న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై, నేటి యువతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్ జీ వర్గం అనుచిత భాషను వాడిందని, వారి ప్రవర్తన బాగోలేదని ఆమె ఆరోపించారు. కాగా కంగనా వ్యాఖ్యలపై ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీలు, హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. ‘చెడు భాష గురించా? మీరు రోడ్లపై పిల్లలను కొట్టారు, వారిపై రాళ్లు రువ్వారు, పైగా వారినే నిందిస్తున్నారు! వారిపై కాల్పులు జరుపుతున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వారి ముఖాలపై పెల్లెట్ గన్లు వాడుతున్నారు. మీ పెయిడ్ గూండాలు ఇప్పటికీ తిరుగుతూ, వారిని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు! ఈ తిట్లను మీరే స్వయంగా సంపాదించుకున్నారు.. మై ఫ్రెండ్’ అంటూ విశాల్ దద్లానీ మండిపడ్డారు.
ఈ పోస్ట్ క్యాప్షన్‌లో.. ‘పెయిడ్ స్టోరీలు, ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు నిర్వహించడం వల్ల మీ దిగజారుడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విశాల్ దద్లానీ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.
మరోవైపు, కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో నిరసనలకు సంబంధించిన ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తీవ్ర పదజాలం వాడారు. ‘నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్ జీ నిరసనల రీల్స్ చూస్తే వాంతి వస్తోంది. వారు మాట్లాడే తీరు, వాడే భాష అత్యంత హేయంగా ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిరసనకారులను ‘జనరేషన్ గటర్’ అంటూ కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, కనీసం ఇంటిని కూడా చక్కదిద్దలేరని ఆమె విమర్శించారు. కాగా, ఈ వివాదం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


