బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్‌ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్‌లోనూ అంతలా ఎలా స్లిమ్‌గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.
ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు.
వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్‌గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు.
గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు.
తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్‌లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు.
అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్‌కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు.
(చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు)


