బంగారం భారీ ధరలకు అదే కారణం.. | Gold Price Today US Inflation Boosts Gold Hyderabad Rates Rise | Sakshi
Sakshi News home page

బంగారం భారీ ధరలకు అదే కారణం..

Aug 12 2026 9:18 PM | Updated on Aug 12 2026 9:41 PM

Gold Price Today US Inflation Boosts Gold Hyderabad Rates Rise

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1శాతానికిపైగా పెరిగింది.

అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్‌లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్‌ సెప్టెంబర్‌లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.

ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్‌లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్‌ పైకి ఎగబాకింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్‌ 12)  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.

ఇదిలా ఉంటే, సెప్టెంబర్‌లో ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్‌మార్క్‌ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్‌ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.

ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్‌ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement