సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్షన్ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి.. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని హిట్ లిస్ట్ ప్రకటించి.. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులకు లేదా? అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ అస్మిత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శృతిమించాయని.. పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



