ముంబైలో భారీ వర్షాల వేళ మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని చిరాగ్ నగర్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు ప్రాణాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.
బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో కుర్లా పశ్చిమ ప్రాంతంలోని గౌసియా చాల్, చిరాగ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని మట్టి ఒక్కసారిగా కూలిపడి సమీపంలోని రెండు మూడు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలతో గాలింపు
ప్రమాదం జరిగిన వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, ముంబై పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాల ద్వారా శిథిలాల లోపల కదలికలు, మనుషుల ఉనికి వంటి సంకేతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించడంతోపాటు.. లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంపై అత్యంత జాగ్రత్తగా గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కుర్లాలోని భాభా ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి మేయర్.. సహాయక చర్యల పరిశీలన
ముంబై మేయర్ రీతూ తావ్డే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు.

ముంబైలో వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం అందిన తర్వాత మృతుల సంఖ్య, చిక్కుకున్న వారి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


