వ్యసనాలకు బానిసై చోరీల బాట
ఐదుగురు నిందితుల గుర్తింపు
రాయవరం: చెడు వ్యసనాలకు బానిసైన ఐదుగురు యువకులు చోరీల బాట పట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. శనివారం రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ జరిగిన తీరును రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య వెల్లడించారు. రాయవరం గ్రామానికి చెందిన వంకా మణికంఠ, కఠారి రాజు, దండంగి వీరవెంకట సత్యనారాయణ (డీవీ)లు స్నేహితులు. వీరు సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికి చోరీ బాటను ఎంచుకున్నారు. మణికంఠ ఉంటున్న వీధిలోనే పులగం లక్ష్మి, భామిరెడ్డి కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. లక్ష్మి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం గుర్తించి చోరీ చేయాలని మణికంఠ అనుకున్నాడు. దీనికి పలు కేసుల్లో నిందితుడు రాజమహేంద్రవరం వాసి లక్కోజు విశ్వనాఽథ సంతోష్ సాయికుమార్ సాయం కోరారు. గతంలో కొమరిపాలెంలో నివాసం ఉండడంతో సంతోష్ సాయికుమార్ రాయవరంలో దొంగతనం చేస్తే ఎవరైనా గుర్తు పడతారని భావించి రాజమహేంద్రవరం నుంచి దారపు దుర్గాప్రసాద్‌ను సాయం అడిగాడు. వీరందరూ కలసి చోరీకి ప్రణాళిక చేశారు. ఈ నెల 10న రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న పులగం లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును దుర్గాప్రసాద్ చోరీ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో సగం తాడు లక్ష్మి వద్ద ఉండగా, సగం తాడును దుర్గాప్రసాద్ దొంగిలించాడు. అందులో బంగారు తాడు ముక్క, రూపు, ఒక సూత్రం కఠారి రాజుకు ఇచ్చాడు. రాజు అనుమానం రాకుండా ఆ బంగారు తాడును చైనుగా మలిచాడు. దొంగిలించిన తాడును దండంగి వీరవెంకట సత్యనారాయణ అనపర్తిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టగా, రూ.3.30 లక్షలు వచ్చింది. ఆ సామ్మును ఐదుగురూ సమానంగా పంచుకున్నారు. మిగిలిన రూపు, ఒక సూత్రం అమ్మి డబ్బులు పంచుకోవడానికి వచ్చిన సందర్భంలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విద్య తెలిపారు. మణికంఠ, సాయివద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, రాజు వద్ద ఉన్న రూపు, సూత్రం, ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారు గొలుసును రికవరీ చేశారు. లక్ష్మి వద్ద నుంచి దొంగిలించిన 42 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మూడు రోజుల్లోనే ఛేదించి.. : తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ విద్య పర్యవేక్షణలో అనపర్తి సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్‌బాబులు సిబ్బందితో కలసి కేసును దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించారు. తొలుత చైన్ స్నాచింగ్‌కు ఒకరే పాల్పడినట్లు భావించగా, తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఐదుగురు నేరంలో భాగస్వాములు అయినట్లు తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


