సాక్షి, హైదరాబాద్: ఏసీ కోచ్ ఆర్‌ఏసీ బెర్తుల్లో కొనసాగుతున్న దుప్పట్ల గొడవకు రైల్వే తెర దించింది. ఇంతకాలం ఈ బెర్తుల్లో ఇద్దరేసి చొప్పున ఉండే ప్రయాణికులకు ఒకే బెడ్‌రోల్ సరఫరా చేస్తున్న విధానాన్ని సరిదిద్దింది. ఇక నుంచి ఆ బెర్తులోని ఇద్దరు ప్రయాణికులకు వేర్వేరు బెడ్‌రోల్స్ అందించాలని నిర్ణయించింది.
ఈమేరకు అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంటే, ఇక ఆర్‌ఏసీ ప్రయాణికులకు ఎవరి బెడ్ రోల్ వారికి చేరుతుంది. ఏసీ కోచ్‌లలో ప్రతి ప్రయాణికుడికి రైల్వే ఓ బెడ్‌రోల్ కిట్ అందిస్తుంది. ఇందులో ఒక దుప్పటి, రెండు బెడ్‌షిట్‌లు, ఒక పిల్లో, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. వీటిని ఏరోజుకారోజు ఉతికి (ఉలెన్ దుప్పటి మినహా) కాగితపు కవర్‌లో ఉంచి అందిస్తారు. కానీ, ఆర్‌ఏసీ బెర్తుల్లోనే చిక్కు వస్తోంది.
బెర్తుకు ఒక బెడ్‌రోల్ కిట్ ఇవ్వాల్సి ఉన్నందున, ఈ బెర్తుకు కూడా సిబ్బంది ఒకటే కిట్ ఇస్తున్నారు. కానీ, ఇది పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ టికెట్ లేని ఇద్దరు ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు ఉద్దేశించిన బెర్తు. ఇద్దరు ప్రయాణికులు ఒక బెర్తును సర్దుకుని పడుకుంటున్నారు. కానీ, ఒకే బెడ్ రోల్ అందుతున్నందున దుప్పటిని చెరిసగం కప్పుకోవాల్సి వస్తోంది. ఒకే పిల్లో ఉంటున్నందున పంపకం కుదరదు. వెరసి, బెడ్‌రోల్స్ విషయంలో ఇద్దరు పరిచయం లేని ప్రయాణికుల మధ్య వివాదానికి కారణమవుతోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లు వెత్తగా ఇంతకాలం తర్వాత రైల్వే బోర్డు మేల్కొని రెండు కిట్లు అందించాలని నిర్ణయించింది.
లక్షల్లో అదనపు కిట్లు
దేశవ్యాప్తంగా నిత్యం 8 లక్షల బెడ్‌రోల్స్‌ను రైల్వే సరఫరా చేస్తోంది. తాజా నిర్ణయంతో మరో లక్షన్నర బెడ్‌రోల్స్ అదనంగా అవసరమవుతాయని అంచనా. వీటి నిర్వహణకు సాలీనా రూ.200 కోట్ల వరకు అదనపు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 60 వేల వరకు బెడ్‌రోల్స్ వాడుతున్నారు. ఇప్పుడు అదనంగా 10 వేల బెడ్‌రోల్స్ అవసరమవుతాయని లెక్కలేస్తున్నారు. కాగా, గత నాలుగేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాదికి లక్ష చొప్పున బెడ్‌రోల్స్ మాయమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.


