రైల్వేస్టేషన్‌లో హైడ్రామా.. ప్రయాణికుడికి చితకబాదిన ఎస్‌ఐ | Surat Station Railway Cop Beats Passenger: Video Viral | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో హైడ్రామా.. ప్రయాణికుడికి చితకబాదిన ఎస్‌ఐ

Jun 29 2026 10:47 AM | Updated on Jun 29 2026 11:01 AM

Surat Station Railway Cop Beats Passenger: Video Viral

ప్రయాణికులను కాపాడాల్సిన రైల్వే పోలీసే.. క్షణికావేశంలో మితిమీరి ప్రవర్తించారు. సామాన్య పౌరులపై ప్రతాపం చూపించాడు. రైల్వే స్టేషన్‌లో వందలాది మంది చూస్తుండగానే జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్‌లో రికార్డ్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. అనంతరం, ఈ ఘటనకు కారణమైన సదరు ఉద్యోగిని అధికారులు బదిలీ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉధ్నా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బీహార్‌లోని జయనగర్ వెళ్లే ఒక ప్రత్యేక రైలు (Special Train) ఉధ్నా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్లాట్‌ఫారమ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులను క్రమబద్ధీకరించడానికి, వారు రైలును క్యూ లైన్లలో ఎక్కేలా చూడటానికి రైల్వే పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఒక ప్రయాణికుడు రద్దీ కారణంగా క్యూ లైన్‌ను దాటి నేరుగా రైలు పెట్టెలోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.

ఇది గమనించిన ఉధ్నా రైల్వే స్టేషన్ జీఆర్‌పీ సబ్ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎమ్.రాథోడ్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు ప్రయాణికుడిని పట్టుకుని బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. అతని జుట్టు పట్టుకుని వెనక్కి లాగి, కిందకు నెట్టేసి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు ధైర్యంగా తన ఫోన్లో రికార్డ్ చేసింది. సదరు వ్యక్తి ఎలాంటి తప్పు చేయలేదని, తన గ్రామానికి వెళ్తుండగా పోలీసులు ఉద్దేశపూర్వకంగా, ఎలాంటి ఉసిగొల్పు లేకుండానే దాడికి తెగబడ్డారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పడం వినిపించింది. పోలీసుల అరాచకాన్ని చూసి భయపడిపోయిన ఇతర ప్రయాణికులు అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తడం కూడా ఆ వీడియోలో రికార్డయ్యింది.

అనంతరం, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు.. సామాన్య పౌరులపై పోలీసుల ప్రవర్తన ఇలాగేనా ఉండేది? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో సూరత్ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుడి పట్ల అంతటి అమానవీయంగా ప్రవర్తించిన అధికారిని ఉధ్నా స్టేషన్ నుండి తక్షణమే వడోదర జీఆర్‌పీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. కేవలం బదిలీతోనే సరిపెట్టకుండా, అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని డిప్యూటీ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement