మాటల గారడీ
2026 –2027 రాష్ట్ర బడ్జెట్‌లో మాటల గారడీ తప్ప ఇంకేమీ లేదు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. చాలా జిల్లాల్లో కలెక్టరేట్లు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. జిల్లా సమగ్ర అభివృద్ధికి, కలెక్టరేట్‌ల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని ఇప్పుడు వరకు చెప్పగా బడ్జెట్ ప్రసంగంలో 60 శాతం మాత్రమే పూర్తయిందని చెప్పడం చంద్రబాబు అబద్ధపు మాటలకు నిదర్శనం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ప్రస్తావనలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు రూ.6,650 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, కౌలురైతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో 80 శాతం పంటలు పండిస్తున్నది కౌలురైతులే. 35 లక్షల మంది కౌలురైతుల్లో 10 లక్షల మందికి పైగా భూమిలేని నిరుపేదలు ఉన్నారు, వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయం.
– తాటిపాక మధు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
ఇది ప్రజావంచక బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది పూర్తిగా ప్రజా వంచక బడ్జెట్. సమాజంలో ఏ వర్గం ప్రజల్ని ఇది తృప్తి పరచలేకపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు – నాడు నేడు పథకంలో పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చెందాయి. కానీ ఈ బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కేవలం రూ.1,500 కోట్లు కేటాయించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలకు ఇంకా నిధులే కేటాయించలేదు. ఉద్యోగులకు కూడా మొండి చెయ్యి చూపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయించిన నిధులు బకాయిలకే సరిపోవు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ప్రతినెలా రూ.1,500, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ ఇలా ప్రతి అంశంలోనూ ఎన్నికల వాగ్దానాలకు మంగళం పాడారు.
– సబ్బెళ్ళ కృష్ణారెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి
మాటల గారడీ


