1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి.. | Flood in Godavari at Cotton Barrage in Dhawaleshwaram | Sakshi
Sakshi News home page

1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

Jul 28 2026 4:34 AM | Updated on Jul 28 2026 4:34 AM

Flood in Godavari at Cotton Barrage in Dhawaleshwaram

గోదావరికి భారీగా వరద  

ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 1,20,608 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాటన్‌ బ్యారేజ్‌ వద్ద వరద నీటి ఉధృతి పెరుగుతోంది.

ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో కూడా నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతూ సోమవారం రాత్రికి 17.60 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద మంగళవారం నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాటన్‌ బ్యారేజ్‌ వద్ద సోమవారం రాత్రి 10.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,800, పశ్చిమ డెల్టాకు 7,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement