మొత్తంగా 73 లక్షల ఓటర్ల తొలగింపు?
ముగిసిన ‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల దరఖాస్తు గడువు
60,69,065 మంది ఓటర్ల వివరాల్లో తేడాలు
నేడు తుది గణాంకాలను ప్రకటించనున్న సీఈఓ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి తిరిగి బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ)కు అప్పగించడానికి నిర్దేశించిన గడువు సోమవారం ఆర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. గడువులోగా రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు దాఖలు చేసిన మొత్తం ఓటర్ల సంఖ్యపై మంగళవారం స్పష్టత రానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26448 మంది ఓటర్లుండగా, సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 2,64,73,616 మంది (78.26శాతం) ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడంతో వాటి డిజిటలైజేషన్ సైతం పూర్తి చేశారు. అప్పటికి మరో 5,737 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.
11,33,692 మంది (3.35శాతం) మంది ఓటర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించగా, మిగిలిన వారు పూరించిన ఫారాలు అందజేశారు. మిగిలిన వారిలో 73,47,095 మంది (21.72శాతం) ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించడం సాధ్యం కాదని నిర్థారించారు. ఈ ఓటర్లందరూ గైర్హాజరులో ఉండటం/చిరునామా మారడం/డూప్లికేట్ ఓటు/ మరణించారనే (ఏఎస్‌డీడీ) కారణాలతో వీరి నుంచి పూరించిన ఫారాలు స్వీకరించడం సాధ్యం కాదని తేల్చారు. గడువులోగా ఫారాలు ఇవ్వని ఓటర్ల పేర్లను ఈ నెల 17న ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. ముసాయిదా జాబితాలో 73 లక్షల మంది (21శాతం)కి పైగా ఓటర్ల పేర్లను తొలగించడం ఖాయమని అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం 3.38 కోట్ల మంది ఓటర్లుండగా, ముసాయిదా జాబితాలో సంఖ్య 2.64 కోట్లకు తగ్గనుంది. కచ్చితమైన తుది గణాంకాలపై మంగళవారం స్పష్టత రానుంది.
తేడాలుంటే నోటీసులు
ఈ నెల 17న ముసాయిదా జాబితా ప్రచురించాక అక్టోబర్ 15 వరకు వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వోలు) నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,69,065 మంది (17.94శాతం) ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ గుర్తించింది. వీరందరికీ నోటీసులు జారీ చేసి వివరణ కోరే అవకాశం ఉంది. విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపించాలి. ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 6,71,592 మంది, రంగారెడ్డి జిల్లాలో 5,59,923 మంది, నిజామాబాద్ జిల్లాలో 3,95,215 మంది, సంగారెడ్డి జిల్లాలో 3,47,575 మంది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 3,92,300 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. శాతాల వారీగా చూస్తే అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 28.49శాతం, వనపర్తి జిల్లాలో 27.83శాతం, నిజామాబాద్ జిల్లాలో 27.25శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 26.83శాతం, నారాయణసేట జిల్లాలో 26.44శాతం, నిర్మల్ జిల్లాలో 26.03 శాతం మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నాయి. ముసాయిదాలో పేరు రాకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తును ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 లోగా సమర్పించాల్సి ఉంటుంది.


