ఆరు నెలలకు రూ.20,000 సంవత్సరానికి రూ.40,000 శాశ్వతం (పదేళ్లకు) రూ.1,00,000 -
పవన్ సభ కోసం.. పచ్చని చెట్లపై వేటు
పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది జనసేన నేతల తీరు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జాతీయ రహదారి పక్కన ఉన్న పలు చెట్లను నరికివేశారు. విషయం తెలియడంతో హైవే అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్లు ఎందుకు, ఎవరిని అడిగి నరుకుతున్నారని ప్రశ్నించారు. దీంతో, జనసేన కార్యకర్తలు వెనక్కు తగ్గారు. అయితే, అప్పటికే పచ్చగా ఉన్న సుమారు 10 చెట్లపై వేటు వేసేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడైనా సభ నిర్వహిస్తే చెట్లు నరికివేస్తున్నారంటూ ఏమీ జరగకపోయినా కూటమి నేతలు రచ్చ చేసేవారు. అటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు చెట్లు నరికివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ దూరం! మరోవైపు పవన్ సభకు కూటమి నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి పైన, సభా ప్రాంగణం వద్ద జనసేన జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు మచ్చుకు కూడా కానరావడం లేదు. కొంత కాలంగా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్ కలసి మాట్లాడుకుంటున్నా మండల, నియోజకవర్గ నాయకుల్లో మాత్రం అంతర్గత విభేదాలు, వారి మధ్య దూరాలు బలంగానే ఉన్నాయి. అందువల్లనే జనసేన నేతలు తప్ప, కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులెవ్వరూ సభా ప్రాంగణానికి రావడం లేదని పలువురు చెబుతున్నారు. -
రూ.1.26 కోట్ల ఎఫ్డీలు
అంతర్వేది దేవస్థానంలో నార సింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమి త్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.1,26,47,912 ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, అంతర్వేది దేవస్థానం మనోవాంఛా ఫలసిద్ధికి భక్తులు నారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం వల్ల మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కూడా సుదర్శన హోమం వల్ల సిద్ధిస్తుంది. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం జన్మ, జన్మల పుణ్యఫలం ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి విశేష పూజల్లో పాల్గొంటే జన్మ, జన్మల పుణ్యఫ లం సిద్ధిస్తుంది. అభిషేకం, సుదర్శన హోమం, ఆర్జిత సేవగా క ల్యాణం వంటివి జరుగుతున్నాయి. నిత్య అన్నదాన పథకంలో స్వామి ప్రసాదం తీసుకోవడం మహాద్భాగ్యం. – బాలాజీ, భక్తుడు, హైదరాబాదు -
సదాచారమున్నచోట కలి ప్రవేశించలేడు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సదాచారమున్న చోట కలి ప్రవేశించలేడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘స్వయంవరంలో నలుడిని దమయంతి వరించిందని తెలుసుకున్న కలి పురుషుడు వారిద్దరినీ కష్టాలపాలు చేయాలనుకున్నాడు. నలుడిలో ప్రవేశించడానికి కలి పురుషునికి 12 సంవత్సరాలు పట్టింది. మూత్రవిసర్జనానంతరం ఒకనాడు పాద ప్రక్షాళన చేసుకోకుండా సంధ్యోపాసన చేయడంతో నలుడిలోకి కలి ప్రవేశించగలిగాడు. ఎంత ఉపాసన, పాండిత్యం ఉన్నా సదాచారాన్ని వదిలిపెట్టరాదు. ఆచారాలు చాదస్తాలు కావు. అంటూసొంటూ, ఎంగిలీ అన్నిటినీ వదలి లలితా, విష్ణు సహస్రనామాలు చదివితే ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. ‘‘ద్యూతానికి నలుడిని పుష్కరుడు ఆహ్వానించగా, కలి ప్రభావంతో అతడు అంగీకరిస్తాడు. తన నేస్తమైన ద్వాపరుడి పాచికల్లో కలి ప్రవేశిస్తాడు. పరాజితుడైన నలుడు దమయంతీ సమేతంగా వనాలకు వెళ్తాడు. పిల్లలను పుట్టింటికి పంపించి భర్తను దమయంతి అనుసరిస్తుంది. ద్యూతమాడటం తన భర్త దోషం కాదని, అతనిలో ఏదో మోహం ప్రవేశించిందని గుర్తిస్తుంది. కష్టకాలంలో భర్తను అనుసరించాలి. దుఃఖ సమయంలో భర్తను ఓదార్చగల భార్యతో సమానమైన ఔషధం లేదని నలునితో అంటుంది. ‘నాస్తి భార్యా సమం మిత్రమ్’ అని ఆమె మాటను అంగీకరిస్తూనే, తనతో ఆమె కష్టాలు పడరాదని, పుట్టింటికి వెళ్లిపోవాలని నలుడు అంటాడు. అందుకు దమయంతి అంగీకరించదు. భార్యాభర్తల మాట తీరు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే– రామాయణంలో సీతారాముల సంభాషణ, భారతంలో యుధిష్ఠిర ద్రౌపదీ సంవాదాలు, నల దమయంతుల మాట తీరును పరిశీలించాలి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం నోరు మూసుకుని పడి ఉండాలంటూ వారు ఒకరినొకరు గద్దించుకోలేదు. పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉన్న మన దేశంలో భార్యాభర్తలు స్పర్థలతో విడిపోవడాలు, విడాకుల తగాదాలు బాధాకరం. అంతరించిపోతున్న మహాసంస్కృతి చివరి దశలో ఉన్నామేమో’’ అని సామవేదం ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను బట్టి భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకోరాదని, అవి శాశ్వతం కావని, ధర్మమొక్కటే శాశ్వతమని అన్నారు. శకుంతల, దమయంతి, ద్రౌపది, కుంతి వంటి పాత్రలు భారత సీ్త్ర ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని వివరించారు. -
అనుమతిపోయేలా..
● ఓపెన్ రీచ్‌లలో అధికారుల లీలలు ● సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో అనుమతులు ● గోదావరి నదీగర్భంలోకి నిషేధిత యంత్రాలు ● అవసరానికి మించి ఇసుక తవ్వేందుకు ‘పచ్చ’జెండా ● కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకేనని విమర్శలు సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అధికార యంత్రాంగం అర్రులు చాస్తోందా.. అందులో భాగంగానే గోదావరి నదిలో ఇసుక ఓపెన్ రీచ్‌లకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేస్తోందా.. అవసరానికి మించి ఇసుక తోడేసేందుకు మార్గం సుగమం చేస్తోందా.. ఒక రీచ్ పరిధిలో మరిన్న రీచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. నిబంధనలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తోందా.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నట్లు కనిపిస్తోంది. అడ్డగోలుగా అనుమతులు ● ఓపెన్ రీచ్‌ల అనుమతుల్లో అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. ఒక రీచ్‌ను పలు భాగాలుగా విభజించి మరీ కూటమి నేతలకు కట్టబెడుతున్నారు. కొవ్వూరు మండలం కుమారదేవంలోని ఒక ఓపెన్ రీచ్‌ను మూడు రీచ్‌లుగా మార్చారు. ● కుమారదేవం మెయిన్ రీచ్‌లో 72 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి విస్సీ ఇంజినీరింగ్ సంస్థకు ఈ ఏడాది మార్చి 13 నుంచి అక్టోబర్ 18 వరకూ అనుమతులు ఇచ్చారు. ఆ గడువు ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు ఇదే రీచ్‌లో మరో మూడు రీచ్‌లు పుట్టుకొచ్చాయి. ● శ్రీ పవన్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు 69,300 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు కుమారదేవం–2 పేరుతో గత అక్టోబర్ వరకూ అనుమతులిచ్చారు. ఇదే రీచ్‌లో 63 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు ఈవీ వెంకటరావు అనే కాంట్రాక్టర్‌కు గత అక్టోబర్ 23వ తేదీ వరకూ అనుమతులివ్వడం గమనార్హం. ● ఇవి చాలవన్నట్లు గత ఏప్రిల్ 16న మరో 8,85,000 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వుకునేందుకు నాగేంద్ర ఇన్ఫ్రాకు అనుమతులు ఇచ్చారు. దీని గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. ● కూటమి నేతలకు ఇష్టానుసారం దోచి పెట్టేందుకే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే రీచ్‌లో మరిన్ని రీచ్‌లో ఎందుకు, ఎవరికి కేటాయిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనుమతి ముగిసినా.. కుమారదేవం రీచ్‌కు అనుమతులు ముగిసినా ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షలు గడిస్తోంది. రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ 200కు పైగా లారీలతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు రహదారిపై ఇసుక లారీలు క్యూ కడుతున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది. రీచ్‌లకు అనుమతులున్నా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినా అదేమీ పట్టనట్లు ఇసుక కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘వాల్టా’కు తూట్లు ఇసుకాసురులు ఏపీ నీరు, భూమి, చెట్ల చట్టానికి (వాల్టా) సైతం తూట్లు పొడుస్తున్నారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు (సెమీ మెకనైజ్డ్) చేపట్టడం నిషేధం. అయినప్పటికీ, చట్టానికి తూట్లు పొడుస్తూ.. మైనింగ్ అధికారులే ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో అనుమతులు ఇస్తున్నారు. అలా ఎలా ఇస్తున్నారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అన్ని అనుమతులతో రీచ్‌ను దక్కించుకుని.. సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో చేపట్టాలన్నా.. నదిలోని ఇసుకను కూలీలతో మాత్రమే తవ్వించి ఒడ్డుకు తీసుకురావాలి. మూడు ఘనపు మీటర్ల ఇసుక మేట ఉంటే ఒక ఘనపు మీటర్ మాత్రమే తవ్వాలి. ఒడ్డుకు తెచ్చిన ఇసుకను యంత్రాలతో లారీల్లోకి లోడ్ చేసుకోవచ్చు. అదే సెమీ మెకనైజ్డ్ కాకపోతే ఇసుక తవ్వకాలు, లోడింగ్ కూడా కూలీలతోనే చేపట్టాలి. గోదావరి నదిలోకి యంత్రాలు, లారీలను తీసుకెళ్లరాదు. కానీ, కుమారదేవంతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలోని పలు ర్యాంపుల్లో ఇష్టానుసారం యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందలాదిగా లారీలను నదీ గర్భంలోకి తీసుకెళ్లి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అంత ఇసుక దేనికో? జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇసుక తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓపెన్ రీచ్‌ల ద్వారా 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది. బోట్ ర్యాంపుల ద్వారా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు సమకూరే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు కొత్త ర్యాంపులకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇన్ని ర్యాంపుల ద్వారా తవ్వేస్తున్న లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు.. జిల్లా ప్రజల అవసరం ఎంత అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు అనుమతులు ఇచ్చారు. ఆ ఇసుకే ప్రభుత్వ పనులకు, ప్రజలు, ప్రైవేటు అవసరాలకు సరిపోయింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మన జిల్లాలోనే కోటి మెట్రిక్ టన్నుల తవ్వేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఇతర జిల్లాల అవసరాలకని అధికారులు చెబుతున్నా అంత స్టాక్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం సైతం కుదేలైంది. భవన నిర్మాణాలు కూడా అనుకున్న రీతిలో సాగడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, వ్యక్తిగత భవన నిర్మాణాలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పరిమాణంలో ఇసుక దేనికనే మీమాంస నెలకొంది. రీచ్‌లలో సింహభాగం కూటమి నేతలకే కట్టబెట్టారు. తద్వారా అదనపు తవ్వకాలు, రీచ్‌లకు అనుమతులిచ్చి రూ.కోట్ల దోపిడీకి దారి చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గోదారమ్మకు గర్భశోకం
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లోదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబోడుస్తోంది. పది అడుగుల లోతు వరకూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతోంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా.. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరవయ్యాడు. మూడు రోజులుగా దందా సాగుతున్నా.. ఏ ఒక్క అధికారీ అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంట్రాక్టర్‌కు గడువు ముగిసినా.. నిడదవోలు నియోజకవర్గం ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో మూడు రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహిస్తుండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలిçంచి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు జేసీబీలు ఉపయోగించి మరీ.. యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి.. రీచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్‌కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలోకి యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ‘కానూరు–పెండ్యాల’ రీచ్‌లో ప్రతి రోజూ మూడు జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలో మీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి పది అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క ‘కానూరు–పెండ్యాల’ రీచ్ నుంచి ప్రతి రోజూ 400లకు పైగా లారీల ఇసుక అక్రమంగా తవి్వ, తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.లోతుగా తవ్వేయడంతో పైకొచ్చిన నీరు నెలకు రూ.10 కోట్ల దోపిడీ అసలే అక్రమ తవ్వకాలు ఆపై అధిక ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే.. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంప్‌లో 6 యూనిట్ల లారీ ఇసుక రూ.1,900 వందలకు విక్రయించాల్సి ఉంది. కానీ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్లోకి వెళ్లే సరికి కిరాయితో కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఇసుక లారీ ధర చేరుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రీచ్‌లలో ఇసుక టన్ను రూ.35 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక రూ.240 ధర పలుకుతోంది.6 యూనిట్లకు రూ.3,000 మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు–పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా రూ.6,500 దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క కానూరు–పెండ్యాల రీచ్ నుంచే ప్రతి రోజూ రాత్రి, పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతోంది. ఒక్కో లారీ ఇసుక రూ.6,500 చొప్పున రోజుకు 400 లారీలకు రూ.26 లక్షలు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మూడు రోజులుగా రూ.78 లక్షలు దండుకున్నట్లు విమర్శలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంప్ నుంచే నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పరిమితులు లేకుండా.. అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా.. పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా.. అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు..?, ఎక్కడికి తరలిస్తున్నారు..? అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు అందినట్లు ఆరోపణలున్నాయి. రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా... అధికారులను మేనేజ్ చేసేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇంత భారీ అక్రమం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరాపుతారు? అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారెవరన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటం, అధికారులకు ఇప్పటికే ఆమ్యామ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కలెక్టర్ స్పందిస్తేనే.. ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్‌లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మైనింగ్ అధికారుల లీలలు ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంపునకు 21.10.2024న టెండర్లు పిలిచారు. 13.03.2025 నుంచి 20.10.2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే.. కానూరు–పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంప్‌ను కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంపులోనే జరగాల్సి ఉన్నా.. కానూరు–పెండ్యాల ర్యాంప్‌లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతోంది. -
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
పసికందును అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఓ బాలింతకు సరైన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచింది. ప్రసూతి సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమెకు ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక రూపంలో ఇచ్చారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను చూస్తూంటే.. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడేందుకా.. తీసేందుకా.. అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలింత మృతి చెందిన రోజునే రాజమహేంద్రవరం నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి వచ్చారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదని, పేదల ప్రాణాలు పోయినా పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కనపడుతోందని దుయ్యబట్టారు. తల్లిని కోల్పోయి అనాథ అయిన పసికందుకు నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత సొసైటీలకు బకాయిలు చెల్లించండి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చేనేత సహకార సంఘాలకు నూలు సబ్సిడీగా రూ.47 కోట్లు, రుణ మాఫీ కింద రూ.47 కోట్లు, ఇతర పథకాల ద్వారా రూ.175 కోట్లను వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నేత నల్ల రామారావు చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆప్కో బకాయిలు సుమారు రూ.108 కోట్లు వెంటనే చెల్లిస్తే సొసైటీల ద్వారా చేనేత కార్మికులకు పనులు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 593 చేనేత సొసైటీలు మూత పడ్డాయని, మిగిలిన 448 సొసైటీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు పనుల్లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రూ.300 కోట్లను ప్రభుత్వం వెంటనే అందజేసి, లక్షలాదిగా ఉన్న కార్మికులను ఆదుకోవాలని కోరారు. హేమస్మితకు ఉత్తమ పురస్కారం దేవరపల్లి: పొగాకు బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మితకు ఉత్తర సేవా పురస్కారం లభించింది. 2024–25 పొగాకు అమ్మకాల కాలంలో ట్రేడర్లు, రైతుల మధ్య సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆమె వేలం ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 177 రోజులు వేలం నిర్వహించి 13.18 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిపించారు. ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాలతో పోల్చితే దేవరపల్లిలో వేలం ప్రక్రియ త్వరితగతిన ముగించారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలుండగా.. దేవరపల్లిలో కిలో పొగాకుకు అత్యధిక సగటు ధర రూ.311, గరిష్ట ధర రూ.453 పలికింది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి ఉత్తమ సేవలందించినందుకు గాను పొగాకు బోర్డు రాష్ట్రంలోని ఐదుగురు వేలం కేంద్రాల నిర్వహణాధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేసి, సత్కరించింది. గుంటూరులో బుధవారం సాయంత్రం జరిగిన సభలో హేమస్మితకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం
● విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు ● సీపీఐ, పీడీఎస్‌యూ నాయకులు‘యువగళం’లో కల్లబొల్లి కబుర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా కనీసం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించకపోవడం, రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయకపోవడం, పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూడటం దారుణమని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ విమర్శించారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామంటూ యువగళం పాదయాత్రలో లోకేష్ కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ సంక్షేమ హాస్టల్ సొంత భవనాల నిర్మాణానికి ఎక్కడా ఒక్క శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టళ్లలో పూర్తి స్థాయి మెనూ అమలు చేయడం లేదని, కనీసం సెంట్రల్ జైలు ఖైదీల మాదిరిగా కూడా ఆహారం పెట్టడం లేదని ఆరోపించారు. విద్యా వ్యాపారానికి రెడ్ కార్పెట్ పరిచారని దుయ్యబట్టారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కనీసం అధికారుల పరిశీలన కూడా లేకుండా పోయిందన్నారు. విద్యాశాఖ మంత్రి తన పని వదిలిపెట్టి పెట్టుబడులు కోసం కొత్త కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నామని, కొత్త కంపెనీలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఏమీ సాధించలేదని కిరణ్ కుమార్ విమర్శించారు. సమావేశంలో కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.భానుప్రసాద్, నగర కార్యదర్శి దినేష్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. ‘పీపీపీ’ని రద్దు చేయాలి అధికారంలోకి వస్తే 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తామని గత ఎన్నికల ముందే చెప్పి ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. పీపీపీ పేరుతో ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని 10 నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం గత సెప్టెంబర్ 9న జీఓ నంబర్ 590 జారీ చేయడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పరిధిలోకి తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్య సేవలకు 70 శాతం పడకలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మిగిలిన 30 శాతం చెల్లింపు పడకల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో పేదలకు వైద్యం అందని ప్రమాదం ఉంటుందన్నారు. దీంతోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కవని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజాగ్రహం ఎదుర్కొనక తప్పదని మధు హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరానికి శుక్రవారం రానున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు నిరసన సెగ తగలనుంది. విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, పీడీఎస్‌యూ నేతలు రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ప్రకటించారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
పీడీలు ఏరీ..!
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొరత ● ఉండాల్సింది ఏడుగురు ● ఉన్నది ఒక్కరు ● క్రీడల్లో వెనుకబడుతున్న విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ఇప్పటి వరకూ ఎటువంటి రూపురేఖలూ లేని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఘనంగా చెప్పారు. ఒలింపిక్స్ సంగతి అలా ఉంచితే.. అసలు క్రీడల అభివృద్ధిలో.. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇచ్చి తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) పాత్ర ఎంతో కీలకం. వీరు ఆయా కళాశాలల్లో క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. విద్యార్థి సలహా కమిటీల వంటి వాటిల్లో భాగస్వామిగా ఉంటూ అవసరమైన సూచనలు ఇస్తారు. వీరి విధుల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యం పీడీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. ఆరుచోట్ల ఇన్‌చార్జిలే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బొమ్మూరు, అనపర్తి, ద్రాక్షారామ, కాకినాడ, ఎటపాక, పిఠాపురం, కాకినాడ(మహిళ)ల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరో 18 ప్రైవేటు కళాశాలలున్నాయి. మొత్తం ఏడు ప్రభుత్వ కళాశాలలకు గాను కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రస్తుతం రెగ్యులర్ పీడీ ఉన్నారు. మిగిలిన అన్నిచోట్లా ఆయా కళాశాలల లెక్చరర్లనే ఇన్చార్జి పీడీలుగా నియమించి, ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. దీంతో, ఆయా లెక్చరర్లు అటు సబ్జెక్టుల బోధనకు.. ఇటు క్రీడా శిక్షణకు సమయం కేటాయించలేని దుస్థితి నెలకొంది. రెండు విధులూ నిర్వహించాల్సి వస్తూండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు. రెగ్యులర్ పీడీలు లేకపోవడంతో సరైన శిక్షణ లభించక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులు క్రీడా పోటీల్లో వెనుకంజ వేస్తున్న దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీడీలు ఉండటంతో అక్కడి విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో మెరుగైన శిక్షణ లభిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా పూర్తి స్థాయిలో పీడీలను నియమిస్తే వివిధ క్రీడల్లో మరింత మంది విద్యార్థులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తేడా స్పష్టం పీడీలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ రీజినల్ మీట్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత నైపుణ్యంతో మాత్రమే వివిధ పోటీల్లో విజయం సాధిస్తున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ తమకు తగిన మెళకువలు నేర్పాల్సిన పీడీలు లేకపోవడంతో వెనుకబడుతున్నామని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. ఈ మీట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 25 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే తమకు సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పూర్తి స్థాయి పీడీలను నియమించాలని వారు కోరుతున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్‌కు వేదికగా నిలిచిన బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సైతం రెగ్యులర్ పీడీ లేరు. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరరే ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. అయితే, రీజినల్ స్పోర్ట్స్ మీట్‌కు ప్రొఫెషనల్ పీడీ అవసరం కావడంతో కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పీడీని ఇన్చార్జిగా రప్పించుకోవాల్సి వచ్చింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు పూర్తి స్థాయిలో పీడీలను నియమించాలని పలు సంఘాల నాయకులు కోరుతున్నారు. -
‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’
● మంత్ర విద్య సంప్రదాయబద్ధంగా నేర్వాలి ● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడంటూ ధర్మరాజు చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన గురువారం కొనసాగించారు. ‘భీష్మ, ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థామ, కర్ణులను నిర్జించడానికి కావలసిన అస్త్ర సంపద మన వద్ద లేదని సోదరులకు ధర్మరాజు చెబుతాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఏకాంతంలోకి పిలిచి, ప్రతిస్మృతి విద్యను బోధించి, దీనిని అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు. ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించకుండా అన్నగారికి ఎందుకు ఉపదేశించాడనే సందేహం మనకు రావచ్చు. మంత్రవిద్యకు కొన్ని సంప్రదాయాలు, మర్యాదలు ఉన్నాయి. కొడుక్కి తండ్రి, తమ్ముడికి అన్న, భార్యకు భర్త మంత్రాన్ని ఉపదేశించవచ్చు’ అని వివరించారు. ‘నాకు నా మొగుడితో పడటం లేదు.. ఏదైనా మంత్రం చెప్పండని అడగరాదు’ అంటూ చమత్కరించారు. ‘‘భూలోక కాలగణన ప్రకారం ఐదు సంవత్సరాలు అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. అస్త్ర విద్యతో పాటు నీవు సంగీత నృత్యాలు నేర్చుకోవడం మంచిదని నాకు అనిపిస్తోదంటూ అతడికి ఇంద్రుడు చెబుతాడు. భారతీయ సంగీత నృత్యాలు దేవనిర్మిత కళలు. ఊర్వశి వంక అర్జునుడు ప్రత్యేకంగా చూశాడని గమనించిన ఇంద్రుడు.. అలంకరించుకుని అర్జునుడిని సేవించాలని ఆమెను ఆదేశిస్తాడు. అప్పటికే అర్జునుడిపై మరులుగొన్న ఊర్వశి సర్వాంగసుందరంగా అలంకరించుకుని అతడిని చేరుతుంది. ఆమెను చూసిన అర్జునుడు సిగ్గుతో తల వంచుకుని గురుభావంతో నమస్కరిస్తాడు. ఊర్వశి తన రాకలోని ఆంతర్యాన్ని వివరిస్తుంది. ‘నాకు కుంతి, మాద్రి ఎటువంటి వారో, శచీదేవి ఎటువంటిదో, నీవూ అటువంటి దానివే. నీవు నాకు తల్లిలా పూజ్యురాలివి. కొడుకులా నన్ను ఆదరించు’ అని అర్జునుడు అడుగుతాడు. దేవలోకంలో అటువంటి కట్టుబాట్లు లేవని ఊర్వశి అంటుంది. ‘నీవు కురువంశానికి మూలమైన పౌర వంశానికి చెందిన ఆదిజననివి. అందుకని నిన్ను అలా చూశాను కానీ, కామదృష్టితో కాద’ని అర్జునుడు చెబుతాడు. తనను తిరస్కరించినందుకు నీవు సిగ్గూ ఎగ్గూ లేకుండా సీ్త్రల మధ్య నపుంసకునిలా తిరుగుతావని ఆమె శపించింది. అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరమవుతుందని అర్జునుడితో ఇంద్రుడు అంటాడు. పితృపితామహుల నుంచి వచ్చిన రాజ్య సంపదలపై నీ బుద్ధి ఎందుకు నిలవడం లేదని ధర్మరాజును వనాలలో ద్రౌపది ఆక్షేపిస్తుంది. తాను ఏదో ఫలాన్ని ఆశించి ధర్మాచరణకు పూనుకోనని ధర్మరాజు చెబుతాడు. స్వర్గాది భోగాల కోసం ధర్మాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేస్తాడు. ధర్మం పాటించాలి కనుకనే ధర్మాన్ని ఆశ్రయిస్తున్నానని, ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడని, ధర్మం వ్యాపార వస్తువు కాదని అంటాడు’’ అని సామవేదం వివరించారు. -
ఎరువు.. కరవు
పెదపూడి: రబీ సాగు చేపట్టిన రైతులకు ఓవైపు సాగునీటి ఇబ్బందులు వెంటాడుతూండగా.. మరోవైపు అదునుకు ఎరువులు లభించని దుస్థితి నెలకొంది. పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) వద్ద ఎరువుల కోసం అన్నదాతలు గురువారం ఇలా పడిగాపులు పడ్డారు. ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ ఎరువు ఇస్తున్నట్లు పీఏసీఎస్ సిబ్బంది చెప్పారు. దీంతో, అన్నదాతలు సాగు పనులు పక్కన పెట్టి ఉదయాన్నే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది జాప్యం చేయడంతో మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. చివరకు కొంత మంది రైతులకు ఎరువులు అందలేదు. పీఏసీఎస్‌కు మళ్లీ ఎరువులు వచ్చిన తరువాత ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆ రైతులు నిరాశగా వెనుదిరిగారు. -
ఆకట్టుకున్న గణిత అష్టావధానం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గురువారం ఎం.నాగార్జున గణిత అష్టావధానాన్ని నిర్వహించారు. పృచ్ఛకులుగా ద్వితీయ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించారు. వింత చదరం అంశానికి సర్తాజ్, వార గణన అంశానికి సౌందర్య, 325తో భాగాహారం అంశానికి శ్రావణి, కారణాంకాలు అంశానికి రమ్యశ్రీ, వర్గ భేదం అంశానికి మృదుల, గుణకారం అంశానికి రమ్యసుధ, 7తో నిషిద్దం అంశానికి మాధురి, అప్రస్తుత ప్రసంగం సీనియర్ లెక్చరర్ కొమ్ముల వెంకట సూర్యనారాయణ నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున అవలీలగా సమాధానమిచ్చి ఆహుతులందరినీ అబ్బుర పరిచారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీహరి ధామాలు.. నవ పారిజాతాలు
● గోదారి తీరంలో జనార్దనుడి తొమ్మిది ఆలయాలు ● ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు.. భక్తుల సందడి ● నవగ్రహాల ఆరాధన ఈ దేవళాల్లో ప్రత్యేకత ఆలమూరు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ తీరంలో కొలువై ఉన్న నవ జనార్దనస్వామి ఆలయాలు సంక్రాంతి ముగిసే వరకూ దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తులతో సందడి చేయనున్నాయి. ధనుర్మాసంలో ఈ నవ జనార్దనులను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి నవగ్రహ దోషాలు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. అందులో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు ఈ దేవాలయాలను ఏటా దర్శించుకుంటారు. సాధారణంగా నవగ్రహ ఆలయాలు శైవ క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి. అందులో భక్తులు నవగ్రహ శాంతి పూజలు నిర్వహించుకుంటారు. అయితే ఈ నవ జనార్దనస్వామి ఆలయాల్లో కూడా నవగ్రహ పూజలు జరుగుతాయి. స్వయంభూగా భాసిల్లుతూ.. ఈ నవ జనార్దనులు స్వయంభూగా భాసిల్లుతున్నారు. సోమకాశురుడనే రాక్షసుడు చతుర్వేదాలను నాశనం చేసే క్రమం నుంచి రక్షించాలన్న దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును వేడుకుంటాడు. క్షీరసాగరం నుంచి శ్రీమహావిష్ణువు భూమిపైకి వచ్చి రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తాడు. అదే సమయంలో నారద మహాముని ఆకాశం నుంచి భువికి తపస్సు చేసుకునేందుకు వస్తాడు. నవ గ్రహాల ప్రభావంతో జనులు కష్టాలు పడుతున్నారని గుర్తించిన నారద మహాముని వైకుంఠం వెళ్లి శ్రీమహావిష్ణువుకు వివరిస్తాడు. జనులను కష్టాల నుంచి విముక్తులను చేయాలని వేడుకుంటాడు. అందులో భాగంగానే శ్రీమహా విష్ణువు ప్రజల రక్షణార్థం గౌతమీ గోదావరి తీరం వెంబడి తొమ్మిది ప్రదేశాల్లో స్వయంభూగా వెలిశాడని పండితులు చెబుతున్నారు. స్వయంభూగా వెలసిన విగ్రహాల వద్ద నారద మహాముని ఆలయాలను నిర్మించాడని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ముద్రల రూపంలో దర్శనం నవ జనార్ధనస్వామి ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ముద్రల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్శనంతో సుఖశాంతులు రాష్ట్రానికే గాక యావత్ భారతావనికి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈ నవ జనార్దన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలను సందర్శిస్తే నవ గ్రహదోషాల నివారణ జరుగుతుంది. సుఖశాంతులు కలుగుతాయి. – అంగర గోపాల కృష్ణమాచార్యులు, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సంధిపూడి -
ధవళేశ్వరంలో యోగ ముద్రలో..
నవ జనార్థనస్వామి ఆలయాల్లో ప్రథమమైన ధవళేశ్వరంలో బ్రహ్మచారిగా భాసిల్లుతున్న శ్రీజనార్దన స్వామి యోగ ముద్రలో దర్శనమిస్తాడు. ఉగ్రరూపంలో ఉన్న జనార్దనస్వామిని శాంతింపజేయాలన్న భక్తుల సంకల్పం మేరకు ఆలయంలో మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. మడికిలో సుదర్శన ముద్ర 216 ఏ జాతీయ రహదారిలోనున్న మడికిలో ద్వితీయంగా వెలసిన శ్రీజనార్దనస్వామి సుదర్శన ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. తూర్పు ముఖంగా వెలసి ఉన్న ఈ ఆలయంలో విగ్రహం పాదాలకు ప్రాతఃకాలంలో సూర్య కిరణాలు ప్రతి రోజు తాకుతుండటం విశేషం. -
వందే మాతరం స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణేన్ని తాను సేకరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 32 గ్రాముల బరువుతో ఉండే ఈ నాణేన్ని నికెల్, సిల్వర్ మిశ్రమంతో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు రూ.150 ముఖ విలువ, మరో వైపు బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వంద మాతరం’ అని నినదిస్తున్న చారిత్రాత్మక దృశ్యం ముద్రించారు. ఆవుకు కవల దూడలు రాయవరం: సాధారణంగా ఆవుకు లేదా గేదెకు ఒక ఈతలో ఒక దూడ జన్మిస్తుంది. అయితే మండలంలోని లొల్లలో ఆవుకు కవల దూడలు జన్మించాయి. గ్రామానికి చెందిన పాడి రైతు జొన్నగంటి త్రిమూర్తులుకు చెందిన ఆవుకు రెండు పెయ్య దూడలు గురువారం జన్మించాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపాడు. పత్ర గణపతి! పెద్దాపురం (సామర్లకోట) : లేత కొబ్బరి ఆకులతో పెద్దాపురం మరిడమ్మ ఆలయ సిబ్బంది తయారు చేసిన వినాయకుడి బొమ్మ ఆకట్టుకుంటోంది. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. -
బీసీ సంక్షేమ కార్యాలయంపై ఏసీబీ దాడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): లంచం తీసుకుంటూండగా కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహా ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి తండ్రి అంబేడ్కర్ ఈ ఏడాది జూలై నెలలో చనిపోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెన్షన్ ఖరారు, కారుణ్య నియామకం కోసం బీసీ వెల్ఫేర్ అధికారులను చక్రవర్తి సంప్రదించగా వారు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. చివరకు మధ్యవర్తి యాదల సత్యనారాయణ ద్వారా జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారపు ఎస్ఎస్ ప్రసాద్ రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే, లంచం ఇవ్వడం ఇష్టం లేని చక్రవర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా గురువారం రూ.40 వేలు ఇస్తూండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్‌కుమార్, సీఐలు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ ఆధ్వర్యంలో వారిని అరెస్టు చేశారు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. వారిని రాజమహేంద్రవరంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి సంబంధించిన సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా మొబైల్ నంబర్ 94404 40057కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కిషోర్ కుమార్ ప్రజలకు సూచించారు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు, ఒక దళారి -
క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిత
రాజమహేంద్రవరం రూరల్: విద్యతో పాటు క్రీడలలో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఆకుల మురళి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పలివెల రాజు మాట్లాడుతూ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత ఆహార అలవాట్ల నేపథ్యంలో క్రీడలతో పాటు యెగా, మెడిటేషన్ చేయాలన్నారు. రాజమహేంద్రవరం మహిళాజైలు సూపరింటెండెంట్ వసంత కె.చెట్టి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావు, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్భాషా విజేతలను అభినందించారు. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న కాకినాడ ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావును, కోచ్ వెంకటరమణను సత్కరించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్స్ వీరే... మెన్స్ విభాగంలో ఇండివిడ్యువల్ చాంపియన్‌గా జి.అవినాష్‌కుమార్ (ఆదిత్య ఇంజినీరింగ్, సూరంపాలెం), స్పోర్ట్స్ విభాగంలో చాంపియన్‌గా ఆదిత్య ఇంజినీరింగ్ (సూరంపాలెం), గేమ్స్ విభాగంలో చాంపియన్ ఆంధ్రా పాలిటెక్నిక్ (కాకినాడ), ఓవరాల్ చాంచాయన్ ఆంధ్రాపాలిటెక్నిక్(కాకినాడ) నిలిచాయి. వుమెన్స్ విభాగంలో ఇండువిడ్యువల్ చాంపియన్‌గా వేగుల ప్రసన్న (ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, కాకినాడ), స్పోర్ట్స్, గేమ్స్ చాంపియన్‌తో పాటు ఓవరాల్ చాంపియన్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ (కాకినాడ) నిలిచింది. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఓఎస్డీ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ టీమ్ వుమెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ టీమ్ ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025 -
రాజమహేంద్రవరంలో రెయిన్బో ఆసుపత్రి సేవలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెయిన్బో ఆసుపత్రి సేవలు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చాయని ఆ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల గురువారం తెలిపారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ఆస్పత్రిని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లా వాసులకు అధునాతన నియోనాటల్, పీడీయాట్రిక్ ఇన్సెంటివ్ కేర్, జనరల్ పీడియాట్రిక్, బర్త్ రైట్స్ ప్రసూతి, గైనకాలజీ, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సులు అధునాతన క్లినికల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆవిష్కరణతో రాజమహేంద్రవరం ఒక కీలకమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంటుందన్నారు. తమ సంస్థ 25 సంవత్సరాల వారసత్వ అనుభవంతో దేశంలో అతి పెద్ద నెట్వర్క్ కలిగి, తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం చూరగొందన్నారు. గతంలో రెయిన్ బో ఆసుపత్రి సేవలు పొందాలంటే మెట్రో నగరాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో ముఖ్య అతిథి తేజస్విని మతుకుమల్లి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ప్రారంభించినందుకు రెయిన్ బో బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. అత్యున్నత నాణ్యతా చికిత్సలు ఈ ప్రాంత వాసులకు కల్పించడమే కాకుండా తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందన్నారు. డాక్టర్ దినేష్ చిర్లా, డాక్టర్ ప్రణతీరెడ్డి, నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. -
జొన్నాడలో అభయం
జొన్నాడలో వెలసిన శ్రీజనార్థనస్వామి అభయ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ స్వామిని కొలుస్తారు. భక్తులు సమీపంలోని గోదావరిలో స్నానమాచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఆలమూరులో ఉగ్ర రూపం ఆలమూరులో ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రథ సప్తమి రోజున భారీగా స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. కపిలేశ్వరపురంలో పద్మాసనంలో.. పూర్వం ఇక్కడి ఆలయం దోపిడీకి గురైంది. దీంతో అప్పటి అర్చకులు జనార్దనస్వామి విగ్రహాన్ని భూమిలో భద్రపరిచారు. కొన్నేళ్లు కిందట ఈ విగ్రహం బయట పడటంతో ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించారు. ఈఆలయంలో జనార్థునుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు. మాచర జ్వాలాముద్ర నవ జనార్దన ఆలయాల్లో సప్తమ క్షేత్రంగా భాసిల్లుతున్న మాచరలో స్వామి జ్వాలాముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. రథ చక్రాకృతిలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద కోరుమిల్లిలో సాధక ముద్ర గౌతమీ నది చెంతన అష్టమ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెద కోరుమిల్లిలోని స్వామి సాధక ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. -
మండపేటలో భోగ ముద్ర
మండపేటలో వేంచేసియున్న స్వామి భోగ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కపిలేశ్వరపురం మండలంలోని దాతపురిగా ప్రఖ్యాతిగాంచిన తాతపూడిలోని గోదావరి చెంతన తొలుత ఈ ఆలయం ఉండేది. వరదల వల్ల దేవాలయం దెబ్బతినడంతో పండితుల సలహా మేరకు మాండవ్యపురం (మండపేట)కు ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ జనార్దనుడితో పాటు ఆగస్త్యేశ్వర, కై లాసేశ్వర స్వాముల ఆలయాలు ఉండటం ప్రత్యేకత. కోటిపల్లిలో సిద్ధ ముద్ర భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా గోదావరి నదీ తీరాన కోటిపల్లిలో వైష్ణ, శైవ క్షేత్రాలు ఒకే శిఖరం కింద, ఒకే ధ్వజస్తంభంతో వేర్వేరు గర్భ గుడుల్లో ఉన్నాయి. ఇక్కడ జనార్దనస్వామి సిద్ధ ముద్రలో కనిపిస్తారు. ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుంటే సకల పాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. -
పోలవరం.. మళ్లీ అదే తప్పు చేస్తున్న చంద్రబాబు!: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్‌కు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధమే లేదు. తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది.. ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం. వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది. గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు. -
పుంజుకున్న పెంపకం..
నిడదవోలు: సంక్రాంతి.. ఈ పేరు అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు పెట్టింది పేరు. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం పందేలకు సై అంటారు. పండగ సమీపిస్తుండడంతో కోడి పుంజుల వేటలో పందెం రాయుళ్లు ఉంటే, మరోపక్క నిర్వాహకులు మూడు నెలల నుంచి పుంజుల పెంపకంలో నిమగ్నమవుతున్నారు. వీరు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఏటా బరుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేలకు అవసరమైన పుంజులను రెడీ చేస్తున్నారు. ఈ సీజన్లో పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిపై వ్యాపారం చేసే కొందరు ముందుగా పెంచిన పుంజులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పందెం రాయుళ్లు పుంజుల వేట మొదలుపెట్టారు. వారికి కావాల్సిన రంగు, సైజుల్లో ఉన్న పుంజులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండడంతో పుంజులను కంటికి రెప్పలా చూసుకుంటూ వాటికి అవసరమైన సఫారీలు చేస్తున్నారు. ప్రధానంగా కాకి, డేగ, నెమలి, పరదా, పచ్చకాకి, పెట్టమారు, రసంగి, తీతువా, మైలియా, సింగాలి వంటి రకాల పుంజులను పెంచుతున్నారు. డిమాండ్‌ను బట్టి.. కత్తులు కట్టి బరిలో దింపే పుంజుల ధరలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కోడి పుంజుల జాతులను పందెం రాయుళ్లు పలు రకాలుగా పిలుస్తారు. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. సరైన పందెం పుంజు దొరికితే ఎంత ధరైనా ముట్టజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా సేతువు జాతి కోడి మీద పందేలు జోరుగా కాస్తారు. దీని ధర రూ.70 వేల వరకూ పలుకుతోంది. అలాగే వర్ల రకం కోడి ధర రూ. 50 వేలు ఉంది. నెమలి రకం కోడి పుంజు ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలుకుతోంది. కాకి డేగ, పర్ల రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్ర కెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి, డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి పెంపకందారులు ధరను అమాంతం పెంచుకుపోతున్నారు. రసంగి, సేతువా, కెక్కరి, పూల, అబ్రాసు, రసంగి, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ వంటి రకాల కోడి పుంజులు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరకు పందెం రాయుళ్లు కొనుక్కుపోతున్నారు. పౌష్టికాహారం.. ఆపై వ్యాయామం పుంజులను రోజూ ఈత కొట్టించడంతో పాటు వేడి నీళ్లతో స్నానం చేయించి శక్తివంతమైన పుంజులుగా తయారు చేస్తున్నారు. నవంబర్ మాసం నుంచి వీటికి గంట్లు, చోళ్లు, గుడ్లు, పిస్తాలు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, నల్ల నువ్వులు, తాటి బెల్లం, మటన్ కై మా, నాస్తా వంటివి ఆహారంగా ఉదయం, సాయంత్రం ఇస్తున్నారు. పౌష్టికాహారం తీసుకున్న పుంజులకు అరుగుదలకు, బద్దకం, నీరసం రాకుండా రోజూ వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను నిర్మించి వాటిలో రోజు ఉదయం ఊత కొట్టిస్తున్నారు. కోళ్ల పెంపకందారులు, పందెం రాయుళ్లు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందెలకు సిద్ధం చేస్తున్నారు. కొందరు అదనంగా విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ప్రత్యేక ఆహారంతో పెంచుతూ సంక్రాంతి బరిలోకి సిద్ధం చేస్తున్నారు. అబ్రాసు జాతి పుంజు ముహూర్తాలు చూసి మరీ.. సేతువా, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు వంటి జాతి పుంజులు బరిలో దిగితే నువ్వా.. నేనా అనేలా తలపడతాయి. సేతువు రకం తెల్ల కోడిపుంజు బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు గాయాలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా కొనఊపిరి వరకూ పోరాడుతుంది. డేగ మీద కూడా ఎక్కువగా పందేలు కడతారు. ఇది కూడా బరిలో పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. కొందరు కోడి పుంజుల జాతి పేర్ల ప్రకారం ముహూర్తాలు చూసుకుని మరీ పందేలు కాస్తారు. కోడి జాతిని బట్టి ఏ దిక్కుకు వెళ్లాలి, ఏ సమయంలో పుంజులను బరిలో దింపాలో ముందుగానే ముహూర్తాలు చూసుకుంటారు. రూ.కోట్లలో జూదం సంక్రాంతి పండగ మూడు రోజులూ ఈ కోళ్లతో ఏటా రూ.కోట్ల జూదం జరుగుతోంది. కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం, కాట్రేనికోన, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, నల్లజర్ల, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లో భారీ స్థాయిలో బరులు నిర్వహిస్తారు. నిడదవోలు పట్టణంలో ఫ్లడ్ లైట్లు, భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ పందేలు జరుపుతారు. పందెం కోళ్లకు రాజభోగాలు సంక్రాంతి బరిలో దింపేందుకు తర్ఫీదు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర -
ఏటీఎం మార్చి ఏమార్చి..
● జల్సాలకు అలవాటు పడి చోరీలు ● పోలీసుల అదుపులోకి నిందితుడు అనపర్తి: ఏటీఎంల వద్దకు వస్తున్న అమాయక ప్రజలే అతని టార్గెట్.. వారిని మాటల్లోకి దించి, ఆపై ఏటీఎంలు మార్చి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు.. మళ్లీ కటకటాల్లోకి పంపారు.. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న అతన్ని అనపర్తి పోలీసులు మంగళవారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బుధవారం అనపర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య వివరాలు వెల్లడించారు. నెల్లూరు పట్టణానికి చెందిన కందూకూరు ఫణీంద్ర బీటెక్ చదివాడు. అతను జల్సాలకు అలవాటు పడి చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎంల వద్ద చదువు రాని, వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడంలో సహాయం చేసినట్లు నటించి వారి ఏటీఎం కార్డును తస్కరిస్తాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డును వారికిచ్చి, అనంతరం అసలు ఏటీఎం ఉపయోగించి వారి ఖాతాల్లోని సొమ్ము డ్రా చేసి ఉడాయిస్తాడు. ఈ ఏడాది మార్చి నెల 13న అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా, మాటలు కలిపి ఏటీఎం కార్డును తస్కరించాడు. అనంతరం ఫణీంద్ర రూ.35 వేలు విత్ డ్రా చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పలు జిల్లాల్లో నమోదైన 7 కేసుల్లో శిక్ష అనుభవించినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. 2024 నుంచి తాడేపల్లిగూడెంలో ఉంటూ అనపర్తి, జగ్గంపేట, మండపేట టౌన్, రాజమహేంద్రవరం, అత్తిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు పాల్పడగా, వచ్చిన సుమారు రూ.1.70 లక్షలతో కారును కొనుగోలు చేసి జల్సా చేస్తున్నాడని డీఎస్పీ వివరించారు. ఫణీంద్ర నుంచి కారు, నేరాలకు ఉపయోగించిన 10 ఏటీఎం కార్డులను సీజ్ చేశామన్నారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో త్వరితగతిన కేసును ఛేదించడంలో శ్రమించిన ఎస్సై శ్రీనునాయక్‌ను, ఆయన బృందాన్ని డీఎస్పీ అభినందించారు. -
వెంకన్న హుండీ ఆదాయం రూ.1.56 కోట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,56,31,085 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం బుధవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1,28,07,874, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.28,23,211 ఽఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి కిలో 150 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు 43 వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా దేవదాయ శాఖ ఏసీ, అండ్ అంతర్వేది దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్– 3 ఈఓ ఎం.సత్యనారాయణ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి... కొల్లగొట్టి
● ఆగని మట్టి అక్రమ తవ్వకాలు ● రెచ్చిపోతున్న మాఫియా కొత్తపేట: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పలువురు మట్టి వ్యాపారులు ప్రైవేట్ భూముల్లోనే కాదు.. నదీ పరీవాహక ప్రభుత్వ భూముల్లో సైతం మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం పట్టడం లేదనే విమర్శలున్నాయి. కొత్తపల్లి మండలం మందపల్లి, నారాయణలంక, కొత్తపేట సూర్యగుండాల పాయ ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ కొందరు నేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టి తవ్వి, తరలిస్తున్నారు. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా పక్క రోడ్లలోనే కాదు.. నిర్భయంగా ప్రధాన ఆర్అండ్బీ, జాతీయ రహదారులపై అధికారుల కళ్లముందే ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా వాటిని ఖాతరు చేయడం లేదు. ‘కూటమి’గా ఏర్పడి మట్టి దందా నిర్భయంగా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైతులు నిబంధనలకు విరుద్ధంగా తమ చేలల్లో మట్టిని లోతుగా తవ్వుకునేందుకు పెద్ద మొత్తానికి విక్రయించగా, పక్క చేలు విరిగిపోతాయని బాధిత రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో అధికారులు వెళ్లి నిలిపివేస్తున్నా, చర్యలకు పలువురి నేతల నుంచి ఫోన్లు రావడంతో వారు వెనుతిరుగుతున్నారని తెలుస్తోంది. పలుచోట్ల గౌతమి, వశిష్ట నదీ పరీవాహక లంక భూముల్లో ఎక్కువగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పుంత రోడ్లు, పక్క రోడ్లు వెంబడి తరలిస్తుంటే, కొన్నిచోట్ల ప్రధాన రహదారుల నుంచి తీసుకెళ్తున్నారు. -
పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతం, వనపర్వంలోని పలు అంశాలను వివరించారు. పరమాత్మ తప్ప రక్షకులు లేరని నాటి సభలో నిరూపణ అయిందని ఆమె అంటుంది. కృష్ణ పరమాత్మ ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో తాను ద్వారకలో లేనని, ఉంటే ఇలా జరిగేది కాదని అంటాడు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ఇచ్చి, ఆమెను కాపాడిన కృష్ణుడు తాను ద్వారకలో లేకపోవడం వలన ఈ అనర్థం జరిగిందని చెప్పడంలో అంతరార్థం మనం తెలుసుకోవాలని అన్నారు. నీలకంఠీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి, ద్వారక అంటే నవద్వారాలు కల శరీరమని ఆయన వివరించారు. ద్రౌపదిని దుశ్శాసనాదులు అవమానిస్తుంటే, పాండవుల స్మరణలో కృష్ణుడు లేడు, వారు విధి బలీయమైందని అనుకున్నారే కానీ, కృష్ణ స్మరణ చేయలేదు. బుద్ధి ప్రపంచం వైపు తిరిగితే పరమాత్మ కనిపించడు, ఆయన వైపు తిరిగితే కనిపిస్తాడని సామవేదం అన్నారు. పాండవులు వనాలకు తరలిపోయాక, ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుని పిలిచి, తనకు హితం ఏది కలిగిస్తుందో చెప్పమంటాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి వేయాలి, దుశ్శాసనుడు తాను చేసిన అకృత్యానికి నిండు సభలో పాండవులను క్షమించమని అడగాలి. నీవు దుర్యోధనుని వదిలివేస్తే, అందరూ క్షేమంగా ఉంటారని విదురుడు చెబుతాడు. దానికి తీవ్ర కోపంతో ధృతరాష్ట్రుడు విదురుని నిందించి, నీవు ఉంటే ఉండు, పోతే పొమ్మని అంటాడు. విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెడతాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో సంజయుని పంపి, విదురుని చేర తీసుకుంటాడని సామవేదం అన్నారు. దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు తెలుసుకున్న వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేయమని, లేని పక్షంలో దుర్యోధనుని అడవులకు పంపి పాండవులతో చెలిమి చేయమని అంటాడు. సత్పురుషులతో వైరం ప్రమాదకరం, స్వజనులతో వైరం అంతకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. హితం ఉపదేశించడానికి వచ్చిన మైత్రే య మహర్షి మాటలను లక్ష్యపెట్టక, వినయరాహిత్యంతో దుర్యోధనుడు తన కాలిని ముందుకు చాచి తొడ మీద కొట్టుకుంటాడు. పాండవులతో శాంతియుతంగా జీవించకపోతే, ధర్మయుద్ధంలో భీముడు నీ తొడను పగలగొడతాడని మైత్రేయ మహర్షి దుర్యోధనుని శపిస్తాడని సామవేదం వివరించారు. వంచన చేసి సుఖపడాలనుకున్నవాడు వధ్యుడేనని సామవేదం అన్నారు. -
వెంకటరమణ చౌదరికే పగ్గాలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం దాదాపు ఖాయమైంది. దీంతో ఆరు నెలలుగా అధ్యక్ష ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర పడింది. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి జిల్లా రథసారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకటరమణ చౌదరికి పదవి కట్టబెట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దళితులకు పదవి కేటాయించాలన్న డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది. కానీ చౌదరికి అధిష్టానం అండదండలు, మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పదవి వరించింది. ఇదిలా ఉంటే సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందన్న వాదన ఆయా వర్గాల్లో వెల్లువెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యవహరించేవారు. ఆయనకు రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఆరు నెలలుగా అధ్యక్షుడి స్థానం ఖాళీగానే ఉంది. సీనియర్లకు మళ్లీ భంగపాటు ● సైకిలెక్కేందుకు జిల్లాలో పలువురు నేతలు పోటీ పడ్డారు. వారి స్థాయిలో పావులు కదిపారు. సీనియర్ నేత గన్నికృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పదవిని ఆశించి భంగపడ్డారు. సీనియర్ నేత గన్నికృష్ణ వర్గం నేతలు సైతం త్రిసభ్య కమిటీ ఎదుట ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. గన్నికృష్ణ ఇప్పటికే రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ నేత కావడంతో పదవి దక్కుతుందన్న భావనలో ఆయన వర్గం నేతలు ఉన్నారు. ● టీడీపీలో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ పరిణాం టీడీపీ సీనియర్ నేతలకు మింగుడుపడటం లేదు. పార్టీ పటిష్టతకు పాటుపడే వారికి గుర్తింపు దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎట్టకేలకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కొలిక్కి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి రేసులో సీనియర్ నాయకులు గన్ని కృష్ణ, ముళ్ళపూడి బాపిరాజు లోకేష్ ఆశీస్సులు ఉన్న వెంకటరమణ చౌదరికే పట్టం సీనియర్ నేతలకు మరోసారి మొండిచేయి ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆశాభంగం -
గోదారమ్మకు గర్భశోకం
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లోదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోంది. పది అడుగుల లోతు వరకూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతోంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా.. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరవయ్యాడు. మూడు రోజులుగా దందా సాగుతున్నా.. ఏ ఒక్క అధికారీ అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంట్రాక్టర్‌కు గడువు ముగిసినా.. నిడదవోలు నియోజకవర్గం ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో మూడు రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహిస్తుండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు జేసీబీలు ఉపయోగించి మరీ.. యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి.. రీచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్‌కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలోకి యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ‘కానూరు–పెండ్యాల’ రీచ్‌లో ప్రతి రోజూ మూడు జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలో మీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి పది అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క ‘కానూరు–పెండ్యాల’ రీచ్ నుంచి ప్రతి రోజూ 400లకు పైగా లారీల ఇసుక అక్రమంగా తవ్వి, తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. నెలకు రూ.10 కోట్ల దోపిడీ అసలే అక్రమ తవ్వకాలు ఆపై అధిక ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే.. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంప్‌లో 6 యూనిట్ల లారీ ఇసుక రూ.1,900 వందలకు విక్రయించాల్సి ఉంది. కానీ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్లోకి వెళ్లే సరికి కిరాయితో కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఇసుక లారీ ధర చేరుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రీచ్‌లలో ఇసుక టన్ను రూ.35 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక రూ.240 ధర పలుకుతోంది. 6 యూనిట్లకు రూ.3,000 మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు–పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా రూ.6,500 దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క కానూరు–పెండ్యాల రీచ్ నుంచే ప్రతి రోజూ రాత్రి, పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతోంది. ఒక్కో లారీ ఇసుక రూ.6,500 చొప్పున రోజుకు 400 లారీలకు రూ.26 లక్షలు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మూడు రోజులుగా రూ.78 లక్షలు దండుకున్నట్లు విమర్శలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంప్ నుంచే నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పరిమితులు లేకుండా.. అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా.. పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా.. అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు..?, ఎక్కడికి తరలిస్తున్నారు..? అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు అందినట్లు ఆరోపణలున్నాయి. రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా... అధికారులను మేనేజ్ చేసేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇంత భారీ అక్రమం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరాపుతారు? అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారెవరన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటం, అధికారులకు ఇప్పటికే ఆమ్యామ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కలెక్టర్ స్పందిస్తేనే.. ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్‌లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. లోడింగ్‌కు రీచ్‌లోకి లారీలు, ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో ఇసుకను లారీల్లో నింపుతున్న జేసీబీమైనింగ్ అధికారుల లీలలు ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంపునకు 21.10.2024న టెండర్లు పిలిచారు. 13.03.2025 నుంచి 20.10.2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే.. కానూరు–పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంప్‌ను కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంపులోనే జరగాల్సి ఉన్నా.. కానూరు–పెండ్యాల ర్యాంప్‌లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతోంది. నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్న ఇసుక మాఫియా పది అడుగుల లోతు వరకూ యంత్రాలతో తవ్వకాలు ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్‌లో దర్జాగా దందా మూడు రోజులుగా నిరాటంకంగా అక్రమ బాగోతం అనుమతులు లేకపోయినా బరితెగింపు మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో సహజ సంపద దోపిడీ ప్రతి రోజూ 400 లారీలకు పైగా అక్రమ రవాణా రూ.కోట్లు దండుకుంటున్న కూటమి నేతలు మామూళ్ల మత్తులో కన్నెత్తి చూడని మైనింగ్, రెవెన్యూ అధికారులు -
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. అవధానం చేపట్టిన తొలి అడుగుల్లోనే తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్కృతం అనగానే క్లిష్టమైనదని భావించి నేర్చుకోవడానికి కూడా భయపడే నేటి రోజుల్లో, ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో స్థిరపడిన 13 ఏళ్ల బాలిక అవలీలగా సంస్కృతాన్ని ఉచ్చరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన అష్టావధానాన్ని చేస్తూ ఘనాపాఠీలను సైతం ఔరా అనిపిస్తోంది. అంతటితో ఆగకుండా సంస్కృతంతోపాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలను అవలీలగా మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ చిన్నారి చెప్పే మాటలు వినడానికి వేద పండితులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం. ఇంజరంలో పుట్టి.. బెంగళూరులో పెరిగి.. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన నరసింహదేవర మైథిలీనాథ్ వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ హెచ్ఏఎల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కిరణ్మయి గృహిణి. వీరి గారాల పట్టి నరసింహదేవర జయలక్ష్మికి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. కుటుంబ నేపథ్యం, బాల్య దశ నుంచే సంస్కృతం సాహిత్యాభిలాషతో, శాసీ్త్రయ శిక్షణతో అవధానంలో అడుగుపెట్టింది. తాత సుబ్బారావు సూచనతో బెంగళూరు పూర్ణ ప్రమతి గురుకుల పాఠశాలలో జయలక్ష్మిని చేర్చించి సంస్కృతం నేర్పించారు. కాశీలో తొలి అష్టావధానం ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ మహానగరంలో జయలక్ష్మి ఈ ఏడాది అక్టోబర్ 26న సంస్కృతంలో తొలి అష్టావధానం చేసింది. అలాగే మధునాపంతుల సత్యనారాయణమూర్తి సూచనలతో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రెండో అష్టావధానం చేసి అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులో రాణిస్తున్న జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు.. జయలక్ష్మిలో ఉన్న విశేష ప్రతిభను గుర్తించి తమ పాఠశాలకు తీసుకువచ్చి సత్కరించాం. తమ విద్యార్థులకు సంస్కృత భాషపై అవగాహన కల్పించడంతో పాటు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐదు భాషల్లో అవలీలగా మాట్లాడుతున్న జయలక్ష్మిని చూసి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు. –టీవీఎస్ఎస్వీ ప్రసాదరావు, హెచ్ఎం, రీజెన్సీ హైస్కూల్ ఫ సంస్కృతంలో అష్టావధానం చేస్తున్న బాలిక ఫ జయలక్ష్మికి ప్రశంసల వెల్లువ -
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ప్రతిభ
బాలాజీచెరువు: రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో కాకినాడ గంగరాజునగర్ ఆదిత్య హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. షేక్ అబ్దుల్ షాహుల్ నవాజ్ (7వ తరగతి) ప్రథమ ర్యాంకు, ధైర్య సుమిత్ రామ (9వ తరగతి) ప్రథమ ర్యాంకును సాధించారు. జిల్లా స్థాయిలో అన్నమదేవర అభిరామ్ (6వ తరగతి) ప్రథమ, మోతూరి క్రిమ్సన్ (8వ తరగతి) రెండో ర్యాంకు, గుడివాడ వెంకట శివరామ అఖిలేష్ (9వ తరగతి) మొదటి ర్యాంకు, దంగేటి రోహిత్‌బాబు (10వ తరగతి) రెండో ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జె.మొయినా తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఆదిత్య సంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి అభినందించారు. -
పలువురికి కారుణ్య నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తూ మరణించిన వారి వారసులు 31 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ 23 మందిని జూనియర్ సహాయకులుగా, 8 మందిని టైపిస్ట్‌లుగా నియమించినట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నియామకాలను పారదర్శకంగా చేపట్టామన్నారు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ తమ కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు, ఈ ఉద్యోగ అవకాశం కల్పించడం ద్వారా కొండంత అండ ఇచ్చినట్లు అయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే త్వరితగతిన ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసినందుకు జెడ్పీ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫొటోగ్రాఫర్ రాజ్‌కు జాతీయ స్థాయి బహుమతి
రాజమహేంద్రవరం సిటీ: గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే బ్లాక్ అండ్ వైట్ లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫ్నకు రాజమహేంద్రవరానికి చెందిన ఫొటోగ్రాఫర్ రాజ్ జాతీయ స్థాయిలో రెండవ బహుమతి సాధించాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్ ఖాన్ (ఏఎఫ్ఐఏపీ) 8వ లంబాడా జాతీయ లైఫ్ స్టైల్ ఆర్ట్ ఫోటోగ్రఫీ పోటీలు ఈ నెల 13, 14, 15 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందు సమీపంలోని రూళ్లపాడులో జరిగాయి. ఈ పోటీలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. సహజమైన భావోద్వేగాలు, సంప్రదాయం, సాధారణ జీవిత క్షణాలను ఎంతో కళాత్మకంగా చిత్రీకరించిన విధానాన్ని జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించి రెండో బహుమతికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా రాజ్ అందుకున్నారు. బుధవారం నగరానికి వచ్చిన రాజ్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు తనకు మరింత ప్రేరణనిచ్చిందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీనిపై అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. అంబాజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన ప్రస్తుతం అమలాపురంలో నివసిస్తున్న తోట వినయ్ (23), నిమ్మకాయల సాయివెంకట సత్యమూర్తిలు స్నేహితులు. మంగళవారం ఉదయం ఆ యువకులు అమలాపురం నుంచి మోటారు సైకిల్‌పై భీమవరం బయలు దేరారు. రోళ్లపాలెం 216 జాతీయ రహదారి బైపాస్‌లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొంది. మోటారు సైకిల్ వెనుక వినయ్ కూర్చోగా, కాలు విరిగిపోయి తలకు గాయమైంది. అతడిని తక్షణమే రాజమహేంద్రవరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ బుధవారం మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. అతనిది సాధారణ కుటుంబం. ఎదిగి వచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సత్య వెంకట సత్యమూర్తి అమలాపురంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమలాపురం పట్టణ ఎస్సై మనోహర్ జోషి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిని చితకబాది బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కు వద్ద బాలుడిని చితకబాది, బాలికను ఎత్తుకుపోయిన దుండగులు లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొవ్వూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు అదే ప్రాంతానికి చెందిన బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బాలిక 10 రోజుల నుంచి స్థానిక రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌కు వచ్చి అక్కడే ఉంటోంది. ఈ నెల 15న ఆ బాలుడు రాజమహేంద్రవరం రావడంతో ఆ రాత్రి బాలిక, బాలుడు ఎస్పీ బంగ్లాకు ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కులో కలిశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మద్యం మత్తులో ఉన్న క్వారీ ప్రాంతానికి చెందిన పెద గంజా, మరో వ్యక్తి అక్కడకు వచ్చారు. బాలుడిని చితకబాదిన తర్వాత పెద గంజా అనే వ్యక్తి బాలికను క్వారీ ప్రాంతంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. ఆమె 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయానికి ఈట్ స్ట్రీట్‌కు చేరుకుని విషయాన్ని బాలుడికి ఫోన్లో చెప్పింది. అనంతరం ఆ బాలుడు వచ్చి 112కు ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద గంజాతోపాటు బాలుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసిన పెద గంజాపై పలు చోరీ కేసులున్నాయి. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. -
ఒకే రోజు ఇద్దరికి అరుదైన గుండె శస్త్ర చికిత్సలు
కాకినాడ రూరల్: తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండె సంబంధిత లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు కార్డియాలజిస్ట్ ఓబుల్‌రెడ్డి తెలియజేశారు. సర్పవరం జంక్షన్‌లోని రమణయ్యపేట సంత మార్కెట్ వద్ద గల మిత్ర హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కాకినాడ ఆర్‌ఆర్‌నగర్‌కు చెందిన 65 ఏళ్ల ద్వారంపూడి వెంకయ్యమ్మ, బలభద్రపురానికి చెందిన 54 ఏళ్ల కర్రి శ్రీనివాసరెడ్డి తమ ఆస్పత్రికి రాగా ఇద్దరిలోనూ గుండె ధమనుల అవరోధం గుర్తించామన్నారు. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమ వైద్య నిపుణుల బృందంతో ఆప్టికల్ కోహిరెన్స్ ట్రోమోగ్రఫీ ఆధారిత కార్డియాక్ ఇంటర్వెన్షన్(ఓసీటీ గైడెడ్ పీసీఐ) అనే అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ అత్యాధునిక ఓసీటీ పరికర సదుపాయం తమ మిత్ర హార్ట్ కేర్ సెంటర్లో ఉందన్నారు. ఏఐ క్యాథ్ ల్యాబ్, ఏఐ ఆధారిత వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నట్టు ఓబుల్‌రెడ్డి తెలిపారు. -
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు సాగించనున్నాయన్నారు. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య జనవరి 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీలలో అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌కు 07295 రైలు జనవరి 14వ తేదీన, సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07292 నంబర్ రైలు జనవరి 17వ తేదీన, 07293 నంబర్ రైలు శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌కు జనవరి 18వ తేదీన అందుబాటులో ఉంటాయని తెలిపారు. వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07294 నంబర్ రైలు జనవరి 13న అందుబాటులో ఉంటుందన్నారు. ఇవి రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని తెలిపారు. -
ఓపెన్‌గా దోపిడీ!
సాక్షి, రాజమహేంద్రవరం: ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదు. కానీ, అధికార అండతో ఇసుక మాఫియా దోపిడీ ‘ఓపెన్’ చేసింది. కూటమి నేతల అండదండలతో నిబంధనలను గోదావరిలో తొక్కి మరీ అక్రమ తవ్వకాలతో చెలరేగుతోంది. ఇసుక అక్రమార్కులు నదిలోకి యంత్రాలను దించి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం వందల వేల టన్నుల ఇసుకను దర్జాగా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మరీ నదీ గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఆ ఇసుకను బిల్లులు సైతం లేకుండానే వందల లారీల్లో ఇతర జిల్లాలకు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలోనే ఈ ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అను‘మతి లేకుండా’.. జిల్లావ్యాప్తంగా గోదావరి నదిలో 21 ఓపెన్ ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో కూలీలతో ఇసుక తవ్వి, విక్రయించుకునేందుకు గతంలో ఏడాది ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు. వీటిలో కొన్నింటి గడువు గత నవంబర్‌లో ముగిసింది. మరికొన్నింటి గడువు ఈ నెలాఖరుకు ముగుస్తుంది. గత నెలలో గడువు ముగిసిన ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు తిరిగి తమకు అనుమతులు ఇవ్వాలంటూ వాటిని గతంలో దక్కించుకున్న వారు అధికారులకు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకూ అధికారులు ఏ ఒక్క రీచ్‌కు అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ, నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు – పెండ్యాల, కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం ఓపెన్ రీచ్‌లలో అక్రమార్కులు దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులూ ఉన్న ర్యాంపులో మాదిరిగానే రేయింబవళ్లు ఇసుక తవ్వేస్తున్నారు. కానూరు – పెండ్యాల ర్యాంపులో సాగుతున్న ఇసుక దందా రాత్రయితే జాతరను తలపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఎలాంటి బిల్లులూ లేకుండానే ఇసుక లోడింగ్ చేసేసి, జాతీయ రహదారుల మీదుగా అధికారుల కళ్లెదుటే దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ర్యాంపు నుంచి నిత్యం 50 నుంచి 100 లారీల్లో ఇసుకను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు నీళ్లు ఫ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో నీటి ప్రవాహానికి, ఏటిగట్టుకు 200 మీటర్ల పరిధిలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ, కానూరు – పెండ్యాల రీచ్‌లో దీనిని పట్టించుకోకుండా గోదావరిని ఇష్టానుసారంగా గుల్ల చేస్తున్నారు. ఫ ర్యాంప్‌లో యంత్రాలతో ఇసుక తవ్వకూడదు. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. ఫ నదీ గర్భంలోకి లారీలు వెళ్లకూడదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బయటకు తీసుకొచ్చి లారీలకు నింపాలి. కానీ, లారీలను ఇష్టానుసారంగా గోదావరి నదిలోకి తీసుకెళ్తున్నారు. ఫ రీచ్ నుంచి ట్రాక్టర్లతో ఇసుక తెచ్చేందుకు మట్టితో మాత్రమే రహదారి వేయాలి. కానీ, ఇసుక మాఫియా బరితెగించి లారీలు తీరిగేందుకు వీలుగా గ్రావెల్ రోడ్లు వేసింది. ఫ నిబంధనల ప్రకారం ఇసుక మేట 3 ఘనపు మీటర్లు ఉంటే.. ఒక ఘనపు మీటర్ మాత్రమే కూలీలతో తీయించాలి. కానీ, యంత్రాలతో నదీగర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఎంత వీలుంటే అంత కుళ్లబొడిచేస్తున్నారు. దీంతో, నదీగర్భంలో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. ఫ కుమారదేవం ఓపెన్ రీచ్ నుంచి సైతం నిత్యం వందల లారీల్లో ఇసుక అక్రమంగా తవ్వి, తరలించుకుపోతున్నారు. నిఘా శూన్యం రీచ్‌ల వద్ద ఎటువంటి నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాలతో పాటు, అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారుతోంది. ఒకవేళ ఉన్నా.. మామూళ్ల మత్తులో పడి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత కలెక్టర్ హయాంలో ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎప్పుడు వచ్చి అధికారులు పట్టుకుంటారోననే భయం ఉండేది. ప్రస్తుత కలెక్టర్ కూడా ఇసుక అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ మంత్రిగారి ఇలాకాలో చెలరేగుతున్న ఇసుక మాఫియా ఫ కానూరు – పెండ్యాల రీచ్‌లో బరితెగింపు ఫ ప్రతి రోజూ వందల లారీల్లో ఇతర జిల్లాలకు తరలింపు ఫ కూటమి నేతల అండదండలతో దందా ఫ కుమారదేవంలోనూ అదే తంతు -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 25 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 850 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల మురళి తెలిపారు. ఈ నెల 18న బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంగళగిరికి చెందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కార్యదర్శి జీవీ సత్యనారాయణమూర్తి, ఏయూ రీజియన్ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాంస్య పతక విజేతకు అభినందనలు రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కార్మికుడు అర్జి బాలకృష్ణ టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల విభాగం స్క్వాడ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణను నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో బాలకృష్ణ మరిన్ని ప్రపంచ పోటీల్లో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వినూత్న, శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, శానిటరి ఇన్స్పెక్టర్ ధనరాజ్ పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక నిధికి విరాళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది రూ.8,00,700 విరాళాలు సేకరించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న 8 వేల మంది మెప్మా సిబ్బంది ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఈ విరాళం సమకూర్చారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో మెప్మా పీడీ బి.ప్రియంవదతో కలసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.కృష్ణారావుకు మంగళవారం అందజేశారు. జేసీ భరత్ మాట్లాడుతూ, మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమం, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగిస్తారని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా బాట తొలగింపు పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం శివారు నడిగాడి వద్ద వశిష్ట గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు ఏర్పాటు చేసిన బాటలను మైన్స్ ఆర్ఐ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీతో తొలగించారు. ర్యాంపు వద్ద గస్తీ నిర్వహించాలని వీఆర్వో కడలి వెంకటేశ్వరరావుకు మైన్స్ ఆర్ఐ సూచించారు. అంతకు ముందు పుచ్చల్లంక రేవును కూడా తనిఖీ చేశారు. అక్కడ లంకలో ఉన్న ఒక జేసీబీని సీజ్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండీ రెహ్మాన్ అలీ, సర్వేయర్ కె.శ్రీధర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 21న పల్స్ పోలియో అమలాపురం రూరల్: ఈ నెల 21వ తేదీని పల్స్ పోలియో నిర్మూలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని, ఐదేళ్ల లోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు వేయించుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. బస్ స్టాండ్లు, ఆస్పత్రులు, మేళాలు, బజార్లలో 21 నుంచి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయన్నారు. -
మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ● కళ్లెదుటే తల్లిని, కొద్దిసేపటికి అన్నను కోల్పోయిన వైనం గండేపల్లి: అన్నను ఆస్పత్రిలో చేర్చేందుకు తల్లిని, బాబాయిని, మరో వ్యక్తిని వాహనంలో వెంట తీసుకువెళుతుండగా కమ్ముకొచ్చిన మంచు, తరుముకొచ్చిన కునుకు మృత్యు ఒడికి తీసుకుపోయాయి. కళ్లముందే కన్నతల్లిని, కొద్దిసేపటికే అన్నను కోల్పోయిన వ్యక్తి హృదయ విదారక ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన తొర్లపాటి శశికుమార్ (27) క్యాన్సర్‌తో బాధపడుతుండగా ఇతనికి మెరుగైన వైద్యం కోసం తమ్ముడు తొర్లపాటి సంజయ్, తల్లి తులసి (49), బాబాయి తొర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కలిసి కారులో విశాఖ ఆస్పత్రికి వెళుతున్నారు. మండలంలోని గండేపల్లి శివారు బంక్ సమీపంలోకి వచ్చేసరికి మంగళవారం తెల్లవారుజాము సుమారు 3.40 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసికి ముఖం, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న శశికుమార్, నాగబత్తుల శ్రీనుకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ వాహన సిబ్బంది, నైట్ డ్యూటీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్ మృతి చెందాడు. తులసి మృతదేహాన్ని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి తరలించి, ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో పక్కకు తీయించారు. కారు నడుపుతున్న తొర్లపాటి సంజయ్ స్వల్పగాయాలతో బయటపడగా ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై యూవీ శివ నాగబాబు పరిశీలించి ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. రాజమహేంద్రవరంలో టీ తాగి ప్రయాణం ప్రారంభించగా వీరు ప్రయాణిస్తున్న కారు గండేపల్లిలో ప్రమాదానికి గురైంది. తీవ్రమైన మంచు, తెల్లవారుజాము ప్రయాణంలో డ్రైవర్‌కు కునుకుపాటుకు గురవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రికి బదులు మృత్యుఒడికి.. కొత్తపేట: తొర్లపాటి వీరాస్వామి, తులసి దంపతులు తమ కుమారులు శశికుమార్, సంజయ్‌లతో కలసి వ్యవసాయ కూలీ పనులతో పాటు కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు శశికుమార్‌కు అనారోగ్యం పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్‌గా నిర్ధారించారు. విశాఖపట్నంలో క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. చిన్న కుమారుడు సంజయ్‌కు కారు డ్రైవింగ్ రావడంతో రోజువారీ అద్దెకు కారు తీసుకుని మంగళవారం రాత్రి వెలిచేరులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున ఈ ఘోరం జరిగిపోయింది. వెలిచేరులో విషాద ఛాయలు వెలిచేరు గ్రామ శివారు కాలనీకి చెందిన తొర్లపాటి తులసి, ఆమె కుమారుడు శశికుమార్ మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు కాలనీలో అందరితో కలసిమెలసి ఉంటారని, సహచర వ్యవసాయ కూలీలతో కలిసి పనులు చేసుకునేవారని స్థానికులు చెప్పారు. కొన్ని రోజులుగా శశికుమార్ అనారోగ్యానికి గురికాగా వారి కష్టార్జితంతోనే వైద్యం చేయిస్తూ వచ్చారని తెలిపారు. తల్లీ, కొడుకు చనిపోయారంటే జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
అన్ని సంఘాలకు ఆదర్శంగా..
ఐకమత్యంగా ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులు. పెన్షనర్లకు పలు సేవలు అందిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఫంక్షన్ హాలుగా సంఘ భవనం పూర్వం తాలూకా వ్యవస్థ ఉన్న సమయంలో కొత్తపే ట తాలూకా పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం మండలాలకు చెందిన పలువురు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘంగా ఏర్పడ్డారు. తొలుత 80 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం నేడు 1,620 మందికి చేరింది. గతంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మంగిపూడి గౌరీశంకరం, అజ్జరపు వెంకట సుబ్బారావు హయాంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మొదట స్థలాన్ని సమకూర్చుకుని, ప్రభుత్వ గ్రాంటులు మంజూరు చేయించుకుని సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. దాతలు, సభ్యు ల విరాళాలతో దశల వారీగా రెండంతస్తు ల నిర్మాణంతో ఫంక్షన్ హాలుగా అభివృద్ధి చేసుకున్నారు. నేడు సీనియర్ పెన్షనర్లకు సన్మానం పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం 1946లో జన్మించిన సీనియర్ పెన్షనర్లు 20 మందిని సత్కరించేందుకు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో ఏర్పాట్లు చేశారు. -
అవిశ్రాంత సేవకులు
● సామాజిక బాధ్యతతో ముందుకు.. ● హక్కుల కోసం పోరాటం ● నేడు జాతీయ పెన్షనర్స్ డే కపిలేశ్వరపురం/కొత్తపేట: సమాజంలో శ్రామికులు, ఉద్యోగులు, కీలక పాత్రధారులు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఓ భరోసా. ప్రస్తుత పాలనలో ఆ పెన్షన్ మంజూరు కావాలన్నా, మంజూరైనది పొందాలన్నా ఓ ప్రహసనంగా మారింది. పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేస్తున్నారు. నేడు పెన్షనర్స్ డే సందర్భంగా కథనం.. ఉద్యమ బాటలో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించిన రిటైర్డ్ పెన్షనర్లు సుమారు 50 వేలు మంది ఉన్నారు. అత్యధికులు రూ.3వేలు లోపు పెన్షన్ తీసుకుంటున్నవారే ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వారు నెలకు కేవలం రూ.2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలుమార్లు ఉమ్మడి జిల్లాలో నిరసన తెలిపారు. వృద్ధులకు అందజేసే రూ.4వేలు సామాజిక పింఛనును వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు ఉమ్మడి జిల్లాలో పలుమార్లు ధర్నాలు చేశాయి. ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈపీఎస్ –95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న ఢిల్లీలోని సుజిత్ భవన్లో సదస్సును నిర్వహించారు. 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి పెన్షనర్లు తరలివెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు –2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఒకటో తేదీకి అందని పెన్షన్ ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పెన్షనర్స్ సమస్యలపై దృష్టి సారించలేదు. ఒకటో తేదీ దాటిన వారం తర్వాతనే చెల్లింపులు చేస్తున్నారు. సామాజిక సేవలో... రామచంద్రపురం, మండపేట, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో పెన్షనర్లు ప్రణాళికాబద్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల నెలా పెన్షనర్లకు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లబ్ధి రాబట్టేందుకు సంబంధించిన పత్రాలను నింపడం, అధికారులకు నివేదించడం క్రమం తప్పకుండా చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఉద్యోగి ఇంటికి వెళ్ళి పెన్షన్‌కు సంబందించిన ఆన్లైన్ ప్రక్రియకు సహకరిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యుల చదువు, ఆరోగ్యాలకు తోచిన సాయం చేస్తున్నారు. సామాజిక పెన్షన్లును వర్తింపజేయాలి దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.రెండు వేల లోపు పెన్షన్‌ను తీసుకొంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.మూడువేలు దాటి పెన్షన్‌ను పొందుతున్నారు. వారందరికీ వృద్ధులు తదితర రకాల సామాజిక పింఛన్లను సైతం అమలు చేయాలి. హైయ్యర్ పెన్షన్ కోసం దేశంలో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 50వేల మందికి న్యాయం జరిగింది. ఈపీఎఫ్ వద్ద రూ.10లక్షల కోట్లు కార్పస్ ఫండ్ ఉండగా దానికి రూ.60వేల కోట్లు నెలకు వడ్డీగా వస్తుంది. అందులోరూ.23 వేల కోట్లు పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. మిగిలిన 37వేల కోట్లు తిరిగి ఈపీఎఎఫ్ కార్పస్ ఫండ్‌గా మళ్లిపోతుంది. ఈపీఎఫ్ ఫండ్‌ను షేర్మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం ప్రమాదకరమైన నిర్ణయం. – కంచపు సత్తిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీఆర్పీఏ, కాకినాడ ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే గతంలో పనిచేసిన నాయకుల కృషితో ఇతర సంఘాలకు దీటుగా మా పెన్షనర్ల సంఘం అన్నింటా ముందు ఉంది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాట కార్యక్రమాలలో పాల్గొనడానికి మా వయసు అడ్డురాదు. ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే. – కాశీరాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ల సాధనకు కృషి సంఘం బలోపేతంలో భాగంగా గత 18 నెలల్లో 361 మందిని నూతన సభ్యులుగా చేర్చాం. మా హయాంలో 61 మందికి అదనపు పెన్షన్ కలిసేలా చేయడం సంతృప్తినిచ్చింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఎరియర్స్ కూడా రావలసి ఉంది. అవి వచ్చేటట్టు చేయడానికి, రాష్ట్ర సంఘం అనుమతితో పోరాట కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. – యేడిద సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం మంజూరు కాని కొత్త పింఛన్లు 18 నెలల చంద్రబాబు పాలనా కాలంలో నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. దీర్ఘకాలంగా ఇస్తున్న పింఛన్లలో కోత పెట్టారు. కాకినాడ జిల్లాలో 2,71,360 మందికి రూ.117.81 కోట్లు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,36,284 మందికి రూ.101.86 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2,35,060 మందికి రూ.1.03.27 కోట్లు ఎప్పటి నుంచో ఇస్తూ వస్తున్నారు. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయకుండా పాత పింఛన్లను సర్వే పేరుతో కోత పెట్టింది. నూతన పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఇంటి పన్నుకు, పింఛన్లకు ముడిపెట్టడం చంద్రబాబు పాలనకే చెల్లింది. -
ఇక బడుల్లో అంగన్వాడీ కేంద్రాలు
రాయవరం: మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తారు. ఆరేళ్ల నుంచి 14ఏళ్ల లోపు చిన్నారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతారు. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం విద్యాశాఖ చేపట్టింది. సమీప ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మండలం దీనికి ఎంపికైంది. కో–లొకేషన్ ప్రక్రియ దిశగా.. మహిళ, శిశు అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్), విద్యాశాఖలు సంయుక్తంగా కో–లొకేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, ప్రాథమిక విద్యను సమర్థంగా అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు. పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులున్నాయా? లేదా? మరుగుదొడ్లు, తాగునీరు, వంటగది, ఆటస్థలం, స్టోర్ రూమ్, ప్రహరీ, విద్యుదీకరణ తదితర వసతులను పరిశీలిస్తారు. మ్యాపింగ్ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం పూర్వ, ప్రాథమిక విద్యను ఒకే ప్రాంగణంలో అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇదిలా ఉంటే 2023లోనే కోలొకేటెడ్ పాఠశాల ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేశారు. జిల్లాలో కపిలేశ్వరపురం మండలం టేకి బీసీ కాలనీలోని నంబర్ – 1 పాఠశాలను కో లొకేటెడ్ పాఠశాలగా ఎంపిక చేసి, పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంగన్వాడీ కార్యకర్తకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కోలొకేషన్ పాఠశాలల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. పి.గన్నవరం మండలంలో 84 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనాల స్థితిగతులను పరిశీలించిన మండల స్థాయి కమిటీ 12 స్కూళ్లను కో లొకేటెడ్ పాఠశాలలుగా గుర్తించింది. -
‘మోగ్లీ’ చిత్ర యూనిట్ సందడి
ప్రేక్షకులతో మమేకమైన హీరో, హీరోయిన్అమలాపురం టౌన్: మోగ్లీ సినిమా హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మండోల్కర్తో పాటు చిత్ర యూనిట్ ప్రతినిధులు అమలాపురంలో మంగళవారం సందడి చేశారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రం విడుదలై అమలాపుంలో ప్రదర్శితమవుతున్న లలిత థియేటర్‌కు చిత్ర యూనిట్ వచ్చి ప్రేక్షకులతో మమేకమైంది. సినిమా హీరో హీరోయిన్‌తోపాటు సినిమా దర్శకుడు సందీప్‌రాజ్ పాల్గొని సందడి చేశారు. తొలుత చిత్ర యూనిట్‌కు థియేటర్ యాజమాని తోట రాము, సిబ్బంది స్వాగతం పలికారు. సినిమా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్, దర్శకుడు సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం థియేటర్ వద్ద హీరో రోషన్, హీరోయిన్ సాక్షి మండోల్కర్ అభిమానుల సమక్షంలో కేక్‌ను కట్ చేశారు. కోనసీమ ప్రజలు కొత్త వారమైన తమకు ఆశీర్వాదాలు అందించాలని ిహీరో, హీరోయిన్ రోషన్, మండోల్కర్ అక్కడికి వచ్చిన అభిమానులను అభ్యర్థించారు. థియేటర్ మేనేజర్ కడలి త్రినాథ్, అనుశ్రీ సినిమాస్ ఏజెంట్ వి.శ్రీనివాస్, టూర్ ఆర్గనైజర్ నిమ్మకాయల దుర్గాప్రసాద్, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు నల్లా చిట్టి, గుమ్మళ్ల సురేష్ పాల్గొన్నారు. -
గుత్తుల మురళీధరరావు ఆకస్మిక మృతి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాజమహేంద్రవరం నగర ఉపాధ్యక్షుడు గుత్తుల మురళీధరరావు (56) ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక 50వ డివిజన్‌కు చెందిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మురళీధరరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలియడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక సీటీఆర్ఐ సమీపాన చోడేశ్వర నగర్‌లోని ఆయన నివాసానికి మంగళవారం చేరుకున్నారు. మురళీధరరావు పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో పాటు మార్తి లక్ష్మి, కానుబోయిన సాగర్, పోలు విజయలక్ష్మి, బొంతా శ్రీహరి, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్పా ఆదినారాయణ, సంకిస భవానీప్రియ, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు తదితర నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీధరరావు మృతికి ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యం తీవ్ర సంతాపం ప్రకటించారు. మురళీధరరావు అంత్యక్రియలు కోటిలింగాల ఘాట్‌లోని రోటరీ కై లాస భూమిలో మంగళవారం నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా పాల్గొని, స్వయంగా పాడె మోశారు. పార్టీకి విశేష సేవలు ఆవిర్భావం నుంచీ వైఎస్సార్ సీపీకి మురళీధరరావు విశేష సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం గతంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చింది. కార్పొరేటర్‌గా గెలిచిన ఆయనను నగర పాలక సంస్థలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేసింది. మనసున్న మనిషిని కోల్పోయాం మురళీధరరావు ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరమని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మంచి నాయకుడిని, మంచి మనసున్న మనిషిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. మురళీధరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీధరరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మార్గాని భరత్‌రామ్, మేడపాటి షర్మిలారెడ్డి మురళీధరరావు పాడె మోస్తున్న చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా తదితరులునేతల సంతాపం మురళీధరరావు మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసిన మురళీధరరావు ఆకస్మిక మరణం వైఎస్సార్ సీపీకి తీరని లోటని అన్నారు. 50వ డివిజన్ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, మురళీధరరావు మరణం పార్టీతో పాటు వ్యకిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి, వైఎస్సార్ సీపీ జెండాను మురళీధరరావు పార్థివ దేహంపై కప్పి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సుశిక్షితుడైన సైనికుడిలా మురళీధరరావు పార్టీ కోసం నిరంతరం పని చేశారని అన్నారు. పార్టీతో పాటు తన డివిజన్ అభివృద్ధికి నిత్యం కృషి చేశారని శ్లాఘించారు. ఫ గుండెపోటుతో మరణించిన వైఎస్సార్ సీపీ నేత ఫ నేతల నివాళి -
విద్యుత్ పొదుపు పాటించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్‌ను తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అవసరమున్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ పొదుపు వల్ల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ ఈపీడీసీఎల్ ఉద్యోగులు స్థానిక వై జంక్షన్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దేవీచౌక్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈపీడీసీఎల్ ఎస్ఈ టి.తిలక్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, జీపీబీ నటరాజన్, ఎన్.నారాయణ అప్పారావు, పర్సనల్ ఆఫీసర్ పి.స్టీఫెన్, సీనియర్ అకౌంట్స్ అధికారి కె.ఆదినారాయణమూర్తి, సర్కిల్ ఆఫీస్ ఈఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
405 కేజీల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోకవరం పోలీసులు గోకవరం: మండలంలోని కామరాజుపేట గ్రామ శివారున ఆగిఉన్న వాహనంలో 405 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వాహనం అనుమానాస్పద స్థితిలో ఆగి ఉండటాన్ని పిడతమామిడి ఫారెస్టు బీట్ ఆఫీసర్ వీరాబత్తుల రమణ గుర్తించారు. అతన్ని గుర్తించిన వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై ఆయన గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌కు సమాచారం అందించగా ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకుని వ్యాన్‌లో 22 బస్తాల్లో ఉన్న 405 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.2.05 కోట్లు ఉంటుంది. తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహనాన్ని, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా...డ్రైవర్ మృతి
ముమ్మిడివరం: తవుడు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ దాని కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన వరసాల సత్యనారాయణ(50) మంగళవారం ట్రాక్టర్‌పై తవుడు లోడుతో కూనవరం వెళుతుండగా ముమ్మిడివరం శివారు బొండాయి కోడు తూము వద్ద 216 జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న బడుగు రాణిని ఢీకొన్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద పడి ఊబిలో కూరుకుపోయాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను తీయగా డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. స్కూటీపై వెళుతున్న బడుగు రాణికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి గాయపడిన బడుగురాణికి సపర్యలు చేసి, ఆమెను 108లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సాహితీ సూర్యుడు బోయి భీమన్నఅమలాపురం టౌన్: ఆధునిక సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహా కవి పద్మశ్రీ బోయి భీమన్న సాహితీ సూర్యుడని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. బోయి భీమన్న వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో మంగళవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. తొలుత బోయి భీమన్న చిత్రపటానికి డాక్టర్ ప్రతాప్తోపాటు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాకవి బోయి భీమన్న –వ్యక్తిత్వం–రచనలు అనే అంశంపై డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కవయిత్రి సబ్బెళ్ల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొని బోయి భీమన్న సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
చాగల్లు: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం ఉదయం మృతిచెందినట్టు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. చాగల్లు–పశివేదల రైల్వేస్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడిన వ్యక్తిని గుర్తించామన్నారు. మృతిచెందిన వ్యక్తి సుమారు 35 నుంచి 40 ఏళ్లు వయస్సు కలిగి, లైట్ బ్లూ కలర్ ప్యాంట్, తెలుపు నీలం పచ్చ పొడుగు చేతుల టీ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం 94906 17090 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఏఎంవో, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఎంఐఎస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఆసక్తి గలిగిన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, ఎస్.సుభాషిణి మంగళవారం తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అనే చిరునామాకు పంపాలన్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు నమూనా, నియమావళికి సంబందిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఎస్ఆర్జేవై.ఆర్గ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98667 79398లో సంప్రదించాలన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 23 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) 23 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో నేరుగా ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 180 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 180 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకాలంలో అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని అన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో సమీక్షిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన, సరైన సమాచారం ఇవ్వని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పులి సంచారంపై ఆధారాల్లేవ్ గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లభించలేదని జిల్లా అటవీ శాఖ అధికారి కె.దావీదురాజు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పులి జాడను గుర్తించేందుకు ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులుగా పులి జాడలు కనిపించలేదని చెప్పారు. పులి సంచారంపై ఎటువంటి అపోహలకూ గురి కావద్దని కోరారు. భీమోలు, సగ్గొండ, గోపవరం కొండలపై రెస్క్యూ టీము ద్వారా పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఎవరికై నా ఎటువంటి జంతువుల పాదముద్రలు లేదా అనుమానాలున్నా అటవీ శాఖ, గ్రామ రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు. 13.99 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయందేవరపల్లి: జిల్లాలో అక్టోబర్ 1 నుంచి సోమవారం వరకూ 13.99 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 17 రోజులకు 5.48 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 7.54 వేల మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ నెలాఖరుకు మరో 8.29 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు రానున్నాయని తెలిపారు. రబీలో అన్ని రకాల ఎరువులూ కలిపి జిల్లాకు 1,15,781 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 43,686 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 24,476 మెట్రిక్ టన్నులు విక్రయించినట్టు తెలిపారు. ప్రస్తుతం 19,216 మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: మార్గశిర బహుళ ఏకాదశిని పురస్క రించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ, తులసి దళాలతో సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి సుప్రభాత సేవ నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అమ్మవారిని ముత్యాల కవచాలతో అలంకరించి పూజించారు. -
కోటిగళ గర్జన
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జన‘కోటి’ గళాలు గర్జించాయి. చేవ్రాలుతో తమ నిరసన తెలిపాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. లక్షలాదిగా ప్రజలు, విద్యార్థులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛంగా సంతకాలు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఇటీవల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఈ కోటి సంతకాల ప్రతులను.. ఇక్కడి నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన భారీ ర్యాలీలుగా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి జెండా ఊపి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, సంతకాల ప్రతులను ఉంచిన వాహనం వెంట వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున ర్యాలీగా కదిలారు. 15 కిలోమీటర్ల మేర.. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు వరకూ సుమారు 15 కిలోమీటర్ల మేర వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు మూడు గంటలకు పైగా సాగింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు అంచనాలకు మించి ప్రజలు కదం తొక్కారు. గోదావరి చిన్నబోయిందా అనే రీతిలో.. రోడ్డు కం రైల్వే వంతెనపై సాగిన ఈ ర్యాలీ జనకెరటం ఎగసి పడింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద పెట్టున నినదించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవడం చూస్తూంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గిరజాల బాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 4.20 లక్షల సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించాం. విద్యార్థులు, యువత, మేధావులు, వెద్య వర్గాలు, పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. పేదలకు వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎట్టి పరిసి్థ్తుల్లోనూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరగనివ్వం. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్న చంద్రబాబు.. వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఇవ్వకపోవడం దారుణం. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సూపర్ సక్సెస్ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు కదం తొక్కారు. పేదలకు వైఎస్ జగన్ అండగా నిలిస్తే.. కార్పొరేట్ సంస్థలకు దన్నుగా చంద్రబాబు నిలుస్తున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. – తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, రాజమహేంద్రవరం ధనార్జనే చంద్రబాబు ధ్యేయం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తోంది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టారు. ఈ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో సర్కార్ మెడలు వంచైనా నిలుపు చేస్తాం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, రాజానగరం చంద్రబాబుకు చెంపపెట్టు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టేలా ప్రజలందరూ తరలి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఇది చంద్రబాబుకు చెంప పెట్టు లాంటిది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆ సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదు. అటువంటిది వైఎస్ జగన్ తెచ్చిన కళాశాలలను ప్రైవేటీకరించడానికి ఆయనెవరు? తన బినామీలకు మెడికల్ కళాశాలలను అందించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. ఏడాదికి 2,300 మంది డాక్టర్లు, పదేళ్లకు 23 వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవడాన్ని బాబు సహించలేకపోతున్నారు. – మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన తాడేపల్లికి సంతకాల ప్రతుల తరలింపు 15 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు దొమ్మేరు వద్ద వాహనానికి వీడ్కోలు -
‘వస్త్రాపహరణ సూచనతో కర్ణుడి పుణ్యాలు నశించాయి’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ద్రౌపది, పాండవుల వస్త్రాలను ఊడబెరకమంటూ దుశ్శాసనుడికి చెప్పిన వాడు కర్ణుడని, ఈ సూచనతో అతడు చేసిన పుణ్యాలన్నీ నశించిపోయాయని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో సోమవారం ఆయన కొనసాగించారు. ‘ద్రౌపదీ దేవిని ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడితో కర్ణుడు పలికిన పలుకులు ఘోర పాపాలకు ప్రతిరూపాలు. ద్రౌపది ఏకవస్త్ర అయినా, వివస్త్ర అయినా పాపం లేదు. మానవ కాంతకు ఒకే భర్త. ఈమెకు ఐదుగురు భర్తలుండటంతో ఆమె బంధకి అయింది. ఈ మాటలు అన్నది దుర్యోధనుడు కాదు– కర్ణుడు’ అని చెప్పారు. ద్రౌపది కృష్ణ స్మరణ చేయడంతో.. ఆమె ధర్మమే ఆమెకు అక్షయ వస్త్రాలుగా వచ్చాయని అన్నారు. తాను ఇంతటి పరాభవానికి గురవుతున్నా, ధర్మరాజు ధర్మ మార్గం తప్పడని అనడం ద్రౌపది పాతివ్రత్య ధర్మానికి పరాకాష్ట అని చెప్పారు. ధర్మరాజు ద్యూత వ్యసనపరుడు కాదని, శకుని అలా చిత్రీకరించాడని, అతడి మాటలను ప్రమాణంగా తీసుకోరాదని అన్నారు. ధర్మరాజు.. ధృతరాష్ట్రుడిని తండ్రిగా భావించాడని, ఆయన ఆదేశాన్ని అనుసరించే ద్యూత క్రీడకు వచ్చాడని స్పష్టం చేశారు. తన బదులు శకుని ద్యూతమాడతాడని దుర్యోధనుడు చెప్పినప్పుడు, అది సరికాదని ధర్మరాజు చెబుతూనే, చివరకు అంగీకరిస్తాడని అన్నారు. ‘‘ద్రౌపదిని పణంగా పెట్టమన్న మాట శకుని నోట వచ్చిందని, అది ధర్మరాజు మాట కాదని భీష్ముడు అన్నాడు. ఇందులో ధర్మం గతి అతి సూక్ష్మమైనదని చెప్పాడు. జరిగిన దానిని భీష్ముడు సమర్థించాడని చెప్పడం సరి కాదు. పుట్టినది మొదలు భీష్ముడు ఎటువంటి పాపమూ చేయలేదని కృష్ణుడు అనుశాసన పర్వంలో అన్న మాటలను మనం విస్మరించరాదు. త్వరలో ధార్తరాష్ట్రులందరూ నశిస్తారనిపిస్తోందని భీష్ముడు అంటాడు. ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో ‘సహదేవా, అగ్ని తీసుకురా. అన్నగారి చేతులను తగలబెడతాను’ అని భీముడు అన్నట్లు అనువాదకులు రాశారు. కానీ, భీముడు అన్న మాటలకు అర్థం అది కాదు. ఇక్కడ వ్యాసుల వారు చెప్పిన శ్లోకం– అస్యాఃకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాత్యతే, బాహూ తే సంప్రదక్ష్యామి సహదేవాగ్ని మానయ’– ఇక్కడ ‘తే’ అన్న పదానికి నీ చేతులు అని అర్థం కాదు, నీ సమక్షంలో– నా చేతులు తగులబెట్టుకుంటానని శ్లోక భావం. నీలకంఠీయ వ్యాఖ్యానం కూడా ఇదే భావాన్ని సమర్థిస్తోంది’’ అని సామవేదం వివరించారు. ధృతరాష్ట్రుడు, దుష్టచతుష్టయం తప్ప మిగతావారందరూ తలలు వంచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. భీముడు ఆవేశపరుడే కానీ, ధర్మపాశానికి, అన్నగారి మాటకు కట్టుబడినవాడని సామవేదం స్పష్టం చేశారు. -
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
పేదలకు సంబంధించి విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి అనుసంధానంగా వైద్య కళాశాల తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ జీఓ జారీ చేసింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. – జి.శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు సమన్వయకర్త వెన్నుపోటు చంద్రబాబు నైజం మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కారు. విద్యార్థులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. ఇప్పుడు 2024లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తిరిగి ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకే కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టాం. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు స్వచ్ఛందంగా తిప్పి కొడుతున్నారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలి. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు సమన్వయకర్త ప్రైవేటీకరణను విరమించుకునే వరకూ పోరాటం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లాలో లక్షలాది మంది సంతకాలు చేయడం ఒక రికార్డు. కోటి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి సమన్వయకర్త ఉద్యమం.. మరింత ఉధృతం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య, పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. చంద్రబాబు సర్కార్ వ్యాపార ధోరణితో వీటిని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపు చేసేంత వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త, రాజమహేంద్రవరం -
అనుమానాస్పద స్థితిలో సెల్ మెకానిక్ మృతి
నిడదవోలు: స్థానిక శాంతినగర్‌లో నివాసముంటున్న సెల్‌ఫోన్ మెకానిక్ మహ్మద్ హఫీజ్ బాషా (39) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు సెల్ మెకానిక్‌ల మీటింగ్ ఉందని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి బిర్యానీ కూడా పంపించాడు. తర్వాత రెండు గంటలకు హఫీజ్ బాషాకు భార్య షామున్నిషా ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు పట్టణంలోని కాపు కల్యాణ మండపం సమీపంలో ఖాళీ ప్రదేశంలో హఫీజ్ బాషా కిందపడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అతని బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ప్రైవేట్ వాహనంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. హఫీజ్ బాషాకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ చేయి పనిచేయదు.. పెన్షన్ రాద్దాంలే...
● జీజీహెచ్ వైద్యుల నిర్వాకంతో చేయి కోల్పోయిన బాధితుడు ● ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానని చెప్పిన డాక్టరు కాకినాడ క్రైం: సర్జరీ తేడాగా జరిగింది, నీ చేయి పనిచేయదు, పెన్షన్ రాద్దాంలే... ఇదీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన చేతిని కోల్పోయిన ఓ పేద రోగికి జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన సమాధానం. నిక్షేపంగా ఉన్న తన చేతిని చచ్చుపడేలా చేశారని బాధితుడు వాపోయాడు. కలెక్టర్‌ను కలిసి ఆధారాలు అందించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 18న పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకటరమణ ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. తన తమ్ముడు రాధాకృష్ణ సాయంతో కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించి కట్టు కట్టారు. అదే రోజు వార్డులో ఉంచి తర్వాత రోజు ఉదయం డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో మళ్లీ రావాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు, వెంకటరమణ రెండు వారాల తర్వాత వస్తే ఏప్రిల్ 7న శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి బాధితుడి కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ వచ్చింది. చిటికెన వేలు అయితే పూర్తిగా ముడుచుకుపోయింది. మరుసటి రోజు నుంచి నొప్పి తీవ్రమవడం మొదలు పెట్టింది. వైద్యులు ఫర్వాలేదు సర్దుకుంటుంది అని చెప్పి ఏప్రిల్ 12న డిశ్చార్జి చేశారు. కట్టు విప్పడానికి మే 2న రమ్మంటే వెళ్లాడు. కట్టు విప్పిన తర్వాత తన చేయిని కదపలేకున్నానని, చిటికెన వేలు పూర్తిగా ముడుచుకుపోయిందని చెబితే ఫిజియో థెరపీ అవసరం అన్నారు. జీజీహెచ్ సహా స్వగ్రామంలో ఉన్న ఫిజియోథెరపీల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకపోయింది. నెలలు గడుస్తున్న కొద్దీ చేయి పూర్తిగా నిస్సత్తువతో కదల్లేని స్థితికి చేరింది. చివరికి బాధితుడు రాయవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సర్జరీ సమయంలో పెద్ద పొరపాటే జరిగిందని, మోచేతిలో బాల్ వంటి నిర్మాణాన్ని తీసేశారని చెప్పారు. దీంతో కంగుతిన్న బాధితుడు ఆందోళనతో ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందంకు పంపించారు. శివానందం నివేదికలు పరిశీలించి సర్జరీలో తేడా జరిగింది. నీ చేయి రాదు, కావాలంటే పెన్షన్ పెడదాం లే అన్నారు. కంగుతిన్న బాధితుడు సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో తన సమస్యను కలెక్టర్‌కు నివేదించాడు. కలెక్టర్ దీనిపై విచారించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. శస్త్రచికిత్స వేళ తనను ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించేందుకు రూ.600 వసూలు చేశారని వాపోయాడు. తనకు 12,10 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. తన కుడి చేయి పూర్తిగా పనిచేయడం మానేయడం వల్ల బతుకుదెరువు కోల్పోయి తన కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు రోదించిన తీరు కలచి వేసింది. -
ఈ ‘తిక్క’కు లెక్కుందా?
సచివాలయ భవనానికి సర్పంచ్ పేరు ఏర్పాటుపై గ్రామస్తుల విస్మయం అల్లవరం: సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్న ఎంట్రుకోన సర్పంచ్ తిక్కిరెడ్డి నాగవెంకట శ్రీనివాసరావు పబ్లిసిటీ పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయ భవనానికి ఏకంగా తన పేరును చెక్కించుకుని గ్రామస్తులను విస్మయానికి గురి చేశారు. ప్రహరీకి ఆర్చీ నిర్మించి, తను సర్పంచ్ పదవిలో బాధ్యతలు తీసుకున్న తేదీని ముద్రించారు. మాజీ సర్పంచ్ పేరిట ఉన్న ఇనుప గేటుని తొలగించి తన పేరిట ఇనుప గేటు పేరుని ఏర్పాటు చేశారు. గతంలో ఈ సర్పంచ్ జనసేన జెండాను సచివాలయం భవనంపై ఏర్పాటు చేయగా అధికారులు స్పందించి వెంటనే తొలగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం సుమారు రూ.24 లక్షలతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రహరీ కూడా ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. ప్రభుత్వ భవనానికి సర్పంచ్ తన పేరుని ఎలా ఏర్పాటు చేసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వెంటనే తొలగించారు. అయితే అది ప్రభుత్వ భవనమా? సర్పంచ్ నిధులతో నిర్మించిన భవనమా? తేల్చాలని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ గౌరికుమారిని వివరణ కోరగా ఈ విషయంపై కార్యదర్శి జ్యోతిని ఇప్పటికే అడిగానని, తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. వలస కార్మికురాలిని ఇంటికి చేర్చిన కేసీఎం అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వలస కార్మికురాలు పళ్ళ సోమలమ్మను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. సోమలమ్మ ఫిబ్రవరి 2025లో మస్కట్ దేశానికి వెళ్లగా అక్కడ పనిచేసే చోట తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురయ్యారు. సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా చిత్రహింసలు పెట్టారని, ఇంట్లో నిద్రపోవడానికి అనుమతించకపోవడంతో బయట దోమల మధ్య, తేళ్ల భయంతో తన తల్లి విదేశాల్లో అవస్థలు పడుతున్నారని ఆమె కుమారుడు అరుణ్‌కుమార్ కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేసీఎం బృందం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సోమలమ్మను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ సోమవారం తెలిపారు. -
స్మార్ట్ ఇండియా హాకథాన్‌లో ప్రతిభ
గండేపల్లి: స్మార్డ్ ఇండియా హాకథాన్‌లో సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు చైర్మన్ పి కృష్ణారావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 8,9 తేదీలలో ముంబై వేస్కూల్లో ప్రతిష్టాత్మకగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి తమ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు కె.సుచిత్ర, వి హేమంత్ శంకర్, వి మధు, బి ఆకాశ్, ఎస్ వేణు కౌశిక్, సాయి ప్రసాద్‌రాయ్ పాల్గొని మాగ్జిమైజింగ్ సెక్షన్ త్రూ ఫుట్ యూజింగ్ ఏ1–పవర్డ్ ప్రిసైజ్ ట్రైన్ ట్రాఫిక్ కంట్రోల్ అనే అంశంపై సవాల్‌తో కూడిన సమస్యను పరిష్కరించి జాతీయస్థాయిలో ఎంపికై న ఆరు జట్లలో ఒకటిగా ప్రగతి నిలిచిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, కె సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి నరేష్, ఎంవీ రాజేష్, సీహెచ్ వీర గాయత్రి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. -
కోడింగ్ నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు
ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కోడింగ్ నైపుణ్యాలతో ఉపాధి అకాశాలు విస్త్రృతంగా ఉంటాయని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి పేర్కొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు కోడింగ్ కాంటెస్ట్–25 పోటీలు నిర్వహించారు. శేషారెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులకు దీటుగా ప్రస్తుత సాంకేతిక రంగంలో నిలబడాలంటే కోడింగ్ తప్పనిసరని, కోడింగ్ వల్లే సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతున్నారన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వీడన్ ఎస్ఈబీ బ్యాంక్ క్లౌడ్ ఇంజినీర్ కారుమంచి మహేష్ మాట్లాడుతూ ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించడానికి ముందుగా కోడింగ్ అవసరమని, ఇటువంటి పోటీలు నిర్వహించిన ఆదిత్య విద్యాసంస్థలను అభినందించాలన్నారు. అనంతరం ప్రతి కళాశాల నుంచి ముగ్గురిని ఎంపికచేసి 250 మందిని ఉత్తమ కొడర్లుగా ఎంపిక చేసి రూ.2లక్షల 50వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి సుగుణారెడ్డి, డాక్టర్ బీఇవీఎల్ నాయుడు, ప్రిన్సిపాల్ కె.కరుణ, బ్యూలా, కోడింగ్ ట్రైనర్ రాజేష్, ఐటీ మేనేజర్ కార్తీక్ పాల్గొన్నారు. -
ఆప్కో బకాయిలు విడుదల చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆరు సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఆప్కో బాకీ ఉన్న డబ్బు వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గారమేష్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల సమావేశం సోమవారం స్థానిక ఉమారామలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో నిర్వహించారు. సుమారు 40 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు. చేనేతల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి చేనేతలకు అడ్డంకిగా వ్యవహరిస్తూ, అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండీ, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే రిలే నిరాహార దీక్షలతో మొదలు పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఆప్కో డైరెక్టర్ మాజీ ముప్పన వీర్రాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు నల్లా రామారావు, అల్లక రాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్ పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
అనపర్తి: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై ఎల్ శ్రీనునాయక్ తెలిపారు. సోమవారం స్థానికు ల సమాచారం మేరకు ఘట నా స్థలానికి వెళ్లి విచారణ చేయగా మూడు రోజుల నుంచి అనపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసుకుంటూ, రాత్రి సమయంలో స్థానిక వజ్ర కాంప్లెక్స్ బయట పడుకునేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని తెలిసిందన్నారు. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి చామన ఛాయ కలిగి ఉన్నాడని లేత పసుపు రంగుపై నిలువు చారలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బూడిద రంగు ప్యాంటు, తెలుపు నలుపు రంగు కలిగిన చలి కోటు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని అనపర్తి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరచినట్టు చెప్పారు. తెలిసినవారు గాని, బంధువులు గాని అనపర్తి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై నాయక్ కోరారు. -
విద్యుత్ వైర్లు తగిలి కూలీ మృతి
రాజానగరం: మండలంలోని కానవరంలో పామాయిల్ గెలలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అదే గ్రామానికి కూలీ బొర్రా నాగేశ్వరరావు (49) సోమవారం మృతి చెందాడు. సాయంత్రం 4 గంటల సమయంలో పొడవాటి ఇనుప గొట్టానికి బిగించి ఉన్న కత్తితో ఆయిల్ పామ్ చెట్ల నుంచి గెలలు కోస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మాజీ సర్పంచ్ ఎస్.సత్యనారాయణ మీడియాకు తెలిపారు. చెట్లపై నుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు కత్తికి తగులుకొని విద్యుత్ ప్రవహించి, షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెంత తుళ్లింత కావాలిలె!
● నేటి నుంచి ధనుర్మాసం ● గ్రామాల్లో ఇక సంక్రాంతి సందడి ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● ఆకట్టుకోనున్న రంగవల్లులు ● కోనసీమ ప్రత్యేకతగా ప్రభల ఉత్సవం ● దేశ విదేశాల నుంచి స్వగ్రామాలకు రానున్న తెలుగువారు ఆలమూరు/బిక్కవోలు: తెలుగు సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతి పండగకు పల్లె సీమలు ముస్తాబవుతున్నాయి. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశి, మూల కార్తీ రోజైన మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనుర్మాసాన్ని నెల పట్టుట లేదా నెలగంట అంటారు. జనవరి 14న జరిగే భోగి పండగ వరకూ నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఉంటుంది. విష్ణాలయాల్లో ధనుర్మాస పూజలు చేసేందుకు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న విష్ణాలయాల్లోని దేవతామూర్తులు ప్రతి రోజూ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనివ్వనున్నారు. సంప్రదాయ కళల కోలాహలం సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ కళల కోలాహలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట ఆడపడుచుల రంగు రంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలతో మేలుకొలుపు, సంప్రదాయ పిండివంటలతో లోగిళ్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, కోడి, ఎడ్ల పందేలను నిర్వహించేందుకు పల్లెలు సమాయత్తం అవుతున్నాయి. భోగి పండగను పురస్కరించుకుని చిన్నారులు ఆవు పేడను సేకరించి భోగి పిడకలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కొమ్మదాసులు, గంగిరెద్దుల వారు, కోయదాసులు వంటి కళాకారులు గ్రామాల్లో సందడి చేయనున్నారు. సంప్రదాయ కళలుగా భావిస్తున్న కోడిపందేలను పోలీసుల కళ్లు గప్పి ఏవిధంగా నిర్వహించాలనే ఆలోచనలో ెపందెం రాయుళ్లు ఉన్నారు. ఇప్పటికే పందెం కోళ్లను జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికాహారంతో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. పాకశాలలుగా పల్లె లోగిళ్లు సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లోని లోగిళ్లు పిండివంటల తయారు చేస్తూ పాకశాలలుగా మారనున్నాయి. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు తెలుగు సంప్రదాయ వంటకాలైన సున్నుండలు, గజ్జికాయలు, జంతికలు, గవ్వలు, పోకుండలు తయారు చేసేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు. రైతులకు పంట చేతికందడంతో సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతికి నూతన వస్త్రాలు కొనుగోలు చేయడంతో పాటు తమ లోగిళ్లను సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవ్వనున్నారు. ఇతర దేశాల్లో కాని, రాష్ట్రాల్లో కాని నివసించే తెలుగు ప్రజలు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే విమానం, రైలు, బస్ టికెట్లు బుక్ అయిపోయాయి. పోటాపోటీగా ప్రభల ఉత్సవాలు సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కోనసీమలోని సుమారు 15 మండలాల్లో ప్రభల తీర్థ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏకాదశ రుద్రులుగా భావించే ప్రభల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రభలను పండగ మూడురోజుల పాటు ఊరేగించి పొలిమేరలు దాటిస్తే ఆ గ్రామానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గ్రామాలు, పట్టణాల్లో పోటీ పడి ప్రభల ఉత్సవాలను జరుపుతున్నారు. బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, బ్యాండుమేళాలు వంటివి ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గొబ్బెమ్మకు పూజలు పండగ నెల ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యన గొబ్బెమ్మను పెట్టి పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలను గోదాదేవి, లక్ష్మీ దేవి, గౌరీ మాతగా భావిస్తారు. గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి గుమ్మడి, తంగేడు, గురుగు పూలు, పసుపు కుంకుమ సమర్పించి పూజిస్తారు. ధనుర్మాసం పొడవునా గొబ్బెమ్మను పూజించడం ఆనవాయితీ. -
కూటమి సర్కార్ విధానాలపై ప్రజాగ్రహం: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ జాతీయ రహదారిపై ప్రతిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎన్‌హెచ్‌పై నరేంద్రగిరి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లే వ్యక్తులు 108కు ఫోన్ చేయడంతో క్షతగాత్రుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96570, 94407 96530 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కోరారు. -
వచ్చే నెల 12న బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడాకారుడు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరుతో వచ్చే జనవరి 12న అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు వెల్లడించారు. అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో ఈ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. మొత్తం 12 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు నేషనల్ షీల్డ్‌లు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, క్యాష్ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి వెంకట సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
రెండు మోటారు సైకిళ్ల చోరీ
సామర్లకోట: రెండు మోటారు సైకిళ్ల చోరీపై ఆదివారం బాధితులు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక పెద్దబజార్‌కు చెందిన శ్రీశైలపు బుజ్జి శనివారం స్టేషన్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద తన మోటార్ సైకిల్ నిలిపి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి కనిపించ లేదని ఫిర్యాదు చేశాడు. అదే విధంగా జి.మేడపాడు గ్రామానికి చెందిన మాదాసు వెంకటరమణ రైల్వే గేటు వద్ద నిలిపిన మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిలాఫలకం ధ్వంసం చేశారని ఫిర్యాదు ముమ్మిడివరం: గత ప్రభుత్వంలో రహదారి నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని స్థానిక జనసేన నాయకుడు ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గేదెల్లంక ఉత్తరవాహినికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి రూ.1.86 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ పనులు మొదలు పెట్టే ఉద్దేశంలో కనీసం గ్రామ సర్పంచ్‌కు గాని, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలికి గాని సమాచారం ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జేసీబీతో స్థానిక జనసేన నాయకుడు గుద్దటి రమాకేశవ బాలకృష్ణ ధ్వంసం చేశారని అంటున్నారు. అదేవిధంగా పంచాయతీ తీర్మానం లేకుండా అడ్డు వచ్చిన కొబ్బరి చెట్లను తొలగించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సానబోయిన పల్లయ్య, వైఎస్సార్ సీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జంపన శ్రీనివాసరాజు, కోలా వెంకటరత్నం (బాబ్జీ) తదితరులు ఆదివారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అమ్మో పులి
ఫ మెట్ట ప్రజలను వణికిస్తున్న వైనం ఫ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు దేవరపల్లి: మెట్ట ప్రాంత ప్రజలను పులి వణికిస్తోంది. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భీమోలు గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఓ పులి, రెండు పిల్లలతో తిరుగుతున్నట్లు చూసినట్లు రైతు కె.రామకృష్ణ చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగలోకి దిగారు. పులి సంచరిస్తున్నట్టు రైతు చెప్పిన ప్రాంతంలో రెండు రోజులుగా అధికారులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువు పాదముద్రను గుర్తించారు. అయితే అది పులి పాద ముద్రా? లేక ఏదైనా జంతువుదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఆదివారం జిల్లా అటవీ అధికారి దావీద్‌రాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి జి.వేణుగోపాల్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆరు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు దావీద్‌రాజు నాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని సూచించారు. గతేడాది ఇదే పరిస్థితి.. గత ఏడాది కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలకు దాదాపు రెండు నెలలు పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2024 ఫిబ్రవరిలో ద్వారకాతిరుమల మండలంలో కొద్ది రోజులు సంచరించిన పులి నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లోని పొగాకు తోటల్లోనూ తిరిగింది. రెండు మండలాల్లో పులి తెల్లవారు జామున పొలాలకు వెళ్లిన రైతుల కంట పడడంతో భయంతో వణికిపోయారు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. పొలాల్లో పాదముద్రలను సేకరించి పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 3న పులి దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గోపాలపురం మండలం వాదాలకుంట, కోమటికుంట, కరిచర్లగూడెం గ్రామాల మీదుగా మాతగమ్మ మెట్టపైకి చేరుకుని సంచరించింది. అక్కడ నుంచి గోపాలపురం మండలం కరగపాడు గ్రామ శివారున గల రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుంది. ఫారెస్ట్‌కు సమీపంలో కరగపాడుకు ఆనుకుని ఉన్న రైతు జక్కు అచ్చయ్య మొక్కజొన్న తోటలో పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసింది. ఆ పులి ఆచూకీ కోసం రిజర్వ్ ఫారెస్ట్‌లో పలు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్లీ ఇప్పుడు పులి జాడలు కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
మాజీ ఎంపీ కృష్ణమూర్తికి అంతిమ వీడ్కోలు
అమలాపురం టౌన్/ అయినవిల్లి: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి అంతమ యాత్ర అమలాపురంలో ఆదివారం సాయంత్రం విషాద వాతావరణంలో జరిగింది. తొలుత కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా అయినవిల్లి మండలం విలస గ్రామం రావిగుంట చెరువులోని ఆయన స్వగృహానికి తీసుకు వచ్చారు. అక్కడ రాజకీయ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ కృష్ణమూర్తి చిరస్మరణీయుడని అన్నారు. చిర్ల జగ్గిరెడ్డితో పాటు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పినిపే శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ పాముల దేవీప్రకాష్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీలు చింతా అనురాధ, బుచ్చి మహేశ్వరరావు, మాజీ మంత్రి పరమట వీరరాఘవులు, ఎంపీపీ మార్గాని గంగాధర్‌లు కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫ అనంతరం అంతిమ యాత్రలో భాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం ఆపారు. తర్వాత అమలాపురం నల్ల వంతెన సమీపం కలెక్టరేట్ రోడ్డులోని కృష్ణమూర్తి సొంత గొడౌన్ల వెనుక అంత్యక్రియలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి పార్థివ దేహంపై పార్టీ జెండాను వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి పరమట రాఘవులు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డీఎంఆర్ రాజశేఖర్, వంటెద్దు వెంకన్నాయుడు, ఉండ్రు వెంకటేష్, సరెళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, అయితాబత్తుల సుభాషిణి, యార్లగడ్డ రవీంద్ర, జిల్లా దళిత ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, పెనుమాల చిట్టాబాబు, నాతి శ్రీను, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. ఏ తల్లి కన్న బిడ్డో.. ఫ పెంట కుప్పపై ప్రత్యక్షం ఫ చేరదీసిన మానవత్వం కపిలేశ్వరపురం (మండపేట): ఏ తల్లి కన్న బిడ్డో.. కాన్పు కాగానే పెంట కుప్ప పాలయ్యాడు. జనమంతా చలికి వెచ్చని దుప్పటి మాటున నిద్రలో ఉన్న సమయమది. మంచు కురిసే వేళ ఎముకలు కొరికే చలిలో ఆరుబయట పశువుల పాక పక్కన పెంట కుప్పపై ఓ బిడ్డ కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. కుక్కలు చుట్టుముట్టినా మృత్యుంజయుడిలా ఊపిరిపోసుకున్న ఆ ఆబిడ్డను మానవత్వం అక్కున చేర్చుకుంది. మండపేట పట్టణంలోని సత్యశ్రీ రోడ్డు కోళ్లఫారం ఎదురుగా గేదెల పాక వద్ద మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదలివెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతు ఏడుపును విని ఆ బిడ్డను చూశాడు. చెంతనే ఉన్న కుక్కలను బెదరగొట్టి పిల్లాడిని చేరదీసి పట్టణంలోని సీహెచ్‌సీలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో శిశువును పరీక్షించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. పట్టణ ఎస్సై ఎన్.రాము ఆదేశాలపై హెచ్‌సీ కాంతారావు ఆసుపత్రిని సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీఓ యు.పూర్ణిమ ఆదేశాలపై సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ నాగశ్రీదేవి, అంగన్వాడీ సీహెచ్ రాణి ఆసుపత్రికి వెళ్లారు. అమలాపురంలోని శిశుగృహ నిర్వాహకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శిశువు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మరో బాలికపై అత్యాచారం ముమ్మిడివరం: వరుసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుండడంతో కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుంది. నెల రోజుల క్రితం ఐ.పోలవరం మండలం బాణాపురంలో జనసేన నాయకుడు ఓ బాలికపై అత్యాచారం చేయగా, వారం క్రితం ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట ఉప్పలగుప్తం మండలంలో ఓ తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఇది మరువక ముందే ముమ్మిడివరంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ముమ్మిడివరం ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు చిన అగ్రహారానికి చెందిన కాలాడి సతీష్ రెండేళ్లుగా ఆ బాలికను ప్రేమ పేరుతో మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ ఎం.మోహన్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి.జ్వాలాసాగర్లు సతీష్‌పై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. -
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్‌బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్‌బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్‌బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్‌రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్‌బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది. ●భవిష్యత్‌కు బాటలు ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. – వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ●ఎంతో ఉపయుక్తం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. – గారపాటి రుద్రనాగ్చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల ●ఎంతో ఉత్సాహం వచ్చింది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి ’స్పెల్‌బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. – కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం ●రాణించేందుకు మంచి అవకాశం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. – పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ●సులభంగా నేర్చుకునేందుకు.. ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. – కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం ●థ్యాంక్యూ ‘సాక్షి’... నేను ముందుగా స్పెల్‌బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్‌బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. – దాట్ల దీక్షిత, 7వ తరగతి, ఆదిత్య నగర్, శ్రీనగర్, కాకినాడ ●అవగాహన పెరిగింది స్పెల్‌బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్‌పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్‌తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. – ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం ●భవిష్యత్తుకు నిర్దేశంగా.. విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్‌లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. – డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ●ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ పరీక్ష దోహదపడుతుంది. సాక్షి స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్‌లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం ●విద్యార్థులకు ప్రయోజనం ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్‌బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్‌లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా ‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. – వి.రాజేష్, కోఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రాజమహేంద్రవరం -
ముగిసిన వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో కాకినాడ జేఎన్టీయూలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్న్‌మెంట్ ఆదివారం రాత్రితో ముగిసింది. జేఎన్టీయూకే క్రీడా మైదానంతో పాటు రాజీవ్‌గాంఽధీ ఏంబీఏ కళాశాల, ఆదిత్య సూరంపాలెం కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఫైనల్స్‌లో చెన్త్నె మద్రాస్ యూనివర్సిటీపై చైన్నె ఎస్ఆర్ఏం యూనివర్సిటీ గెలిచింది. రన్నర్‌గా మద్రాస్ యూనివర్సిటీ నిలవగా, కేరళ కాలికట్ యూనివర్సిటీ తృతీయ, భారతీయర్ యూనివర్సిటీ నాల్గో స్థానంలో నిలిచాయి. అంతర్జా తీయ వాలీబాల్ క్రీడాకారుడు ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్‌లు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీనివాసరా వు, స్టూడెంట్స్ ఎఫైర్ డైరెక్టర్ కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామ్ కుమార్, డాక్టర్ జీపీ రాజు పాల్గొన్నారు. -
పుడమి తల్లికి పచ్చబొట్లు
● రబీ వరి నాట్లకు శ్రీకారం ● బోర్ల కింద ప్రారంభించిన రైతులు ● సాగు విస్తీర్ణం 61,326 హెక్టార్లు ● ఇప్పటి వరకూ 895 హెక్టార్లలో నాట్లు దేవరపల్లి: ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు పూర్తి కాకుండానే రైతులు రబీ వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో.. ముందుగా ఖరీఫ్ కోతలు పూర్తయిన పొలాల్లో.. బోర్లు, కాలువల కింద వారం రోజులుగా వరి ఆకుమడులు ముమ్మరంగా వేస్తున్నారు. రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు, తాళ్లపూడి చాగల్లు, మండలాల్లో వరి నాట్లు సైతం ప్రారంభించారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకంగా లేక పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సార్వాలో ఎకరాకు 32 నుంచి 38 బస్తాల ధాన్యం దిగుబడి రావలసి ఉండగా, 25 నుంచి 28 బస్తాలు మాత్రమే వచ్చాయి. దీంతో, పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే దాళ్వాలో ఎకరాకు 55 నుంచి 60 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగి, దండిగా దిగుబడులు వచ్చి, నాలుగు డబ్బులు మిగలాలని ఆశ పడుతున్నారు. అధిక దిగుబడులిచ్చే వంగడాలపై మొగ్గు దాళ్వాలో అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల పంట కాల పరిమితి వండగాలయిన ఎంటీయూ–1121, ఆర్ఎన్ఆర్–15048, ఎంటీయూ–1156, ఎంటీయూ–1153 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు డీసీఎంఎస్, సొసైటీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తూండగా.. ఎక్కువ మంది రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలనే సాగు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో నారు పోసుకుని, 25వ తేదీలోగా నాట్లు వేస్తే మార్చి నెలాఖరుకు 60 శాతం పంట కోతకు వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తద్వారా మూడో పంట వేసుకునే అవకాశం కూడా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో రైతులే విత్తనాలు తయారు చేసి, అవసరమైన ఇతర రైతులకు సరఫరా చేస్తున్నారు. నెలాఖరుకు సాగు జోరు ఇప్పటికే ఆకుమడులను రైతులు సిద్ధం చేస్తున్నారు. పొలాలు దమ్ములు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందు కుంటాయి. రైతులకు అవసరమైన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాం. యూరి యా కొరత ఎక్కడా లేదు. రాజమహేంద్రవరం డివిజన్లో 1,555 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డి విజన్‌లో 3,439 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీ లు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. – ఎస్.మాధవరావు,జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం రబీలో వివిధ పంటల సాగు ప్రణాళిక (హెక్టార్లు) వరి 61,326 మొక్కజొన్న 8,646 పెసర 434 మినుము 771 శనగ 806 వేరుశనగ 241 నువ్వులు 224 పొద్దుతిరుగుడు 187 పొగాకు 5,544 చెరకు 402 జిల్లావ్యాప్తంగా అన్ని పంటలూ కలిపి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 78,592 హెక్టార్లు. ఇప్పటి వరకూ 7,302 హెక్టార్లలో ఆయా పంటలు వేశారు. వరి 895, మొక్కజొన్న 2,800, పొగాకు 3,333 హెక్టార్లు, శనగ 254 హెక్టార్లలో వేశారు. -
లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
బిక్కవోలు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత బిక్కవోలులో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈఓ ఆధ్వర్యాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేడు పీజీఆర్ఎస్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. విజయవాడ భవానీ దీక్షల విరమణకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వారు వచ్చిన టూరిస్టు బస్సులతో దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. ఆ భక్తులందరూ నడక దారిన సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రత్నగిరిపై పార్కింగ్ స్థలం కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. స్వామివారి వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. నేడు సత్యదేవుని మెట్లోత్సవం సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత రత్నగిరి పైనుంచి దిగువకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామంలో పల్లకీపై ఊరేగించి, తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, తొలి మెట్టుకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపై సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పసుపు, కుంకుమ రాసి, హారతి ఇచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. -
ఉండాల్సిన వారు 27.. ఉన్నది 9 మంది
పెరవలి మండలంలోని కాకరపర్రు కెనాల్‌పై ఉన్న పెరవలి లాకు పరిధిలో 37,357 ఎకరాల సాగు భూమి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని నిడదవోలు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లోని 51 గ్రామాలకు దీని ద్వారా సాగు, తాగునీరు అందుతోంది. పెరవలి లాకు పరిధిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఏఈ, ఒక గుమస్తా(పర్మినెంట్ ఉద్యోగులు)తో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 9 మంది లస్కర్లు మాత్రమే ఉన్నారు. ఈ లాకుల పరిధిలోని ఉండ్రాజవరం, రామయ్యగుంట, అజ్జరం, భూపయ్య కాలువ, ఈస్ట్ విప్పర్రు, ఖండవల్లి, పేకేరు కాలువలపై ఏడుగురు డెల్టా లస్కర్లు ఉండాల్సి రాగా మొత్తం ఏడు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అలాగే, కెనాల్ లస్కర్లు ఐదుగురు ఉండాలి. ఈ పోస్టులు కూడా మొత్తం ఖాళీ. వైరు లస్కర్లు ఇద్దరికి గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైర్ సూపరింటెండెంట్, లాకు లస్కర్లు 4, లాకు సూపరింటెండెంట్, గుమస్తాలు 2, వర్క్ ఇన్స్పెక్టర్లు 2, వాచ్‌మన్ 1, ఎవెన్యూ లస్కర్ 1 చొప్పున పోస్టులుండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీరందరి విధులను కేవలం 9 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే కానిచ్చేస్తున్నారు. -
నేడు కోటి సంతకాల ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులను సోమవారం ఉదయం 10 గంటలకు బొమ్మూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కేంద్ర కార్యాలయానికి పంపించనున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీపై ప్రజల్లో చర్చ జరగాలని, జిల్లా మొత్తం హోరెత్తేలా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం దేశంలోని ప్రజలందరి దృష్టికీ వెళ్లాలన్నారు. కోటి సంతకాల ప్రతులున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తామని, బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో జరిగిందన్నారు. గ్రామాలు, డివిజన్లు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు మద్దతు కూడగట్టామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస్‌నాయుడు హాజరవుతారని వివరించారు. పార్టీ, వివిధ అనుబంధ విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వేణు కోరారు. బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ నిర్వహణ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతుల తరలింపు శ్రేణులు రాజమహేంద్రవరానికి భారీగా తరలి రావాలి దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
లస్కర్లను చూసి పుష్కరం
● ఏళ్ల తరబడి భర్తీ కాని పోస్టులు ● జిల్లావ్యాప్తంగా ఉండాల్సిన లస్కర్లు 1,500 మంది ● ఉన్నవారు 600 మంది ● వీరిలో అవుట్ సోర్సింగ్ 550 మంది ● ఏడాదిగా అందని జీతాలు ● సిబ్బంది కొరతతో లాకులు, కాలువలపై పర్యవేక్షణ లోపంపెరవలి: ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన గోదావరి డెల్టాలో కీలకమైన లస్కర్ల వ్యవస్థ తగినంత మంది సిబ్బంది లేక నానాటికీ నీరసించిపోతోంది. ఏయే కాలువల కింద ఏయే పంటలు సాగవుతున్నాయి.. నీటి అవసరం ఎంత.. లాకుల పరిస్థితి ఏమిటి.. నీటి సరఫరా క్రమబద్ధీకరణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత లస్కర్లది. అటువంటి లస్కర్ల నియామకాలు ఏళ్ల తరబడి జరగకపోవడంతో కాలువలు, లాకుల స్థితిగతులను పట్టించుకుంటున్న వారే కరువవుతున్నారు. పూర్తి స్థాయిలో లస్కర్లు ఏరీ! జిల్లాలో అన్ని పంటలూ కలిపి మొత్తం సాగు భూమి 3,53,692 ఎకరాలు. ఇందులో 11 మండలాల్లో కాలువల కింద 1,63,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువలపై ఉన్న లాకుల వద్ద సాగునీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే లస్కర్ల నియామకాలు 12 సంవత్సరాలుగా జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా గోదావరి డెల్టా కాలువలపై 22 ప్రధాన లాకులున్నాయి. వీటిపై ఒక్కోచోట 30 మంది చొప్పున మొత్తం 660 మంది లస్కర్లు ఉండాలి. అలాగే, మరో చిన్న లాకులు 172 ఉన్నాయి. ఒక్కో లాకు నుంచి సుమారు 30 వేల నుంచి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వ్యవస్థలో ప్రధాన కాలువ, డెల్టా, ఎవెన్యూ అనే మూడు కేటగిరీలుగా లస్కర్లు ఉంటారు. ప్రధాన కాలువ లస్కర్లు డెల్టాలోని ప్రధాన కాలువలను పర్యవేక్షిస్తూంటారు. ఈ ప్రధాన కాలువలకు అనుసంధానమైన చిన్న కాలువలపై డెల్టా లస్కర్లు విధులు నిర్వహిస్తారు. ఎవెన్యూ లస్కర్లు కాలువ గట్లు, లాకుల వద్ద పిచ్చి మొక్కలు పెరగకుండా.. గట్లు దెబ్బ తినకుండా పర్యవేక్షిస్తారు. ఈ మూడు రకాలూ కలిపి మొత్తం 1,500 మంది లస్కర్లు ఉండాలి. కానీ, అన్ని రకాలూ కలిపి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 600 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో 50 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు కాగా, మిగిలిన 550 మందీ అవుట్ సోర్సింగ్ విధానంలోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం 900 మంది లస్కర్లకు కొరత ఉంది. మరోవైపు ఏఈల కొరత కూడా ఇరిగేషన్ వ్యవస్థను వేధిస్తోంది. రెండు మూడు లాకుల బాధ్యతను ఒక్కరే చూడాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా కాలువలు, లాకులపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా లస్కర్లు లేకపోవటంతో ఏలూరు, బ్యాంక్ కెనాల్, కాకరపర్రు, నరసాపురం, అమలాపురం, కాకినాడ, జొన్నాడ తదితర కాలువల నుంచి నీటి ప్రవాహం సక్రమంగా జరగక రైతులు కిబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఆక్రమణలతో పెద్ద కాలువలు పంట కాలువల్లా.. పంట కాలువలు పంట బోదెల్లా మారిపోతున్నాయి. గట్లు కుచించుకుపోతున్నాయి. ఒక్కో లాకు వద్ద 20 నుంచి 30 మంది వరకూ లస్కర్లు పని చేయాల్సి ఉండగా చాలాచోట్ల కనీసం 10 మంది కూడా లేని దుస్థితి నెలకొంది. ఇచ్చేదే తక్కువ.. ఏడాదిగా అదీ లేదు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న లస్కర్లకు నెలకు రూ.5,500 మాత్రమే చెల్లిస్తారు. అది కూడా ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా ఇబ్బందులూ పడుతున్నారు. వేతనాలు వెంటనే చెల్లించాలి డెల్టాలోని రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టు చివరి వరకూ నీరు చేరాలంటే లస్కర్ల వ్యవస్థ కీలకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవస్థలోని లస్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉంచటం సరి కాదు. వారికి వెంటనే వేతనాలు విడుదల చేసి, లస్కర్ల పర్యవేక్షణలో రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. – విప్పరి్త్ వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ, ధవళేశ్వరం -
‘దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వలేదు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందనే మాట పచ్చి అబద్ధమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ చెప్పారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా శిశుపాల వధ, రాజసూయ యాగ నిర్వహణ, దుర్యోధనుని భంగపాటు తదితర అంశాలను వివరించారు. ‘త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ.. రాజసూయం తరువాత 13 సంవత్సరాల్లో నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం చేత, భీమార్జునుల బలము చేత గొప్ప క్షత్రియ వినాశనం జరుగుతుందని ధర్మరాజుకు వ్యాసుడు చెబుతాడు. ఈ మాటలకు ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. అప్రమత్తుడవై, ఇంద్రియాలపై పట్టు కలిగి ఉండాలని వ్యాసుడు ఆదేశిస్తాడు’ అని చెప్పారు. జ్ఞానం సంఘటనలను మార్చుకోవడానికి కాదని, ప్రతికూల సంఘటనలను సైతం తట్టుకోవడానికేనని అన్నారు. ‘‘వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు ‘ఇకపై నేను పరుష వాక్యాలు పలకను, జ్ఞాతులు చెప్పినట్లు ప్రవర్తిస్తాను. ఎవరి పట్లా భేద భావం కలిగి ఉండను. ఇది నా ప్రతిజ్ఞ’ అని తమ్ములకు వివరిస్తాడు. కృష్ణుడు అప్పటికే ద్వారకకు వెళ్లిపోయాడు. రాజలోకం తిరిగి వెళ్లింది. శకుని, దుర్యోధనుడు మాత్రం మరో రెండు రోజులు మయసభలో ఉండాలనుకున్నారు. దుర్యోధనుని భంగపాటు చూసి ద్రౌపది నవ్వినట్లు వ్యాసుడు చెప్పలేదు. భీమసేనుడు, అతని సేవకులు మాత్రమే నవ్వినట్లు వ్యాస భారతం చెబుతోంది’’ అని సామవేదం స్పష్టం చేశారు. ‘‘పాండుసుతుల వైభవాన్ని చూసి అసూయా రోగానికి గురైన దుర్యోధనుడితో శకుని.. ధర్మరాజును ద్యూత క్రీడకు ఆహ్వానించాలని చెబుతాడు. దీంతో, దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ‘నేను నిప్పులలో దూకుతాను, విషం మింగుతాను’ అని బెదిరిస్తాడు. ద్రౌపది, కృష్ణుడు తనను చూసి నవ్వారని ధృతరాష్ట్రుడికి అబద్ధం చెబుతాడు. ఈ అబద్ధాన్ని పట్టుకొని కొందరు ద్రౌపది నవ్విందంటూ తప్పుడు ప్రచారం చేశారు’’ అని వివరించారు. ‘‘రాజసూయ యాగంలో మరుగుజ్జులు, భిక్షకులు కూడా భోజనం చేశారో లేదో కనుక్కున్న తరువాతనే ద్రౌపది భోజనం చేసేది. ఆమె గృహిణీ ధర్మాన్ని పాటించిన తీరును వ్యాసుడు అనేక సందర్భాల్లో వర్ణించాడు’’ అని చెప్పారు. శిశుపాల వధ వత్తాంతాన్ని వివరిస్తూ, కృష్ణుడు తన దివ్యత్వాన్ని, నారాయణ తత్త్వాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడని, దీనికి విరుద్ధంగా రామావతారంలో రాముడు తన అవతారతత్త్వాన్ని గోప్యంగా ఉంచాడని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు. -
షటిల్ బ్యాడ్మింటన్‌లో ఆదిత్య రామ్ ప్రతిభ
అమలాపురం టౌన్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన షటిల్ బ్యా డ్మింటన్ ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్‌లో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బీబీఏ విద్యార్థి బొంత ఆదిత్య రామ్ సౌత్ జోన్ (సౌత్ ఇండియా) పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడ కేఎల్‌యూలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పోటీలకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీలో ఆదిత్య రామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అపురూపం.. రూ.108 నాణెం అమలాపురం టౌన్: సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం రూ.108 ముఖ విలువతో వెండి నాణేన్ని విడుదల చేసింది. అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ఈ నాణేన్ని సేకరించారు. దీన్ని 40 గ్రాముల బరువుతో 99.90 శాతం శుద్ధ వెండితో తయారు చేశారు. తొలిసారిగా రూ.108 ముఖ విలువతో ఈ నాణేన్ని భారత ప్రభుత్వం ముద్రించింది. దేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతిగా సేవ చేసిన సత్య ప్రమోద తీర్థ స్వామీజీ పేరుతో నాణేన్ని ముద్రించారు. నాణేనికి ఒక వైపు రూ.108 ముఖ విలువ, మరో వైపు సత్య ప్రమోద తీర్థ స్వామీజీ చిత్రం కనిపిస్తాయి. డాబా పైనుంచి పడి మహిళ మృతి కొత్తపేట: డాబాపై దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గణేష్ నగర్‌కు చెందిన గొల్లపల్లి వెంకటలక్ష్మి (40) శనివారం ఉదయం తన డాబాపై దుస్తులు ఆరవేస్తోంది. ఈ క్రమంలో కాలుజారి కిందపడిపోయింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. -
పాఠం వింటూ.. ప్రాణం వదిలింది
● తరగతి గదిలో విద్యార్థిని హఠాన్మరణం● కార్డియాక్ అరెస్టుగా భావిస్తున్న వైద్యులు ● రామచంద్రపురంలో ఘటన రాయవరం: తరగతిలో గదిలో పాఠాలు వింటున్న విద్యార్థిని హఠాత్తుగా బెంచీపై నుంచి పడిపోయి మృతి చెందింది. హుషారుగా వెళ్లిన బాలిక.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివ రాల్లోకి వెళితే.. పసలపూడి గ్రామానికి నల్లమిల్లి వెంకటరెడ్డి, సుజాత దంపతుల కుమార్తె సిరి (16) రామచంద్రపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆమె తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు యథావిధిగా వెళ్లిన సిరి మొదటి పిరియడ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుడివైపునకు పడిపోయింది. వెంటనే ఉపాధ్యాయుడు, సహ విద్యార్థులు ఆ బాలికకు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్టుతోనే సిరి మృతి చెందిందని వారు భావిస్తున్నారు. -
చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
కొత్తపేట: స్థానిక మద్దులమెరక గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల ఏడుకొండలు (64) అనే కల్లుగీత కార్మికుడు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు చెట్ల నుంచి కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దానిలో భాగంగా శనివారం గ్రామంలోని తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేగా జ్యుయలర్స్‌లో అద్భుత ఆఫర్లు
రాజమహేంద్రవరం సిటీ: పండగల సందర్భంగా వేగా జ్యుయలర్స్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులకు డిసెంబర్ 15 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. వీటి బ్రౌచర్లను మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ ఆవిష్కరించారన్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలను వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సువర్ణవకాశం కల్పించామని తెలిపారు. ఫ్యాషన్ ఆభరణాల నుంచి ప్రాచీన సంప్రదాయ ఆభరణాల వరకూ తమ షోరూమ్‌లలో అందుబాటులో ఉంచామన్నారు. బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు ఇస్తున్నామని, పోల్కి ఆభరణాలపై తయారీ, తరుగు చార్జీలు ఉండవన్నారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 మాత్రమే ఉంటుందన్నారు. -
అంగరంగు వైభవం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసోత్సవం ప్రారంభానికి ముందు రోజు స్వామివారి మెట్లోత్సవం నిర్వహించడం, ఆ తర్వాత రోజు నుంచి కనుమ పండగ వరకూ సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారిని గ్రామంలో ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన (సోమవారం) సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజు రత్నగిరి కొండ దిగువన గల తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ గల 450 మెట్లకు భక్తులు పూజలు నిర్వహించనున్నారు. దీని కోసం రత్నగిరి మెట్ల మార్గంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మెట్టుకూ రంగు వేసి ముస్తాబు చేస్తున్నారు. పల్లకీలో ఊరేగింపు సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా రత్నగిరి నుంచి కొండ దిగువకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువస్తారు. గ్రామంలో వందల మంది భక్తుల నడుమ పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం తొలి పావంచా వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న తొలి మెట్టుకు దేవస్థానం అధికారులు, మహిళలు పూజలు చేసి మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయం వరకు గల మెట్లకు భక్తులు పూజలు చేసి హారతి ఇస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళతారు. 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ కనుమ పండగ వరకూ ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారిని ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ అన్నవరం పుర వీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆలయానికి చేరుస్తారు. నెల రోజులు జరిగే ధనుర్మాసోత్సవాలకు స్వామివారి పల్లకీ కూడా ఉండేందుకు దేవస్థానం వేద పండితులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. 30న ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో ఉండే సత్యదేవుడు, అమ్మవారిని దర్శించేందుకు భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వెండి రథంపై ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారి ప్రాకార సేవ, అదే రోజు రాత్రి కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. జనవరి 14న భోగి ఉత్సవాలు భోగి పండగ సందర్భంగా జనవరి 14న రత్నగిరి రామాలయం వద్ద భోగి మంట వేస్తారు. పల్లెటూరి వాతావరణం ప్రతిబించించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న కనుమ పండగ సందర్భంగా కొండ దిగువన పురగిరి క్షత్రియుల రామకోవెల వద్ద సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రభోత్సవం నిర్వహిస్తారు. కాగా.. సత్యదేవుని మెట్లోత్సవం, ధనుర్మాసంలో ఊరేగింపు కోసం స్వామివారి వెండి పల్లకీని ముస్తాబు చేస్తున్నారు. వెండి శంఖ, చక్రాలకు కూడా మెరుగు పెట్టి సిద్ధం చేస్తున్నారు. రేపు సత్యదేవుని మెట్లోత్సవం మెట్లకు రంగులు వేసి ముస్తాబు చేసిన దేవస్థానం సిబ్బంది 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
భీమోలులో పులి సంచారం!
గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పులి పాదముద్రలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు, డీఆర్ఓ జి.వేణుగోపాల్, ఎఫ్బీఓ వై.శ్రీను ఆ ప్రాంతాన్ని శనివారం సాయంత్రం పరిశీలించారు. దావీదురాజు మాట్లాడుతూ భీమోలు కొండపై వ్యవసాయం చేస్తున్న కె.రామకృష్ణ తన పొలంలో పులి, రెండు పిల్లలు కనిపించాయంటూ ఈ నెల 11న సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు భీమోలు కొండపై సర్వే చేస్తున్నామన్నారు. పులికి సంబంధించి ఎటువంటి జాడలూ కనిపించలేదని, ప్రస్తుతం కొండపై ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు, కూలీలు ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలసి సంచరించాలని సూచించారు. -
హుండీ సొమ్ము చోరీచేసిన ఇద్దరి అరెస్ట్
దేవరపల్లి: సంగాయగూడెం గంగానమ్మ ఆలయంలో హుండీ సొమ్ములను దొంగిలించిన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ దేవత గంగానమ్మ గుడిలోని హుండీని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు బద్దలు కొట్టి, దానిలో నగదును దొంగిలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన బల్లే దుర్గాపండు, తొర్లపాటి రాజును అరెస్ట్ చేసి కొవ్వూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామానికి చెందిన శెట్టి సత్యనారాయణ (54) కూలి పనికి వస్తూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. అతడిని అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు ఢీకొంది, ఈ ఘటనలో శెట్టి సత్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పి.గన్నవరం: నాగుల్లంక గ్రామానికి 18 ఏళ్ల యువతి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి అదృశ్యమైందని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఆ యువతి ఐదు నెలల పాటు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిందని, అనంతరం నెల రోజుల క్రితం మానేసిందన్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందని తెలిపారు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. -
పద్యంలా ఘోషించే గోదావరి!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ సహస్ర వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మాతృ భాష పరిరక్షణ సమితి పెరవలి, ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 40 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భారతమాత, తెలుగు తల్లి వేషధారణలతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జంధ్యాల పాపాయ్య శాస్త్రి (కరుణశ్రీ) కుమారుడు వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 80 ఏళ్లు జీవించిన తన తండ్రి 80 తెలుగు సాహితీ గ్రంథాలను అందించారని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం తెలుగు బాల సాహిత్య గ్రంథాలనే అందించిన ఘనత కరుణశ్రీ దే అన్నారు. శాసనమండలి సభ్యులు సోమ వీర్రాజు మాట్లాడుతూ 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని వెయ్యి సార్లు ఆలపించడం ఆనందదాయకమన్నారు. నగర ప్రముఖులు తోట సుబ్బారావు, పంతం కొండలరావు, ఇయ్యపు మురళీధర్, లక్కోజు వీరభద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతినిధులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు శతక పద్య విశిష్టతను వివరించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారుడు వెంకటరమణకు ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కారం చేశారు. -
చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే కోటి సంతకాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిపక్షాలు ప్రజల గొంతుకై ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజేస్తాయని, వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారని, ఆయన కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల ఉద్యమం చేపట్టారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నా రు. ఈ నెల 15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహక సమావేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అధ్యక్షతన బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేణు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను చంద్రబాబు అనుయాయులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. వైద్యం, విద్యను ప్రజలకు దూరం చేస్తున్న ప్రభుత్వానికి కోటి సంతకాలు సేకరించి కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4లక్షల 20వేల సంతకాల ప్రతులను సోమవారం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయ కర్తలు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర, మండల, గ్రామస్థాయి ప్రతినిధులతో కలిసి వాహనంపై తాడేపల్లికి తీసుకుని వెళతామన్నారు. వాటిని ఈ నెల 18న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్‌కు అందజేస్తారన్నారు. ప్రజల నిరసన ఎలా ఉందో? చంద్రబాబుకు చెప్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. 15న వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వ నిర్ణయం తప్పని, ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెల్లుబోయిన వేణు తెలిపారు. ప్రభుత్వ భూమి, భవనాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే కాకుండా రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా జీవో ఇచ్చారన్నారు. ఇంత దారుణంగా ఎక్కడైనా ఉంటుందా? తన తాబేదారుల ఆస్తులు పెంచుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు వాడుకుంటున్నాడన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదల ఆస్తులు దోచి పెద్దలకు పెట్టుకున్నాడు. ఇదే తీరు మెడికల్ కళాశాలల అంశంలో తారాస్థాయికి చేరిందన్నారు.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమం చేస్తామని వేణు అన్నారు. జగన్ విద్య, వైద్యం ప్రజలకు చేరువ చేశారు పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను కట్టుకుంటూ వస్తే..చంద్రబాబు వాటిని అమ్ముకుంటూ పోతున్నారన్నారు. వైఎస్ జగన్ భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు మాట్లాడుతూ కోటి సంతకాల ఉద్యమం వైఎస్సార్ సీపీ పోరాటం కాదని, ప్రజా ఉద్యమం అన్నారు. టీడీపీ నేతలే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. అనంతరం 15వ తేదీన వాహ నాలు పార్కు చేసే ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌ సింగ్ బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, గుబ్బల తులసీరామ్, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జామౌలాలి, వివిధ విభాగాల అధ్యక్షులు మార్తి లక్ష్మి, విజయసారధి, నేతలు పాల్గొన్నారు.రేపటి ర్యాలీ సన్నాహక సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు -
'అంబా' అని అరచినా..
సాక్షి, రాజమహేంద్రవరం: మూగజీవాలపై సైతం చంద్రబాబు ప్రభుత్వం పచ్చపాతం రూపుతోంది. అధికారంలోకి వచ్చిన తక్షణమే మూగజీవాలకు ఇంటి ముంగిటకే అందే వైద్య సేవలకు మంగళం పాడారు. తాజాగా మూగజీవాలకు అవసరమైన మందులు అందించకుండా సర్యారు నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిగా జౌషధాల పంపిణీ నిలిపివేయడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నా మందులు మాత్రం బయటకు రాసిస్తున్నారు. దీంతో పశువుల యజమానులపై ఆర్థిక భారం పడుతోంది.ఇదీ సంగతి..జిల్లా వ్యాప్తంగా 71 పశువైద్యశాలలు ఉన్నాయి. వివిధ రకాల పశువులు 1,23,668 ఉండగా.. 1,03,598 గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం, మందుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకుని వేలమంది రైతులు జీవనం సాగిస్తున్నారు. పాలు విక్రయించి బతుకుబండి లాగుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువులకు వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళుతుంటే మందుల కొరత వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు.ఏడాదిగా అందని మందులుచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మందులు సరఫరా చేసిన దాఖలాలు లేవు. ప్రతి మూడు నెలలకోసారి సరిపడా స్టాక్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. మరో నెల రోజులు పాటు మందులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పశువుల సంఖ్య ఆధారంగా రాష్ట్ర పశువైద్య శాఖ మందులు సరఫరా చేయాల్సి ఉంది. లైవ్‌స్టాక్ యూనిట్లుగా పరిగణించి డైరెక్టరేట్ నుంచే ఏ ప్రాంతానికి ఏ మందులు ఎన్ని అవసరమో ఇండెంట్ పెట్టే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. ప్రక్రియ పూర్తయి, మందులు క్షేత్రస్థాయి ఆస్పత్రులకు చేరాలంటే మరో నెల రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు రూ.వేలు ఖర్చు చేసి బయట మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పశుపోషకులు ఆవేదన చెందుతున్నారు.సంచార వైద్య సేవలపై అక్కసుపశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. అంబులెన్స్ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబర్ సైతం ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళం పాడింది. దీంతో పశుపోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకునేందుకు పాట్లు పడుతున్నారు.అంబులెన్స్‌లో అధునాతన వసతులుగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చిన పశువుల అంబులెన్స్‌లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉండేవారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాలను అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉండేది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు.వ్యవస్థల నిర్వీర్యంఅత్యవసర వైద్య సేవలు అందించే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడేమో మందులు సకాలంలో సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతోంది.-రాజమహేంద్రవరంలోని పశు సంవర్ధకశాఖ జిల్లా కార్యాలయంఅత్యవసర మందులకూ కటకటే..పశు వైద్యశాలల్లో మందులు నిండుకున్నాయి. అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలు కూడా నిల్వ లేని పరిస్థితి తలెత్తింది. పశువులకు ప్రస్తుతం ఎక్కువగా జీర్ణ సంబంధిత ఇబ్బందులు, నొప్పులు, గర్భ సంబంధ సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వైద్యం తప్పనిసరి. మందుల కొరతతో మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి.అజీర్తి, ఆమ్లజలగ వ్యాధులు, బికోలై ఇన్ఫెక్షన్, ఫెర్టిలిటీ, బ్యాక్టీరియా, వైరల్ సమస్యలతో అత్యధిక శాతం పశువులను ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. వాటికి చికిత్స చేస్తున్నా వైద్యులు మందులు బయట తెచ్చుకోమని చీటీ రాస్తున్నారు.ఆసుపత్రులకు ప్రతి మూడు నెలకోసారి మందులు సరఫరా చేయాలి. ఏడీ స్థాయి ఉన్నవాటికి రూ.1.50 లక్షలు, వైద్యాధికారి స్థాయి ఉన్న వాటికి రూ.లక్ష బడ్జెట్ ఉండేది. ఇక్కడి నుంచి గ్రామీణ, రైతు సహాయక కేంద్రాలకు అవసరమైన మందులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. -
రాజీయే రాజమార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంమాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రిశాస్త్రి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎయిర్‌పోర్టులో డ్రై రన్ కోరుకొండ: విమాన సర్వీసుల రాకపోకలకు ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత విమానాశ్రయాల అథారిటీ (ఏఏఐ) ఆధ్వర్యంలో శనివారం మధురపూడిలోని విమానాశ్రయంలో డ్రై రన్ నిర్వహించారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా ఏర్పడే అవరోధాలను అధిగమించి విమాన సేవలందించడానికి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సర్వీసుల రాకపోకల్లో అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏటీసీ, ఆపరేషన్లు, ఇంజినీరింగ్, ఏఆర్ఎఫ్ఎఫ్ విభా గాలకు చెందిన అధికారులతోపాటు, ఇండిగో, అలయన్స్ ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్పై అపోహలు వద్దు రాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్పై అపోహలు అవసరం లేదని, జిల్లాలో ఆ వ్యాధి వ్యాప్తిలో లేదని, సకాలంలో గుర్తిస్తే నయం అవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే వేంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో ప్రచురితం అవుతున్న వార్తల నేపథ్యంలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు స్క్రబ్ టైఫస్ కేసులు మాత్రమే గుర్తించారని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలియజేశారు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదని, జూనోటిక్ వ్యాధి అని తెలిపారు. పొదలు, గడ్డి ప్రాంతాల్లో నివసించే నల్లి లార్వా (చిగ్గర్ మైట్స్) కాటు ద్వారా మాత్రమే మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు. సాధారణ స్పర్శ, దగ్గు, తుమ్ము, మాట్లాడటం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని వివరించారు. నేటి నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు రాజమహేంద్రవరం సిటీ: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె తిలక్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీన రాజమహేంద్రవరం ఎస్ఈ కార్యాలయంలో బహుమతుల ప్రదానం నిర్వహిస్తామన్నారు. వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై నిపుణులతో ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్క్ షాపులు నిర్వహిస్తారన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. -
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్‌పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
వేతనాలు పెంచాలి
● యాప్‌ల భారం తగ్గించాలి ● అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్లు, ఆయాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ, పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణం రూ.26 వేల కనీస వేతనాన్ని అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పెంచిన పని భారాన్ని తగ్గించాలని, అన్నీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలుపు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ ఇవ్వడం లేదని, దీనిని తక్షణం పునరుద్ధరించి వారికి మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు బడ్జెట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు అనేక హామీలిచ్చి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏకబిగిన 42 రోజుల సమ్మె చేసిన అనుభవం అంగన్వాడీలకు ఉందని గుర్తు చేశారు. వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, మినీ కేంద్రాల కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, బేబీ రాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, ఉపాధ్యక్షుడు టి.అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఫీడర్ లెవెల్ సోలారైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు ఈ నెలాఖరులోగా సిద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలారైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. విజయానంద్ మాట్లాడుతూ, ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని, వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలారైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్‌బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సమావేశంలో యనమదల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకరరావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకే రాజు, పెంకే శివ, పెంకే వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
● సీఐటీయూ నేతల విజ్ఞప్తి ● నగరంలో రెడ్ మార్చ్రాజమహేంద్రవరం సిటీ: ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకూ విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాసభల నేపథ్యంలో సీఐటీయూ ఆధ్వర్యాన నగరంలో వివిధ రంగాల కార్మికులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్లపై కార్మికులందరూ ఐక్యంగా సమరశంఖం పూరించారని అన్నారు. ిసీఐటీయూ ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కార్మిక హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ అసువులు బాసిన చరిత్ర కార్మికోద్యమానికి ఉందని చెప్పారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రమాదాలను కార్మిక ఉద్యమం ముందుగానే హెచ్చరించిందన్నారు. అయినప్పటికీ పాలకులు తమ స్వార్థం కోసం అమలు చేశారని మండిపడ్డారు. ఫలితంగానే దేశ సంపద కార్పొరేట్ల వద్దకు చేరిపోతోందని చెప్పారు. పారిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్కీము వర్కర్ల కోసం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, కార్మికుల ఐక్యతను చాటిచెప్పేలా విశాఖలో సీఐటీయూ మహాసభలు జరగనున్నాయని అన్నారు. ఈ సభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సభ అనంతరం పెద్ద సంఖ్యలో కార్మికులు అంబేడ్కర్ బొమ్మ సెంటర్, పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటర్ వరకూ భారీ రెడ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ిసీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్‌బాబు, బి.పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, నాయకులు పాల్గొన్నారు. -
కార్మిక మంత్రికి మా గోడు వినిపించదా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ మంత్రికి భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించదా అని ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పీఆర్ భవన్లో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు బతుకు భారమైందని, సొంత ఊర్లో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110 కోట్ల భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కై ్లమ్ ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మికులకు పథకాల అమలు చేయాలంటే నిధులు లేవని కానీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.70 కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు తానువ్యతిరేకం కాదని, కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం చెల్లిస్తున్న సెస్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ నిధులు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలను, కలిసొచ్చే ఇతర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల అమలుపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. సదస్సులో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, అమలాపురం యూనియన్ అధ్యక్షుడు బోనం చిన్న, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ -
పంచాయతీ కార్మికుడి దుర్మరణం
రాజానగరం: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో స్థానిక పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఫరిజల్లిపేటకు చెందిన కొత్తపల్లి శ్రీను (43) రాజానగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పనులు ముగించుకుని, సహ కార్మికుడు నీలాపు వీరన్నను డ్యూటీకి పిలిచేందుకు మరో కార్మికుడు చంద్రమళ్ల వీర్రాజుతో కలసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణించి, అవతలి వైపునకు వెళ్లేందుకు వైఎస్సార్ జంక్షన్లో ఆగి ఉన్నారు. అదే సమయంలో రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న లారీ ఆ మోటార్‌సైకిల్‌ను ఢీకొని, వెనుక కూర్చున్న శ్రీనును కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. మోటారు సైకిల్ నడుపుతున్న వీర్రాజు గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య మరియమ్మ, 13 సంవత్సరాల అమ్మాయి ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. వారం రోజుల క్రితం ఇదే జంక్షన్లో బైక్‌పై ఆగివున్న యువ జంట మృత్యువాత పడింది. -
ఇదేం బ్యాగోతం?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘నాసిరకానికి కాదేదీ అనర్హం’ అన్న చందంగా మారింది చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులకు అందించిన కిట్ల పరిస్థితి. పాఠశాలలు పూర్తయ్యేంత వరకూ ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అందించిన రెండు నెలలకే జిప్పులు ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామన్నా మళ్లీ రోజుల వ్యవధిలో చిరిగిపోతోంది. చేసేది లేక.. విద్యార్థుల తల్లిదండ్రులు సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 98,853 బ్యాగులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో జిల్లావ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌కు రూ.2,366 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.22.32 కోట్లు వెచ్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ చదివే 98,853 మంది విద్యార్థులకు బ్యాగులు అందించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అసలు ‘బ్యాగో’తం ఇక్కడే బహిర్గతమైంది. ఇక్కడా కక్కుర్తే.. విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, చంద్రబాబు సర్కారు కక్కుర్తి చూపిందనే విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన రెండు నెలలకే ఇవి పాడైపోయాయి. జిప్పులు పూర్తిగా ఊడిపోయాయి. బ్యాగులు చిరిగిపోయాయి. దీంతో, వాటిని వీపునకు తగిలించుకుని పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మూడు దశల్లో తనిఖీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ప్రభుత్వం పంపిణీ చేసిన బ్యాగుల్లో 70 శాతం ఇలాగే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగులపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేవిధమైన అభిప్రాయాలు చెప్పారు. అలాగే, తల్లిదండ్రుల సమావేశాల్లో సైతం ఉపాధ్యాయులను, విద్యా శాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగులు పాడైపోవడమేమిటని ప్రశ్నించారు. దీంతో, నీళ్లు నమిలిన అధికారులు పాడైన బ్యాగ్‌ల స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. ఆవిధంగా కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. సర్కారు వారి ఈ ఘనకార్యంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగుల స్థానంలో సొంత డబ్బులతో కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ కొత్త బ్యాగులే దర్శనమిస్తున్నాయి. కిట్లలోనూ అయోమయమే.. ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉండగా.. బూట్ల సైజు చాలా మంది విద్యార్థులకు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి మరో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్‌లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు లేదన్న ఆరోపణలున్నాయి. డిక్షనరీలు, యూనిఫాం, సాక్సులు ఇవ్వలేదు. దీంతో, వాటిని కూడా తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన కానుక గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ పేరిట విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లు, యూనిఫామ్ అందించేది. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే రోజునే 1,31,1194 మంది విద్యార్థులకు ఈ కానుక అందించేవారు. విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగుల పంపిణీ మూడు నెలలకే మూలకు.. జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం 70 శాతం బ్యాగులది ఇదే దుస్థితి 20 రోజులకే చిరిగిపోయాయి చంద్రబాబు ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన 20 రోజులకే జిప్పులు ఊడిపోవడం, దారాలు రావడం గమనించాం. బ్యాగు పీచులుగా ఊడిపోయింది. నాలుగైదుసార్లు కుట్టించినా.. ఉండటం లేదు. చేసేది లేక తల్లిదండ్రులు మార్కెట్లో కొనుగోలు చేసి విద్యార్థులకు ఇచ్చి పంపుతున్నారు. గతంలో ఇచ్చిన బ్యాగులు ఎంతో నాణ్యంగా ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కక్కుర్తి చూపడం దారుణం. – మానుకొండ చంద్రబాబు, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
పంటలో కలుపుకోవద్దు
ఐ.పోలవరం: రబీ సాగు ఆరంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. చేలల్లో అంతర తామర (ిపిస్టియా స్ట్రేటియోట్స్) కలుపు ముప్పుగా మారింది. దీని తొలగింపు రైతులకు వ్యయప్రయాశలతో కూడుకున్న అంశమైంది. ఒకసారి తొలగించిన పంట అవశేషాలు మిగిలిపోవడంతో సాగు ఉన్నంత కాలం తరచూ వస్తుండడంతో రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లాలో రబీ వరి సాగు మొదలైంది. ఈ సారి సుమారు 1.65 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. ఖరీఫ్ దెబ్బతినడంతో రైతులు రబీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్‌తో పోల్చుకుంటే 45 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతులు భావిస్తున్నారు. ఖరీఫ్ కోతలు జరిగిన ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో రైతులు రబీ సాగు ప్రారంభించారు. నారుమడులు వేసి నాట్ల కోసం మురగ దమ్ములు మొదలు పెట్టారు. ఖరీఫ్‌కు దూరంగా ఉన్న ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో రైతులు ముందుగానే రబీకి సిద్ధమవుతున్నారు. సాగు ఆరంభంలోనే అంతర తామర (పిస్టియా స్ట్రేటియోట్స్) కలుపు రైతులకు ముప్పుగా మారింది. పిస్టియా రకం జాతి తామరలో చిన్న పువ్వుగా ఉంటోంది. ఇది కాలువలు, చేలల్లో త్వరగా విస్తరిస్తోంది. బురద నేల అధికంగా ఉన్నచోట్ల ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో ఇది ఎక్కువగా వస్తోంది. మరీ ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం మండలాల్లో రైతులకు ముప్పుగా మారింది. మురుగునీటి కాలువల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నచోట్ల ఇది కనిపిస్తోంది. కాలువల ద్వారా చేలల్లోకి వస్తోంది. దమ్ములు చేసిన వారం రోజుల్లో చేలు అంతా విస్తరిస్తోంది. చేలల్లో దీనిని తొలగించేందుకు కూలీలకు రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. ఎకరాకు అదనంగా రూ.మూడు వేల వరకూ ఖర్చవుతోంది. ఒకసారి తొలగించినా మళ్లీ మళ్లీ వస్తోందని రైతులు వాపోతున్నారు. సాగు ఆరంభంలో రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల్లోని పంట కాలువలు, పంట బోదెలలో పెద్ద ఎత్తున పిస్టియా కలుపు మొక్కలు చేరాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మురుగునీటి కాలువల్లో కనీసం గుర్రపుడెక్క, తూడు వంటివి తొలగించకపోవడంతో వాటితోపాటు పిస్టియా కలుపు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దీని ద్వారా చేలల్లోకి వచ్చి చేరుతోంది. చేలకు నష్టం ఫ పిస్టియా కలుపు వల్ల పంటకు నష్టం అధికంగా ఉంది. మొదట్లోనే నాట్లు వేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. తరువాత వరి మొక్కల మధ్యలో చేరి చేనంతా అల్లుకుపోతోంది. దీనివల్ల చేలలకు అందించే ఎరువుల సారాన్ని ఇదే ఎక్కువగా పీల్చి వేయడం వల్ల వరి మొక్కలకు అందాల్సిన సారం అందుకుండా పోతోంది. ఫ చేలకు చేసే మందుల పిచికారీ వరి మొక్కల వేర్లకు అందకుండా పోతోంది. పురుగు మందుల సారాన్ని కూడా ఇది పూర్తిగా సేకరిస్తోంది. దీనివల్ల ఇది చనిపోదు కాని, చేలకు పట్టిన పురుగు, తెగుళ్లు తగ్గకుండా చేస్తోంది. పిస్టియా తొలగింపు ఖర్చుతో కూడుకున్న అంశమైతే.. తొలగించకుంటే పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. మెష్‌లు కట్టడం ద్వారా అరికట్టొచ్చు వరి చేలల్లో అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి కలుపు నివారణకు ఎకరాకు 400 గ్రాముల 2, 4–డి సోడియం సాల్ట్ 80 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. లేకుంటే 400 గ్రాముల 2,4–డి అమైన్ సాల్ట్, లేదా 50 గ్రాముల ఇథాక్సి సల్ఫూయూరాన్ 15 శాతం డబ్ల్యూడీజీ లేదా 8 గ్రాముల మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమురూన్ ఇథైల్ 20 శాతం డబ్ల్యూపీని పిచికారీ చేయాలి. చేలకు నీరు పెట్టే సమయంలో తూరలకు చిన్న మెష్‌లు కట్టడం ద్వారా పిస్టియా పువ్వు రాకుండా అడ్డుకునే అవకాశముంది. –ఎం.వాణి, మండల వ్యవసాయ అధికారి, ఐ.పోలవరం ఫ సాగుకు ముప్పుగా పిస్టియా ఫ తొలగింపునకు అదనపు భారం -
అన్నింటా మహిళల ముందంజ
కాకినాడ రూరల్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకూ బాలికలు, యువతుల విద్యాభ్యాసం పెరిగిందని నన్నయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పీజీ సెంటర్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆధ్యర్యంలో జరిగిన సదస్సును వీసీ ప్రారంభించారు. 55 శాతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వీసీ అన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులకు శ్రీలంకకు చెందిన డాక్టర్ జేఎస్ రోహన్, అల్గిరీయాకు చెందిన డాక్టర్ నావెల్ ఆన్లైన్ ద్వారా భౌగోళిక మార్పులు, సమకాలీన సామాజిక దృక్కోణాలు, ప్రదర్శనలపై వివరించారు. ఎథియోపియా నుంచి హాజరైన ప్రొఫెసర్లు టెస్సెమా గేబ్రే కీమిసో, టెస్ఫాహున్ టెగెర్న్ సోర్సా తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్లు రమేష్, జ్యోతి పలు సూచనలు అందించారు. మాణిక్‌రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరెడ్డి, లయన్ గరికపాటి నమశ్శివాయలు వీసీ ప్రశాంతిశ్రీని సన్మానించి, మహాత్మా గాంధీ సేవారత్న పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగాధిపతి ఎం.పోచయ్య, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, మనోజ్దేవా తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన అల్లం రమేష్ (32) రాజవరం శివారున రౌతులపూడి నుంచి కోటనందూరు వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో చెట్టుకు శుక్రవారం ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి అల్లం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌతులపూడి ఎస్ఐ వెంకేటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమేష్‌కు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 15 మందికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో ఒకరికి పది రోజులు, ఒకరికి నాలుగు రోజులు, 8 మందికి మూడు రోజులు, ఐదుగురికి రెండు రోజుల చొప్పున శిక్ష విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో 15 మందిని హాజరుపర్చగా వారికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కుదిరిన ఎంఓయూ భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
ప్రమాదం మంచుకొస్తోంది!
పగటి ప్రయాణం ఉత్తమం చుట్టూ కమ్మిన మంచు తెరలతో ఎదుట ఏ వాహనం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ శీతాకాలంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణాలు తగ్గించుకుంటేనే అన్ని విధాలా శ్రేయస్కరం. పగలు ప్రయాణం ఉత్తమం. రాత్రి సమయంలో ముఖ్యంగా తెల్లవారు జామున ప్రయాణించాల్సి వస్తే పూర్తి అప్రమత్తతతో నెమ్మదిగా వెళ్లాలి. – పి.వీరబాబు, సీఐ, అమలాపురం పట్టణం అమలాపురం టౌన్: అంతటా మంచు కమ్మేస్తోంది.. రోడ్డంతా దుప్పటిలా పరుచుకుంటోంది.. పొగ మరింత దట్టంగా వ్యాపిస్తోంది.. ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు అటు అనారోగ్యాలకు, ఇటు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. తెల్లవారు జామున మంచు రోడ్లపై కమ్ముకుని కనీసం ఎదురుగా వచ్చే వాహనాల ఉనికి కూడా తెలీయనంతగా ఉంటోంది. కన్నుమూసి తెరిచే లోపు జరగాల్సిన అనర్థం జరిగిపోతోంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ రోడ్లపై ఇదే పరిస్థితి. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ప్రమాదానికి మంచే ప్రధాన కారణం. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఓ బస్సు పల్టీ కొట్టిన ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. శీతాకాలం మొదలయ్యాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు మంచు వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు మృత్యువాత పడుతుండగా, మరికొంత మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. టూరిస్ట్ బస్సులు, వివిధ సరకుల లోడుతో వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలే ఎక్కువగా మంచు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, హైవేల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనచోదకులు తగిన అప్రమత్తతతో వ్యవహరిస్తూ వాహనాలను నెమ్మదిగా నడిపితే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అప్రమత్తతతో ప్రమాదాలకు చెక్ ఫ మంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ వాహనచోదకులు స్వయం నియంత్రణతోనే సాధ్యమవుతుందని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేస్తోంది. కొన్ని జాగ్రత్తలతో ముందుకు వెళితే సురక్షితంగా గమ్యం చేరవచ్చని సూచిస్తోంది. ఫ అత్యవసరమైతే తప్ప శీతాకాలంలో తెల్లవారు జాము ప్రయాణాలు సాధ్యమైనంత వరకూ మానుకోవాలి. ఎండ వచ్చాక బయలు దేరడం మంచిది. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రయాణాలను పగటి పూటకు వాయిదా వేసుకుంటేనే శ్రేయస్కరం. ఫ తెల్లవారు జామున రోడ్లపై వెళ్లే వాహనాల లైట్లు నిరంతరాయంగా వెలుగుతూ ఉంచాలి. అప్పుడే ఎదుటి వాహనాలను గుర్తించేందుకు వీలుంటుంది. రోడ్డు మలుపులు వచ్చినప్పుడు వాహన లైట్లను ఆపుతూ, మళ్లీ వేస్తూ ఉంటే ప్రమాదాలను దూరం చేయవచ్చు. ఫ మంచు సమయంలో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగిస్తూ ముందుకు సాగాలి. దీనివల్ల ఎదుటి వాహనానికి ఆ శబ్ధం వినిపించి వాహన స్పీడ్‌ను తగ్గించి కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఫ రాత్రంతా వాహనం ప్రయాణించినా ముఖ్యంగా తెల్లవారు జామున ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలిపివేసి మంచు తగ్గాక తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తే మంచిది. ఫ ప్రయాణ సమయంలో ముఖ్యంగా వాహన హెడ్ లైట్లు, సిగ్నల్స్ లైట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. వాహనాల బ్రేక్‌లు కూడా చూసుకోవాలి. ఫ అతి వేగం ఎప్పుడూ అనర్ధమే. పొగ మంచులో వెళుతున్నప్పుడు మాత్రం వాహనం నెమ్మదిగా (30 కిలోమీటర్ల లోపు) ఉంటే శ్రేయస్కరం. కొత్తపేట రోడ్డులో కమ్ముకున్న మంచు మాటున వాహనాల సంచారంఈదరపల్లి– ముక్కామల బైపాస్ రోడ్డులో తెల్లవారుజామున మంచులో ప్రయాణం ఫ కమ్ముకుంటున్న మంచుతో ఇబ్బంది ఫ తెల్లవారుజామున ప్రయాణం అవస్థలమయం ఫ అప్రమత్తతతోనే ప్రాణాలు భద్రం -
భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం కలుగుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘ఖాండవ వనదహన సమయంలో భారతంలో అనే అగ్ని స్తుతులు కనబడతాయి. ఇవి వేదాల్లోని అగ్నిసూక్త మంత్రాల వంటివే. అగ్ని స్తుతి అత్యంత విశేషమైనది. సర్వదేవతలూ అగ్ని స్వరూపులే. వేదాల్లోని అగ్నిసూక్తం అందరూ చదవలేరు. కానీ, భారతంలోని అగ్నిస్తుతి శ్లోకాలు తప్పులు లేకుండా అందరూ చదవవచ్చు. దీనివలన పంచభూతాలు శాంతిస్తాయి. వాటి అనుగ్రహం కలుగుతుంది’ అని అన్నారు. భారత కథలోకి వెళ్తూ.. ‘ద్వారకకు వెళ్తున్న శ్రీకృష్ణుడిని పాండవులు కొంత దూరం అనుసరించారు. ధర్మరాజు రథసారథి అయ్యాడు. అర్జునుడు రథంలో మాధవునికి వింజామరలు వీచాడు. రథంతో పాటు పాండవుల హృదయాలు కూడా కృష్ణుని అనుసరించి వెళ్లాయి’ అని చెప్పారు. ప్రవచనాలు ప్రారంభించిన పదహారో రోజు కావడంతో.. సభా పర్వంలోకి ప్రవేశించడాన్ని 16 రోజుల పండగగా అభివర్ణించారు. ‘మయుడు ధర్మరాజుకు నిర్మించిన దివ్యమైన సభకు త్రిలోక సంచారి నారదుడు వచ్చి, అనేక రాజధర్మాలు చెప్పాడు. రామాయణంలో తనను అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చిన భరతునికి శ్రీరాముడు చెప్పిన రాజధర్మాలతో నారదుడు చెప్పిన ధర్మాలు సరితూగుతాయి. వ్యాసునికి వాల్మీకి అంటే మహాప్రీతి. నారదుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ సభలను వర్ణించాడు’ అని సామవేదం వివరించారు. దేవలోకంలో ఉన్న పాండురాజు రాజసూయ యాగం చేయాలని తన ద్వారా సందేశం పంపాడని ధర్మరాజుకు నారదుడు చెబుతాడన్నారు. కానీ, ఈ యాగం వలన గొప్ప ప్రజాక్షయం జరుగుతుందని చెప్పారు. యమసభను వర్ణిస్తూ, యముడు సహజంగా సౌమ్యుడు, శాంతస్వరూపుడు, పాపుల పాలిట భయంకరుడని అన్నారు. ధర్మరాజు పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని, రాజసూయ యాగం చేయాలంటూ ధర్మరాజును ఎందరో ప్రోత్సహించారని దీనికి సంకల్పం చేయాలని మంత్రులు, హితైషులు సూచించారని తెలిపారు. ‘ఎందరు చెప్పినా, ధర్మరాజుకు కృష్ణుడు చెప్తేనే తృప్తి. ఆయన ఆదేశం మేరకు నడుచుకోవాలని నిర్ణయించాడు. వేగంగా వెళ్లి కృష్ణుని వేగంగా తీసుకురావడానికి పంపాడు. లోకంలో ఎందరో ఎన్నో రకాల సలహాలు ఇస్తూంటారు. కానీ, నాకు ఏది మంచిదో అదే నీవు ఉపదేశిస్తావని ధర్మరాజు కృష్ణునితో అంటాడు. రాజసూయ యాగం చేయడానికి పగవారు ఉండరాదని చెబుతాడు. చివరకు కృష్ణుని సలహాపై ఆ యాగం చేయడానికి ధర్మరాజు సిద్ధపడ్డాడు’ అని సామవేదం చెప్పారు. -
నూతన సత్రం నిర్మాణానికి అడుగులు
● సీతారామ సత్రం కూల్చివేత ప్రారంభం ● అక్కడే తొలి దశలో 105 గదులతో మరో సత్రం నిర్మాణం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శిధిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రం కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సుమారు 38 సంవత్సరాల క్రితం 100 గదులతో సీతారామ సత్రాన్ని నిర్మించారు. దీనిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో నిర్మించడంతో వివాహాలకు కూడా వీలుగా ఉండేది. ఒక్క ముహూర్తంలోనే ఇక్కడ దాదాపు 30, 40 వివాహాలు జరిగేవి. ఇది రెండేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరింది. తాత్కాలిక మరమ్మతులు చేసి, భక్తులకు గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దె రూ.200 మాత్రమే కావడంతో పేద, మధ్య తరగతి భక్తులు ఎక్కువగా ఇక్కడ బస చేసేవారు. అయితే, సత్రం పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యేవారు. 2023 నవంబర్‌లో దేవస్థానం ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ సత్రం శిథిలావస్థకు చేరిన విషయం గమనించారు. దీని ఫిట్‌నెస్‌పై నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను అప్పట్లోనే కోరారు. వారు పరిశీలించి, ఈ సత్రం శిథిలావస్థకు చేరినందున కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా సీతారామ సత్రం కూల్చివేసి, ఆ వ్యర్థాలను తొలగించేందుకు టెండర్ పిలిచి ఖరారు చేశారు. అలాగే, ఆ స్థలంలోని సగ భాగంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో నూతన సత్రం నిర్మించేందుకు గత ఏడాది మే నెలలో రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువగా రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ తరువాత గత ఏడాది నవంబర్‌లో రామచంద్ర మోహన్ విజయవాడకు బదిలీ అయ్యారు. సలహాదారు సూచనతో.. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు సీతారామ సత్రాన్ని పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం తలెత్తింది. సలహాదారు సూచనల ప్రకారం సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఆ తరువాత కూడా సత్రం కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జూన్ 26న ‘సత్యదేవా చూడవయ్యా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు. సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయూ–కాకినాడ ప్రొఫెసర్లను కోరారు. ఆ మేరకు సీతారామ సత్రం గదులు, శ్లాబ్, గోడలను గత ఆగస్టు 13న జేఎన్టీయూకే ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నం పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని, కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ సత్రాన్ని కూల్చివేసి, కొత్త సత్రం నిర్మాణానికి గతంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థను కోరారు. కార్తిక మాసంలోనే ఈ సత్రాన్ని కూల్చివేయాలని అనుకున్నా.. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సత్రాన్ని కూల్చివేస్తున్నారు. 18 నెలల్లో పూర్తి చేస్తాం దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సీతారామ సత్రం కూల్చివేత పనులు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా కూల్చివేత పూర్తవుతుంది. అనంతరం మంచి ముహూర్తంలో నూతన సత్రం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అనంతరం, మూడంతస్తుల్లో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తాం. దీనిని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
వైఫల్యాలను మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): వైఫల్యాలను సై తం మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశ ర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవ చనాన్ని గురువారం ఆయన కొ నసాగించారు. ‘శిథిలమై, గొప్ప కోటలు, ఇతర రక్షణ మార్గాలు లేని ఖాండవప్రస్థాన్ని ఏలుకోమని ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. అయితే, పాండవు లు ఖాండవప్రస్థాన్ని కృష్ణునితో కలసి వెళ్లి, విశ్వకర్మతో సుందర నగరాన్ని నిర్మించుకున్నారు’ అని చె ప్పారు. హస్తినకు వచ్చిన ద్రౌపదిని చూసి గాంధారి ఆమె తన పుత్రుల పాలిట మృత్యుదేవతగా కనిపిస్తున్నట్లు భావించినదన్నారు. పాండవుల కోసం విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన నగరం ‘ఇంద్రప్రస్థం’గా పే రొందిందని, వాణిజ్యవేత్తలు, వివిధ భాషలకు చెంది న ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చె ప్పారు. ‘అంత్య కాలంలో కూడా నీవే మాకు గతి’ అంటూ కృష్ణుని పాండవులు ప్రార్థించారని, ‘నిన్ను స్మరింపజేసే విపత్తులు ఎన్ని కలిగినా చింత లేదంటూ కృష్ణుని కుంతి ప్రార్థించిందని అన్నారు. ‘విష్ణుని విస్మరించడమే విపత్తు. స్మరించడమే సంపద’ అని వ్యాసుడు చెప్పాడన్నారు. ‘వంద మంది కౌరవులు, ధృతరాష్ట్రు డు తదితర అనేక మంది శత్రువులున్న ధర్మరాజును అజాత శత్రువుగా ఎలా అంటారని కొందరు అడుగు తారు. ధర్మరాజు పట్ల ఎందరో వైరి భావం కలిగి ఉండవచ్చు. కానీ, ఆయనకు ఎవరి పట్లా శత్రు భావం లేదు. అందుకే ఆయన అజాతశత్రువు’ అని వివరించా రు. సోదరుల మధ్య ఏర్పాటు చేసుకున్న నియమానికి భంగం కలగడంతో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడని, వాటిని పరిశీలిస్తే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గంగ నుంచి కావేరి వరకూ అఖండ భారతం ఒకటేనని, ఒకే ధర్మం ఉండేదని తెలిపారు. వేదాల్లానే ఆగమాలు కూడా ప్రాచీనమని, మన దేశంలో ఆలయ వ్యవస్థ అనాదిగా ఉన్నదేనని చెప్పారు. ఆర్య, ద్రావిడ తేడాలు కొందరు కుహనా చరిత్రకారుల కల్పితాలేనన్నారు. సుభద్రార్జునుల వివాహం, ఖాండవ వన దహనం, వరుణుడు, అగ్నిదేవుడి నుంచి కృష్ణార్జునులు దివ్యాయుధాలు పొందిన వైనాన్ని సామవేదం వివరించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగతవచనాలు పలుకుతూ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహా పురుష సంశ్రయం దుర్లభమంటూ పెద్దలు చెబుతారని, భారత ప్రవచనాలు వినడంలో ఈ మూడూ ఉన్నాయని అన్నారు. -
కోనసీమపై చలి పంజా..
● కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నమోదు ● గజగజలాడుతున్న జిల్లా ప్రజలు ● ఉదయం 8 దాటినా వీడని మంచు తెరలు ఐ.పోలవరం: చలి పులి పంజాకు కోనసీమ ప్రజలు గజగజలాడుతున్నారు. జిల్లాలో గురువారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున మూడు డిగ్రీల చొప్పున పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 గంటలకే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. మరోవైపు ఈ వాతావరణం శీతల రోగాలకు, వ్యాధులకు కారణమవుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న మంచులో తిరుగుతున్న వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధ్యమైనంత వరకూ మంచులో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పొద్దు పొడవక ముందే పనులకు వెళ్లాల్సిన వారు ముందున్న దారి కనపడక తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ వాతావరణం వల్ల ఖరీఫ్ కోతలు, రబీ సాగు నారుమడులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 9 గంటలైతే తప్ప వరి చేలల్లో పనులకు కూలీలు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితి రైతులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఉదయం పూట దట్టంగా కమ్ముకుంటున్న మంచులో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాకింగ్ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉదయం నడిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారు జామున వాకింగ్ మంచిదే అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా మంచులో తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి వాతావరణంతో గుండె సమస్యలు పెరుగుతాయని, గుండైపె ఒత్తిడి పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. పలువురికి ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచులో నడకకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాలని, వీలైతే, సూర్యరశ్మి భూమికి తాకే సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మంచులోనే మార్నింగ్ వాక్ -
రానూ.. రాజమండ్రి రాను
● లోకేష్ పర్యటన మూడుసార్లు వాయిదా ● స్థానిక టీడీపీ నేతలపై మితిమీరిన అవినీతి ఆరోపణలు ● అందుకే ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని చర్చ ● విదేశీ పెట్టుబడుల కోసం వెళ్లారంటూ టీడీపీ కవరింగ్సాక్షి, రాజమహేంద్రవరం: ‘రానూ బొంబాయికి రాను’ అనే పాట మాదిరిగానే.. సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘రానూ రాజమండ్రి రాను’ అంటున్నట్టున్నారు. ఆయన రాజమహేంద్రవరం పర్యటన పదేపదే వాయిదా పడటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని టీడీపీ నేతలపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నందువల్లనే ఇక్కడకు వచ్చేందుకు ఆయన విముఖత చూపుతున్నారా.. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన తంతుపై ఇతర నాయకులు నిలదీస్తారని భావిస్తున్నారా.. ఈ విషయం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారా.. ఇందులో భాగంగానే ఆయన రాజమహేంద్రవరం పర్యటన విరమించుకున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇప్పటికే ఆయన పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. ఇకనైనా వస్తారా.. మిన్నకుండిపోతారా.. అనే మీమాంస ఆ పార్టీ శ్రేణల్లో నెలకొంది. ముచ్చటగా మూడుసార్లు చారిత్రక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిర్మించిన ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తారని కొన్నాళ్ల కిందట విస్తృత ప్రచారం చేశారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి సైతం ఏర్పాటు చేశారు. ఇదిగో రేపు వచ్చేస్తారంటూ ఎమ్మెల్యే, టీడీపీ నేతలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టేశారు. వారి హడావుడిపై నీళ్లు జల్లినట్టుగా లోకేష్ పర్యటన ఒక్కసారిగా వాయిదా పడింది. రెండు రోజుల అనంతరం మళ్లీ రేపు వచ్చేస్తారంటూ హడావుడి చేశారు. అప్పుడు కూడా ఆయన డుమ్మా కొట్టారు. మూడోసారి కచ్చితంగా వస్తారంటూ మరోసారి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రవేశ ద్వారం లోగోను సైతం వస్త్రంతో కప్పేశారు. లోకేష్ వచ్చి ప్రారంభించిన అనంతరం దానిని తీయాలనుకున్నారు. కానీ, షరా మామూలుగానే ఆయన ముఖం చాటేశారు. ఇలా ప్రతిసారీ వస్తారని ఆశించడం.. భంగపాటు ఎదురవడం పరిపాటిగా మారింది. గడచిన రెండు నెలలుగా లోకేష్ నగర పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. దీనికి నగర టీడీపీలో నెలకొన్న పరిస్థితులే కారణమన్న చర్చ జరుగుతోంది. అవినీతే కారణమా? రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న కారణంగానే లోకేష్ రాజమహేంద్రవరం రాలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు కవరింగ్ ఇస్తున్నాయి. అయితే దీని వెనుక వేరే విషయం ఉందని కూడా పలువురు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక టీడీపీ నేతలపై అవినీతి, అక్రమాలు, ఆడియో టేపుల్లో బహిరంగంగా దొరికిపోవడం వంటి కారణాలున్నాయనే ఆరోపణలున్నాయి. నగర పర్యటనకు వస్తే.. నేతల అవినీతి ఆరోపణలపై నిలదీస్తారనే ఉద్దేశంతోనే లోకేష్ ఇక్కడకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వరుస ఆరోపణలు ● లిక్కర్ వ్యవహారంలో అధికారులకు మామూళ్లు ఇవ్వాలంటూ టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఓ మద్యం దుకాణం నిర్వాహకుడితో జరిపిన సంభాషణ ఆడియో సంభాషణలు బహిర్గతమవడం తీవ్ర దుమారం రేపింది. ● ఇది జరిగిన కొద్ది రోజులకే అదే మద్యం వ్యవహారంలో జరిగిన సంభాషణకు సంబంధించి టీడీపీలో మరో కీలక నేత కిలపర్తి శ్రీనివాస్ ఆడియో సంభాషణలు సైతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. ● అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసినవని, తమ వాయిస్ కాదని టీడీపీ నేతలు వివరణ ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు. ● ఆ ఆడియో సంభాషణలను బయట పెట్టింది సైతం మరో టీడీపీ నాయకుడే కావడం గమనార్హం. ● దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఇటీవల చేపట్టిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నియామకం సైతం వివాదాస్పదంగా మారింది. నగరంలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేతను ప్రముఖ దేవస్థానం చైర్మన్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● స్థానిక శ్రీరామ్ నగర్‌లోని ఓ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో ఉన్న వ్యక్తిని మరో ముఖ్యమైన దేవస్థానం చైర్మన్‌గా నియమించారు. ● గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న టీడీపీ సిటీ మాజీ అధ్యక్షుడికి ప్రముఖ సత్రం చైర్మన్ పదవి కట్టబెట్టారు. ● ఇంకా పలు ట్రస్ట్ బోర్డులకు డైరెక్టర్లుగా సైతం వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని నియమించారనే ఆరోపణలున్నాయి. ● ఇలా పవిత్రమైన ఆలయాల చైర్మన్, ఇతర పదవులను నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కట్టబెట్టడంపై భక్తులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ● నామినేటెడ్ నియామకాలు, మద్యం, ఇసుకలో టీడీపీ నేతలు పాల్పడుతున్న అవినీతి ఆరోపణలపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందజేసినట్లు తెలిసింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ల నేరారోపణలపై సైతం స్పష్టమైన నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. నోరు మెదపని బీజేపీ ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు సైతం ఈ నియామకాలపై నోరు మెదపకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు బీజేపీ నేతలు సైతం పదవులు పొందినట్లు సమాచారం. ఈ విషయాలు తెలియకుండానే బీజేపీ నేతలు ట్రస్ట్ బోర్డ్ పదవులు తీసుకున్నారా.. లేక తెలిసి కూడా కూటమిలో భాగం కాబట్టి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా.. అనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలే లోకేష్ పర్యటన రద్దుకు కారణమని ప్రతిపక్షం సైతం ఆరోపించడం రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ పర్యటన ఈ కారణాలతోనే వాయిదా పడుతోందా.. లేక వ్యూహాత్మకమా అనే చర్చ నడుస్తోంది. -
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
● జిల్లాలో 7,599 మెట్రిక్ టన్నుల యూరియా ● జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు దేవరపల్లి: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించినా, మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు హెచ్చరించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రబీ పంటలకు అవసరమైన ఎరువులను సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. జిల్లాలో 59 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించామన్నారు. అక్టోబర్ 1 నాటికి 34 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని చెప్పారు. అకోబర్ 1 నుంచి ఈ నెల 1 వరకూ జిల్లాకు మొత్తం 26.9 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటికే 17.9 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటి వరకూ 13.1 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ఈ నెలాఖరుకు మరో 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుందని తెలిపారు. రానున్న 21 రోజులకు 61 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ప్రస్తుతం 89 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఆర్పీ ప్రకారమే ఎరువులకు ధర చెల్లించాలని, డీలర్ నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలని రైతులకు మాధవరావు సూచించారు. నేటి నుంచి ఢిల్లీ విమానం కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్ తెలిపారు. వేతనాలు చెల్లించాలని జేసీకి వినతి తాళ్లపూడి: తమకు గౌరవ వేతనం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తాళ్లపూడి మండల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్కు గురువారం వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి పరశురామారావు, గజ్జరం, వేగేశ్వరపురం ఎంపీటీసీ సభ్యులు గుంటు చిన్నబ్బాయి, లక్ష్మణరావు పాల్గొన్నారు. దీనిపై జేసీ మేఘాస్వరూప్ తక్షణం స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకుని, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ 3, ఆడియో మెట్రీషియన్ 4, టీబీ హెల్త్ విజిటర్ 5, ఫార్మసిస్ట్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ 2, పబ్లిక్ అండ్ ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ ఫర్ టీబీ 1, అకౌంటెంట్ 2, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ 1, ఎల్జీఎస్ 8 పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్లోడ్, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. -
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గం
అమలాపురం టౌన్: ఏపీ ఎన్జీవో సంఘం కోనసీమ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక ఏవీఆర్ నగర్‌లోని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. కార్యవర్గంలోని 17 పోస్టులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా బి.సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్.రామారావు, కార్యదర్శిగా కోలా పీవీఎన్‌బీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జె.మల్లికార్జునుడు, సీహెచ్ చిట్టిబాబు, సీహెచ్ సూర్యారావు, టి.ఏసుబాబు, ఆర్వీ నరసింహరాజు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.లోవలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవీ సీతారామరాజు, బి.రామకృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎస్వీ రామారావు, డి.పృథ్వీరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎస్. కృష్ణవేణి, కోశాధికారిగా జి.సురేష్‌సింగ్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా పి.రమేష్, అబ్జర్వర్‌గా టి.జానకి వ్యవహరించారు. కార్యవర్గాన్ని ఉమ్మడి జిల్లా సంఘం పూర్వ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. -
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
రాజానగరం: సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కరరావు అన్నారు. అమరావతిలోని ఏపీ స్పేస్ అకాడమీ (ఏపీఎస్ఏ), ఆదికవి నన్నయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) సహకారంతో ‘విశ్వంపై జిజ్ఞాసను పెంపొందించడం – అంతరిక్ష సంస్కృతికి ఉత్ప్రేరకం’ అనే అంశంపై వర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విజయ భాస్కరరావు మాట్లాడుతూ, రానున్న 25 ఏళ్లలో దేశ వనరులు, సవాళ్లు, భూమిపై రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను వివరించారు. వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను అన్వేషించే వేదికను యువ అభ్యాసకులకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. స్సేస్ అకాడమీ ఉపాధ్యక్షుడు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ వి.శేషగిరిరావు మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీ స్పేస్ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి కేవీ రమణ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ప్రిన్సిపాల్ పి.విజయనిర్మల, కో ఆర్డినేటర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు ● మరొకరికి తీవ్రగాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్ఎల్ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వేమూరి మురళీకృష్ణ (60), తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్ సమీపంలో ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి (35)కి, మురళికృష్ణకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భారీగా గంజాయి పట్టివేత
● 24,690 కిలోల సరకు స్వాధీనం ● విలువ రూ.13,29,500 ● ఏడుగురి అరెస్టు కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 16వ నంబర్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో బూరుగుపూడి గ్రామ శివారున మాటు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వైపు మూడు మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఏడుగురు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి 17 ప్యాకెట్లలో ఉంచి తరలిస్తున్న రూ.13,29,500 విలువ చేసే 24,690 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అల్లూరి జిల్లా హకుంపేటకు చెందిన జోగ్ నకుల్‌సింగ్, పంజా దుర్గాప్రసాద్, పెద్దాపురానికి చెందిన పంచదార స్వామి, వనపర్తి రాజేష్, సప్పా అశోక్, లంక శ్రీకల్యాణ్, గొంపు అప్పారావులుగా గుర్తించారు. గంజాయి తరలింపులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నకుల్సింగ్ను ఏ1గా, జంపా దుర్గాప్రసాద్ ఏ2, పంచదార స్వామి ఏ3, వనపర్తి రాజేష్ ఏ4గా పేర్కొన్నారు. గతంతో వీరిపై ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. ఏ5 సప్పా అశోక్‌పై హత్య కేసు ఉంది. నిందితులపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టించిన ఈగల్ టీమ్‌ను, ఎస్సైని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకర్ల సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై సతీష్ కూడా పాల్గొన్నారు. -
నమ్మకం.. నిజాయతీలదే విజయం
కపిలేశ్వరపురం: స్థానిక ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి పర్యవేక్షణలో ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి మారిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరంకు సరిపడ 10 మందికి మించి సభ్యులు ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ స్థానానికి వెంకటలక్ష్మిని కేదారిలంక ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు ప్రతిపాదించగా నేలటూరు ఎంపీటీసీ సభ్యురాలు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి బలపరిచారు. దీంతో వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జేసీ నిషాంతి, ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ధ్రువీకరణ పత్రం అందజేశారు. నూతన ఎంపీపీ వెంకటలక్ష్మికి ఎంపీడీఓ హెచ్.భానోజీరావు, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రలోభాలకు లొంగక.. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత ఇష్టాలు, ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అంటూ జీవించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా గెలుపు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బాటలో నడచి, చేయిపట్టి నడిపించిన నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. మండల పరిషత్ ఎన్నికల్లో అదే జరిగింది. వైఎస్సార్ సీపీకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నమ్మకానికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు కట్టుబడి నిలబడ్డారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి మళ్లిన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అంతిమంగా నిజాయతీ మరోసారి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. మండలంలో 19 మంది ఎంపీటీసీ స్థానాలుండగా గత పరిషత్ ఎన్నికల్లో 15 వైఎస్సార్ సీపీ, రెండు టీడీపీ, మరో రెండు జనసేన గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగినప్పటికీ మిగిలిన 12 మంది నిజాయతీగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఓటింగ్‌లో ఎంపీపీ జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, పెందుర్తి శిరీష, పలివెల మధు, గుణ్ణం భాను ప్రసాద్, అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, ఉమ్మిడిశెట్టి వీరవేణి, గొల్లపల్లి సోనియా, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం తనతో సహా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మండల పరిషత్‌లో ఉన్న సుమారు 70 లక్షల నిధులను మండలంలోని 19 గ్రామాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాలు చేశాం. వివిధ దశల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలంతో అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ తామంతా పరిషత్ నిధులను పార్టీలకు అతీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీపీ సభ్యులకు కృతజ్ఞతలు ఎమ్మెల్సీ తోట కపిలేశ్వరపురం ఎంపీపీ ఎన్నికలో నిజాయతీగా నిలబడిన వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సభ్యులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం తదితర కారణాలతో వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలు ఆలస్యమైందన్నారు. ఒప్పందానికి కట్టుబడి మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడం, జిత్తుక వెంకటలక్ష్మి ఎన్నికకు 12 మంది సభ్యులు ఏకతాటిపై నిలవడం వైఎస్సార్ సీపీ పట్ల, తన పట్ల ఎంపీటీసీ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులు తర్వాత మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోబోమని, ఎవరైనా రాదలిస్తే తమ పదవులకు రాజీనామా చేసి చేరవచ్చని ప్రగల్బాలు పలికారన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్నారని, వారంతా వారి వారి పదవులకు రాజీనామా చేయించి చేర్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేని నేత అని ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల తీరు సైతం అలానే ఉందన్నారు. నియోజకవర్గంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రలోభాలకు గురి చేస్తూ నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, నిజాయతీ, అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల తెలుసుకోవాలని ఎమ్మెల్సీ తోట అన్నారు. కపిలేశ్వరపురం ఎంపీపీగా విజయలక్ష్మి ఏకగ్రీవం అండగా నిలచిన 12 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు లొంగని వైనం ఎన్నికను పర్యవేక్షించిన జేసీ నిశాంతి -
మొసళ్ల ఆచూకీ కోసం గాలింపు
అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని తెలుసుకున్న అమలాపురం అటవీ రెంజ్ అధికారి ఈశ్వరరావు బృందం గురువారం ఆ పరిసరాలను గాలించారు. పరిసరాల్లోని నీటి గుంటల వద్ద మొసళ్ల పాదముద్రలు సేకరించారు. అయితే ఒకటే మొసలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు, వ్యవసాయ కార్మికులకు వారి ఫోన్ నంబర్లు ఇచ్చి మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మొసలి రాత్రి వేళల్లో వేగంగా సంచరిస్తుందని, ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా కదులుతోందన్నారు. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష కడియం: బాలుడి మృతి కేసులో కడియం మండలం జేగురుపాడుకు చెందిన రాయి వెంకన్న, నల్లి శేఖర్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్టు కడియం ఇన్స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు తెలిపారు. 2018 సెప్టెంబర్ ఏడో తేదీన మోటారు సైకిల్లో పెట్రోల్ తీసి దొంగతనం చేస్తున్నాడని సంతోష్‌కుమార్ అనే బాలుడిని వీరు కొట్టారు. దీంతో బాలుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి సీఐ ఎం.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గంధం సునీత 14 మంది సాక్షులను విచారించి, నిందితులకు కేసు ఖరారు చేసినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పీపీలు కె.రాధాకృష్ణ, రాజులు, రాచపల్లి ప్రసాద్ వ్యవహరించారన్నారు. కోర్టు కానిస్టేబుల్ కె.శ్రీనివాస్ సాక్షులను కోర్టు ముందు హాజరు పరిచారని ఇన్స్పెక్టర్ వివరించారు. మహిళపై కత్తులతో దాడి పిఠాపురం: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పిఠాపురం–సామర్లకోట రోడ్డులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మీదుగా స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆమె సీతయ్య గారి తోట శివారు నరసింగపురం రోడ్డు మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. రక్తపు గాయాలతో ఉన్న సునీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సదరు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. 17 నుంచి అభిషేక వేళల మార్పు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సందర్భంగా 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ స్వామివారి ఆర్జిత అభిషేకం వేకువ జామున 4.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ గురువారం పేర్కొన్నారు. ఇంత వరకూ ఈ అభిషేకాన్ని 5.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా 16వ తేదీన ఆర్జిత సేవగా స్వామివారి శాంతికల్యాణం జరుగునున్నట్టు ఏసీ ప్రసాద్ అన్నారు. ఈ సేవలకు ఆలయ వెబ్సైటు నుంచి గాని, ఆలయం వద్ద కౌంటర్ నుంచి కానీ టిక్కెట్లు పొందవచ్చునని ఆయన అన్నారు. -
ఓవరాల్ చాంపియన్స్ జీఎస్ఎల్
రాజానగరం: స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీలకు నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు (పురుషులు) 2025లో ‘ఓవరాల్ చాంపియన్ షిప్’ను స్థానిక జీఎస్ఎల్ క్రీడాకారులు కై వసం చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పోటీలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. ఫుట్‌బాల్, చెస్, బ్యాడ్మింటన్ పోటీలలో జీఎస్ఎల్ విద్యార్థులు విజేతలుగా నిలువగా, కబడ్డీ, లాన్ టెన్నిస్‌లలో విజయవాడకు చెందిన ఎస్ఎమ్సి జట్లు ఆధిపత్యం చూపాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న విజతలకు జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు షీల్డ్ అందజేశారు. -
పిచ్చి కుక్క దాడిలో 21 మందికి గాయాలు
పి.గన్నవరం: మండలంలోని ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, పి.గన్నవరం పరిసర గ్రామాల్లో రెండు రోజలుగా ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. కనిపించిన వారిని కరుస్తూ పారిపోతుండటంతో ప్రజలు భయాందోన చెందుతున్నారు. బుధవారం 14 మందిని, గురువారం ఏడుగురిని గాయ పరచింది. దీంతో వారంతా పి.గన్నవరం సీహెచ్‌సీకి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆస్పత్రిలో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, సిబ్బంది హెచ్చరించారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. అన్నవరం రైల్వేస్టేషన్, యార్డ్ రైల్వేగేటు మధ్య సుమారు 40 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94906 19020 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
కొండలను కొల్లగొట్టి కాసుల పంట
గోపాలపురం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు దళారులు మండలంలోని పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు కొల్లగొట్టి మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, గోపాలపురం, చిట్యాల, చెరుకుమిల్లి, రాజంపాలెం, గంగోలు, యర్రవరం గ్రామాలలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి సుమారు 70 శాతం మట్టిని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. వారికి స్థానిక నాయకుల అండదండలు ఉండడంతో జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు ఇప్పటికే మాయమైపోయాయి. కాలువ తవ్వకాల సమయంలో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పొందిన రైతులు మిగులు భూములపై కన్నేసి ఆ భూమిలోని మట్టిని విక్రయించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్లీ సాగులోకి తెస్తున్నారు. కొవ్వూరుపాడు, గోపాలపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కొండలను సైతం అక్రమార్కులు తవ్వేసి ఇళ్లకు, ఎత్తు పల్లాల నేలల చదునుకు మట్టిని విక్రయిస్తున్నారు. కొండలు పిండి చేస్తున్నారు రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ ఇంటి వద్ద వేయాలంటే దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ. 1500కు విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మట్టి దొకడం కష్టంగా ఉంటుంది. కొండలు పిండి చేస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అఽధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి. – సరంగి మోసియ్య, చిట్యాల ఆగని మట్టి అక్రమ తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు స్థానిక నాయకుల అండతో రేయింబవళ్లు మట్టి తరలింపు గోపాలపురం మండలంలో విడ్డూరం -
వాడపల్లి క్షేత్రంలో టెండర్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గృహ సంకల్పం కింద ఇటుకల పాటను దొడ్డ లక్ష్మణరావు రూ.59,09,999కు దక్కించుకున్నారు. గతంలో ఈ టెండరు ద్వారా రూ.35,66,999 రాగా ఈ సారి రూ. 23,43,000 ఆదాయం పెరిగింది. దేవస్థానం పచ్చి గో గ్రాసం అమ్ముకునే హక్కును అడపా వరప్రసాద్ రూ.10,09,999కు దక్కించుకున్నారు. గత ఏడాది దీనికి రూ.1.25 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.8,84,999 అదనంగా ఆదాయం వచ్చింది. గుమ్మటాలుకు సంబంధించి గత శిస్తు రూ.2,14,999 ఆదాయం రాగా ప్రస్తుతం రూ.75,333 వచ్చింది. ఆ విధంగా ఈసారి రూ 1,39,666 ఆదాయం తగ్గింది. 26 షాపులకు పాట పెట్టగా అందులో ఐదు మాత్రమే వేలానికి వెళ్లాయి. వాటిని రూ.50,709కు పొందారు. గత ఏడాది కంటే ఈసారి రూ.5,300 ఆదాయం పెరిగింది. ఆలయంలో సెక్యూరిటీ సేవలు శ్రీస్కంధ బౌన్సర్లు రూ.వెయ్యికి, శ్రీకృష్ణప్రసాద్ రూ.369కి టెండరు పొందారు. కార్యక్రమంలో గ్రేడ్ – 3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం సిబ్బంది తధితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు.. మరోసారి బట్టబయలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, లిక్కర్ సిండికేట్ బాగోతాలను మరో టీడీపీ నేత బర్ల బాబురావు బట్టబయలు చేశారు. గతంలో వరుసగా టీడీపీ నేతలు మద్యం సిండికేట్ల ముడుపుల గురించి మాట్లాడిన ఆడియోలను బాబురావు విడుదల చేశారు. ఎక్సైజ్ సీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బర్ల బాబురావు బయటపెట్టారు. తాను విడుదల చేసిన ఆడియోలు ఏఐ క్రియేషన్ కాదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాబురావు సవాల్ చేశారు. బర్ల బాబురావుతో బహిరంగ చర్చకి వచ్చేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు.కాగా, గతంలో కూడా రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది.రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్‌లో ఉన్న లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
సందడిగా ‘శ్రీ ప్రకాష్ సినర్జీ’ వార్షికోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్కూల్ ప్రాంగణంలోని సీతా నరసింహక్షేత్ర ఆడిటోరియంలో బ్లిట్జ్–25 పేరుతో వేడుకలు నిర్వహించారు. విలువలే ప్రధానం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. యోగా, జిమ్నాస్టిక్స్, త్వైకాండో, కలరీయపట్టు, కర్రసాము వంటి వాటిని ప్రదర్శించి అందరినీ అలరించారు. ముఖ్యంగా బుర్రకథ కళారూపాలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ కళాశాల విభాగాధిపతి డాక్టర్ వడ్లమూడి రవీంద్ర సారథి మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ వెల్లంకి సుమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలను పెంచుతున్న శ్రీ ప్రకాష్ స్కూల్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలు, సంస్కృతి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యాబోధన సాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, సినర్జీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, ప్లస్ వన్, టూ కో ఆర్డినేటర్ కె.విశ్వనాథ్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శనానికి మరో సుపథం
అన్నవరం: సత్యదేవుని రత్నగిరికి వెళ్లేందుకు మొదటి ఘాట్‌రోడ్ వద్ద టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్లదారి పనులు పూర్తయ్యాయి. సుమారు 450 నున్నటి మెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పూర్వపు ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్రమోహన్ చొరవతో 2010 సంవత్సరంలో ఆలయ ఈఓగా పనిచేసిన ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడ నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తులు సుమారు అర కిలోమీటరు దూరంలోని తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి స్వామివారి ఆలయానికి 400 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చేది. భక్తులకు ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ మేరకు వారికి మార్గం సుగమం అయ్యేలా మెట్ల దారి నిర్మాణానికి ఆయన నడుం కట్టారు. అన్నవరం దేవస్థానం నుంచి ఆయన 2012లో బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. 2023లో మళ్లీ ఆలయ ఈఓగా రామచంద్రమోహన్ రావడంతో మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలచి ఖరారు చేసి 2025 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. రెండు మలుపులు, 410 మెట్లు ఈ మెట్ల దారిని రెండు మలుపులతో 410 మెట్లతో నిర్మించారు. మొదటి ఘాట్‌రోడ్ టోల్గేట్ నుంచి ఇది ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. మెషీన్‌తో కట్ చేసిన రాళ్లతో.. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన అధునాతన మెషీన్‌తో కట్ చేసిన గ్రానైట్, మార్బుల్ రాళ్లను ఈ నిర్మాణానికి వినియోగించారు. మొదటి మెట్ల దారికి ఉపయోగించిన రాళ్లను 50 ఏళ్ల క్రితం శిల్పులు చేతితో చెక్కగా పలకల్లా అమర్చారు. సంతృప్తిగా నిర్మాణం కాగా, గత నవంబర్‌లో ఆలయానికి వచ్చిన రామచంద్రమోహన్ మెట్ల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్గం మధ్యలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ల్యాండింగ్ వద్ద విశ్రాంతి షెడ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, అలాగే మెట్లకు ఇరువైపులా పిట్టగోడ నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యాక ఈ దారిని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రత్నగిరికి రెండో మెట్లదారి సిద్ధం మొదటి ఘాట్ రోడ్ నుంచి ఆలయం వరకు మార్గం సుగమం రూ.90 లక్షల వ్యయంతో 410 మెట్ల నిర్మాణం ఆర్చి, పిట్టగోడలు పూర్తయ్యాక ప్రారంభం ఆర్చి, పిట్టగోడ నిర్మాణానికి టెండర్లు మెట్లదారికి ఇరువైపులా పిట్టగోడ నిర్మాణంతో పాటు ప్రారంభంలో ఆర్చి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. ఆ పనులను వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. – వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం -
కొరతకు కట్టడి
● పశుగ్రాసం కొరతకు పరిష్కారం ● అందుబాటులోకి స్ట్రా బేలర్ యంత్రం ● ఎండుగడ్డిని కట్టలుగా కడుతున్న వైనం ● రైతులకు అదనపు ఆదాయం రైతునేస్తాలు ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రా బేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టే విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చేసే అవకాశం ఏర్పడింది. ట్రాక్టర్ ఉపకరణ పనిముట్లు మాదిరిగానే ఈ స్ట్రాబేలర్ యంత్రం కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. – సీహెచ్‌కేవీ చౌదరి, వ్యవసాయశాఖ ఏడీ, ఆలమూరు స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టిన ఎండుగడ్డి ఆలమూరు: వ్యవసాయంలో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల పని సులభం కావడంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతోంది. ఇలాంటి వాటిలో గడ్డి సేకరణ యంత్రం (స్ట్రా బేలర్) ఒకటి. ఇప్పటి వరకూ పాడి రైతులను వేధించిన పశుగ్రాసం సమస్యకు దీని ద్వారా చెక్ పడింది. వరి పంట కోతకు ప్రస్తుతం మెషీన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన గడ్డిని కట్టలుగా కట్టడానికి స్ట్రా బేలర్ ఉపయోగపడుతుంది. లాభదాయకం యంత్రాలతో పంటను కోసిన వరి పొలాల్లో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని గతంలో రైతులు తగులబెట్టేవారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాటు భూసారం తగ్గిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. ఈ స్ట్రాబేలర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎండుగడ్డి కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ట్రాక్టర్‌కు దమ్ము చక్రాలు అమర్చే విధంగానే స్ట్రా బేలర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా గడ్డి సేకరణ జరపడంతో ఇటు పాడి రైతులకు, అటు కొనుగోలు దారులకు లాభదాయకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో.. ఇటీవల పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టి తీసుకువెళుతున్నారు. దీనివల్ల పాడి రైతులకు, గో సంరంక్షణ కేంద్రాలకు, డెయిరీ ఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ మార్గం సుగమమైంది. అలాగే ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 250 వరకూ స్ట్రా బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాడి ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 4.69 లక్షల ఎకరాల్లో సుమారు 80 శాతం మేర వరి కోత యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతోనే ఒబ్బిడి చేసుకున్నారు. అదనపు ఆదాయం స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గతంలో రైతులు ఎండుగడ్డి కోసం కూలీలలో వరి పంటను కోయించేవారు. ప్రయోజనాలివే.. ● పొలాల్లో నిరుపయోగంగా ఉన్న గడ్డిని తగులబెట్టకుండా ఉంచుతున్నారు. దీనివల్ల భూసారం బాగుంటుంది. భూమిలో పోషక విలువలు పెరిగేందుకు, అధిక దిగుబడికి దోహద పడుతుంది. ● వరికోత యంత్రంతో పంటను కోయించిన రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ● ఎండుగడ్డి సేకరణ సులభతరం కావడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు. గడ్డివాములను సులువుగా వేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ● అగ్ని ప్రమాదాల నివారణకు, కాలుష్య నియంత్రణకు దోహదపడుతుంది. పశుగ్రాసం కొరత అధిగమించడంతో పాటు వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు. -
సమర సంతకం!
సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై విద్యార్థులు, ప్రజలు, అన్ని వర్గాలవారూ సమర సంతకాలు చేశారు. వైఎస్సార్ సీపీ పిలుపునకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి చేయందించాయి. లక్షలాది సంతకాలు సేకరించి చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. పీపీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సంతకాల ప్రతులను అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రత్యేక బాక్సుల్లో భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. రెండు రోజుల అనంతరం వాటిని గవర్నర్ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యక్రమంలో పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్రకార్యదర్శులు చందన నాగేశ్వర్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గిరజాల బాబు, అద్దంకి ముక్తేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యాలయానికి సంతకాల ప్రతులు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో లక్ష్యం మేరకు సంతకాలు సేకరించారు. ఆ ప్రతులను ప్రత్యేక బాక్సులలో ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నినదించారు. సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయంలో భద్రపరిచారు. 17న గవర్నర్ వద్దకు జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను ఈ నెల 15వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించి, అదే రోజు జిల్లాలోని పార్టీ శ్రేణులు సమావేశమైన సంతకాల ప్రతులతో ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి విజవాడకు తీసుకువెళ్తారు. 17వ తేదీన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి కొంత మంది ప్రముఖ నేతలు గవర్నర్‌ను కలసి సంతకాల ప్రతులను అందజేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా నేతలు తలమునకలవుతున్నారు. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 60 వేల సంతకాలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 4.2 లక్షల సంతకాలు సేకరించాలని భావించారు. అన్ని నియోజకవర్గాల్లో లక్ష్య సాధనకు కృషి చేశారు. ఇప్పటి వరకు 4,05,129 సంతకాలు చేపట్టారు. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 వేల సంతకాలు సేకరించారు. లక్ష్యానికి మించి సంతకాలు నమోదయ్యాయి. సంతకాల ప్రతులను మాజీ మంత్రి పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శించారు. ● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో 45 వేల సంతకాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో 50 వేలు సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సంతకాల ప్రతులను భరత్, పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి పంపారు. ● రాజానగరం నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. ఆ ప్రతులను జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నేతలు ప్రదర్శించి అనంతరం బాక్సుల్లో ప్యాక్ చేసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతరం రాజానగరంలోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. ● పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సంతకాలు సేకరించారు. లక్ష్యాన్ని అధిగమించి 60,129 సంతకాలు పూర్తి చేశారు. అనంతరం జిల్లా కార్యాలయానికి తరలించారు. ● కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో 55 వేల సంతకాలు చేయించారు. సంతకాల పత్రాలను పెట్టెల్లో కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ప్రదర్శించి అనంతరం ర్యాలీగా బయలు దేరి రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకు అప్పగించారు. ● గోపాలపురంలో మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 55 వేల సంతకాలు సేకరించారు. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల నుంచి రాజమహేంద్రవరం జిల్లా పార్టీ కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ● నిడదవోలులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ముగిసింది. లక్ష్యానికి అనుగుణంగా 60 వేల సంతకాలు పూర్తి చేశారు. సంతకాల ప్రతులను బాక్సుల్లో పెట్టి జిల్లా కార్యాలయానికి తరలించారు. రాజానగరంలో ప్రతులు చూపుతున్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులునిడదవోలులో సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి తరలిస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడుఅవిశ్రాంత కృషిప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాలు సేకరించాలన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు గత అక్టోబర్ పదో తేదీన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణకు ముందుకు కదిలారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందించారు. పోస్టర్లు ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేరించారు. బుధవారంతో ఈ కార్యక్రమం ముగిసింది. వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై తమ ఆగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ, ప్రజలు, విద్యార్థుల గర్జన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునకు విశేష స్పందన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ జిల్లా వ్యాప్తంగా సంతకాలు, భారీ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి ప్రతులు రెండు రోజుల్లో గవర్నర్‌కు అందించనున్న నేతలు -
సరదాగా చోరీ.. ప్రవృత్తిగా మారి..
● బైక్‌లను చోరీ చేస్తున్న యువకుడు ● అరెస్టు చేసిన పోలీసులు ● రూ.17.40 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సరదాగా తిరిగేందుకు బైక్‌ను దొంగతనం చేసిన ఆ యువకుడు.. ఆ తర్వాత బైకుల చోరీయే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. చివరకు రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, త్రీటౌన్ సీఐ వి.అప్పారావు ఈ వివరాలు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఓ హోటల్లో నైట్‌బాయ్‌గా పనిచేసేవాడు. పగటి సమయాల్లో వెల్డింగ్ పనులు చేసేవాడు. అతడికి బైక్ లేకపోవడంతో ఏదో విధంగా బైక్ సంపాదించాలని పథకం వేశాడు. పుష్కర్ ఘాట్ వద్ద పార్కింగ్ చేసిన బైక్‌పై అతడి కన్ను పడింది. తన వద్ద ఉన్న పాత తాళంతో ప్రయత్నించగా లాక్ వచ్చేయడంతో అది తీసుకుని ఉడాయించాడు. అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో మోటార్ బైకులను చోరీ చేశాడు. వాటిని తనకు పరిచయమున్న భీమవరానికి చెందిన కోసూరి పవన్ కుమార్, గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన జార్గాని అప్పన్నలకు తక్కువ ధరకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. పోలీసుల ప్రత్యేక నిఘా నగరంలో బైక్ చోరీలు ఎక్కువ కావడంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన సబ్బు వీరబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాల చిట్టా బయట పెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడు పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మల్లయ్యపేట, సుబ్రహ్యణ్య మైదానం, లాలాచెరువు రోడ్డు, ఇస్కాన్ గుడి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వరిసర ప్రాంతాలలో చోరీ చేసిన 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.17.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందుతుడి నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వారిపైనా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.అప్పారావు ఎస్సై ఎండీ జుబేరు, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్‌కుమార్, కె.పవన్ కుమార్, ఆర్.సుబ్రహ్మణ్యంలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఈ నెల 13న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు 46 బెంచ్‌లు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడ దగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్, బ్యాంకు, ప్రీ లిటిగేషన్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హై కోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలనా కేసులు కూడా ఇక్కడ పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు 18 వేల 35 కేసులను రాజీ చేయడానికి గుర్తించినట్టు తెలిపారు. న్యాయసేవ ప్రజల ముంగిటకు చేరాలన్న లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమన్నారు. -
21న పల్స్ పోలియో
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ఆనం కళాకేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.శ్రీదేవి మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సిబ్బందికి పలు సూచనలిచ్చామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలు లక్ష్యంగా గుర్తించగా, దీనికి 1,084 పోలియో బూత్‌లు, 62 ట్రాన్సిట్, 53 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 4,566 మంది సభ్యులు, 116 మంది సూపర్వైజర్లు, 10 మంది మానిటరింగ్ అధికారులను నియమించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు సీ్త్ర–శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖలు, వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ప్రయాణంలో ఉన్న వారికి ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సంధ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.షమ్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అద్దె ఇల్లు కావాలంటూ పుస్తెల తాడు చోరీ
జగ్గంపేట: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు యువకులు యజమానురాలిపై దాడి చేసి బంగారు పుస్తెల తాడు దోచుకుపోయా రు. జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో పులవర్తి సూపర్ బజారు పక్కనే ఉన్న పైడిపల్లి శ్రీమన్నారాయణ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీమన్నారాయణ ఇంటి ముందు ఉన్న టూలెట్ బోర్డును చూసి మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అక్కడకు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని అడగడంతో వారిద్దినీ శ్రీమన్నారాయణ భార్య సుబ్బలక్ష్మి అద్దెకు ఇచ్చే పోర్షన్లోకి తీసుకువెళ్లింది. వెంటనే ఆ ఇద్దరు యువకులు కత్తితో ఆమె బెదిరించి, మత్తు మందు స్ప్రే చేశారు. ఆమె మెడలోని మూడు కాసుల విలువైన నల్లపూసలు, పుస్తెల తాడు లాక్కుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ పుటేజీలో దొంగతనం రికార్డు అయ్యిందన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
సాయి ప్రతిభ.. రికార్డుల మోత
తుని: సృజనాత్మకతతో పాటు కృషి, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఈ తుని యువకుడు నిరూపించాడు. ఇప్పటికే అతి చిన్న వాషింగ్ మెషీన్ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన అతడు.. అదే స్ఫూర్తితో కుండలు తయారు చేయడానికి ఉపయోగించే అతి చిన్న మోటార్ వీల్‌ను రూపొందించాడు. దీంతో మరోమారు గిన్నీస్ రికార్డు సాధించాడు. తుని పట్టణానికి చెందిన తిరుమలనీడి సాయి కుండల తయారు చేసే అతి చిన్న మోటార్ వీల్‌ను (ద స్మాలెస్ట్ మోటరైజ్డ్ పోటరీ వీల్) రూపొందించాడు. ఈ మేరకు మంగళవారం అతడికి గిన్నీస్ వరల్డ్ బుక్ సంస్థ వరల్డ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు లేటెస్ట్ వెర్షన్ గిన్నీస్ బుక్‌ను పంపించింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయి చిన్నప్పటి నుంచి సైన్స్‌పై మక్కువతో ప్రాజెక్టులు రూపొందించేవాడు. ఈ నేపథ్యంలో అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతి చిన్న మోటార్ వీల్‌ను తయారు చేసి తాజాగా రెండోసారి ఈ ఘటన సాధించాడు. -
అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు
● మరో ఇద్దరిపై కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్ ముమ్మిడివరం: ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మోర్త గిరిబాబుతో పాటు మరో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ నిందితులను మీడియా ముందు హాజరు పర్చి, కేసు వివరాలు వెల్లడించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన బాలిక ఐదో తరగతి నుంచీ ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె తల్లి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటుండగా, తండ్రి కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆ బాలిక నాయనమ్మ ఇంటి వద్ద ఉంటూ గురుకులంలో చదువుకుంటోంది. ఈ క్రమంలో బాలికతో బాబాయి వరసయ్యే అదే గ్రామానికి చెందిన మోకా గిరిబాబు పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 3న గురుకుల పాఠశాలలో ఉన్న ఆ బాలికను వైద్య చికిత్స కోసం బయటకు తీసుకు వెళుతున్నానని పాఠశాల యాజమాన్యంతో చెప్పగా, వారు నిరాకరించారు. దీంతో గిరిబాబు సమీప బంధువైన మేడేపల్లి అర్చనాదేవి ఆ పాఠశాలకు వెళ్లి ఆ బాలికకు మేనత్తనంటూ మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వచ్చింది. గతంలో బాలిక తండ్రితో గిరిబాబు పలు పర్యాయాలు గురుకుల పాఠశాలకు రావడం, ఆ బాలిక కూడా గిరిబాబును బాబాయి అనడంతో యాజమాన్యం నమ్మి, బయటకు పంపించింది. అధిక సొమ్ములు ముట్టజెప్పి.. గిరిబాబు ఆ బాలికతో పాటు అర్చనాదేవిని మోటారు సైకిల్‌పై ముమ్మిడివరం వరకూ తీసుకువచ్చాడు. అక్కడ అర్చనాదేవిని దించి బాలికను గౌరీపట్నం తీసుకువెళ్లాడు. అదే రోజు సాయంత్రం అమలాపురం చేరుకుని స్థానిక గణపతి లాడ్జిలో రిసెప్షనిస్టు నాగవరపు వెంకట రమణకు అధిక సొమ్ములు ముట్టజెప్పి గది తీసుకున్నాడు. ఆ రాత్రి బాలికపై రెండుసార్లు అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాలికను గురుకుల పాఠశాల వద్ద వదిలేశాడు. పాఠశాల ప్రిన్సిపాల్ డి.శారద ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డీఎస్పీ ప్రసాద్ పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఎస్సై డి.జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితుడు గిరిబాబుపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతడికి సహకరించిన అర్చనాదేవి, నాగవరపు వెంకట రమణలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా.. బాలిక నాయనమ్మ ఇంటి సమీపంలోనే గిరిబాబు ఉంటున్నాడు. బాలిక తండ్రితో ఉన్న పరిచయంతో లోబర్చుకున్నాడు. సెలవుల సమయంలో ఇంటి వద్ద ఉన్న ఆ బాలికపై పలు పర్యాయాలు అత్యాచారం చేశాడు. -
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
పెరవలి: ఏటిగట్టుపై మలుపు తిరుగుతున్న ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. దానిలోని 40 మంది విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉండ్రాజవరం మండలం తాటిపర్రు గ్రామానికి చెందిన జ్యోతి కాన్వెంట్ బస్సు మంగళవారం పెరవలి మండలం తీపర్రులో గోదావరి ఏట్టుగట్టుపై మలుపు తిరుగుతోంది. ఆ సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా లంకలోకి బోల్తా పడింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పరుగున అక్కడకు వెళ్లి, బస్సు అద్దాలను పగులకొట్టి, విద్యార్థులకు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆయా ర్యాలి వెంకట పద్మావతికి తీవ్ర గాయాలు కావడంతో సొమ్మసిల్లిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొందరు పిల్లలకు స్వల్ప గాయాలు కావటంతో తల్లితండ్రులు, స్థానికులు సపర్యలు చేశారు. పెరవలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. దాదాపు నెల రోజులుగా బస్సు సమయానికి రావడం లేదని, ఎందుకుని ప్రశ్నిస్తే బస్సు రేపేరుకు వచ్చిందంటూ డ్రైవర్ వెంకట రమణ చెప్పేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. -
సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలి
నిడదవోలు: పోలీసు స్టేషన్లలో ఎటువంటి సెటిల్మెంట్లూ ఉండకూడదని, వాటికి దూరంగా ఉండాలని, ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, అవినీతికి పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, నిడదవోలు సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. క్రైం రేటు, కేసుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, నిడదవోలు ప్రాంతంలో చోరీ కేసులు అధికంగా ఉన్నాయని, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు విడిచి, ఊరికి వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) కెమెరాలను తమ ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. దీని ద్వారా దొంగతనాలను అరికట్టడం సులభమవుతుందన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి రకరకాల యాప్‌లు, ఫోన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పండగల నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో పోలీసు విభాగంలో మ్యాన్‌పవర్ తగ్గుతుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని చెప్పారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేసేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. బాధితుల ఫిర్యాదు, ఎఫ్ఐఆర్లో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా ఆయా కేసుల విచారణ అప్డేట్ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. నిడదవోలు పట్టణంలతో రాత్రి దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మరింతగా పెంచాలని సూచించారు. పెరవలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిడదవోలులో గంజాయి విక్రయదారులందరినీ అరెస్టు చేశామన్నారు. నిడదవోలులో ఒకరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, ఎస్సైలు జగన్మోహన్రాావు, ఎల్.బాలాజీ సుందరరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఫ ఎస్పీ నరసింహ కిషోర్ -
చోరీ సొత్తు రికవరీ
తుని: రైల్వే ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి రైల్వే పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తుని జీఆర్పీ సబ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుని రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై అనుమానిత వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతడు రైళ్లలో చోరీలు చేస్తున్నట్టు తెలిపింది. అతడి నుంచి రూ.52 వేలు, సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. -
క్రీడలతో విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో నమ్మకం, ధైర్యం కలిగించడంలో, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి అన్నారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్‌కేవీటీ స్కూలులో మంగళవారం నిర్వహించిన సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించి, క్రీడా మైదానంలో వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని అన్నారు. వారికి తగిన అవకాశాలు, సరైన వేదిక కలిగిస్తే ఎటువంటి విజయాలనైనా అందుకుంటారని అన్నారు. క్రీడలతో పాటు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, అవకాశాలు అందుకుని రాణించడం ద్వారా చిన్నారుల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పీడీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో వ్యక్తి దారుణ హత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన కీర్తి సత్యనారాయణ (45) స్థానిక సంత చెరువు జంక్షన్‌లోని దుర్గ గుడి మలుపులో చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. దుమ్ములపేటకు చెందిన అత్తిలి రంగా అనే ఆటో డ్రైవర్ మంగళవారం సత్యనారాయణ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డాడు. నిన్న రాత్రి తన తల్లిని ఎందుకు దూషించావని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతలోనే రంగా అక్కడే ఉన్న చెప్పులు కుట్టేందుకు వాడే కత్తితో సత్యనారాయణ గుండెల్లో పొడిచాడు. వెంటనే సత్యనారాయణ రక్త మోడుతూ కాకినాడ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనపై జరిగిన దాడి గురించి చెబుతుండగా ముందుగా ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో తాను సహజీవనం చేస్తున్న మేరీ అనే మహిళ సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు ఆటోలో వెళుతుండగా మార్గం మధ్యలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లే సరికి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడికి కుటుంబం లేదు. కొన్నాళ్ల క్రితం రేచర్లపేటకు చెందిన మేరీతో పరిచయం ఏర్పడింది. ఆమె చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో సత్యనారాయణ కూడా ఆమెతో కలిసి కాగితాలు ఏరుకుంటూ, చెప్పులు కుడుతూ ఆమె కు దగ్గరయ్యాడు. ఈ పరిచయం ఇరువు రి మధ్య సహజీవనానికి దారి తీసింది. నిందితుడు రంగాను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం
రాజమహేంద్రవరం రూరల్: వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) డైరెక్టర్ వై.మేఘాస్వరూప్ అన్నారు. బొమ్మూరులోని ఆర్టీఐహెచ్లో స్టార్టప్ ఆలోచనలు కలిగిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మూడు రోజులపాటు నిర్వహించే స్పార్క్ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధక విద్యార్థులు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు సమస్య నిర్వచనం, కస్టమర్ సెగ్మెంట్ల గుర్తింపు, ప్రాక్టికల్ సొల్యూషన్లపై బ్రెయిన్ స్టార్మింగ్ అంశాలపై చర్చ జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులపై విఠల్ కుమార్, ఐడియా జనరేషన్‌పై ఎడ్జ్ వన్ ఇంటర్నేషనల్‌కు చెందిన శ్రీరామ్ కుమార్ రామదేవ్ ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి టి.సూర్యప్రకాశ్, ఆర్టీఐహెచ్ రీజినల్ సెంటర్ పరిధిలోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు వద్దుసీతానగరం: వరునికి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జి.క్రాంతిలాల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డి.చిట్టిబాబు ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన బాల్యవివాహ నిరోధక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నైతిక విలువలు లేని పెద్దల చేతిలో పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల వరకూ చదువుకున్న విద్యార్థిని వివాహ జీవితం, బాల్యంలో ప్రేమ పేరుతో జులాయిలను పెళ్లి చేసుకున్న యువతుల జీవితం గురించి కథల రూపంలో వివరించారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని కోరారు. తోటి బాలురతో అతి చనువు వల్ల అపార్థాలు కలిగి జీవితాలు నాశనమవుతాయని, విచక్షణతో, బాధ్యతతో కుటుంబానికి విలువనిస్తూ చదువుకుని, ఆదర్శ సమాజాన్ని నెలకొల్పాలని క్రాంతిలాల్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు వెంకటేష్ బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.పెదలక్ష్మి, అధ్యాపకులు నాగేశ్వరరావు, ఎం.సుధామయి, వాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ‘నన్నయ’లో ముగిసిన జాతీయ వర్క్షాప్రాజానగరం: ఆదికవి నడయాడిన నేలపై జాతీ య స్థాయి వర్క్‌షాప్ నిర్వహించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి అన్నారు. ‘భారతీయ భాషలలో ఏకరూ ప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై వర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో తానా సాహితీ వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ, అందరికీ నిర్భయంగా మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. భారతీయ సంస్కృతి అకడమిక్స్ కో ఆర్డినేటర్ కె.గిరిధరరావు మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన జరగాలన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య డి.జ్యోతిర్మయి, తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్డీ విల్సన్, భారతీయ భాషా సమితి నిపుణుడు ఆచార్య ఆర్ఎస్ సర్రాజు, కో ఆర్డినేటర్ తలారి వాసు పాల్గొన్నారు. -
గిరిజనుల హక్కులను కాపాడాలి
సామర్లకోట: గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓలకు మంగళవారం ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వారి హక్కులపై అవగాహన కల్పించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 24వ తేదీలోపు గిరిజనులకు పెసా చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఈ మేరకు స్థానిక శిక్షణా కేంద్రంలో సీఈఓలు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు టీఓటీలుగా శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 12 నుంచి 14 వరకు డిప్యూటీ ఎంపీడీలకు, ఈ నెల 15 నుంచి 17 వరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి పంపాలన్నారు. ఈ నెల 24న విశాఖపట్నంలో జాతీయ పెసా దినోత్సవం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెసా కోర్సు డైరెక్టర్ డి.చిన్నబ్బులు, అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు కె.సుశీల, ఎం.రాజ్ కుమార్, ఎన్ఎన్ రాజ్‌కుమార్, ఎ.విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఫెర్రీ.. వర్రీ..
● సఖినేటిపల్లి రేవులో పంటు ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన ● ఇటీవల నది మధ్యలో నిలిచిన వైనం ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ సఖినేటిపల్లి: నర్సాపురం – సఖినేటిపల్లి మధ్యలోని వశిష్ట గోదావరిలో పంటుపై ప్రజలు, విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇది అక్కడి వారందరూ సాధారణ విషయమే. అయితే ఇటీవల నది మధ్యలో పంటు నిలిచిపోయిన ఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పంటు ఫిట్నెస్పైనా సందేహాలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ఉమ్మడి పశ్చిమ, ఇటు తూర్పు గోదావరి జిల్లాల ఉన్నతాధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాధవాయిపాలెం ఫెర్రీగా సఖినేటిపల్లి – నర్సాపురంలో రేవు గుర్తింపు పొందింది. నది మధ్యలో.. నర్సాపురం వైపు నుంచి సఖినేటిపల్లి వైపునకు సుమారు 80 మంది ప్రయాణికులు, 20 వాహనాలతో బయలుదేరిన పంటులో ఇంజిన్ సమస్య తలెత్తింది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్ల కారణంగా గోదావరిలోకి వచ్చే కెరటాల ధాటికి నదిలో దిశ మారింది. ఈ నేపథ్యంలో అరగంట పాటు నిలిచిన పంటుపై ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ తరుణంలో నిర్వాహకులు ఆ పంటుకు ఇదే రేవులో ప్రయాణికులతో వస్తున్న మరో పంటుకు తాడును కట్టి సఖినేటిపల్లి వైపు గోదావరి ఒడ్డుకు చేర్చారు. పర్యవేక్షణ కరవు వేలంలో రేవు పాట దక్కించుకున్న నిర్వాహకులు ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేయబోయే పంటులను ఆ శాఖ అధికారులు పరిశీలన చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ క్రమంలో సెక్యూరిటీ మెజర్స్ పరిశీలనకు కాకినాడలోని ఏపీ మారిటైమ్ బోర్డు (ఓడల రేవులు, సముద్ర మౌలిక సదుపాయాల నిర్వహణ) అధికారులు ఇందుకు అథారిటీ ఉంటారు. నర్సాపురం ఎంపీడీవో పర్యవేక్షణలో రేవు నిర్వహణ కొనసాగుతుంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటీవల ఇంజిన్ మొరాయించి నది మధ్యలో పంటు నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు ఏవీ! సఖినేటిపల్లి రేవులో ప్రయాణికుల నుంచి సాలీనా సుమారు రూ.3 కోట్ల వరకూ పాటదారులు వసూలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రేవులో వేలం ద్వారా ఖరారవుతున్న పాట మొత్తంలో ఎక్కువ శాతం ఆదాయం ఇచ్చేది రాజోలు దీవివాసులే. కానీ పాటదారులు కనీస సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం శోఛనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. పెత్తనమంతా పశ్చిమదే రేవుపై పెత్తనమంతా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులదే. దీంతో రేవు పాట ద్వారా వచ్చే ఆదాయంలో వాటాలకు మాత్రమే తూర్పు జెడ్పీ, సఖినేటిపల్లి మండల పరిషత్, సఖినేటిపల్లిలంక (రేవు ఉన్న ప్రాంతం) పరిమితం అయింది. కూతవేటు దూరం సాగర సంగమానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రేవులో సముద్రం ఆటుపోటులకు గోదావరి వైపునకు పోటెత్తే కెరటాలు ఽప్రభావం రేవులో అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కెరటాలు దాటికి పంటు అదుపు తప్పి దిశ మారడం జరిగి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఉన్న రేవులో అధికారుల ఉదాసీన వైఖరి, రేవు పాటదారుల నిర్లక్ష్యం తగదని ప్రయాణికులు పేర్కొన్నారు. నిత్యం వేల సంఖ్యలో నిత్యం వేల సంఖ్యలో ఈ రేవు నుంచి నర్సాపురంతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తారు. రోడ్డు మార్గంలో నర్సాపురం వెళ్లడానికి చించినాడ మీదుగా చుట్టూతిరిగి సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే సఖినేటిపల్లి రేవులో పంటు మీదుగా అరగంటలో నర్సాపురం చేరుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి రేవును ఆశ్రయించడం పరిపాటి. నిర్వహణ లోపం నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రేవులో పంటు నది మధ్యలో నిలిచిపోయిన ఘటనలో నిర్వహణ లోపం కచ్చితంగా కనబడుతోంది. అలాగే పంటు ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరికీ అనుమానం ఉంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. – బళ్ల నోబుల్ ప్రభాకర్, పరిషత్ కో ఆప్షన్ మెంబర్, సఖినేటిపల్లి అజమాయిషీ ఉండాలి రేవులో పంటు ఫిట్నెస్, నిర్వహణపై ఉన్నత అధికారుల అజమాయిషీ కచ్చితంగా ఉండాలి. నిత్యం ప్రయాణికులతో పాటు చదువు కోసం విద్యార్థులు రేవు మీదుగా నర్సాపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. వారి భద్రతపై ఉదాసీన వైఖరి తగదు. – తాడి సహదేవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి, వీవీ మెరక -
ఎట్టకేలకు నూతన ఈఓ
అన్నవరం దేవస్థానం అన్నవరం: దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును తిరిగి ఆయన మాతృ శాఖ రెవెన్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డిప్యూటేషన్ ఈ నెల 13తో పూర్తి కానుంది. నాలుగు రోజులు ముందుగానే ఆయనకు స్థానచలనం కలిగింది. నూతన ఈఓ త్రినాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పోస్టులో ఆయన నియమితులవడం ఇది నాలుగోసారి. 2019లో జనవరి నుంచి మార్చి వరకూ.. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్టు నుంచి 2022 వరకూ, తిరిగి 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకూ త్రినాథరావు అన్నవరం దేవస్థానం ఈవోగా పని చేశారు. ఫలించని ప్రయత్నాలు కాణిపాకం, శ్రీశైలం దేవస్థానం ఈఓలుగా గత ఏడాది నియమితులైన డిప్యూటీ కలెక్టర్లను మరో ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఏడాది కొనసాగేందుకు ప్రస్తుత ఈఓ సుబ్బారావు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయనను సిఫారసు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. కనీసం నాలుగు నెలలైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా కోరినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానాన్ని ప్రజాప్రతినిధుల చేతిలో పెట్టారన్న విమర్శలు.. పలు వివాదాల నేపథ్యంలో ఆయనను కొనసాగించేందుకు ఉన్నతాధికారులు విముఖత చూపారని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం ఈఓలుగా గతంలో డిప్యూటీ కలెక్టర్లు ఎన్వీ శేషగిరిబాబు, ఎస్.సత్యనారాయణ, ప్రసాదం వెంకటేశ్వర్లు, కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర పని చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. వివాదాస్పద నిర్ణయాలు గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానం ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. వీటిపై ‘సాక్షి’లో పలు కథనాలు వచ్చాయి. ఫ దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను సత్రాల్లోని ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ ఈఓ కుమారుని వ్యవహార శైలిపై ఏప్రిల్ 16న ‘చినబాబొచ్చారు బహుపరాక్!’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం దేవదాయ శాఖలో తీవ్ర సంచలనం రేపింది. ఫ తమను ఈఓ వేధిస్తున్నారంటూ పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఫ ఈ అంశాలపై విచారణకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్‌ను కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నియమించారు. ఆయన ఏప్రిల్ 23న అన్నవరం వచ్చి, సిబ్బందిని విచారించారు. ఈఓ తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో సిబ్బంది ఆయన వద్ద ఏకరవు పెట్టారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ చంద్రకుమార్ ఏప్రిల్ 26న కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ‘సాక్షి’ కథనాలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా అప్పట్లోనే సుబ్బారావును బదిలీ చేస్తారని అనుకున్నారు. అయితే, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఆయన బదిలీ నిలిచిందని అంటారు. ఫ సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచిస్తూ జూలై నెలలో కమిషనర్ ఒక మెమో జారీ చేశారు. ఒక ఈఓకు కమిషనర్ మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం. ఫ పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా ఏ ఒక్కసారీ సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించిన అనంతరం స్పందించి, నెలాఖరున చెల్లించారు. దీనినిని కూడా పాలనా వైఫల్యంగా ఉన్నతాధికారులు భావించారు. ఫ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం గత ఫిబ్రవరిలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో, జిల్లా కలెక్టర్ దేవస్థానంలో తనిఖీలు చేసి, పరిస్థితి చక్కదిద్దారు. ఆ తరువాతి నెలలో ఒకటో స్థానం వచ్చినా తిరిగి ఐదు, ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత నెలలో కూడా ఆరో ర్యాంకు రావడంతో కలెక్టర్ మళ్లీ సమీక్షించి, పలు ఆదేశాలిచ్చారు. ఫ సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని గత ఏడాది ఆగస్టు నుంచి సహకార డెయిరీల ద్వారా కొటేషన్‌పై కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ ద్వారా మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ గత నెలాఖరు వరకూ కూడా కొటేషన్ పైనే కొనుగోలు చేయడంతో ఈఓపై దేవదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్రినాథరావు ఫ ఈ పోస్టులో నాలుగోసారి ఆయన నియామకం ఫ నేడు బాధ్యతల స్వీకరణ ఫ ప్రస్తుత ఈఓ సుబ్బారావు కొనసాగింపునకు నో ఫ 4 రోజుల్లో ముగియనున్న ఆయన డిప్యూటేషన్ ఫ మాతృ శాఖ రెవెన్యూకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు -
నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది
సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మఅల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): లక్క ఇంటిలో పంచపాండవులు కుంతితో సహా దహనమయ్యారన్న వార్త విని ధృతరాష్ట్రుడు బిగ్గరగా ఏడిచాడు. సహజంగా ఏడిచేవాడి ఏడుపు కన్నా, నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. వేదవ్యాస భారతంపై ఆయన హిందూ సమాజంలో సోమవారం 12వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. ధృతరాష్ట్రుడు వారణాశికి పాండవులను పంపడానికి గల కారణాలను ఆయన వివరించారు. అర్జునుడు భీముని తోడుగా తీసుకుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ధర్మరాజు యశస్సు నింగినంటుతోంది, పాండు సుతుల విజయగాథలను ప్రజలు వేనోళ్లా ప్రశంసించడం ఆయనకు కంటగింపయింది. అసూయతో రగిలిపోయాడు. ఆ సందర్భంగా కణికుడు అనే మంత్రిని పిలిపించి, తాను యుధిష్టరునితో సంధి చేసుకోవాలా, సంగ్రామానికి సిద్ధపడాలా అని ప్రశ్నిస్తాడు. కణికుడు రాజనీతిని ఉపదేశిస్తాడు–శత్రువును ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదు. తన కన్నా బలవంతుడయితే, అతనిని కానుకలతో మంచి చేసుకోవాలి, వినయశీలుడిలా శత్రువు వద్ద నటించాలి, అదను చూసి దెబ్బతీయాలి. శత్రువు తన కన్నా బలహీనుడయి శరణుజొచ్చినా, ఉపేక్షించరాదని కణికుడు చెబుతాడు. దుర్యోధనాదుల ఆలోచనలకు ఆమోదం తెలిపి, పాండవులను వారణావత నగరానికి పంపుతాడని సామవేదం అన్నారు. కౌరవుల కుటిల నీతిని పసిగట్టిన విదురుడు సంకేత పదాలతో ధర్మరాజును అప్రమత్తం చేస్తాడు. కార్చిచ్చు అడవిని దహనం చేసినా, కలుగులోని ఎలుకకు అపాయం ఉండదని, రాత్రివేళ సైతం పాండుసుతులు అప్రమత్తులయి, పరిసరాలను గమనించాలని హితవు చెబుతాడు. సుయోధనుడు పురోచనుడు అనే విశ్వాసపాత్రుడిని పిలిచి, లక్కయింటిని నిర్మించమని, అదను చూసి నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. అయితే పురోచనుడి ఆలోచనను పసిగట్టిన పాండవులు ఒక రాత్రివేళ లక్క ఇంటికి తామే నిప్పు అంటించి, కలుగు మార్గం ద్వారా అడవుల్లోకి వెడతారని సామవేదం వివరించారు. ‘దుర్యోధనుడు’, ‘దుశ్శాసనుడు’ వంటి చెడు పేర్లను వ్యాసుడు ఎంత పక్షపాతి అయినా, ఎలా పెట్టాడని కొందరు అడుగుతారు. ఆ పదాలకు సరి అయిన అర్థాలను తెలుసుకోవాలి, దుర్భేద్యము అన్న పదం లాగే, దుర్యోధనుడు అంటే ఓడించడానికి వీలు పడని పరాక్రమం కలవాడని, దుశ్శాసనుడు అంటే శాసించడానికి వీలు పడని వాడనీ అర్థమని సామవేదం అన్నారు విదురుడు ఇంగితజ్ఞుడు, లాక్షాగృహ దహనంలో పాండుసుతులు అగ్నిపాలు కాకుండా విలువైన సూచనలు ఇవ్వడమే కాకుండా, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక విశ్వాసపాత్రుడిని పంపాడని ఆయన అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ నారాయణరావు సభకు స్వాగతం పలికారు. -
సీటొస్తే నవోదయమే
ఫ ఉజ్వల భవిత, ఉన్నత ప్రమాణాలకు బాట ఫ 13న నవోదయ ప్రవేశ పరీక్ష ఫ 32 కేంద్రాల్లో నిర్వహణ, 7,140 మంది హాజరు రాయవరం: ఉన్నత ప్రమాణాలతో విద్య.. క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదు.. సాహస కృత్యాలు.. వివిధ అంశాల్లో అధునాతన శిక్షణ.. పౌష్టికాహారంతో బోధన అందించే కేంద్రాలుగా జవహర్ నవోదయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఇందులో ప్రవేశాల కోసం ఏటా వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఒకసారి ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకూ విలువలతో కూడిన ఉచిత విద్య లభిస్తుంది. నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారు. 80 సీట్లకు 7,140 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నేపథ్యంలో 2021లో 5,371 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, 2022లో 10,741 మంది, 2023లో 8,779 మంది, 2024లో 8,506 మంది, 2025లో 8,971 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే 1,831 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. పరీక్షల అనంతరం విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం నిమిత్తం ఢిల్లీకి పంపిస్తారు. అక్కడే విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో 12, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 80 ప్రశ్నలు.. 100 మార్కులు ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు, భాషా పరిజ్ఞానంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10.45 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా కేంద్రానికి చేరుకుంటే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు సూచనలివీ.. విద్యార్థులు రెండు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక హాల్ టికెట్‌ను ఇన్విజిలేటరుకు అందించాలి. ఏదో ఒక గుర్తింపు కార్డును విద్యార్థి వెంట తీసుకు వెళ్లాలి. బ్లూ లేదా బ్లాక్ పెన్నుతోనే పరీక్ష రాయాలి. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు పాఠశాల యూనిఫామ్, లేదా సివిల్ డ్రస్‌లో హాజరు కావచ్చు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురాకూడదు. సిబ్బంది నియామకం పూర్తి నవోదయ ప్రవేశ పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల తో పరీక్షను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించే విషయంపై చర్చించాం. పరీక్ష కేంద్రాల సీఎస్, డీవో, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేశాం. ఈ నెల 11న సీఎస్, డీవోలకు శిక్షణనివ్వనున్నాం. సెంటర్ లెవల్ అబ్జర్వర్లను నియమించి శిక్షణ ఇస్తున్నాం. –బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం పారదర్శకంగా నిర్వహిస్తాం.. నవోదయ ప్రవేశ పరీక్షను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు డీఈఓలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. –జి.నాగమణి, పాఠశాల విద్యాశాఖ, ఆర్జేడీ, కాకినాడ జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలు, హాజరయ్యే విద్యార్థులు జిల్లా పరీక్ష దరఖాస్తు చేసిన కేంద్రాలు విద్యార్థులు కోనసీమ 15 3,046 తూర్పు 05 1,014 గోదావరి కాకినాడ 12 3,080 మొత్తం 32 7,140 -
● సంధ్యా సమయం.. ఆధ్యాత్మిక సోయగం
సాయం సంధ్యా సమయాన.. ఆ వేంకటేశుని క్షేత్రాన కనువిందు చేసే దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది.. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వద్ద సోమవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళలో ఆకాశం కొత్త అందాన్ని సంతరించుకుంది. సూర్యుడి చుట్టూ స్వర్ణ ఛాయ, అందులో వెంకన్న క్షేత్ర రాజగోపురం ఆకట్టుకుంది. దీనిని పలువురు భక్తులు తమ కెమెరాల్లో బంధించారు. –కొత్తపేట -
హత్యకు పాత కక్షలే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు గండేపల్లి, జగ్గంపేట: హత్య కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ నెల 5న కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2024లో జరిగిన ఘర్షణలో కాకర అప్పారావుపై కుళ్ల రాజాబాబు దాడి చేయడంతో అప్పటి నుంచి వారి మధ్య కక్షలు కొనసాగుతున్నారు. భూపాలపట్నంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి అప్పారావు ఒంటరిగా కనిపించడంతో కుళ్ల రాజాబాబు అతని తమ్ముడు కుళ్ల నాగేశ్వరరావుతో కలసి అక్కడకు వెళ్లగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇనుప రాడ్లతో అప్పారావుపై దాడి చేసి హతమార్చి రాడ్లను అక్కడే వదిలి వారు పరారయ్యారు. ప్రధాన నిందితుడు రాజాబాబును సోమవారం ఉదయం హైవేలో బూరుగుపూడి నుంచి జగ్గంపేట వెళ్లే మార్గంలో రామవరం వద్ద అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. అతన్ని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు కుళ్ల నాగేశ్వరరావు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఏఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి బంధువులమంటూ బెదింపులు
ఫ భూముల కబ్జా యత్నంపై తల్లీ కుమార్తె ఆవేదన ఫ న్యాయం చేయాలని మంత్రి సుభాష్ కాళ్లు పట్టుకున్న వైనం అమలాపురం రూరల్: మంత్రి బంధువులమంటూ బెదిరిస్తూ తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాళ్లు పట్టుకుని తల్లీకుమార్తె ప్రాధేయపడ్డారు. ఆస్తి వివాదంలో తమకు న్యాయం చేయాలని గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీప్రసన్న మొరపెట్టుకున్నారు. సోమవారం అమలాపురం భట్నవిల్లిలో ఓ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ రాగా, ఆయన కాళ్లు పట్టుకుని ఆ తల్లీ కుమార్తె ఏడ్చిన దృశ్యాలు అందిరినీ కలచివేశాయి. తన భర్త గుత్తుల వెంకట్రావు జీవించి ఉండగానే తనకు, కూతురు లకీ్‌ష్మ్‌ప్రసన్న పేరున కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని ఒక సర్వే నంబర్లో 1–42 ఎకరాలు, మరో సర్వే నంబర్లో 51 సెంట్ల భూములు రాయించి ఇచ్చారని అని పుణ్యవతి తెలిపారు. కానీ మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్న కూతురు, ఆమె భర్త కలసి ఈ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని పుణ్యవతి, లకీ్‌ష్మ్‌ప్రసన్న ఆరోపిస్తున్నారు. కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి, తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు. తమ కొబ్బరి తోటలో దింపు తిస్తుండగా అడ్డుకుని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని బాధితులు మంత్రికి వివరించారు. దాడులు చేసిన కుడిపూడి వెంకటరత్నం, వెంకటేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఫిర్యాదు చేసినా న్యాయం దొరకలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.


