breaking news
Special Intensive Revision (SIR)
-
అమర్త్యసేన్‌కు ఎస్ఐఆర్ నోటీస్
కోల్‌కతా: ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న దిగ్గజ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సంబంధ నోటీస్‌ను జారీచేసింది. అమర్త్యసేన్, ఆయన తల్లి మధ్య వయసు వ్యత్యాసం కేవలం 15 సంవత్సరాలలోపే ఉన్నట్లు ఎస్ఐఆర్ సంబంధ దరఖాస్తులో పేర్కొనడంతో దీనిపై వివరణ కోరుతూ నోటీస్ పంపామని పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరించారు. పశ్చిమబెంగాల్లోని బోల్పూర్లోని శాంతినికేతన్లో సేన్ సొంతింటికి ఈ నోటీస్‌ను పంపించారు. ప్రస్తుతం అమర్త్యసేన్ విదేశాల్లో ఉండటంతో ఆయనకు ఈ విషయం తెలియజేస్తామని సేన్ కుటుంబసభ్యులు తెలిపారు. నోబెల్ పురస్కారంతో భారత్‌ను గర్వపడేలా చేసిన దిగ్గజ ఆర్థికవేత్తకు సైతం ఇలాంటి నోటీస్‌లు పంపడమేంటంటూ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈసీ సిగ్గుమాలిన పని చేసిందని ఆరోపించింది. -
6.5 కోట్ల ఓటర్లు తొలగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల నుంచి 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. మృతి చెందడం, శాశ్వతంగా వలస వెళ్లడం, డూప్లికేట్ కేటగిరీ వంటి కారణాలతో ఆయా ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రాలవారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం తాజాగా ప్రచురించింది. ఎస్ఐఆర్లో భాగంగా మొత్తం 50.90 కోట్ల ఓటర్ల అర్హతలను తనిఖీ చేశారు. అనర్హుల పేర్లను తొలగించిన తర్వాత 44.40 కోట్ల మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా జాబితాలు సిద్ధం చేశారు. తొలగింపునకు గురైనవారి పేర్లను ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డూప్లికేట్(ఎస్ఏడీ) విభాగంలో చేర్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం గమనార్హం. -
కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు
బెంగళూరు : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో కర్ణాటకలోని బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తన ప్రాంతంలో ఓటర్ల జాబితా నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని మహిళా కార్యకర్త ఆరోపించారు. సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్ఐఆర్ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్‌లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.🚨BJP woman worker alleges assault and stripping during SIR protest in Karnataka, police DENY CLAIMS. The woman activist is identified as Sujata Handi Cops claim 'she stripped' pic.twitter.com/dL15PuB5hQ— The Tatva (@thetatvaindia) January 7, 2026 మరోవైపు సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమే చింపేసుకుందిఅధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు పోలీసు వ్యాన్‌లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు దాఖలు చేసినట్టు వివరించారు.#WATCH | Hubballi, Karnataka: BJP worker allegedly assaulted in Hubballi, sister of victim, Vijaylakshmi says, "... We were sitting outside our house when around 30 policemen arrived. They took Sujata and all of us inside. Sujata was brutally assaulted, and her clothes were torn.… pic.twitter.com/UQooQPrs7j— ANI (@ANI) January 7, 2026సుజాత అరెస్ట్‌పై కమిషనర్ స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్స్పెక్టర్, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.బాధితురాలి సోదరి"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే తీరని అవమానమని, సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి పడి టెకీ దుర్మరణం -
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోర్టుకెళతా
సాగర్ ఐల్యాండ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళతామని టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఎస్ఐఆర్ అధికారుల వేధింపులు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని ఆమె ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ ఐల్యాండ్‌లో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఎస్ఐఆర్ సిబ్బంది ఎలాంటి సహేతుక కారణాలను చూపకుండానే అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని విమర్శించారు. మామాలుగా చేపట్టే ఈ ప్రక్రియను ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, ఎస్ఐఆర్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాలపై 6న(మంగళవారం) కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఓ సాధారణ పౌరురాలిగా అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టు తలుపు కూడా తడతానన్నారు. ‘నేను కూడా అనుభవమున్న లాయర్నే’అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పిటిషన్‌ను వ్యక్తిగతంగా వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం లేక టీఎంసీ పక్షానా అనే విషయం ఆమె స్పష్టంగా తెలపలేదు. వ్యాధి గ్రస్తులు, వృద్ధులు కూడా తాము అర్హులైన ఓటర్లమే అని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం కనికరం చూపకుండా ఎస్ఐఆర్ సిబ్బంది వారినీ క్యూలలో నిల్చోబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై వివక్ష చూపుతున్నారని మమత చెప్పారు. బెంగాలీలో మాట్లాడటం ఈ దేశంలో నేరమైపోయిందంటూ ఆమె..‘నన్ను చంపినా సరే, బెంగాలీలోనే మాట్లాడుతా’అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు తాయిలాలు చూపే బీజేపీ.. గెలిచిన తర్వాత అణచివేతలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ‘ఎన్నికలకు ముందు తలా రూ.10 వేలు పంచిపెడుతుంది.. ఆ తర్వాత వారిపైకి బుల్డోజర్లను నడుపుతుంది’అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు. -
మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, అతడి సోదురుడు మహ్మద్ కైఫ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఓటరు జాబితాల సవరణలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరుగుతోంది.అయితే షమీ, కైఫ్ సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారమ్‌లలో కొన్ని వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా చాలాకాలంగా కోల్‌కతాలోనే నివసిస్తున్నాడు.షమీతో పాటు అతడు సోదరుడు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) లోని వార్డు నంబర్ 93 (రాష్‌బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం) లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. వాస్తవానికి వారిద్దరూ సోమవారం(జనవరి 5) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ షమీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నందున విచారణకు హజరుకాలేకపోయాడు. "దేశవాళీ క్రికెట్ టోర్నీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, నిర్దేశించిన సమయానికి హాజరు కాలేకపోతున్నాను" అని షమీ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీంతో షమీ అభ్యర్థన ఎన్నికల కమిషన్ విచారణను వాయిదా వేసింది. బెంగాల్ జట్టు లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి 11 మధ్య హాజరుకావాలని సూచించింది.చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే -
ఓట్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భారీగా ఓట్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. అదే జరిగితే, ప్రజాస్వామ్య పునాదులపైనే దెబ్బకొట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా, తప్పులతడకగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు మరో లేఖ రాశారు. ఎటువంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా ఎన్నికల కమిషన్ హడావుడిగా చేపట్టిన ఎస్ఐఆర్తో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నవంబర్ 20, డిసెంబర్ 2వ తేదీల్లో రాసిన లేఖలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో మరిన్ని ఘోరమైన తప్పిదాలకు తావిచ్చినట్లయిందని మమత ఆరోపించారు. సరైన శిక్షణ ఇవ్వలేదు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులకు సరైన శిక్షణ లేదని, ఓటర్ల జాబితా సవరణకు వాడుతున్న సాఫ్ట్వేర్, ఐటీ వ్యవస్థలు సరైనవి కావని సీఎం మమత పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన, ఒకే విధమైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఆదేశాలలో స్పష్టత కూడా లేదన్నారు. పరస్పర విరుద్ధ ఆదేశాల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో గందరగోళం నెలకొందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళికా లోపం వల్ల ఈ కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యంతరాలను ఇకపై అయినా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తూ మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఐటీ వ్యవస్థల దుర్వినియోగం ఓటర్ల నమోదు అధికారు(ఈఆర్వో)లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండానే ఐటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓటు తొలగించాలంటే చట్టపరమైన నిబంధనలు పాటించాలి, కానీ ఇక్కడ ఆ సరైన ప్రక్రియ అమలుకు నోచుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తొలగింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టపరమైన అధికారం కింద ఇవి జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే జరుగుతోంది కాబట్టి, ఎటువంటి అక్రమ, ఏకపక్ష, పక్షపాత చర్యలకైనా ఎన్నికల కమిషనే పూర్తి బాధ్యత వహించాలని మమత స్పష్టం చేశారు. -
అస్సాంలో 10.56 లక్షల పేర్లు తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 10.56 లక్షల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా 93,021 డి–ఓటర్లు(డౌట్ఫుల్ఓటర్స్) ఉన్నట్లు గుర్తించింది. మరణించడం, వలసవెళ్లడం, బహుళ ఎంట్రీలు వంటి కారణాలతో 10,56,291 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. పౌరసత్వం లేకున్నా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారిని డి–ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి ఓటు వేసే హక్కు ఇవ్వడం లేదు. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్‌ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
దేశ వ్యతిరేకి!
నామ్ రూప్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ పార్టీ తలమునకలుగా ఉందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అసోంలో స్థిరపడేందుకు అన్నివిధాలా సాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓటు బ్యాంకు తప్ప దానికి మరేమీ పట్టదు.ఎలాగైనా అధికారాన్ని ఒడిసిపట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం‘ అని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న అసోంలో దిబ్రుగడ్ జిల్లాలోని నామ్ రూప్ లో రూ.10,601 కోట్లతో నిర్మించిన భారీ ఎరువుల కర్మాగారాన్ని ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ను దునుమాడారు. ‘‘ఆ రాష్ట్రంపై దానిది ఎప్పుడూ సవతి ప్రేమే. అస్సామీల అస్తిత్వం, సంస్కృతి, ప్రతిష్ఠ కాంగ్రెస్‌కు ఏనాడూ పట్టలేదు. వాటి పరిరక్షణకు పాటుపడుతున్నది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అనే విషం బారినుంచి అస్సాంను కాపాడాల్సిన అవసరముంది . ఈ విషయంలో బీజేపీ ఒక కవచంలా నిలుస్తుంది‘ అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాల హింసాకాండకు శాశ్వతంగా తెర దించేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. నాటి అహోం రాజా వంశ పాలనలో ఉన్నంత శక్తిమంతంగా అసోంను తీర్చిదిద్ది తీరుతామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మోదీ చెప్పారు.ద్రోహాలను కడుగుతున్నాందేశానికి కాంగ్రెస్ ఎన్ని ద్రోహాలు చేసిందో లెక్కే లేదని మోదీ అన్నారు. దాంతో, 12 ఏళ్లుగా తమ సర్కారు ఎంతగా సరిచేస్తున్నా, ఇంకా చక్కదిద్దాల్సిన తప్పిదాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘అసోం ఆణిముత్యం భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటిస్తే బాహాటంగా వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్ ది! ’ఆడిపాడే వారికి మోదీ భారతరత్న ఇస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేసి అస్సామీల మనసులకు తీరని గాయం చేసింది‘ అని మండిపడ్డారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ విభాగం ఏర్పాటు చేసినా వ్యతిరేకించిన కాంగ్రెస్ ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికీకరణ, కనెక్టివిటీ అస్సాం కలలు క్రమంగా సా చేస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. సభకు మహిళలు భారీగా తరలిరావడం హర్షణీయమని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను భేటీ అయినపుడు ఆయనకు అసోం బ్లాక్ టీ పొడి కానుకగా ఇచ్చినట్టు గుర్తు చేశారు.స్టూడెంట్స్‌తో బోటు షికారుప్రధాని మోదీ ఆదివారం ఉదయం అసోంలో బ్రహ్మపుత్రా నదిలో బోటు షికారు చేశారు. వినూత్నంగా క్రూయిజ్ షిప్ లో విద్యార్థులతో గంటపాటు పరీక్షా పే చర్చా కార్యక్రమం జరిపారు. పలు స్కూళ్లకు చెందిన 25 మంది స్టూడెంట్లు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు గువాహ తిలో అసోం ఆందోళన అమర వీరుల స్తూపం వద్ద మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోకి అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన స్వహిద్ సమరక్ ఉద్యమంలో 860 మందికి పైగా అసువులు బాశారు. ఇందుకు గుర్తు నిర్మించిన స్వహిద్ సమరక్ క్షేత్ర వద్ద వెలిగే నిత్య ప్రమిదకు మోదీ ప్రణమిల్లారు. ఆయన రెండు రోజుల అసోం పర్యటన ఆదివారంతో ముగిసింది. -
11.49 కోట్ల మందిలో 1.71 కోట్ల పేర్లు తొలగింపు
న్యూఢిల్లీ: తమిళనాడు, గుజరాత్‌లలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనంతరం 1.71 కోట్ల ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేవని ఎన్నికల కమిషన్ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఓటర్లు 11.49 కోట్లు కాగా, వీరిలో 9.78 కోట్ల మంది పేర్లు తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నాయని శుక్రవారం ఈసీ వివరించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41 కోట్ల మంది కాగా, 84.81 శాతం మంది అంటే, 5.43 కోట్ల మంది బూత్ లెవెల్ అధికారులకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారని తెలిపింది. మిగతా సుమారు 97.37 లక్షల పేర్లు తొలగింపునకు గురయ్యాయంది. అదేవిధంగా, గుజరాత్లో మొత్తం ఓటర్లు 5.08 కోట్ల మంది కాగా, 85.50 శాతం మంది, 4.34 కోట్ల మంది ఎన్యుమరేషన్ ఫాంలు అందజేసినట్లు ఈసీ వివరించింది. మిగతా 73.74 లక్షల మంది పేర్లు ఓటరు జాబితా ముసాయిదా నుంచి తొలగింపునకు గురయ్యాయని తెలిపింది. 2026 జనవరి 18వ తేదీ వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారంది. ఎస్ఐఆర్ కొనసాగుతున్న పశ్చిమబెంగాల్, రాజస్తాన్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఈ నెల 16వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తామంది. ఇక్కడ మొత్తం 12.32 కోట్ల మంది ఓటర్లు ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయోలేదో చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాను http://ceo. gujarat.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. -
మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా, సాక్షి: ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) పై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మొదటినుంచీ ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. కృష్ణానగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..మహిళలా? బీజేపీ? తేల్చుకుందాంఅంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు. అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో, ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు. అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని ఏదీ తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాయపడిన పులి చాలా డేంజర్గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు -
అమిత్ షా, రాహుల్ మాటల యుద్ధం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, అమిత్ షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఓట్ల చోరీపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ సవాలు విసిరారు. ఎన్నికల సంఘం అండతోనే బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మంపడ్డారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. హరియాణాలో ఓట్ల చోరీ జరగలేదంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ ఓట్ల చోరీకి ఆధారాలున్నాయని చెప్పారు. అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్లు తాను నడుచుకోవాలా? అని నిలదీశారు. విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా భయపడుతున్నారని, ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. నా ప్రశ్నకు సమాధానమేది?ఓట్ల చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో తాము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఓట్ల చోరీ, ఈవీంఎల పనితీరు గురించి తాము ప్రశి్నస్తే అమిత్ షా ఒక్కమాట కూడా మట్లాడలేదని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటికే ఆధారాలు చూపించానని గుర్తుచేశారు. కానీ, అమిత్ షా దానిపై స్పందించలేదని రాహుల్ ఆక్షేపించారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారని, దీనిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘సర్’ను గబ్బర్‌సింగ్‌లా మార్చారు ‘‘గౌరవప్రదమైన ‘సర్’ పదాన్ని గబ్బర్‌సింగ్‌లా భయంకరమైన అంశంగా మార్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్ సర్ అంటూ బీజేపీ ఎంతగా గొంతు చించుకున్నా బెంగాల్ ప్రజలు మాత్రం మేడమ్‌కు(మమతా బెనర్జీ) అండగా నిలుస్తారు. బీజేపీ నేతలు బెంగాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంటికి తిరిగివెళ్లారు. బీజేపీ బిహార్‌లో గెలిచిందేమో గానీ బిహార్‌లో వారి ఆటలు సాగవు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎందుకు చేపట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ – శతాబ్ది రాయ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బ్యాలెట్ పేపర్ల విధానం కావాలి ‘‘ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలి. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. చాలా ఏళ్లుగా బీజేపీకి సహకరిస్తోంది. ఎన్నికల సంఘానికి కలి్పంచిన కొన్ని చట్టపరమైన వెసులుబాట్లను తొలగించాలి. ప్రధాని ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించిన ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలి’’ – డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ఐఆర్ అంటే బ్యాక్‌డోర్ ఎన్ఆర్సీ ‘‘పౌరుల జాతీయ రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి మరో రూపమే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసుగులో దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేస్తున్నారు. మతం ఆధారంగా ఓటు హక్కును తొలగించడానికి ద్రోహపూరితమైన ప్రక్రియ జరుగుతోంది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఎస్ఐఆర్ చేపట్టడం పార్లమెంటరీ వ్యవస్థను ఉల్లంఘించడమే అవుతుంది. పౌరులకు పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ఈ ప్రక్రియ విరుద్ధమే’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ప్రజల హృదయాలను మోదీ హ్యాక్ చేశారు ఎన్నికల్లో నెగ్గడానికి ఈవీఎంలను హ్యాక్ చేయాల్సిన అసవరం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశారు. వారి మనసులు గెల్చుకున్నారు. ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారు’’ – కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ మళ్లీ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ కావాలా? ‘‘ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానం మళ్లీ ప్రవేశపెడితే అప్పటి అరాచకాలు పునరావృతం అవుతాయి. బూత్ ఆక్రమణ, రిగ్గింగ్ మళ్లీ జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ల వాడకాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు సమరి్థంచాయి. ఈవీఎంలకు అనుకూలంగా ఎన్నో తీర్పులిచ్చాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఈవీఎంలను అనుమానాలను ఇకనైనా మానుకోవాలి. ఈవీఎంలతో ఎన్నికలు వేగంగా, సురక్షితంగా జరుగుతాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలు ముసిగిన తర్వాత ఓట్ల చోరీ అంశంపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. నిజంగా ఓట్ల చోరీ జరిగిందని రుజువులుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా జరగడానికి ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ఎన్నికల వరుస పరాజయాలను జీరి్ణంచుకోలేక ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మరో 15–20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడం తథ్యం’’ – రవి శంకర్ ప్రసాద్, బీజేపీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి -
చొరబాటుదారుల ఓట్ల కోసమే!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ అమిత్ షా కొట్టిపారేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే.. తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో నెగ్గే అవకాశం పోతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఆ పార్టీ నాయకత్వమే తప్ప ఈవీంఎలు లేదా ఓట్ల చోరీ కారణం కాదని తేల్చిచెప్పారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో కొనసాగించడానికే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎంతగా వ్యతిరేకించినా, సభ నుంచి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా సరే చొరబాటుదారులను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం, వారిని బయటకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించినవారికి ఓటు హక్కు ఇవ్వాలనడం న్యా యమేనా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులను అధికారికంగా గుర్తించి, ఎన్నికల జాబితాలో చేర్చాలంటూ నిస్సిగ్గుగా వాదిస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది ‘‘దేశంలో మూడుసార్లు ఓట్ల చోరీ జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఓట్ల చోరీకి పాల్పడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కోరుతూ 28 మంది ఆయనకు మద్దతిచ్చారు. నెహ్రూకు కేవలం ఇద్దరే మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. అయినా సరే ఆమె ప్రధానమంత్రి అయ్యారంటే కారణం ఓట్ల చోరీ. ఇక సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఎన్నికల్లో ఓటు వేశారు. అలా చేయడం ఓటు చోరీ కాదా? విపక్ష నాయకులు కేసుల్లో ఓడిపోతే న్యాయమూర్తిని నిందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై నిందలేస్తున్నారు. ఆ నిందలను జనం పట్టించుకోకపోతే ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. బిహార్‌లో కాంగ్రెస్ పరాజయానికి ముమ్మాటికీ ఆ పార్టీ నాయకత్వమే కారణం. ఈవీఎంలు లేదా ఓట్ల చోరీ కారణం అనడం ఉత్తమాట. కాంగ్రెస్ పెద్దలు ఏదో ఒకరు ఆ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి మృతి చెందినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, 18 ఏళ్ల వయసున్నవారిని చేర్చడం, విదేశీయులను తొలగించడం ఎస్ఐఆర్ అసలు ఉద్దేశం. ఈ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి మన దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఓట్ల చోరీ అంటూ కేకలు పెట్టారు. చొరబాటుదారులను కాపాడాలంటూ యాత్రలు చేశారు. చివరికి బిహార్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో మేమే గెలిచాం. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని, ఓటర్ల జాబితాను తప్పుపట్టడం, ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగితే ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఎందుకు పోటీచేశాయి? దేశంలో ఇప్పటిదాకా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భాల కంటే ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ. అయినా సరే ఏనాడూ ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టలేదు. ఈవీఎంలతో ఎన్నికల చోరీని అడ్డుకోవచ్చు. తప్పుడు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే విపక్షాలు ఈవీఎంలు వద్దంటున్నాయి. వారి బండారం పూర్తిగా బయటపడింది. దేశ ప్రజలు ప్రతిపక్షాలకు ఓట్లు వేయడం లేదు. ఎస్ఐఆర్తో చొరబాటుదారుల ఓట్లు కూడా రద్దయితే ఇక పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. 2004, 2009లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా! 2014లో ఓడిపోయిన తర్వాతే ఈవీఎంలపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించకుండా మేము పారిపోవడం లేదు. ఎస్ఐఆర్ అంశం ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. అందుకే సభలో చర్చించలేం. ఎన్నికల సంస్కరణలపై చర్చించాలని కోరితే వెంటనే అంగీకరించాం. ఎస్ఐఆర్పై ఏకపక్షంగా అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలి’’ అని అమిత్ షా తేల్చిచెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఐఆర్ ప్రారంభం ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చొరబాటుదారులు మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను ఎన్నుకొనే పరిస్థితి ఉంటే దేశ ప్రజాస్వామ్యం భద్రంగా ఉంటుందా? ఈ విషయం అందరూ ఆలోచించాలి. చరిత్ర గురించి మేము మాట్లాడడం ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. చరిత్ర తెలుసుకోకుండా సమాజం గానీ, దేశం గానీ ఎలా ముందుకెళ్తాయి. దేశంలో మొట్టమొదటి ఎస్ఐఆర్ను 1952లో నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. రెండోసారి 1957లో నెహ్రూ హయాంలో, మూడోసారి 1961లో నెహ్రూ హయాంలోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో, ఇందిరా గాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, పీవీ నరసింహారావు హయాంలో కూడా ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో, మన్మోహన్ సింగ్ పాలనలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పట్లో ఎస్ఐఆర్ను ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే, ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎస్ఐఆర్ అవసరం కాబట్టి వ్యతిరేకించలేదు. -
నెహ్రూ, ఇందిర, సోనియానే ఓట్ చోరీ చేశారు
సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఎస్ఐఆర్పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు. -
బ్రెజిల్ మహిళ ఫొటోపై సమాధానం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎనిమిదవ రోజున(బుధవారం) లోక్‌సభలో.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తుపై లోక్‌సభ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంభించారు. ఆయన ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలను డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ చర్చను ముందుకు తీసుకెళుతూ.. ఎన్నికల కమిషన్.. ఎన్నికలను రూపొందించేందుకు పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కవుతున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటు చోరీని మించిన జాతి వ్యతిరేక చర్య మరొకటి లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్, సిబిఐ , ఈడి, ఐటి విభాగాలను బిజెపి కబ్జా చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ల కమిటీ నుంచి సిజెఐ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని చెబతూ, ఈవీఎం వెరిఫికేషన్ కు యాక్సెస్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల జాబితాలో 22 సార్లు బ్రెజిల్ మహిళ ఫోటో ఉందని, దీనిపై తన ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వస్తే అన్నింటిని చక్కదిద్దుతామని రాహుల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ఇండిగో వైఫల్యం వల్ల ఆర్థిక నష్టం అత్యంత భారంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు మొత్తం ఆర్థిక నష్టం ఎంతో తెలియదు. ఎన్ని టిక్కెట్లు రద్దు చేశారో తెలుస్తోంది.ఈ విషయంలో ఇతర నష్టాల సంగతేంటి? హోటల్ బుకింగ్, ఈవెంట్లు రద్దు అయ్యాయి. వీటన్నింటినీ ఎవరు భరిస్తారు? ఈ భారీ వైఫల్యం కారణంగా ప్రయాణికులు ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారో ప్రభుత్వానికి ఏమైనా అంచనా ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనను సమర్థించారు. పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అయినప్పటికీ కాలుష్యం గురించి లేదా ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానమంత్రికి పెద్దగా పట్టింపు లేదు.వారు 150 ఏళ్ల నాటి వందేమాతరం గురించి మాట్లాడుతున్నారు, కానీ యువత నిరుద్యోగం గురించి ఎటువంటి ఆందోళన లేదు అని రంజీత్ రంజన్ ఎద్దేవా చేశారు. వారు ఎవరి సమస్యలను పరిష్కరిస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందా?" అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టనున్నారు. దీనికి ముందు వందేమాతరం 150వ వార్షికోత్సవంపై చర్చ కొనసాగింది. అంతకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వందేమాతరం 150వ వార్షికోత్సవంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. వందేమాతరంపై విమర్శలు చేసేవారు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. -
S.I.R. Row: ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్ఓలు (బూత్ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్ఓలకు బెదిరింపులు, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్ఐఆర్ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. -
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి: లోక్‌సభలో మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం.... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు.... ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. -
నేడు ఎస్ఐఆర్పై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. -
ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం .. దేశంలో తొలి కేసు నమోదు
లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరోపణలపై దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కుటుంబంపై కేసు నమోదైంది. రాంపూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఇద్దరు కుమారులు ఆమిర్ ఖాన్, డానిష్ ఖాన్ దుబాయ్, కువాయిట్‌లలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. అయితే, నూర్జహాన్ ఎస్ఐఆర్ బూత్ లెవల్ అధికారులకు వాళ్లిద్దరూ రాంపూర్‌లోని జ్వాలా నగర్లోనే ఉంటున్నట్లు ఫోర్జరీ పత్రాలను ఎన్యుమరేషన్ సందర్భంగా సమర్పించింది. డిజిటైజేషన్ ఫాంలను పరిశీలించిన బీఎల్వోల ఈ విషయాన్ని గుర్తించారు. ఆరా తీయగా వారిద్దరూ విదేశాల్లో ఉంటున్నది నిజమేనని తేలింది. దీంతో, నిజాలను దాచిపెట్టినందుకు నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద, బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు. -
బీఎల్వోలపై పనిభారం తగ్గించండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో పాల్గొనే బూత్ లెవల్ అధికారు(బీఎల్వో)లపై పని ఒత్తిడి తగ్గించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై పనిభారం తగ్గించేందుకు వీలుగా మరింత మంది సిబ్బందిని కేటాయించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది. ఎస్ఐఆర్ను గడువులోగా పూర్తి చేయాలంటూ బీఎల్వోలపై ఈసీ ఒత్తిడి పెంచుతోందని, అలా చేయని వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకుంటోందని, ఈ పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఎల్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు, అంగన్ వాడీ సిబ్బంది వంటి వారిపై ఒత్తిడి చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఆపేలా ఈసీని ఆదేశించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. ‘రాష్ట్రాలు ఎస్ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుంది. పనిగంటలు తగ్గి, బీఎల్వోలపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు అవసరమైన మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి’అని ధర్మాసనం పేర్కొంది. ‘సిబ్బంది ఎవరైనా ప్రత్యేక కారణాలతో మినహాయింపు కోరిన పక్షంలో సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారి అలాంటి కేసులను పరిస్థితులను బట్టి డీల్ చేయాలి. వేరొకరిని ఆస్థానంలో నియమించాలి’అని ధర్మాసనం వివరించింది. అలా ప్రత్యామ్నాయం ఇవ్వలేనప్పుడు, ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవాలనడం తమ ఉద్దేశం కాదని కూడా ధర్మాసనం స్పష్టతనిచి్చంది. విధుల్లో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం వంటి అంశాలపై తర్వాత వేరుగా ఆదేశాలిస్తామని తెలిపింది. -
రచ్చ బదులు చర్చ!
పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈసారి కూడా వాయిదాల్లోనే ముగిసిపోతాయని నిరాశపడినవారికి మంగళవారం పాలక, ప్రతిపక్షాలు ఒక అంగీకారానికి రావటం ఊరట నిచ్చింది. ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్) పేరిట కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, అందుకు కేంద్రం సిద్ధపడకపోవడం పర్యవసానంగా సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ‘సర్’ను చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షం అంగీకరించింది. దేశ ప్రజల సార్వభౌమా ధికారానికి పార్లమెంటు ప్రతీక అంటారు. ప్రజా సమస్యలపై చర్చకు, దేశ ప్రగతికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాల రూపకల్పనకు అది ప్రధాన వేదిక. పాలకపక్ష జవాబుదారీతనాన్ని పెంచటం, ప్రజల గొంతుక వినిపించటం విపక్షాలు చేసే పని. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోతోంది. లోక్‌సభ చరిత్ర గమనిస్తే దాని వర్తమాన స్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1952–70 మధ్య అది ఏడాదికి సగటున 121 రోజులు సమావేశమయ్యేది. అంటే అయిదేళ్లలో సగటున 605 రోజులు సమావేశాలుండేవి. అటు తర్వాత నుంచి ఏడాది సగటు 68 రోజులకొచ్చింది. అయిదేళ్ల సగటు 340 రోజులకు తగ్గింది. దాదాపు సగానికి పడిపోయిన పని దినాలైనా సజావుగా సాగుతున్న జాడలేదు. సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రతిష్టంభన సృష్టించటమే విపక్షాల ఏకైక వ్యూహంగా మారింది. సభలో ఆందోళనలు నిర్వహించటం, ముందుకు సాగనీయకపోవటం తమ ప్రజాస్వామిక హక్కని విపక్షాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఔన్నత్యం గురించి, ప్రజా స్వామ్యం గురించి గంభీరోపన్యాసాలివ్వటం... విపక్షంలో ఉంటే సమావేశాలకు ఆటంకం కలిగించటం రివాజైంది. ఆ తర్వాత చానెళ్లకొచ్చి మహోద్రేకంతో ఊగిపోతూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం దానికి అదనం. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య పౌరులకు పనికొచ్చేది ఒక్కటీ ఉండదు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగకపోవటం వల్ల ప్రజలకు జరిగే అన్యాయం సాధారణమైనది కాదు. ఎంతో కీలకమనుకున్న బిల్లులు సైతం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆమోదం పొంది చట్టంగా మారుతున్నాయి. వాటిని అధ్యయనం చేయ టానికీ, అభ్యంతరాలు చెప్పటానికీ, సవరణలు ప్రతిపాదించటానికీ సమయం ఎక్కడ? కొన్ని బిల్లులైతే నిండా గంట పాటైనా చర్చించిన దాఖలా ఉండటం లేదు. చాలా బిల్లులు విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం పొందినట్టు ప్రకటించటం ఇటీవలి కాలంలో పెరి గింది. బడ్జెట్ ప్రతిపాదనలూ, ద్రవ్యబిల్లులు కూడా ఏ చర్చా లేకుండానే సునాయాసంగా గట్టెక్కుతున్నాయి. పార్లమెంటులో ఎంతో ప్రాధాన్యం ఉండే ప్రశ్నోత్తరాల సమయం వాయిదాల కారణంగా కుంచించుకుపోతోంది.‘సర్’ చాటున తనకు సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ బాధ్యతను ఈసీ భుజాన కెత్తుకుంది. ఇందువల్ల ఓటర్‌గా నమోదు కావాలంటే ముందు ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత జనం పైనే పడింది. అందుకోసం గడువులోగా దాఖలు చేయాల్సిన పత్రాలు అందరి వద్దా అప్పటికప్పుడు లభ్యమయ్యేవి కాదు. తల్లితండ్రుల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పత్రాలు సైతం తెచ్చివ్వాలంటే కూలీ నాలీ చేసుకునే పౌరులు ఎక్కడికని, ఎంతకని తిరుగుతారు? ఈ స్థితిలో బిహార్‌లో ఓటుహక్కు కోల్పోయిన 47 లక్షల మందిని ‘విదేశీయులు’గా ముద్రేయటం సాధ్యమేనా? చిత్ర మేమంటే ఇంతటి కీలకమైన నిర్ణయంపై ముందుగా పార్లమెంటు చర్చించలేదు. ప్రస్తుతం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుండగా సభలో చర్చకు రాబోతోంది! ఇది కూడా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై కావటం వల్ల ఆ చర్చ కాస్తా ఎటు మళ్లుతుందో తెలియదు. ఇటీవలి కాలంలో ఈవీఎంల వింతలూ, ఎన్నికలైనాక ప్రకటించే పోలింగ్ శాతం పెరుగుతూ పోవటం వంటి అంశాల్లో ఈసీ మౌనమే సమాధానమవుతోంది. ఎన్నికల సంస్కరణల కన్నా ముందు ఈసీ పనితీరు ప్రక్షాళన, ఆ సంస్థ జవాబు దారీతనం పెంచటం వగైరాల అవసరం ఉంది. వీటన్నిటినీ పార్లమెంటు సమగ్రంగా చర్చిస్తుందా? పరస్పర నిందారోపణలతో కాలం గడుస్తుందా? ఈ నెల 9న జరగబోయే చర్చను దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది. -
ఉమ్మడి వ్యూహంపై విపక్షాల చర్చ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలు బుధవారం పార్లమెంట్లో ప్రాంగణంలోని మల్లికార్జున ఖర్గే చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, విపక్షాల భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 1వ తేదీన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. లేబర్ కోడ్స్పైపత్రిపక్షాల నిరసన కేంద్రం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పాయి. లేబర్ కోడ్స్ పట్ల విపక్షాలు బుధవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కారి్మకులకు కక్షగట్టిందని, కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కొత్త లేబర్ కోడ్స్‌తో కారి్మకులకు, ఉద్యోగులకు నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. లేబర్స్ కోడ్స్‌ను ప్రియాంకా గాంధీ సైతం తప్పుపట్టారు. -
బెంగాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మాల్డాకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్‌లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు. -
వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే విపక్షాల ఆందోళనతో లోక్‌సభ అట్టుడికింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకే లోక్‌సభ స్పీకర్ నిరాకరించడంతో విపక్షసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పలు మార్లు లోక్‌సభ వాయిదాపడింది. నివాళులతో మొదలై నినాదాలతో కొనసాగి.. అంతకుముందు సోమవారం ఉదయం 11 గంటలకు జాతీయగీతం జనగణమనతో లోక్‌సభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులకు ప్రస్తుత లోక్‌సభ సభ్యులు నివాళిగా సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెనువెంటనే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు తమతమ స్థానాల్లోంచి లేచారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర(ఎస్ఐఆర్) సర్వే అంశంపై లోక్‌సభలో చర్చించాలని పట్టుబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా వెంటనే కల్పించుకున్నారు. ‘తొలిరోజే సభాకార్యకలాపాలకు అడ్డుతగలడం ఏమాత్రం మంచి పధ్దతి కాదు. సభలో విధానాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరగాలి. సభలో సమ్మతి, అసమ్మతి రెండు ఉన్నా, చర్చల ద్వారానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను నినాదాలతో అడ్డుకోకూడదు. ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి’’ అని స్పీకర్ అన్నారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా, ఎస్ఐఆర్పై చర్చను కోరుతూ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక సైతం విపక్ష సభ్యుల వైఖరితో మార్పు రాలేదు. విపక్షాల ఆందోళన ఎక్కువవడంతో కేవలం 12 నిమిషాల తర్వాత సభ మళ్లీ వాయిదాపడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ మళ్లీ మొదలైంది. బిల్లులను ప్రవేశపెట్టిన సీతారామన్ పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజ్ డ్యూటీ, పాన్ మసాలాపై కొత్త సెస్ వేసేందుకు ఉద్దేశించిన బిల్లుతోపాటు, సెంట్రల్ ఎక్సయిజ్(సవరణ) బిల్లు–2025, హెల్త్‌సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025లను ఈలోపే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన కొనసాగుతుండటంతో మణిపూర్ జీఎస్టీ(సవరణ) బిల్లును సైతం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. 2025–26 ఆర్థికసంవత్సర గ్రాంట్లకు సంబంధించిన అనుబంధ పద్దును సైతం సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సభ మరోసారి వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా విపక్ష సభ్యుల నినాదాలు ఆగలేదు. దీంతో చేసేదిలేక స్పీకర్ మధ్యాహ్నం 2.20 గంటలకు సభను మంగళవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోనూ.. ఎగువసభలోనూ దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ‘‘ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు. అయితే నిరీ్ణత కాలావధిలోపు ఫలానా సమయంలోనే చర్చించాలనే మొండిపట్టును విపక్షాలు విడనాడాలి. ఎస్ఐఆర్పై చర్చ అంశంలో కేంద్రానికి మరింత సమయం కావాలి’’ అని ఆయన అన్నారు.మంత్రి సమాధానంతో సంతృప్తిచెందని విపక్ష సభ్యులు వెనువెంటనే రాజ్యసభ నుంచి వాకౌట్‌చేశారు. అంతకుముందు ఎస్ఐఆర్సహా పలు అంశాలపై తక్షణం చర్చ జరపాలంటూ తొమ్మిది మంది విపక్ష సభ్యులు వేర్వేరుగా రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు నోటీస్‌లను అందజేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణంచేశాక రాజ్యసభ డిప్యూటీచైర్మన్ హోదాలో రాధాకృష్ణన్ సేవలందించడం ఇదేతొలిసారికావడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రధాని మోదీ పొగిడారు. ‘‘సాధారణ కుటుంబం నుంచి వచి్చన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం మన ప్రజాస్వామ్యంలోని శక్తికి నిదర్శనం. పలు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో సేవచేసి గడించిన అనుభవం రాజ్యసభ సజావుగా సాగేందుకు తోహదపడనుంది’’ అని ఆయన అన్నారు. తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘ గత ఉపరాష్ట్రపతి హఠాత్తుగా రాజీనామాచేయడం అధికార పక్షాన్ని సైతం విస్మయపరిచింది. రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ విపక్ష సభ్యులకు సైతం సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నా’’ అని ఖర్గే అన్నారు. -
ఎస్ఐఆర్ గడువు వారం పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో వారంపాటు పొడిగించింది. పశి్చమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పొడిగింపు వర్తించనుంది. ఎస్ఐఆర్లో భాగంగా దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ డిసెంబర్ 4 కాగా, పొడిగింపుతో 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరిశీలనల అనంతరం 2026 ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో చర్చించిన అనంతరం కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు షెడ్యూల్లో మార్పులు చేయడం చూస్తే.. సభలో ఎస్ఐఆర్పై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పక్కన పెట్టడానికి ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించింది. గోవాలో 90 వేల నకిలీ ఓట్లున్నట్లు ఎస్ఐఆర్లో తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సంజయ్ గోయెల్ తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయినవారు, మరణించిన వారితోపాటు నకిలీ ఓట్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు నవంబర్ 4న రాష్ట్రంలో మొత్తం 11,85,000 ఓటర్లున్నారని, ఎస్ఐఆర్ తరువాత కేవలం 10,55,000 దరఖాస్తులు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయని తెలిపారు. ఇంకా 40 వేల దరఖాస్తులు కమిషన్‌కు రాలేదని వెల్లడించారు. -
నేటి నుంచి సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు మొదలవుతాయి. ఈసారి శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఐఆర్పై ప్రభుత్వాన్ని ఐక్యంగా నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో కారుబాంబు పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రతపై మోదీ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నాయి. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నూతన లేబర్ కోడ్స్, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలతోపాటు ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నారు. పార్లమెంట్లో 14 బిల్లులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. మణిపూర్ గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్(రెండో సవర) బిల్లు–2025, సెంట్రల్ ఎక్సైజ్(సవరణ) బిల్లు–2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు–2025, పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు–2025, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు–2025ను జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, దివాళా, దివాళా కోడ్ (సవరణ) బిల్లు, పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు, కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టాలు(సవరణ) బిల్లులు వంటివి ఉన్నాయి. ఇటీవల వివిధ పార్టీల అభ్యంతరాల తర్వాత, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నేరుగా నిబంధనలు జారీ చేసే అధికారం కల్పించే బిల్లును ప్రభుత్వం విరమించుకున్న విషయం తెలిసిందే. బీఏసీ భేటీలో గళమెత్తిన ప్రతిపక్షాలు లోక్‌సభ, రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు ఆదివారం నిర్వహించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై స్వల్ప కాల చర్చ చేపట్టాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలోని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఆదివారం ఈ కమిటీ సమావేశమైంది. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని చెప్పిన ప్రతిపక్ష నేతలు ఎస్ఐఆర్ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం మధ్యా హ్నం 2 గంటలకు ఎన్నికల సంస్కరణలపై చర్చ జరపాలని కోరారు. చర్చ జరపకుంటే, సభా కార్యకలాపాలకు కలిగే అంతరాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు. ఈ అంశానికి ఎన్నికల సంస్కరణలు లేదా ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత వంటి పేరు పెట్టుకోవచ్చన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం తెల్సిందే. -
ఎస్ఐఆర్ ఉద్యోగుల మృతి వెనుక ఈసీ హస్తం ఉంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన 40 మంది మరణించారని టీఎంసీ శుక్రవారం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీని వెనుక రాష్ట్రంలోని పోల్ ప్యానెల్ చీఫ్ హస్తం ఉందని ఆరోపించింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలో పదిమంది ఎంపీల ప్రతినిధి బృందం శుక్రవారం సీఈసీ అధికారులను కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్.. తమ పార్టీ ఐదు ప్రశ్నలను సీఈసీ ముందుంచుందని, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాము ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం లేదని, ఈసీ పనిచే స్తున్న తీరుపై తమకు అభ్యంతరం ఉందని నొక్కి చెప్పారు. కమిషన్ దానిని కేవలం ఆరోపణలుగా తోసిపుచ్చిందని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. సీఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో లోక్‌సభ ఎంపీలు శతాబ్దిరాయ్, కళ్యాణ్ బెనర్జీ, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్, రాజ్యసభ ఎంపీలు డోలా సేన్, మమతా ఠాకూర్, సాకేత్ గోఖలే, ప్రకాష్ చిక్ బారిక్ ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్ స్థాయి అధికారులు మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఈ సంఖ్య అధికంగా ఉంది. ఒక్క పశ్చిమబెంగాల్లోనే 40 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఎల్ఓల మరణాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్ఐఆర్ సంస్కరణకాదని, విజయం కోసం బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనని విమర్శిస్తున్నారు. -
26 లక్షల పేర్లు సరిపోలడం లేదు: ఈసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ప్రస్తుత ఓటరు జాబితాలోని 26 లక్షల మంది ఓటర్ల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాతో సరిపోలడం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ)తెలిపింది. ఓటరు జాబితా ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎస్ఐఆర్లో భాగంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 6 కోట్లకుపైగా ఎన్యుమరేషన్ దరఖాస్తులను డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అనంతరం వీటిని గత 2002 ఎస్ఐఆర్నాటి ఓటరు జాబితాతో పోల్చగా ఈ తేడా బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు. డిజిటైజేషన్ కొనసాగుతున్నందున ఈ తేడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అయితే, తుది ఓటరు జాబితా నుంచి వీటిని ఈ పేర్లను ఆటోమేటిక్‌గా తొలగించినట్లు కాదన్నారు. -
ఎస్ఐఆర్ అప్లికేషన్ వివరాలు అందుబాటులో లేవెందుకు?
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఉపయోగించనున్న ఏఐ అప్లికేషన్ అనుమానం కలుగుతోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. యాప్, దాని కార్యాచరణగురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. ‘బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏఐ యాప్‌ను ఉపయోగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ యాప్‌ను ఎవరు తయారు చేశారు? దాని కార్యాచరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఎందుకు లేవు’అని గోఖలే ప్రశ్నించారు. యాప్ డెవలపర్, అమ్మిన సంస్థ వివరాల గురించి తాను ప్రయత్నించానని, ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లు బాగా పనిచేయగలిగినప్పుడు, నకిలీలను గుర్తించడానికి ఏఐ అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. 2019లో మహారాష్ట్రలోనూ బీజేపీ ఐటీ సెల్‌తో అనుబంధం ఉన్న ఓ ఏజెన్సీని ఈసీఐ నియమించుకున్న విషయాన్ని తాను బయటపెట్టానని చెప్పారు. బయటినుంచి వెయ్యిమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్వేర్ డెవలపర్లను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీఐకి రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. -
ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR) పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదని వెల్లడించింది. ఆధార్ కార్డులున్న చొరబాటుదారులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆధార్ కార్డు ఉన్న పౌరుడు కాని వ్యక్తికి కూడా ఓటు హక్కులు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్ తప్ప , ఇది స్వయంచాలకంగా ఓటు హక్కును ప్రసాదించకూడదని ప్రధాన న్యాయమూర్తి (CJI) స్పష్టం చేశారు.అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ చర్య చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్ఘ బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వేడివాడి వాదనలు జరిగాయి. ఆధార్ కార్డు "పౌరసత్వానికి సంపూర్ణ రుజువు కాదని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అందుకే అది పత్రాల జాబితాలోని పత్రాలలో ఒకటిగా ఉంటుందనీ, ఎవరి పేరైనా తొలగిస్తే, వారికి తొలగింపు నోటీసు ఇవ్వవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.ఒక వ్యక్తి పొరుగు దేశానికి చెందినవాడు మరియు కార్మికుడు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తుంటే, వారికి మానవతా దృక్పథంతో రేషన్ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. ఇది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం. అయితే, ఆధార్ కార్డు కలిగి ఉండటం వల్ల వారిని ఓటరుగా మార్చలేము. పౌరసత్వం మరియు ఓటు హక్కుల ప్రమాణాలు వేరుగా ఉంటాయి. ఆధార్‌తో అనుసంధానించబడవు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా?ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు" అనే వాదన ఒక ప్రక్రియను రాజ్యాంగ విరుద్ధమైనదిగా మార్చలేదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆధార్ పౌరసత్వ రుజువు కాదని, ఎన్నికల కమిషన్‌కు పత్రాలను ధృవీకరించే రాజ్యాంగ హక్కు ఉందని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. అలాగే కమిషన్ కేవలం పోస్టాఫీసు కాదు. పత్రాల ఖచ్చితత్వాన్ని ధృవీకరించే రాజ్యాంగ హక్కు దీనికి ఉంది. ఫారం 6లో ఏదైనా తప్పు ఉంటే, దానిపై దర్యాప్తు చేసే అధికారం కమిషన్‌కు ఉందని స్పష్టం చేశారు.ఆధార్‌ను నివాస రుజువుగా పేర్కొనడం ద్వారా పౌరులపై సందేహ భారాన్ని మోపడానికి వ్యతిరేకంగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. SIR ముందుకు సాగుతున్న తీరు తొందరపాటు మరియు మినహాయింపుతో కూడుకున్నది. ఇది నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారం మోపుతోందన్నారు. ఫారాలు నింపడం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా, నివాసానికి సంబంధించి ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని ఆయన వాదించారు. SIR ప్రచారం లోపభూయిష్టంగా , రాజ్యాంగ విరుద్ధమైందని పేర్కొన్నారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో SIRని ప్రత్యేకంగా సవాలు చేస్తున్న పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్‌ను కూడా నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా ప్రతిస్పందనలను దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను బెంచ్ కోరింది. ఈ గడువులో పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాలు త్వరలో విచారణకు వస్తాయి. -
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్‌కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్‌లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్‌లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్‌లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్‌పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్‌ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
నన్ను చాలెంజ్ చేస్తే..బీజేపీ పునాదులే కదిలిస్తా : సీఎం మమత
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు పశ్చిమ బెంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. బీజేపీ సర్ ప్రక్రియను ఉపయోగించి ఓటర్లను తొలగిస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది. మంగళవారం జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తనను చాలెంజ్ చేస్తే దేశంలో బీజేపీ పునాదులు కదిలిస్తానని మమత వ్యాఖ్యానించారు. బొంగావ్‌లో జరిగిన ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని మతువా-మెజారిటీ ప్రాంతాలలోని ఓటర్లు పౌరసత్వం (సవరణ) చట్టం ప్రకారం తమను తాము విదేశీయులుగా ప్రకటిస్తే వారిని "వెంటనే జాబితా నుండి తొలగిస్తారు" అని కూడా మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ రాజకీయంగా తనను ఓడించలేదని గతంలోనే పదిసార్లు చెప్పానని మమత మరోసారి నొక్కి వక్కాణించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఇకపై నిష్పాక్షిక సంస్థ కాదు, కానీ బిజెపి కమిషన్‌గా మారిపోయిందంటూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)పై విమర్శలు గుప్పించారు.చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా“అక్రమ బంగ్లాదేశీయులను” తొలగించడమే లక్ష్యమైతే, బిజెపి పాలిత రాష్ట్రాల్లో SIR ఎందుకు నిర్వహిస్తు న్నారని మమత ప్రశ్నించారు. అంటే పార్టీ “డబుల్ ఇంజిన్ పాలిత రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నారని అంగీకరిస్తుందా అని ఆమె ఎద్దేవా చేశారు. తానుఒక దేశంగా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాననీ తమ భాషా ఒకటేనని చెప్పారు. ఏదో ఒకరోజు తనను కూడా బంగ్లాదేశీ అని పిలుస్తారని విమర్శించారు. ఈ రాష్ట్రం నుంచి ఈ జాబితా ప్రకారమే 2024లో ప్రధాని మోదీ ఓట్లు గెల్చుకున్నారు. మరి ఆ ఓట్లు తీసేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తొలగించాలా కదా అన్నారు. అసలు సర్ నిర్వహణకు ఎందుకు ఇంత తొందర పడుతున్నారని సీఎం మమత ప్రశ్నించారు.ఇదీ చదవండి: వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!"నేను ఇక్కడ ఉన్నంత వరకు, వారు మిమ్మల్ని వెళ్లగొట్టడానికి నేను అనుమతించను. ఎవరూ మిమ్మల్ని వెళ్లగొట్టలేరు’’ అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇక్కడ బంగ్లాదేశీయులే సమస్య అయితే, మధ్యప్రదేశ్ , యుపీలోSIR ఎందుకు నిర్వహిస్తున్నారు? అని మమతా అటు ఈసీపైనా, ఇటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు. కాగా ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి ఘన విజయం తరువాత బిహార్ గెలిచేశాం. ఇక పశ్చిమ బెంగాల్ వంతు అని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకే కౌంటర్‌గానే మమతీ ప్రతిసవాల్ చేసినట్టుగా భావిస్తున్నారు.


