నీట్‌ యూజీతో ఆగలేదు.. నీట్‌ పీజీలోనూ అవే తలనొప్పులు! | NEET PG 2026 City Intimation Slips Spark Panic Among Aspirants Due to Technical Glitches | Sakshi
Sakshi News home page

నీట్‌ యూజీతో ఆగలేదు.. నీట్‌ పీజీలోనూ అవే తలనొప్పులు!

Aug 12 2026 11:34 AM | Updated on Aug 12 2026 12:00 PM

NEET PG 2026 City Intimation Slips Spark Panic Among Aspirants Due to Technical Glitches

న్యూఢిల్లీ: నీట్‌ పీజీ-2026 పరీక్షా నగరాల కేటాయింపులో తీవ్ర గందరగోళం తలెత్తింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్‌)విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల్లో సాంకేతిక లోపాల కారణంగా అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన సమాచారానికి, అధికారిక పోర్టల్ లో చూపించిన నగరాలకు పొంతన లేకపోవడంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 30న జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్ష కోసం ఎన్‌బీఈఎంఎస్‌ సోమవారం నాడు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ లు పంపడంతో పాటు అప్లికెంట్ లాగిన్ ద్వారా వివరాలు అందుబాటులో ఉంచారు. అయితే ఎస్ఎంఎస్‌లో ఒక నగర పేరు వచ్చిందని, అధికారిక పోర్టల్ చూస్తే మరో నగరం కేటాయించినట్లు ఉందని సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు వాపోయారు. కొందరికి గుజరాత్ లో ఉంటే మణిపూర్ కేంద్రంగా చూపించగా, మరికొందరికి కోరుకున్న నగరాలు కాకుండా పూర్తిగా వేరే రాష్ట్రాలు కేటాయించారు.

ఈ వ్యవహారంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి, ఏ సమాచారాన్ని నమ్మాలో బోర్డు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సాంకేతిక లోపంపై స్పందించిన ఎన్‌బీఈఎంఎస్‌ బోర్డు సాంకేతిక కారణాల వల్లే కొందరికి తప్పుగా పరీక్షా నగరాల సమాచారం వెళ్లిందని తెలిపింది. ఆ తర్వాత సరైన వివరాలతో అభ్యర్థులకు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పంపామని వెల్లడించింది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్‌లో ఉన్న వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: ‘అయోధ్య’ సీఈవో ఇంటర్వ్యూలో.. ‘మందు కొడతారా?.. శాకాహారులా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement