షిర్డీ: నేడు(బుధవారం) గురుపూర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సమాధి మందిరం, ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతోంది. లక్షలాది మంది సాయి భక్తుల సమక్షంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన పూల అలంకరణలు, ఆకర్షణీయమైన విద్యుత్ కాంతుల అలంకరణ చేపట్టడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఆలయంలో బాబాకు పూజలు, హారతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సాయిభక్తుడు ఎస్. ప్రకాష్ అందించిన విరాళంతో సాయిబాబా సమాధి మందిరంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల దేశీయ, విదేశీ రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. గులాబీలు, బంతిపూలు, ఆర్కిడ్స్, రజనీగంధ అలాగే ఇతర రకాల పుష్పాలను ఉపయోగించి ఆలయానికి ఆకర్షణీయమైన రూపురేఖలు తీసుకొచ్చారు. సమాధి మందిరం సుందరమైన పూలతో అలంకృతమై భక్తుల ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గర్భగుడితో పాటు గురుస్థాన్, ద్వారకామాయి, చావడి తదితర ప్రాంతాలలో రంగురంగుల దేశీయ, విదేశీ పూల తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ మూడవ గేటు వెలుపల వివిధ పుష్పాలతో సాయిబాబా వారి భవ్యమైన ప్రతిమను తీర్చిదిద్దారు. ఈ అద్భుతమైన పుష్ప కళాఖండం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ముంబైకి చెందిన సాయిరాజ్ డెకరేటర్స్ ఆధ్వర్యంలో సమాధి మందిరంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణ చేశారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, గురుస్థాన్, ద్వారకామాయి, చావడి, సంస్థాన్ పరిపాలనా భవనం, ప్రసాదాలయం మరియు ప్రధాన వీధులు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్నాయి. సాయంత్రం కాగానే ఈ విద్యుత్ కాంతుల వెలుగులో ఆలయ ప్రాంగణం దీప్తివంతంగా మారుతూ, భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది.


