మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఓ కన్నతల్లి తన మూడేళ్ల పసికందును అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడనే కారణంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛౌలీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛౌలీ గ్రామానికి చెందిన కృష్ణ మురారి గుప్తా భార్య రుచి జిందల్ (32) వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జూన్ 28న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో మూడేళ్ల కుమారుడు మాధవ్ పదే పదే ఏడుస్తూ ఆమెకు అడ్డుగా మారాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ తల్లి, బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది.
ఈ దారుణం తర్వాత ఆమె ఏమీ ఎరుగనట్లు నాటకం మాడింది. బిడ్డకు అకస్మాత్తుగా అనారోగ్యం చేసిందంటూ భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. పోలియో చుక్కల వికటించడం వల్లే మృతి చెంది ఉండవచ్చని భావించి, బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జూలై 27న భర్త కృష్ణ మురారి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణను ఆయన విన్నారు. నిలదీయడంతో రుచి జిందల్ తన తప్పును అంగీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బల్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మహావన్ సీఓ సంజీవ్ కుమార్ రాయ్ తెలిపారు.


