నల్సార్‌ వర్సిటీ గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా ఎన్‌రోల్‌ చేయొద్దు | No NALSAR Graduate Of 2026 Will Be Enrolled As Advocate Says BCI Chairman | Sakshi
Sakshi News home page

నల్సార్‌ వర్సిటీ గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా ఎన్‌రోల్‌ చేయొద్దు

Aug 13 2026 7:20 PM | Updated on Aug 13 2026 7:40 PM

No NALSAR Graduate Of 2026 Will Be Enrolled As Advocate Says BCI Chairman

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి 2026లో న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్లుగా ఎన్‌రోల్‌ (నమోదు) చేయవద్దని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) చైర్మన్ గురువారం అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించారు. అలాగే, నల్సార్‌ కాన్వొకేషన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన ప్రచారంలో పాల్గొన్న వారిపై వాస్తవ నివేదిక సమర్పించాలని యూనివర్సిటీని కోరారు.

"తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, 2026 సంవత్సరంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టా పొందిన ఏ విద్యార్థినీ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్‌గా నమోదు చేయకూడదు" అని బీసీఐ చైర్మన్ నల్సార్ వైస్-చాన్సలర్‌కు, అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. గత వారం, ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై సీజేఐ చేసిన వ్యాఖ్యల కారణంగా, కాన్వొకేషన్‌కు ఆయనను ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి.

విద్యార్థుల ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, ప్రచారాన్ని ప్రారంభించడం, నిర్వహించడం, సమన్వయం చేయడం, ప్రజలను సమీకరించడం వంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులను గుర్తిస్తూ 3 రోజుల్లో ధ్రువీకరించిన నివేదిక ఇవ్వాలని నాల్సార్ వైస్-చాన్సలర్‌ను కోరారు.

సీజేఐ పాల్గొనడం లేదా ఆహ్వానం విషయంలో యూనివర్సిటీ అధికారులకు సమర్పించిన ప్రాతినిధ్య పత్రాలు, పిటిషన్లు, మెమొరాండాలు, ఇతర సమాచార పత్రాల ప్రతులతో పాటు, అధికారిక రికార్డుల్లో ఉన్న పూర్తి సంతకాల జాబితాను కూడా సమర్పించాలని యూనివర్సిటీకి సూచించారు.

వీళ్లందరినీ గుర్తించాలి.. 
ప్రచారాన్ని ప్రారంభించినవారు, దానిని మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, సమావేశాలు నిర్వహించినవారు, ప్రజలను సమీకరించినవారు, పత్రికలతో మాట్లాడినవారు, అధికారిక లేదా వ్యవస్థీకృత సామాజిక మాధ్యమ సమూహాలను నిర్వహించినవారు, కాన్వొకేషన్ లేదా సంబంధిత కార్యక్రమాలను బహిష్కరించాలని, అడ్డుకోవాలని, భంగం కలిగించాలని, సమిష్టిగా పాల్గొనకూడదని పిలుపునిచ్చినవారిని గుర్తించాలని కూడా బీసీఐ నాల్సార్‌ను కోరింది. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బయటి వ్యక్తుల ప్రమేయంపై వివరాలు కూడా కోరింది.

"కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొందరు అకడమిక్ సిబ్బంది మధ్య వర్గపోరు, అసహ్యకర రాజకీయాలు ఉన్నాయి. వారు విద్యార్థులను తప్పుదారి పట్టించడంలో, రెచ్చగొట్టడంలో, తప్పుగా ప్రభావితం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. ఇది అత్యంత తీవ్రమైన విషయం. ఉపాధ్యాయులు బోధనా బాధ్యతలపై దృష్టి పెట్టకుండా క్యాంపస్‌లో చెత్త రాజకీయాలు చేస్తున్నారు. న్యాయ విద్య నియంత్రణ సంస్థగా భారత బార్ కౌన్సిల్ ఇలాంటి పరిస్థితిని చూస్తూ మౌనంగా ఉండదు" అని చెప్పింది.

అయితే, ప్రాతినిధ్య పత్రం లేదా ప్రచారంలో పాల్గొన్నారనే కారణంతో ఎవరినీ ఈ దశలో నమోదు అర్హత లేనివారిగా ప్రకటించలేదని బీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ, విచారణ కొనసాగుతున్న సమయంలో విద్యార్థుల నమోదు అనుమతిస్తే ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల 2026 నాల్సార్ బ్యాచ్ మొత్తానికి తాత్కాలికంగా నమోదు నిలిపివేయాలని ఆదేశించింది.

"దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి గౌరవం లేని న్యాయ విద్యార్థి, బాధ్యతాయుతమైన అడ్వకేట్, ఉపాధ్యాయుడు లేదా న్యాయమూర్తిగా మారతాడని ఆశించలేం. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ వృత్తికి భారంగా మారతారు. అలాంటి ప్రవర్తన, న్యాయ వృత్తిలో ప్రవేశానికి లేదా దానితో అనుబంధానికి ఆ వ్యక్తి తగినవాడా కాదా అన్న విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది న్యాయ వృత్తి గౌరవం, క్రమశిక్షణ, నైతిక ప్రమాణాలకు విరుద్ధం. మా అనుభవం ప్రకారం అలాంటి వ్యక్తులు ఎప్పుడూ సమ్మెలు, బహిష్కరణల్లో పాల్గొంటారు. న్యాయ వృత్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తారు" అని చైర్మన్ పేర్కొన్నారు.

ధ్రువీకరించిన వాస్తవ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని బీసీఐ చైర్మన్ నల్సార్‌ను కోరారు. లేఖ ప్రకారం, వైస్-చాన్సలర్ నివేదిక అందిన తర్వాత 2026 ఆగస్టు 19న ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement