రైలు ఢీకొని ఏనుగు, దాని పిల్ల మృతి | Wild Elephant and Calf Die After Being Hit by Train in Walayar | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఏనుగు, దాని పిల్ల మృతి

Aug 13 2026 10:03 AM | Updated on Aug 13 2026 10:13 AM

Wild Elephant and Calf Die After Being Hit by Train in Walayar

వాళా: కేరళ-తమిళనాడు సరిహద్దులోని వాళా సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళూరు-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఒక అడవి ఏనుగు, దాని కూన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:30 గంటల సమయంలో కావడిపార వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏనుగులు రైలు ఇంజిన్ కింద ఇరుక్కుపోవడంతో, వాటిని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.

తమిళనాడు సరిహద్దు పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా రైలు సర్వీసులు కొన్ని గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే వాళా పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.  ఏనుగుల కారిడార్‌గా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ వాళా సమీపంలోని వట్టప్పార వద్ద యశ్వంత్‌పూర్-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఒక చిన్న ఏనుగు మృతి చెందింది.

ఆ ప్రాంతంలో ఉన్న అధిక మలుపుల కారణంగా లోకో పైలట్లకు 100 మీటర్ల కంటే తక్కువ విజిబులిటీ ఉండటమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే ఈ మార్గంలో రాత్రి వేళల్లో గూడ్స్ రైళ్లకు 25 నుంచి 35 కి.మీ, ప్రయాణికుల రైళ్లకు 45 కి.మీ వేగ పరిమితి నిబంధనలు అమల్లో ఉంది. అయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతాల్లో రైలు మార్గాల వెంబడి వన్యప్రాణుల రక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement