ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు | WORLD ELEPHANT DAY VANTARA ELEPHANT WELFARE OUTREACH INDIA GLOBALLY | Sakshi
Sakshi News home page

ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు

Aug 12 2026 6:51 PM | Updated on Aug 12 2026 7:29 PM

WORLD ELEPHANT DAY VANTARA ELEPHANT WELFARE OUTREACH INDIA GLOBALLY

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంక్షేమం, సంరక్షణ, సంరక్షకులకు మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన మార్పిడిని మరింత విస్తరించేందుకు వంతారా పలు కార్యక్రమాలను ప్రకటించింది. పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రయాణం గౌరి అనే ఏనుగును రక్షించడంతో ప్రారంభమై ప్రస్తుతం 260కుపైగా ఆసియా ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ అందిస్తోంది.

హాథీ గావ్‌లో ప్రత్యేక సంరక్షణ కేంద్రం

రాజస్థాన్‌లోని జైపూర్ హాథీ గావ్‌లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వంతారా, రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి పనిచేయనుంది. ఇందులో ఆధునిక ఏనుగుల ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సదుపాయాలతో కూడిన చికిత్స–సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.

182 ఏనుగులకు వైద్య, సంక్షేమ సేవలు

అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్‌–నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో వంతారా ఇటీవల భారీ ఏనుగుల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించగా, 242 మంది మహౌత్‌లకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, మానవీయంగా నిర్వహించడం, ప్రథమ చికిత్స, మస్ట్‌హ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వెటర్నరీ, సంక్షేమ కిట్లతో పాటు పోషకాహార సహాయాన్ని కూడా అందించారు.

పిల్లల్లో కరుణ పెంచేందుకు ‘మై ఫ్రెండ్ లీలావతి’

పిల్లల్లో ఏనుగుల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు వంతారా ‘మై ఫ్రెండ్ లీలావతి’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో తల్లి నుంచి వేరై సర్కస్‌లో సంవత్సరాలు గడిపిన లీలావతి, సర్కస్ టెంట్‌లో అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలకు గురైంది. ప్రస్తుతం వంతారాలో సంరక్షణ పొందుతున్న లీలావతి కథ ఆధారంగా పిల్లలకు పజిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ హ్యాంపర్‌తో పాటు వంతారాను సందర్శించి ఆ ఏనుగును, సంరక్షకుడిని కలిసే అవకాశం కల్పించనున్నారు.

మానవ–ఏనుగు ఘర్షణలపై అంతర్జాతీయ సహకారం

మనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ (EPI) ఫౌండేషన్‌కు వంతారా గ్రాంట్ అందిస్తోంది. 2027 మార్చిలో బ్యాంకాక్‌లో జరిగే గ్లోబల్ హ్యూమన్–ఎలిఫెంట్ కాన్‌ఫ్లిక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ హ్యూమన్–వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్ సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నిపుణులు, సంరక్షణ కార్యకర్తలు, యువ ప్రతినిధుల భాగస్వామ్యానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

ఆసియా ఏనుగుల పరిధిలోని మొత్తం 13 దేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికాలోని కనీసం ఐదు దేశాల ప్రతినిధులు, యువ సంరక్షణ కార్యకర్తలకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభించనుంది. భారత్‌లో తొలిసారిగా EPI యూత్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.

అత్యవసర సేవలకు ఆధునిక సాంకేతికత

క్షేత్ర స్థాయిలో మానవ–ఏనుగు ఘర్షణలను ఎదుర్కొనేందుకు వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ వెటర్నరీ బృందాలను, థర్మల్ డ్రోన్ నిఘాను, స్థానిక సమాజాలతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గాయపడిన ఏనుగులకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు మనుషులు, ఏనుగులు పరస్పర సహజీవనం సాగించేలా దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది.

ఈ సందర్భంగా వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన కథ ఉంటుందని, వాటి సంక్షేమం పట్ల బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గౌరి రక్షణతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అనేక ఏనుగుల సంక్షేమం, సంరక్షకులకు మద్దతు, విజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ పరిరక్షణ కార్యక్రమాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement