‘సర్‌’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర | Parakala Prabhakar on Special Intensive Revision | Sakshi
Sakshi News home page

‘సర్‌’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర

Jun 15 2026 2:15 AM | Updated on Jun 15 2026 2:15 AM

Parakala Prabhakar on Special Intensive Revision

ఇప్పటికే దేశంలో 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు

రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారు 

ప్రజలు రోడ్డెక్కి పోరాడితేనే సమస్యలు పరిష్కారం

ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ 

నెల్లూరు(అర్బన్‌): దేశంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో ఎన్నికల కమిషన్, మిలిటరీ దళాలను గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వర్గాల ప్రజలకు ఓట్లు లేకుండా చేస్తున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ ఆరోపించారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించిన 20 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నెల్లూరులో ఆదివారం డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి 18వ స్మారక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ‘వికసిత్‌ భారత్‌– భ్రమలు, వాస్తవాలు’ అనే అంశంపై పరకాల మాట్లాడారు. ఇప్పటి వరకు సర్‌ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికల ముందు సర్‌ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తెలిపారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రశ్నించకుండా ఉండేందుకు వికసిత్‌ భారత్‌ పేరుతో డ్రామాలాడుతూ కుల, మత, భాషాపరంగా ప్రజలను విభజన చేస్తున్నారని వివరించారు. ఇలాంటి దారుణాలను ఎదుర్కో­వాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, పోరాటాలు చేయాలని పరకాల పిలుపునిచ్చారు. 

స్కిల్‌ ఇండియా ఒక స్కామ్‌
దేశంలో గడిచిన వందేళ్లలో లేనంతగా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని, బడుగు, బలహీన వర్గాల  ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరకాల ప్రభాకర్‌ చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యత... ఇలా పలు రంగాల్లో అనేక చిన్న దేశాల కంటే భారత్‌ వెనుకబడి ఉందన్నారు. ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి, ఆకలి సూచీలో 102 స్థానానికి మన దేశం దిగజారిపోయిందని తెలిపారు. అయినా భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిలో 5వ స్థానంలో ఉందని పాలకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

దేశంలో ప్రధాన మంత్రి కౌసల్‌ యోజన (స్కిల్‌ ఇండియా) పెద్ద స్కామ్‌గా మారిపోయిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. స్కిల్‌ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు, ఊçర్లు లేవన్నారు. 12 వేల మంది మళ్లీ మళ్లీ శిక్షణలో పాల్గొంటున్నట్లు తేలిందన్నారు. శిక్షణ పొందిన 34 లక్షల మంది ఇళ్లకు వెళ్లి పరిశీలించగా, వారికి స్టైఫండ్‌ అందలేదన్నారు. కాగ్‌ నివేదిక ప్రకారం 95 శాతం బోగస్‌ అకౌంట్‌లు ఉన్నాయని, స్కిల్‌ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement