అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.
ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?..
Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM
— Apka Aashish (@ApkaAashish) July 28, 2026
అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.
బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.

40 శాతానికి పైగా భూభాగం..
అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.
ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?
ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ప్రభుత్వం వల్ల కావట్లేదా?
వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.

👉పాతబడుతున్న కట్టలు
వరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్‌మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.
👉తాత్కాలిక చర్యలకే పరిమితం
అస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.
👉నదీ కోత మరో పెద్ద సమస్య
అస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.
ఆ మార్పులు పెంచుతున్న ముప్పు
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.
కావాల్సింది కొత్త విధానం
అస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.
అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు.


