కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్‌ ప్రమాదకరమా? | Health Tips: Kangana Ranauts Viral Cancer Story Mentions Too Much Protein | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్‌ ప్రమాదకరమా?

Jul 27 2026 5:34 PM | Updated on Jul 27 2026 5:39 PM

Health Tips: Kangana Ranauts Viral Cancer Story Mentions Too Much Protein

50 ఏళ్లు లోపు వారిలో పెరుగుతున్న కేన్సర్‌ కేసుల గురించి నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ పెద్ద దుమారం రేపి.. వివిధ చర్చలకు దారితీసింది. ఆమె ఆ పోస్ట్‌లో ప్రోటీన్‌ సప్లిమెంట్ల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ గురించి మాట్లాడారు. అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, ప్రోటీన్‌ షేక్‌లకు దూరంగా ఉండాలని అన్నారు. అవి కేన్సర్‌ వంటి ఆరోగ్య ప్రమాదాలను మరింత పెంచేస్తాయని నొక్కి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శరీరానికి అవసరమైన దానికంటే అధిక మోతాదులో ప్రోటీన్‌ తీసుకుంటే చాలా ప్రమాదకరమా అని చర్చలు మొదలయ్యాయి నెట్టింట. నిజంగా ఇది ఎంతవరకు సమంజసం అంటే..

కండరాల మరమ్మత్తు, కణజాల నిర్వహణ, హార్మోన్ల ఉత్పత్తి,  రోగనిరోధక పనితీరుకు ప్రోటీన్ ఒక ముఖ్యమైన స్థూల పోషకం. ఇది గుడ్లు, చేపలు, చికెన్, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, బీన్స్, నట్స్, విత్తనాలలో సహజంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కండరాల పునరుద్ధరణకు, నిర్వహణకు తోడ్పడుతుంది. అలాగని అధికంగా తీసుకోవడం మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైన సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు.

ప్రోటీన్ షేక్‌ల వల్ల కేన్సర్‌ వస్తుందా అంటే..
ప్రోటీన్ షేక్‌ల వల్లనే కేన్సర్ వస్తుందనడానికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. దీన్ని ఒక నిర్దిష్ట ఆహారానికి లేదా సప్లిమెంట్‌కు ముడిపెట్టలేమని అన్నారు. అయితే కొన్ని ప్రోటీన్‌ షేక్‌లు, బార్‌లు, ఇతర ఫిట్‌నెస్‌ ఉత్పత్తులలో అదనపు చక్కెరలు, అధిక కేలరీలు లేదా అధికంగా ప్రాసెస్‌ చేయబడిన పదార్థాలు ఉంటాయి. అందువల్ల అలాంటివి నిత్యం తీసుకుంటే బరువుని అదుపులో ఉంచుకోవడం కష్టతరమవుతుంది.

ఎవరికీ మంచిది కాదంటే..
ప్రోటీన్‌ను సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతులకు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు వైద్య పర్యవేక్షణలో ప్రోటీన్ తీసుకోవడాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు కూడా తమ ఆహారంలో ముఖ్యమైన మార్పుల గురించి వైద్యులను సంప్రదించాలి.

ఎంత ప్రోటీన్ అవసరం?
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రోటీన్ అవసరాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. ఈ క్రింది అంశాలు:

వయస్సు
శరీర బరువు
శారీరక శ్రమ
వ్యాయామ తీవ్రత
ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు
గర్భధారణ స్థితి
ఫిట్‌నెస్ లక్ష్యాలు

తదితరాలు వ్యక్తిగత ప్రోటీన్ అవసరాలను ప్రభావితం చేయగలవు. శారీరకంగా చురుకుగా ఉండే లేదా బలం పెంచే శిక్షణ పొందుతున్న వారికి, నిశ్చల జీవనం గడిపే వ్యక్తి కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం కావొచ్చు. కేవలం ఫిట్‌నెస్ ట్రెండ్‌లను అనుసరిస్తూ కాకుండా, నిజమైన పోషకాహార అవసరం ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్లను ఉపయోగించాలి అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే ఆహారమే మేలా?

చాలా మందికి, ప్రోటీన్ అవసరాలను వైవిధ్యమైన, సమతుల్యమైన ఆహారం ద్వారా పొందొచ్చు. అవేంటంటే..

గుడ్లు
చేపలు
చికెన్
పాలు, పెరుగు
పనీర్
పప్పు, బీన్స్
సోయా, టోఫు
గింజలు, విత్తనాలు

సంపూర్ణ ఆహారాలు ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కేవలం ఆహారం ద్వారా ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో, కొన్ని పరిస్థితులలో ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. అయితే, అవి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి అనుబంధంగా ఉండాలి.

కేన్సర్ ప్రమాదాన్ని పెంచేవి ఏమిటి?

కేన్సర్‌కు ఒకే ఒక్క కారణం లేదు. ఈ వ్యాధి రావడానికి అనేక కారకాలు దోహదపడతాయి, వాటిలో కొన్నింటిని మార్చవచ్చు, మరికొన్నింటిని మార్చలేము. ముఖ్యమైన ప్రమాద కారకాలు:

పొగాకు, మద్యం

అధిక శరీర బరువు

శారీరక శ్రమ లేకపోవడం

కుటుంబ చరిత్ర, జన్యువులు

పర్యావరణ కారకాలకు గురికావడం

జీవనశైలి మార్పులతో  కేన్సర్ ప్రమాదానికి చెక్‌..
ప్రతి క్యాన్సర్‌ను నివారించలేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు అనేక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఇతర ఆహారపదార్థాల తోపాటుసమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 

క్రమం తప్పని శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానాన్ని పరిమితం చేయడం తోపాటు తప్పనిసరిగా కేన్సర్ స్క్రీనింగ్‌ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం తదితరాలతో ఆ కేన్సర్‌ ప్రమాదాన్ని నివారించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement