బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం | What next for Yunus after Bangladesh elections? | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం

Feb 13 2026 11:30 AM | Updated on Feb 13 2026 11:53 AM

What next for Yunus after Bangladesh elections?

ఢాకా: ఉవ్వెత్తున ఎగసిన విద్యార్థుల ఉద్యమం(2024) మధ్య బంగ్లాదేశ్ శాంతి స్థాపన కోసం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని  హసీనా పదవీచ్యుతురాలై దేశం విడిచిన తర్వాత, దేశ వ్యవస్థను చక్కదిద్దడంలో యూనస్ కీలక పాత్ర పోషించారు. అయితే తన పాత్ర కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని యూనస్ గతంలోనే స్పష్టం చేశారు.

ముహమ్మద్ యూనస్ 2006లో గ్రామీణ బ్యాంక్ ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని  అందుకున్నారు. 1983లో ఆయన స్థాపించిన ఈ బ్యాంక్, పేదలకు అతి తక్కువ వడ్డీకే మైక్రో క్రెడిట్ రుణాలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1974లో బంగ్లాదేశ్‌లో సంభవించిన కరువు సమయంలో ఆయన పేదల కోసం దీర్ఘకాలిక రుణాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు కృషి చేశారు. పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించే యూనస్, ఇప్పుడు అదే చిత్తశుద్ధితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బాధ్యతను నెరవేర్చారు.

ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ చరిత్రలో కీలకమైనవిగా నిలిచాయి. ఒకప్పుడు దేశ రాజకీయాలను  నడిపిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, అల్లర్ల సమయంలో జరిగిన హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో పోటీకి దూరమైంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాకు మరణశిక్ష విధించగా, ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) జమాత్-ఏ-ఇస్లామీ ప్రధాన పార్టీలుగా అవతరించాయి. మైనారిటీలపై దాడులు, మతపరమైన ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంలో పట్టుదలతో వ్యవహరించింది. తాజాగా యూనస్‌ తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగబోననని మరోమారు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ (బీఎన్‌పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం 300 స్థానాలకు గాను బీఎన్‌పీ ఇప్పటికే 150 మార్కును దాటి మెజారిటీని దక్కించుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తిరిగి వచ్చిన తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ రెహ్మాన్‌కు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ హెచ్చరిక!

 

Advertisement
 
Advertisement
Advertisement