Bangladesh: బీఎన్‌పీ క్లీన్ స్వీప్.. 197ను దాటేసి.. | Bangladesh election Tarique Rahman led BNP victory | Sakshi
Sakshi News home page

Bangladesh: బీఎన్‌పీ క్లీన్ స్వీప్.. 197ను దాటేసి..

Feb 13 2026 7:42 AM | Updated on Feb 13 2026 9:05 AM

Bangladesh election Tarique Rahman led BNP victory

ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున వెలువడిన అనధికారిక గణాంకాల ప్రకారం 300 స్థానాలున్న పార్లమెంటులో మేజిక్ ఫిగర్ అయిన 150 మార్కును బీఎన్‌పీ సునాయాసంగా దాటేసింది. దాదాపు 197 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అలాగే తారిఖ్ రెహ్మాన్‌ తదుపరి ప్రధానమంత్రి అవుతారని కూడా స్పష్టం చేస్తున్నాయి. 

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా భావించిన జమాత్-ఇ-ఇస్లామీ కేవలం 63 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. బీఎన్‌పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటారు. సుదీర్ఘ కాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన, ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి, పార్టీని విజయపథంలో నడిపించారు. బీఎన్‌పీ కూటమి అధికారంలోకి వస్తే తారిఖ్ రెహ్మానే తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా సాగిన  విద్యార్థి ఉద్యమం నుండి ఉద్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది.

జమాత్ కూటమితో కలిసి బరిలోకి దిగిన ఎన్‌సీపీ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు ఆ పార్టీ ఎన్నికల కమిటీ ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ సోషల్ మీడియాకు తెలిపారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్‌లోని మూడు స్థానాలను కూడా బీఎన్‌పీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. గత 18 నెలలుగా అధికారంలో ఉన్న మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలతో ముగియనుంది. కాగా ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఎన్.ఎం. నాసిర్ ఉద్దీన్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో దాచడానికి ఏమీ లేదని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు తమ పార్టీకి లభించిన భారీ ప్రజాదరణ నేపధ్యంలో బీఎన్‌పీ నేత రుహుల్ కబీర్ రిజ్వీ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు విజయ సంబరాలు చేసుకుంటూ రోడ్ల మీదకు రాకుండా, శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం మసీదుల్లో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement